అత్యధిక క్రెడిట్ నాణ్యతను పాటిస్తూ, వడ్డీ రేట్ల అస్థిరతల రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకునే వారు బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ ఫండ్ (ఎన్‌బీపీడీఎఫ్) మంచి పనితీరు చూపిస్తోంది. బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసే రుణ పత్రాల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. కనుక పెట్టుబడికి ముప్పు ఏర్పడే రిస్క్ దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. అందుకే రిస్క్ వద్దని కోరుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. మధ్యకాల పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల ఇన్వెస్టర్లు పోర్ట్‌ఫోలియలో ఈ పథకాన్ని భాగం చేసుకోవచ్చు.
పెట్టుబడుల విధానం.
సెబీ నిబంధనల ప్రకారం బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ ఫండ్స్ కనీసం 80 శాతం పెట్టుబడులను బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూలు), పబ్లిక్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (పీఎఫ్‌ఐ) జారీ చేసే రుణ పత్రాల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలలో (జీసెక్‌లు) ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ పథకాలకు ఉంటుంది. ఎన్‌బీపీడీఎఫ్ తక్కువ మెచ్యూరిటీ పత్రాలను ఎక్కువగా పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటుంది. అంటే దీర్ఘకాల రుణ పత్రాల్లో పెట్టుబడులు ఎక్కువగా పెట్టదు. మూడింట రెండొంతుల పెట్టుబడులను పీఎస్‌యూలు, పీఎస్‌యూ బ్యాంకులు, ఎఫ్‌పీఐల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని గమనించొచ్చు. పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే నాణ్యమైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు డెట్ ఇనుస్ట్రుమెంట్స్ కనిపిస్తాయి. గడిచిన మూడేళ్ల కాలంలో బ్యాంకులు, పీఎస్‌యూలు జారీ చేసిన ఏఏఏ రెటెడ్ డెట్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఏఏఏ రేటింగ్ అంటే అధిక భద్రతకు చిహ్నంగా చూడాలి. ప్రభుత్వరంగ సంస్థల రుణ పత్రాలకు సౌర్వభౌమ హామీ ఉంటుంది.
విశ్లేషణ..
ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రేట్లు పెరగడం మొదలైతే స్వల్పకాల ఇనుస్ట్రుమెంట్లను కలిగి ఉన్న పథకాలకు అనుకూలంగా ఉంటుంది. ‘‘ప్రస్తుతం మనం అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను చూస్తున్నాం. దేశీయంగా ఆర్థిక రికవరీ మొదలైంది. కనుక కరోనాతో కుదుటపడ్డ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఆర్‌బీఐ ప్రకటించిన అత్యవసర చర్యలన్నింటినీ వెనక్కి తీసుకోవచ్చు. వడ్డీ రేట్లు కనిష్టాల్లోనే ఉండిపోవన్న దానిపై ఎక్కువ మందిలో ఏకాభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే ఏడాది, ఏడాదిన్నరలో వడ్డీ రేట్ల సైకిల్ పెరగడాన్ని చూడొచ్చు. అస్థిరతలు తక్కువగా ఉండాలంటే తక్కువ డ్యురేషన్ డెట్ పత్రాల్లో పెట్టుబడులు పెట్టే పథకాలు అనుకూలంగా ఉంటాయి. ఎన్‌బీపీడీఎఫ్ ఫండ్ నష్టాలను కట్టడి చేయగలదు’’ అని ఫండ్స్‌ఇండియా రీసెర్చ్ హెడ్ అరుణ్‌కుమార్ తెలిపారు.
రాబడులు
ఈ పథకం 2015 మే నెలలో ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షికంగా ఇచ్చిన రాబడి 8.37 శాతం చొప్పున ఉంది. గడిచిన ఏడాది కాలంలో ట్రెయిలింగ్ రాబడులు 4.5 శాతంగా ఉన్నాయి. అదే మూడేళ్ల కాలంలో 8.77 శాతం. ఐదేళ్లలో 7.75 శాతం చొప్పున రాబడిని అందించింది. ఫండ్ పోర్ట్‌ఫోలియో సగటు మెచ్యూరిటీ 1.5 నుంచి 3.5 సంవత్సరాల మధ్య ఉండడాన్ని గమనించొచ్చు.
నిప్పన్ ఇండియా డెట్ ఫండ్ రివ్యూ
Published Mon, Jan 17 2022 8:18 AM | Last Updated on Mon, Jan 17 2022 9:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment