ప్రతి రోజూ కాకపోయినా వారానికొకసారైనా ఇన్‌కంట్యాక్స్ వెబ్‌సైట్‌ని చూస్తూ ఉండండి. రోజు, తిథి, వారం, నక్షత్రాల్లాగా, వాతావరణం రిపోర్ట్‌లాగా, బంగారం రేట్లలాగా, షేర్ మార్కెట్ల ధరల్లాగా, చూడక తప్పదు. సైటు తెరవగానే హోమ్‌పేజీలో ఇంపార్టెంట్ విషయాలు ఇరవై ఉంటాయి. వీటిని తెరిస్తే మీకు ఉపయోగపడే సమాచారం కనిపిస్తుంది. వీటిలో ముఖ్యమైనవి.. ఈ–వెరిఫికేషన్ స్టేటస్, పాన్ స్టేటస్, చెల్లించిన పన్ను స్టేటస్, మీ అధికారి ఎవరు, మీ రిఫండ్ స్టేటస్, ఆధార్‌తో అనుసంధానం వివరాలు, నోటీసు వివరాలు.
మీకు అవసరమైన విండోని ఓపెన్ చేస్తే అందులో ఉన్న కాలాలు అన్నీ పూరిస్తే, వివరాలు తెలుస్తాయి. రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత చాలా మంది రిఫండ్ ఇంకా రాలేదేంటి అని ప్రశ్నించడం మొదలెడతారు. అలాగే, అసెస్‌మెంట్ స్టేటస్‌కు సంబంధించి సాధారణంగా మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు సమాచారం వస్తుంది. ఓటీపీతో మొదలు అన్ని స్టేజీల్లోనూ మీకు సమాచారం అందుతూనే ఉంటుంది. ఆ సమాచార స్రవంతిని ఫాలో అవ్వండి. ఒకరోజు టీవీ, సీరియల్స్‌ని మిస్ అయినా ఫర్వాలేదు. ఈ ట్రాక్‌ని వదలకండి. పోస్టులో మీ ఇంటికి వచ్చి, తలుపు కొట్టి నోటీసులు ఇచ్చే రోజులు కావివి. అంతా ఆన్‌లైన్. అంతే కాకుండా నోటీసులు కూడా పంపుతున్నారు. ఈ మెయిల్స్‌ని ట్రాక్ చేయండి. అప్పుడప్పుడు నోటీసులు, సమాచారాలు ఈమెయిల్ బాక్సులో స్పామ్‌లోకి వెళ్లిపోతాయి. అలా పోయినా మనకు నోటీసు ఇచ్చినట్లుగానే భావిస్తారు డిపార్ట్‌మెంట్ వారు. ఫోన్‌లో మెసేజీ వచ్చిన వెంటనే మెయిల్ రాకపోవచ్చు. పది, పదిహేను రోజులు ఆగండి.
టాక్స్ కాలెండర్
ఇవన్నీ కాకుండా ‘టాక్స్ కాలెండర్’ కనిపిస్తుంది. అందులో ప్రతి తేదీని క్లిక్ చేస్తూ పోతే, ఆ రోజు మీరేం చేయాలో తెలుస్తుంది. ఉదాహరణకు సెప్టెంబర్ 15 అనుకోండి.. ఈ తేదీలోపల మీరు ఏయే ఫారాలు వెయ్యాలో, మీ ఎన్నో వాయిదా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలో చెబుతుంది. మీకు ఏ విషయంలో వారి సహాయం కావాలో, ఆ సలహా, సహాయం అందిస్తారు. మార్గదర్శకాలను కూడా చెబుతారు. ఫైలింగ్, టీడీఎస్, ట్యాక్స్, పాన్, టాన్, వార్షిక సమాచార నివేదికకి సంబంధించిన తప్పొప్పులు.. ఇలాంటి వాటి గురించి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఇవన్నీ ఫ్రీ కాల్స్! మీరు దాఖలు చేసే ప్రతి ఫారం 1,2,3,4,5,6,7.. ఇలాంటి వాటికి సంబంధించి ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి. మీరు నేరుగా సంప్రదించవచ్చు. సంప్రదించే ముందు మీ వివరాలు, అంటే పాన్, పేరు, పుట్టిన తేదీ, పన్నుకి సంబంధించిన వివరాలు ఉండాలి. అప్పటికప్పుడే మీకు సమాచారం దొరుకుతుంది. అలాగే మీ మెయిల్స్‌కి రెస్పాన్స్ వస్తుంది.
ఇంకొక మంచి అవకాశం ఏమిటంటే, మీరు ఫిర్యాదులు కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఐటీ రిఫండ్ విషయం ఉంటుంది. అవసరం అనిపిస్తే ఫిర్యాదులు చేయండి. మీ ఫిర్యాదుని నమోదు చేసుకుంటారు. ఎక్నాలెడ్జ్ చేస్తారు. దానికో నంబర్ కేటాయిస్తారు. ఆ ఫిర్యాదుల స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. వెంటనే దర్శించి, అన్నీ తెలుసుకోండి. మీ పాన్ నంబరు, పాస్‌వర్డ్ మీ దగ్గరుండాలి. ఈ సైట్ స్నేహపూర్వకమైనది. చాలా సులభతరమైనది. మీకు అన్నీ అర్థమయ్యేలా ఉంటుంది. ఇది ఉచితం. త్వరగా పని పూర్తవుతుంది. రెస్పాన్స్ బాగుంటుంది. వృత్తి నిపుణుల సహాయం అక్కర్లేదు. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఈ సైట్ డైనమిక్ అండోయ్!!
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment