వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్‌కు విడిగా కేవైసీ ఇవ్వకుండా, ఏదైనా కేంద్రీకృత ప్లాట్‌ఫామ్ ఉందా?
– సమీర్ పటేల్
కేవైసీ (కస్టమర్ గురించి తెలుసుకోవడం) అనేది ఇన్వెస్టర్ల గుర్తింపు, చిరునామాకు సంబంధించినది. నల్లధన నిరోధక చట్టం కింద ఇన్వెస్టర్ విధిగా కేవైసీ వివరాలు ఇవ్వాల్సిందే. ప్రస్తుతం కేంద్రీకృత కేవైసీ (సీకేవైసీ) ప్లాట్‌ఫామ్ ఒకటి పనిచేస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినది. ఇన్వెస్టర్ తన కేవైసీ ప్రక్రియను ఒక్కసారి పూర్తి చేస్తే చాలు. ఇన్వెస్టర్ కొత్త మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ కేవేసీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఇన్వెస్టర్లు పాన్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా సెబీ వద్ద నమోదైన క్యాపిటల్ మార్కెట్ మధ్యవర్తి (స్టాక్ బ్రోకర్, డీపీ)కి సమర్పించొచ్చు. ఆ సమాచారం కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీల ద్వారా కేంద్రీకృత వ్యవస్థలో నమోదు అవుతుంది.
నా వయసు 62 ఏళ్లు. నేను ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. నా మాదిరి వృద్ధులు ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకునేందుకు డెట్ ఫండ్ లేదా ఈక్విటీ ఫండ్ ఏది అనుకూలం? – శర్వానంద్ శివమ్
వృద్ధులు కేవలం డెట్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ముందు కొంత సమయం తీసుకుని పెట్టుబడిపై మరింత స్పష్టతను తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీ పెట్టుబడి ఉద్దేశాలు, పెట్టబడి కాలం ఎంతన్నది తేల్చుకోవాలి. మీకు దీర్ఘకాల లక్ష్యం ఉందా? లేక ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం తర్వాతే పెట్టుబడి అవసరం ఉందా? వీటికి అవును అనేది సమాధానం అయితే అందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సరైన ఎంపిక అవుతుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్/క్రమానుగత పెట్టుబడి) లేదా లంప్‌సమ్ (ఒకే విడత) పెట్టుబడిలో ఏది మంచిది? అని అడిగితే.. మేము అయితే సిప్‌కు అనుకూలం. ఎందుకంటే ఇది కొనుగోలు ధరను సగటుగా మారుస్తుంది. మార్కెట్లు పడిపోయినప్పుడు తక్కువ ధరల్లోనూ సిప్ ద్వారా కొనుగోలు చేస్తారు. అలాగే, మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగుతాయి. డెట్ ఫండ్స్ అన్నవి స్థిరంగా ఉంటాయి. పెట్టుబడికి రక్షణ ఉద్దేశంతో కొనసాగుతాయి. మీ పెట్టుబడి ఉద్దేశాలకు అనుకూలం అనుకుంటే డెట్ ఫండ్స్‌లో ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతలతో ఉంటాయి. కనుక ఈక్విటీ పథకాల్లో ఒకే విడత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటుంటే, అప్పుడు ఆ మొత్తాన్ని డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. అక్కడి నుంచి సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ ద్వారా ఈక్విటీ పథకాల్లోకి నిర్ణీత కాలంలోపు పెట్టుబడులను బదిలీ చేసుకోండి.
నా సోదరుడు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. దురదృష్టంకొద్దీ అతడు ఇటీవలే మరణించాడు. నామినీగా మా వదిన ఉండడంతో, ఆమె పేరు మీదకు ఫండ్స్ యూనిట్లు బదిలీ అయ్యాయి. ఇప్పుడు మా ఒదిన వాటిని విక్రయించాల్సి ఉంటుందా? –వరుణ్
యూనిట్ హోల్డర్ మరణిస్తే, వారి పేరుమీద ఉన్న యూనిట్లను నామినీ క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు ఆ యూనిట్లు నామినీకి బదిలీ అవుతాయి. సాధారణంగా బ్యాంకు డిపాజిట్లు, బీమా ప్లాన్లలో ఆ మొత్తం నామినీ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో అలా కాకుండా యూనిట్లను నామినీకి బదిలీ చేస్తారు. ఒకసారి ఇలా బదిలీ అయిన యూనిట్లకు నామినీయే యజమాని అవుతారు. కనుక వారు కోరుకున్నంత కాలం ఆ యూనిట్లను కొనసాగించుకోవచ్చు. విక్రయించడం తప్పనిసరి కాదు.
Comments
Please login to add a commentAdd a comment