Debt Fund
-
ఈ ఫండ్‌తో నమ్మకమైన రాబడులు!
ఇన్వెస్టర్లలో కొందరు రిస్క్ తీసుకోలేరు. అటువంటి వారు ఈక్విటీలకు దూరంగా ఉంటుంటారు. కానీ, దీర్ఘకాలంలో అంటే ఐదేళ్లకు మించిన కాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇచ్చినట్టు చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక రిస్క్‌ను చూసి భయపడి ఈక్విటీ పెట్టుబడులకు దూరంగా ఉండడం సరికాదు. కాకపోతే మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీలకు కేటాయింపులు కొంత తక్కువ చేసుకుంటే సరిపోతుంది. ఐదేళ్లకు మించి పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉండి, మోస్తరు రిస్క్‌కు సిద్ధపడే వారికి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ ఎంతో మెరుగైన పనితీరును ప్రదర్శిస్తోంది. రాబడులు ఈ పథకానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1999 నవంబర్ 3న ప్రారంభమైంది. ఆరంభంలో ఈ పథకంలో ఒకే విడత రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేడు అది రూ.29.33 లక్షలుగా మారి ఉండేది. అంటే ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడిని అందించింది. ఆరంభం నుంచి ప్రతి నెలా సిప్ రూపంలో రూ.10,000 ఇన్వెస్ట్ చేసినా రూ.28.9 లక్షలు సమకూరి ఉండేది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 25 శాతం రాబడులు అందించింది. ఇదే కాలంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు రాబడి 19 శాతంగా ఉంది. మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 26 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఐదేళ్లలో 19 శాతం, ఏడేళ్లలో 16.61 శాతం, పదేళ్లలో 17.69 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం కంటే ఈ పథకంలోనే 2–9 శాతం మధ్య వివిధ కాలాల్లో అధిక రాబడులు ఉన్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. సూచీతో పోల్చి చూసినా ఈ పథకమే ఎక్కువ రాబడిని తెచ్చి పెట్టింది. అన్ని కాలాల్లోనూ స్థిరమైన, నమ్మకమైన రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో కేవలం బెంచ్ మార్క్ అనే కాకుండా, ఈ విభాగంలోని పోటీ పథకాల కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. పెట్టుబడుల విధానం, పోర్ట్‌ఫోలియో పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకం ఈక్విటీ పెట్టుబడులను 65–80 శాతం మధ్య నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే, డెట్ పెట్టుబడులను 20–35 శాతం మధ్య కొనసాగిస్తుంది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛ ఈ పథకానికి ఉంది. అంతే కాదు విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను సైతం ఈ పథకం పరిశీలిస్తూ ఉంటుంది. మార్కెట్ల కరెక్షన్లలో పెట్టుబడుల విలువను కాపాడుకునేందుకు డెరివేటివ్స్‌లో ఎక్స్పోజర్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.28వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 69 శాతం కేటాయించగా, డెట్ పెట్టుబడులు 22 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లో 2 శాతం పెట్టుబడులు ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 7 శాతంగా ఉన్నాయి. ఇక ఈక్విటీల్లో 86 శాతానికి పైనే లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 12 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 1.24 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. డెట్ విభాగంలో ఎస్వోవీల్లో 13 శాతం పెట్టుబడులు, 4 శాతం ఏఏ రేటెడ్ సాధనాల్లో కలిగి ఉంది. ఈక్విటీల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 16 శాతం కేటాయించింది. ఇంధన రంగ కంపెనీల్లో 15.66 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 9 శాతం, కమ్యూనికేషన్ కంపెనీల్లో 6.35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఎన్టీపీసీ 7.43 ఐసీఐసీఐ బ్యాంక్ 7.01 భారతీ ఎయిర్టెల్ 6 ఓఎన్జీసీ 4.18 మారుతి సుజుకీ 3.92 రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.39 సన్‌ఫార్మా 3.07 ఇన్ఫోసిస్ 3.02 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.95 టాటామోటార్స్ డీవీఆర్ 2.63 -
వృద్ధులకు మెరుగైన పెట్టుబడి సాధనం?
వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్‌కు విడిగా కేవైసీ ఇవ్వకుండా, ఏదైనా కేంద్రీకృత ప్లాట్‌ఫామ్ ఉందా? – సమీర్ పటేల్ కేవైసీ (కస్టమర్ గురించి తెలుసుకోవడం) అనేది ఇన్వెస్టర్ల గుర్తింపు, చిరునామాకు సంబంధించినది. నల్లధన నిరోధక చట్టం కింద ఇన్వెస్టర్ విధిగా కేవైసీ వివరాలు ఇవ్వాల్సిందే. ప్రస్తుతం కేంద్రీకృత కేవైసీ (సీకేవైసీ) ప్లాట్‌ఫామ్ ఒకటి పనిచేస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినది. ఇన్వెస్టర్ తన కేవైసీ ప్రక్రియను ఒక్కసారి పూర్తి చేస్తే చాలు. ఇన్వెస్టర్ కొత్త మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ కేవేసీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఇన్వెస్టర్లు పాన్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా సెబీ వద్ద నమోదైన క్యాపిటల్ మార్కెట్ మధ్యవర్తి (స్టాక్ బ్రోకర్, డీపీ)కి సమర్పించొచ్చు. ఆ సమాచారం కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీల ద్వారా కేంద్రీకృత వ్యవస్థలో నమోదు అవుతుంది. నా వయసు 62 ఏళ్లు. నేను ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. నా మాదిరి వృద్ధులు ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకునేందుకు డెట్ ఫండ్ లేదా ఈక్విటీ ఫండ్ ఏది అనుకూలం? – శర్వానంద్ శివమ్ వృద్ధులు కేవలం డెట్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ముందు కొంత సమయం తీసుకుని పెట్టుబడిపై మరింత స్పష్టతను తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీ పెట్టుబడి ఉద్దేశాలు, పెట్టబడి కాలం ఎంతన్నది తేల్చుకోవాలి. మీకు దీర్ఘకాల లక్ష్యం ఉందా? లేక ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం తర్వాతే పెట్టుబడి అవసరం ఉందా? వీటికి అవును అనేది సమాధానం అయితే అందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సరైన ఎంపిక అవుతుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్/క్రమానుగత పెట్టుబడి) లేదా లంప్సమ్ (ఒకే విడత) పెట్టుబడిలో ఏది మంచిది? అని అడిగితే.. మేము అయితే సిప్‌కు అనుకూలం. ఎందుకంటే ఇది కొనుగోలు ధరను సగటుగా మారుస్తుంది. మార్కెట్లు పడిపోయినప్పుడు తక్కువ ధరల్లోనూ సిప్ ద్వారా కొనుగోలు చేస్తారు. అలాగే, మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగుతాయి. డెట్ ఫండ్స్ అన్నవి స్థిరంగా ఉంటాయి. పెట్టుబడికి రక్షణ ఉద్దేశంతో కొనసాగుతాయి. మీ పెట్టుబడి ఉద్దేశాలకు అనుకూలం అనుకుంటే డెట్ ఫండ్స్‌లో ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతలతో ఉంటాయి. కనుక ఈక్విటీ పథకాల్లో ఒకే విడత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటుంటే, అప్పుడు ఆ మొత్తాన్ని డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. అక్కడి నుంచి సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ ద్వారా ఈక్విటీ పథకాల్లోకి నిర్ణీత కాలంలోపు పెట్టుబడులను బదిలీ చేసుకోండి. నా సోదరుడు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. దురదృష్టంకొద్దీ అతడు ఇటీవలే మరణించాడు. నామినీగా మా వదిన ఉండడంతో, ఆమె పేరు మీదకు ఫండ్స్ యూనిట్లు బదిలీ అయ్యాయి. ఇప్పుడు మా ఒదిన వాటిని విక్రయించాల్సి ఉంటుందా? –వరుణ్ యూనిట్ హోల్డర్ మరణిస్తే, వారి పేరుమీద ఉన్న యూనిట్లను నామినీ క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు ఆ యూనిట్లు నామినీకి బదిలీ అవుతాయి. సాధారణంగా బ్యాంకు డిపాజిట్లు, బీమా ప్లాన్లలో ఆ మొత్తం నామినీ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో అలా కాకుండా యూనిట్లను నామినీకి బదిలీ చేస్తారు. ఒకసారి ఇలా బదిలీ అయిన యూనిట్లకు నామినీయే యజమాని అవుతారు. కనుక వారు కోరుకున్నంత కాలం ఆ యూనిట్లను కొనసాగించుకోవచ్చు. విక్రయించడం తప్పనిసరి కాదు. -
డెట్‌లో నమ్మకమైన రాబడి
స్వల్ప కాల లక్ష్యాలకు డెట్ సాధనాలే అనుకూలం. ఈక్విటీలంటే కనీసం ఐదేళ్లు అంతకుమించి వ్యవధి కావాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకోలేని వారి కోసం, స్వల్పకాల లక్ష్యాల కోసం డెట్ ఫండ్స్‌లో.. తక్కువ రిస్క్, మెరుగైన రాబడుల కోసం చూసే వారికి మనీ మార్కెట్ ఫండ్స్ అనుకూలమని చెప్పుకోవచ్చు. 2018–20 మధ్యకాలంలో డెట్ మార్కెట్లో రుణ చెల్లింపుల ఎగవేతలు, సంక్షోభ సమయంలోనూ మనీ మార్కెట్ ఫండ్స్ విభాగం బలంగా నిలబడింది. పెట్టుబడుల విధానం.. ఇవి తక్కువ కాల వ్యవధి కలిగిన సాధనాల్లో (సాధారణంగా ఏడాదిలోపు) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక క్రెడిట్ రిస్క్ భయం అక్కర్లేదు. వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో దీర్ఘకాలిక డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం సరికాదు. అందుకని ప్రస్తుత తరుణంలో ఈ పథకాలు ఎంతో అనుకూలమని చెప్పుకోవచ్చు. తక్కువ రిస్క్ కోరుకునే వారికి కూడా అనుకూలం. ఈ విభాగంలో ఇన్వెస్టర్లు ప్రధానంగా నాలుగు పథకాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అవి.. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ (ఏబీఎస్ఎల్) మనీ మేనేజర్, హెచ్డీఎఫ్సీ మనీ మార్కెట్, ఎస్బీఐ సేవింగ్స్, నిప్పన్ ఇండియా మనీ మార్కెట్. స్వల్పకాలం నుంచి మధ్య కాలానికి వీటిని పరిశీలించొచ్చు. ఈ పథకాలన్నీ కూడా కనీసం రూ.10వేల కోట్లకు పైగా నిర్వహణ ఆస్తులు కలిగి ఉన్నవి కావడం గమనించాలి. రాబడులు మనీ మార్కెట్ ఫండ్స్ మూడేళ్లకు పైన పన్ను అనంతరం రాబడుల్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన పనితీరు చూపించాయి. డెట్ పథకాల్లో కనీసం మూడేళ్లపాటు పెట్టుబడులు కొనసాగించినట్టయితే, లాభాలు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. మూడేళ్ల రోలింగ్ రాబడులను గమనిస్తే ఈ మూడు పథకాల్లోనూ వార్షికంగా 7.5 శాతానికి పైనే ఉన్నాయి. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ఇవి మనీ మార్కెట్ ఫండ్స్ విభాగంలో రాబడుల పరంగా మెరుగైన స్థానంలో నిలిచాయి. మూడేళ్లలో సగటున రోలింగ్ రాబడి 7.5–7.8 శాతం చొప్పున ఉంది. ఈ కాలంలో గరిష్ట రాబడి 8.9–9.5 శాతం వరకు ఉంటే, కనిష్ట రాబడి 5–5.2 శాతం మధ్య ఉంది. ఒక్క 2021 సంవత్సరాన్ని మినహాయిస్తే గడిచిన పదేళ్ల కాలంలో ఈ పథకాల్లో రాబడి 6.29–9.2 శాతం మధ్య ఉంది. కానీ ఫిక్స్డ్ డిపాజిట్లలో రేట్లు 6–7 శాతంగానే ఉండడాన్ని గమనించాలి. మూడేళ్లకు మించిన కాలానికి వచ్చే రాబడిపై 20 శాతం పన్ను పడుతుంది. కాకపోతే రాబడి నుంచి ద్రవ్యోల్బణాన్ని మినహాయించుకోవచ్చు. ఇండెక్సేషన్ ప్రయోజనం వల్ల రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడకపోవచ్చు. కనుక మూడేళ్లు, ఐదేళ్ల పాటు పెట్టుబడులపై ఈ పథకాల్లో పన్ను అనంతరం నికర వార్షిక రాబడి 7 శాతానికి పైనే, అది కూడా రిస్క్ లేకుండా ఉంటుందని అంచనా వేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో ఈ నాలుగు పథకాలూ తక్కువ రిస్క్ పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నాయి. వీటి పెట్టుబడి సాధనాల సగటు మెచ్యూరిటీ (కాల వ్యవధి ముగియడం) 0.28–0.38 సంవత్సరాలుగా ఉంది. అంటే ఏడాదిలో ఒకటో వంతు. 71–113 వరకు సెక్యూరిటీ సాధనాల్లో పెట్టుబడులు కలిగి ఉన్నాయి. ఒక సాధనంలో 5 శాతానికి మించి పెట్టుబడులు లేవు. వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తోంది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
ఇక కొత్త పథకాల జోరు.. ముగిసిన మూడు నెలల నిషేధం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాలు ఇక మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. కొత్త పథకాల ఆరంభంపై సెబీ విధించిన మూడు నెలల నిషేధం ముగిసిపోయింది. దీంతో అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఫండ్స్ సంస్థలు) కొత్త పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క జూలైలోనే 28 పథకాలను కంపెనీలు ప్రారంభించాయి. ఈక్విటీ, డెట్, ఇండెక్స్, ఈటీఎఫ్‌ల విభాగాల్లో వీటిని తీసుకొచ్చాయి. ఇన్వెస్టర్ల నిధుల పూలింగ్ విషయంలో తాను తీసుకొచ్చిన నిబంధనలను జూలై 1 నాటికి అమలు చేయాలని ఆదేశిస్తూ.. అప్పటి వరకు కొత్త పథకాలు ప్రారంభిచొద్దని ఈ ఏడాది ఏప్రిల్‌లో సెబీ ఆదేశించింది. జూలై 1తో నిషేధం ముగిసిపోయింది. పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో డ్యుయల్ అథెంటికేషన్, ఖాతా మూలాలను గుర్తించాలని కూడా సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కొత్త నిబంధనలు తెచ్చింది. జూలైలో 28 ఎన్‌ఎఫ్‌వోలు జూలైలో 18 ఏఎంసీలు కలసి 28 కొత్త పథకాలను ప్రారంభించాయి. ఇందులో నాలుగు పథకాలు ముగిసిపోగా, 24 పథకాలు ఇంకా పెట్టుబడుల స్వీకరణలో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, బరోడా బీఎన్పీ పారిబాస్, కెనరా రొబెకో, డీఎస్పీ, మోతీలాల్ ఓస్వాల్, ఐడీఎఫ్సీ, మిరే అస్సెట్ నుంచి ఈ పథకాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రారంభమైన పథకాల్లో చాలా వరకు సెబీ విధించిన మూడు నెలల నిషేధానికి ముందే అనుమతి పొందినవిగా ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ హెడ్ అమర్ రాను తెలిపారు. ప్యాసివ్ విభాగంలో పథకాలు లేకపోతే వాటా కోల్పోతామన్న ఉద్దేశ్యంతో.. ఏఎంసీలు ప్యాసివ్ ఇండెక్స్ పథకాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. యాక్టివ్ నిర్వహణతో కూడిన ఈక్విటీ పథకాల్లో మంచి రాబడులు లేకపోవడంతో.. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొంత పెట్టుబడులను ప్యాసివ్ పథకాలకు మళ్లిస్తున్నట్టు అమర్‌రాను వెల్లడించారు. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నుంచి ఈటీఎఫ్‌లకు ఆసక్తి పెరిగినట్టు మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. 176 కొత్త పథకాలు.. 2021–22లో ఏఎంసీలు 176 కొత్త పథకాలను ఆవిష్కరించి, వీటి రూపంలో రూ.1.08 లక్షల కోట్లను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించాయి. అంటే సగటున ఒక్కో నెలలో 15 పథకాలు ప్రారంభమయ్యాయి. 2020–21లో 84 కొత్త పథకాలు రాగా, అవి రూ.42,038 కోట్లను ఆకర్షించాయి. రానున్న రోజుల్లో మరిన్ని నూతన పథకాలు ఇన్వెస్టర్ల ముందుకు వస్తాయని, వీటిల్లో డెట్, ఈక్విటీ విభాగం నుంచి ప్యాసివ్ (ఇండెక్స్‌ల్లో) స్ట్రాటజీతో ఉంటాయని ఎపిస్లాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్‌రావు చెప్పారు. -
నిప్పన్ ఇండియా డెట్ ఫండ్ రివ్యూ
అత్యధిక క్రెడిట్ నాణ్యతను పాటిస్తూ, వడ్డీ రేట్ల అస్థిరతల రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకునే వారు బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ ఫండ్ (ఎన్‌బీపీడీఎఫ్) మంచి పనితీరు చూపిస్తోంది. బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసే రుణ పత్రాల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. కనుక పెట్టుబడికి ముప్పు ఏర్పడే రిస్క్ దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. అందుకే రిస్క్ వద్దని కోరుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. మధ్యకాల పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల ఇన్వెస్టర్లు పోర్ట్ఫోలియలో ఈ పథకాన్ని భాగం చేసుకోవచ్చు. పెట్టుబడుల విధానం. సెబీ నిబంధనల ప్రకారం బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ ఫండ్స్ కనీసం 80 శాతం పెట్టుబడులను బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూలు), పబ్లిక్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (పీఎఫ్ఐ) జారీ చేసే రుణ పత్రాల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలలో (జీసెక్‌లు) ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ పథకాలకు ఉంటుంది. ఎన్‌బీపీడీఎఫ్ తక్కువ మెచ్యూరిటీ పత్రాలను ఎక్కువగా పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటుంది. అంటే దీర్ఘకాల రుణ పత్రాల్లో పెట్టుబడులు ఎక్కువగా పెట్టదు. మూడింట రెండొంతుల పెట్టుబడులను పీఎస్‌యూలు, పీఎస్‌యూ బ్యాంకులు, ఎఫ్‌పీఐల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని గమనించొచ్చు. పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే నాణ్యమైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు డెట్ ఇనుస్ట్రుమెంట్స్ కనిపిస్తాయి. గడిచిన మూడేళ్ల కాలంలో బ్యాంకులు, పీఎస్‌యూలు జారీ చేసిన ఏఏఏ రెటెడ్ డెట్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఏఏఏ రేటింగ్ అంటే అధిక భద్రతకు చిహ్నంగా చూడాలి. ప్రభుత్వరంగ సంస్థల రుణ పత్రాలకు సౌర్వభౌమ హామీ ఉంటుంది. విశ్లేషణ.. ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రేట్లు పెరగడం మొదలైతే స్వల్పకాల ఇనుస్ట్రుమెంట్లను కలిగి ఉన్న పథకాలకు అనుకూలంగా ఉంటుంది. ‘‘ప్రస్తుతం మనం అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను చూస్తున్నాం. దేశీయంగా ఆర్థిక రికవరీ మొదలైంది. కనుక కరోనాతో కుదుటపడ్డ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఆర్బీఐ ప్రకటించిన అత్యవసర చర్యలన్నింటినీ వెనక్కి తీసుకోవచ్చు. వడ్డీ రేట్లు కనిష్టాల్లోనే ఉండిపోవన్న దానిపై ఎక్కువ మందిలో ఏకాభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే ఏడాది, ఏడాదిన్నరలో వడ్డీ రేట్ల సైకిల్ పెరగడాన్ని చూడొచ్చు. అస్థిరతలు తక్కువగా ఉండాలంటే తక్కువ డ్యురేషన్ డెట్ పత్రాల్లో పెట్టుబడులు పెట్టే పథకాలు అనుకూలంగా ఉంటాయి. ఎన్‌బీపీడీఎఫ్ ఫండ్ నష్టాలను కట్టడి చేయగలదు’’ అని ఫండ్స్ఇండియా రీసెర్చ్ హెడ్ అరుణ్‌కుమార్ తెలిపారు. రాబడులు ఈ పథకం 2015 మే నెలలో ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షికంగా ఇచ్చిన రాబడి 8.37 శాతం చొప్పున ఉంది. గడిచిన ఏడాది కాలంలో ట్రెయిలింగ్ రాబడులు 4.5 శాతంగా ఉన్నాయి. అదే మూడేళ్ల కాలంలో 8.77 శాతం. ఐదేళ్లలో 7.75 శాతం చొప్పున రాబడిని అందించింది. ఫండ్ పోర్ట్‌ఫోలియో సగటు మెచ్యూరిటీ 1.5 నుంచి 3.5 సంవత్సరాల మధ్య ఉండడాన్ని గమనించొచ్చు. చదవండి:నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్ రివ్యూ -
ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే డెట్ ఫండ్స్ మెరుగైనవా?
