నేను సిప్ విధానంలో ఒక ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. అందుకే వేరే ఈక్విటీ ఫండ్‌లోకి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మారుద్దామనుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ నుంచి పెట్టుబడులను ఒకేసారి ఉపసంహరించుకొని ఆ మొత్తాన్ని వేరే ఫండ్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయమంటారా? ఇలాచేస్తే ఏడాదిలోపు నేను సిప్‌ద్వారా ఇన్వెస్ట్ చేసిన మొత్తాలపై షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అలాకాకుండా ప్రస్తుత ఫండ్ నుంచి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ)ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని వేరే ఫండ్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? ఈ రెండింటిలో దేనిని ఎంచుకుంటే బావుంటుంది? - అరవిందరావు, హైదరాబాద్
ఈక్విటీ ఫండ్స్ పనితీరు స్వల్పకాలాన్ని పరిగణనలోకి తీసుకొని మదింపు చేయకూడదు. ఈక్విటీ ఫండ్ పనితీరును అంచనా వేయడానికి ఏడాది కాలం సరిపోదని మేం భావిస్తున్నాం. మీరు వేరే ఈక్విటీ ఫండ్‌లోకి మారేటప్పుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి. ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి మీరు మారేటప్పుడు ముందుగా మీరు చేయాల్సిన పని... ఈక్విటీ ఫండ్‌ను నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్‌కు స్టాప్ రిక్వెస్ట్‌ను సమర్పించాలి. ఒకేసారి మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నింటిని ఉపసంహరించుకుంటే మీరు చెప్పినట్లుగానే మీరు షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఏడాది దాటిన వాటిని ఒకేసారి ఉపసంహరించుకోవాలి. ఏడాది లోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఈ విధానాన్ని అనుసరిస్తే మంచిది.
తాతల నాటి స్థిరాస్థిని విక్రయించగా నా భాగానికి కోటి రూపాయలు వచ్చాయి. దీనిని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేద్దామనుకుంటున్నాను. దీనిపై వచ్చే వడ్డీని ఇంటి అద్దె, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఉపయోగించుకోవాలనేది నా ఆలోచన. ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా కాకుండా, ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? నా సొమ్ము భద్రంగా ఉండేలా మరో మార్గమేదైనా ఉందా? సరైన సలహా ఇవ్వండి. - జాన్, ఈ మెయిల్ ద్వారా
డెట్ ఫండ్‌లో ఇంత పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. మీరు భద్రత కోరుకుంటున్నారు. అదే సమయంలో స్థిరమైన రాబడులు (ఇంటి అద్దె, ఇతర ఖర్చులు) కోరుకుంటున్నారు. ఈ దృష్ట్యా చూస్తే డెట్‌ఫండ్‌లో ఇన్వెస్ట చేయడం సరైనపనే కాదు. బ్యాంక్ డిపాజిట్లతో పోల్చితే డెట్‌ఫండ్స్ ఒకింత అధిక రాబడినే అందిస్తాయని చెప్పవచ్చు. అయితే ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయి. నెలవారీ రాబడుల నిమిత్తం ఈ ఫండ్‌లపై ఆధారపడడం సరైన విధానం కాదు.
రూ. కోటి అనేది అతి పెద్ద మొత్తం. దీనిని ఒకేచోట ఒకేసారి ఒకే మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఏడాది పాటు ఇంటి అద్దె, ఇతర ఖర్చులన్నింటిని లెక్కవేసి ఆ మొత్తాన్ని మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో జమ చేయండి. ఇదే మొత్తానికి మూడు రెట్ల మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయండి. గరిష్టంగా రాబడులను పొందాలంటే స్వీప్-ఇన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌం ట్‌ను తెరవండి. ఈ తరహా ఖాతాల్లో నిర్దేశిత పరిమితికి మించి సొమ్ములు పెరిగినట్లయితే, బ్యాంక్ ఆ పెరిగిన మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా మారుస్తుంది.
దీంతో మామూలుగా కన్నా అధికంగా మీకు రాబడులు లభిస్తాయి. మరోవైపు పరిమితి కంటే తక్కువగా మీ ఖాతాలో సొమ్ములున్నప్పుడు, ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ రద్దై, ఆ సొమ్ములు సేవింగ్స్ ఖాతాలోకి వస్తాయి. ఇక మిగిలిన మొత్తాన్ని మంచి రేటింగ్ ఉన్న ఇన్‌కమ్, షార్ట్‌టెర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. .. ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్‌టెర్మ్ ఇన్‌కమ్ ప్లాన్, యూటీఐ షార్ట్‌టెర్మ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీస్, బిర్లా సన్‌లైఫ్ మీడియమ్ టెర్మ్ ప్లాన్, యూటీఐ డైనమిక్ బాండ్ తదితర ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.
పన్ను లేకుండా ఫండ్ మార్పు ఎలా..
Published Mon, Sep 15 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM
Advertisement
Advertisement