ఇండెక్స్ ఫండ్స్‌లో రాబడులు ఎంత? బ్యాంకు ఎఫ్‌డీల కంటే మీడియం లాంగ్, మీడియం డ్యురేషన్ ఫండ్స్ మెరుగైనవా? – కీర్తి నందన Fixed Deposits and Debt funds : భద్రత పాళ్లు అధికంగా ఉండే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లను (ఎఫ్డీలు) డెట్ ఫండ్‌తో పోల్చి చూడడం సరికాదు. ఎఫ్డీలపై రాబడులు దాదాపుగా గ్యారంటీడ్ (హామీతో కూడిన)గా ఉంటాయి. బ్యాంకులు సంక్షోభంలో పడితే డిపాజిటర్ల డబ్బులు (గరిష్టంగా రూ.5లక్షల వరకు) 90 రోజుల్లోపు చెల్లించేలా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌ను ప్రభుత్వం సవరించింది. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే డెట్ ఫండ్స్‌పై రాబడుల విషయంలో ఎటువంటి హామీ లభించదు. రాబడుల విషయంలో ఏ మ్యూచువల్ ఫండ్‌కూడా హామీ ఇవ్వదు. కాకపోతే పెట్టుబడులను నష్టపోకుండా స్థిరమైన రాబడులకు అయితే అవకాశం ఉంటుంది. కానీ మీడియం లేదా లాంగ్ డ్యురేషన్ (కాల వ్యవధి) ఫండ్స్‌కు ఇది వర్తించదు. కొన్ని ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ పడిపోదు. ఉదాహరణకు ఓవర్‌నైట్ ఫండ్స్‌లో రాబడులు సేవింగ్ ఖాతా కంటే ఎక్కువ ఉండవు. అల్ట్రా షార్ట్ టర్మ్, షార్ట్ టర్మ్ ఫండ్స్ అన్నవి ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరే, కొన్ని సందర్భాల్లో కొంచెం అధిక రాబడులను ఇచ్చే విధంగా పనిచేస్తాయి. స్వల్ప కాలానికి ఎఫ్డీలతో ఈ ఫండ్స్‌ను పోల్చి చూడొద్దు. ఎందుకంటే కొన్ని డెట్ ఫండ్స్ స్వల్పకాలంలో విలువను కోల్పోవచ్చు. 2–4 ఏళ్ల కాలానికి అయితే ఎఫ్‌డీల కంటే అధిక రాబడులు అందుకోవచ్చు. ఇక పన్ను చెల్లింపు రెండో అంశం అవుతుంది. ఎఫ్డీలు, డెట్ ఫండ్స్ రాబడులపై పన్ను వేర్వేరుగా ఉంటుంది. డిపాజిట్లపై వచ్చే ఆదాయానికి ఏటా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అది వెనక్కి తీసుకున్నా లేదా క్యుములేటివ్ అయినా ఇదే వర్తిస్తుంది. డెట్ ఫండ్స్‌లో రాబడులపై పన్ను అన్నది విక్రయించిన తర్వాతే అమల్లోకి వస్తుంది. మూడేళ్లకు పైగా డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను కొనసాగించినట్టయితే.. రాబడుల్లోంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించిన తర్వాత పన్ను చెల్లిస్తే చాలు. ఈ ప్రయోజనాల వల్ల దీర్ఘకాలంలో ఎఫ్‌డీల కంటే డెట్ ఫండ్స్‌లో కాస్త మెరుగైన రాబడులు అందుకోగలరు. పదిహేనేళ్ల కాలానికి పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా సెన్సెక్స్ లేదా నిఫ్టీ ఫండ్ ఏదైనా ఉందా? 16 నుంచి 17 శాతం వార్షిక రాబడులు రావాలి. అది కూడా రోజువారీగా ఆ పథకాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉండకూడదు? – ఆర్ఎస్ దహియా వచ్చే 15 ఏళ్ల కాలానికి నిఫ్టీ లేదా సెన్సెక్స్ 16–17 శాతం చొప్పున వార్షిక రాబడులు ఇస్తాయే, లేదో నాకు తెలియదు. ఒకవేళ వడ్డీ రేట్లు 5–7 శాతం స్థాయికి పరిమితమైతే అప్పుడు వార్షిక రాబడులు 12 శాతం ఉన్నా కానీ మెరుగైనవే. సుదీర్ఘకాల చరిత్ర ఉన్న ఇండెక్స్ ఫండ్ పనితీరును గమనిస్తే.. చాలా ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది. కానీ, గత పనితీరు అన్నది భవిష్యత్తుకు సంకేతం కాదు. రానున్న కాలంలో భిన్నమైన పనితీరును చూపించే అవకాశం కూడా లేకపోలేదు. నిఫ్టీ, సెన్సెక్స్ గురించి మాట్లాడుతుంటే అది లార్జ్‌క్యాప్ కంపెనీల గురించే. సాధారణ మార్కెట్‌కు అనుగుణంగానే లార్జ్‌క్యాప్ కంపెనీల పనితీరు ఉంటుంది. సెన్సెక్స్‌లోని కొన్ని కంపెనీలు అసాధారణ పనితీరు చూపించొచ్చు. కొన్ని నిరుత్సాహపరచొచ్చు. ఇండెక్స్ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసేట్టు అయితే రాబడులు దీర్ఘకాలంలో సహేతుకంగా ఉంటాయి. అంతేకాదు స్థిరాదాయ పథకాల కంటే అధికంగా, ద్రవ్యోల్బణం కంటే ఎక్కువే ఉంటాయి. కనుక ఆ రాబడులు మంచివే. - ధీరేంద్రకుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి: Insurance Policy: ఈ పాలసీలు.. ఎంతో సులభం -
జియో నిధుల్లో కొంత డెట్ ఫండ్స్‌లోకి!
డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియోలో వాటా విక్రయం ద్వారా సమీకరించిన నిధుల్లో కొంతమేర డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్పకాలిక డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు రిలయన్స్ జియోలో వాటా విక్రయం, మరోపక్క రైట్స్ ఇష్యూ చేపట్టడం ద్వారా సమీకరించిన నిధుల్లో కొంతమేర అతి స్వల్పకాలిక, మనీ మార్కెట్ ఫండ్స్, తదితర రుణ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సగటున మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితిగల వివిధ రుణ సెక్యూరిటీలలో నిధులను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశాయి. 20 బిలియన్ డాలర్లు ఇటీవల రిలయన్స్ జియోలో వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ ఆర్ఐఎల్ 20 బిలియన్ డాలర్లను(రూ. 1,50,000 కోట్లకుపైగా) సమకూర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో విదేశీ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్ ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటాలు కొనుగోలు చేసిన విషయం విదితమే. కొద్ది వారాలుగా పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ స్థాయిలో నిధులను సమీకరిస్తోంది. దీంతో ఆర్ఐఎల్ స్వల్పకాలిక పెట్టుబడులపై ఇటీవల ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆసక్తి పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కొంతమంది మనీ మేనేజర్ల వివరాల ప్రకారం ఇటీవల ఆర్ఐఎల్ సుమారు రూ. 35,000 కోట్లు(4.7 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. భారీ కార్పొరేట్ కంపెనీ నుంచి ఇటీవల రుణ సెక్యూరిటీలలోకి పెట్టుబడులు ప్రవహిస్తున్నట్లు మ్యూచువల్ ఫండ్ అడ్వయిజరీ సంస్థ వేల్యూ రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. రుపీకి బలం ఇటీవల కొద్ది వారాలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ స్థాయిలో విదేశీ నిధులను సమీకరిస్తుండటంతో దేశీ కరెన్సీకి బలమొచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో గత నెల రోజుల్లో డాలరుతో మారకంలో రూపాయి 1 శాతానికిపైగా పుంజుకున్నట్లు తెలియజేశాయి. వెరసి ఆసియా కరెన్సీలలో రూపాయి ముందంజ వేసినట్లు తెలియజేశాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం ద్వారా సమీకరించిన నిధుల్లో కొంతమేర ఆర్ఐఎల్ వడ్డీ రేట్ల ఆధారిత పెట్టుబడులకు మళ్లిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
ఈక్విటీ ఫండ్సా? డెట్ ఫండ్సా?
ఫైనాన్షియల్ బేసిక్స్... మార్కెట్లో చాలా ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఫండ్ ఎంపికకు ముందే మనం (ఇన్వెస్టర్) తొలిగా ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవాలా? లేదా డెట్ ఫండ్‌ని ఎంపిక చేసుకోవాలా? అని నిర్ణయం తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి దీర్ఘకాలంలో పెట్టుబడులకు సరైన ప్రతిఫలం పొందాలంటే మన పొర్ట్‌ఫోలియోలో ఈక్విటీ అసెట్స్ తప్పనిసరి. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడమంటే కంపెనీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే. మార్కెట్ పరిస్థితులకు అనువుగా ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఫండ్ ఎంపిక ఇలా.. ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం: ఆర్థిక లక్ష్యాలకు అనువుగా ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి. కొంత రాబడి కోసమైతే డెట్ ఫండ్స్ వైపు చూడాలి. అదే సంపద వృద్ధి కోసం ఈక్విటీ ఫండ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. పెట్టుబడుల కాలం: ఇన్వెస్టర్ ఒక అసెట్ తరగతిని ఎంపిక చేసుకునేటప్పుడు అందులో ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలి అనే అంశాన్ని అప్పటికే నిర్ణయించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ల కాలం ఐదేళ్లలోపు ఉంటే డెట్ ఫండ్‌ని, ఐదేళ్ల పైన ఉంటే ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవాలి. రాబడి అంచనా: మన రాబడి అంచనాలకు అనుగుణంగా ఫండ్ ఎంపిక ఉండాలి. ఒక్కొక్క ఫండ్ రాబడి ఒక్కోలా ఉంటుంది. ఈ రాబడిని అప్పటి పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలంలో సగటున డెట్ ఫండ్స్ రాబడి 9 శాతంగా, ఈక్విటీ ఫండ్స్ రాబడి 16 శాతంగా ఉండొచ్చు. చివరిగా: ఏ ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి? అనే ప్రశ్నకు సమాధానం తెలిసిన తర్వాత ఫండ్ హౌస్‌ను ఎంచుకోవాలి. ఫండ్ హౌస్ బ్రాండ్ విలువ, దాని మేనేజ్మెంట్, ఇది వరకు ఫండ్ పనితీరు, సేవల నాణ్యత వంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. -
పన్ను లేకుండా ఫండ్ మార్పు ఎలా..
నేను సిప్ విధానంలో ఒక ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. అందుకే వేరే ఈక్విటీ ఫండ్‌లోకి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మారుద్దామనుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ నుంచి పెట్టుబడులను ఒకేసారి ఉపసంహరించుకొని ఆ మొత్తాన్ని వేరే ఫండ్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయమంటారా? ఇలాచేస్తే ఏడాదిలోపు నేను సిప్ద్వారా ఇన్వెస్ట్ చేసిన మొత్తాలపై షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అలాకాకుండా ప్రస్తుత ఫండ్ నుంచి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ)ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని వేరే ఫండ్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? ఈ రెండింటిలో దేనిని ఎంచుకుంటే బావుంటుంది? - అరవిందరావు, హైదరాబాద్ ఈక్విటీ ఫండ్స్ పనితీరు స్వల్పకాలాన్ని పరిగణనలోకి తీసుకొని మదింపు చేయకూడదు. ఈక్విటీ ఫండ్ పనితీరును అంచనా వేయడానికి ఏడాది కాలం సరిపోదని మేం భావిస్తున్నాం. మీరు వేరే ఈక్విటీ ఫండ్‌లోకి మారేటప్పుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి. ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి మీరు మారేటప్పుడు ముందుగా మీరు చేయాల్సిన పని... ఈక్విటీ ఫండ్‌ను నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్‌కు స్టాప్ రిక్వెస్ట్‌ను సమర్పించాలి. ఒకేసారి మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిని ఉపసంహరించుకుంటే మీరు చెప్పినట్లుగానే మీరు షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఏడాది దాటిన వాటిని ఒకేసారి ఉపసంహరించుకోవాలి. ఏడాది లోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఈ విధానాన్ని అనుసరిస్తే మంచిది. తాతల నాటి స్థిరాస్థిని విక్రయించగా నా భాగానికి కోటి రూపాయలు వచ్చాయి. దీనిని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామనుకుంటున్నాను. దీనిపై వచ్చే వడ్డీని ఇంటి అద్దె, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఉపయోగించుకోవాలనేది నా ఆలోచన. ఫిక్స్డ్ డిపాజిట్‌గా కాకుండా, ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? నా సొమ్ము భద్రంగా ఉండేలా మరో మార్గమేదైనా ఉందా? సరైన సలహా ఇవ్వండి. - జాన్, ఈ మెయిల్ ద్వారా డెట్ ఫండ్‌లో ఇంత పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. మీరు భద్రత కోరుకుంటున్నారు. అదే సమయంలో స్థిరమైన రాబడులు (ఇంటి అద్దె, ఇతర ఖర్చులు) కోరుకుంటున్నారు. ఈ దృష్ట్యా చూస్తే డెట్ఫండ్లో ఇన్వెస్ట చేయడం సరైనపనే కాదు. బ్యాంక్ డిపాజిట్లతో పోల్చితే డెట్‌ఫండ్స్ ఒకింత అధిక రాబడినే అందిస్తాయని చెప్పవచ్చు. అయితే ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయి. నెలవారీ రాబడుల నిమిత్తం ఈ ఫండ్లపై ఆధారపడడం సరైన విధానం కాదు. రూ. కోటి అనేది అతి పెద్ద మొత్తం. దీనిని ఒకేచోట ఒకేసారి ఒకే మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఏడాది పాటు ఇంటి అద్దె, ఇతర ఖర్చులన్నింటిని లెక్కవేసి ఆ మొత్తాన్ని మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో జమ చేయండి. ఇదే మొత్తానికి మూడు రెట్ల మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. గరిష్టంగా రాబడులను పొందాలంటే స్వీప్-ఇన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌం ట్ను తెరవండి. ఈ తరహా ఖాతాల్లో నిర్దేశిత పరిమితికి మించి సొమ్ములు పెరిగినట్లయితే, బ్యాంక్ ఆ పెరిగిన మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్‌గా మారుస్తుంది. దీంతో మామూలుగా కన్నా అధికంగా మీకు రాబడులు లభిస్తాయి. మరోవైపు పరిమితి కంటే తక్కువగా మీ ఖాతాలో సొమ్ములున్నప్పుడు, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ రద్దై, ఆ సొమ్ములు సేవింగ్స్ ఖాతాలోకి వస్తాయి. ఇక మిగిలిన మొత్తాన్ని మంచి రేటింగ్ ఉన్న ఇన్కమ్, షార్ట్‌టెర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. .. ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్‌టెర్మ్ ఇన్కమ్ ప్లాన్, యూటీఐ షార్ట్‌టెర్మ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్, బిర్లా సన్‌లైఫ్ మీడియమ్ టెర్మ్ ప్లాన్, యూటీఐ డైనమిక్ బాండ్ తదితర ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.