ప్రతీ ఇన్వెస్టర్ తన పెట్టుబడుల్లో ఈక్విటీలకు కచ్చితంగా స్థానం కల్పించాలి. అప్పుడే మెరుగైన సంపద సృష్టి, ఆర్థిక లక్ష్యాల సాధన సాధ్యపడుతుంది. ఇందుకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం అవుతుంది. ఈక్విటీల్లోనూ ఎన్నో రకాల విభాగాలున్నాయి. అందులో మల్టీక్యాప్ ఫండ్స్ విభాగం ఒకటి. అన్ని రకాల మార్కెట్ విలువలతో కూడిన కంపెనీలను పోర్ట్‌ఫోలియోలో భాగం చేసుకునేవే మల్టీక్యాప్ ఫండ్స్.
అంటే, లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లో.. ఒక్కో విభాగంలో కనీసం 25 శాతం చొప్పున పెట్టుబడులు పెడతాయి. దీంతో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పెట్టుబడి అవకాశాలను సొంతం చేసుకునే అనుకూలత ఈ పథకాలకు ఉంటుంది. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా మల్టీక్యాప్ ఫండ్ దీర్ఘకాలం నుంచి స్థిరమైన, నమ్మకమైన పనితీరును చూపిస్తోంది. సొంతిల్లు, పిల్లల ఉన్నత విద్య, వివాహాల వంటి దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం, అలాగే దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలని భావించే వారు ఈ పథకంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు.
రాబడులు
ఈ పథకం గడిచిన ఏడాది కాలలో 29 శాతం రాబడులను తెచ్చిపెట్టింది. కానీ, ఇదే కాలంలో ఈ పథకం రాబడికి పోల్చుకోతగిన ప్రామాణిక సూచీ బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ రాబడి కేవలం 15.63 శాతంగానే ఉంది. ఇక మూడేళ్ల కాలంలో చూసినా బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ రాబడి ఏటా 30 శాతంగా ఉంటే, ఈ పథకంలో రాబడి వార్షికంగా 41.50 శాతం మేర ఉంది. ఐదేళ్లలోనూ బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ కంటే 2 శాతం అధికంగా 14.47 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలం ఈ పథకంలో వచ్చింది. ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలో 15.61 శాతం చొప్పున వార్షిక రాబడి రేటు ఉంది. 2005 మార్చిలో ఈ పథకం మొదలైంది. అప్పటి నుంచి చూసుకుంటే ఏటా 17.18 శాతం చొప్పున రాబడి ఈ పథకంలో ఉండడం గమనించొచ్చు. ఇన్వెస్టర్లు సిప్ రూపంలో కనీసం రూ.1,000 నుంచి ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో
ఈ పథకాన్ని 16 ఏళ్ల నుంచి శైలేష్ రాజ్ భాన్ నిర్వహిస్తుండడం సానుకూల అంశం. అతని మెరుగైన నిర్వహణ పథకం స్థిరమైన రాబడులకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మెరుగైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను, సరైన విలువల వద్ద ఉంటే ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం విధానంలో భాగం. పోటీ కంపెనీలతో పోలిస్తే అనుకూలతలు ఉన్న కంపెనీలు కొంచెం అధిక విలువల వద్ద ఉన్నా, పెట్టుబడులను కేటాయిస్తుంది. ఆయా రంగాల్లో అగ్రగామి కంపెనీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఆయా రంగాల్లో వచ్చే స్వల్పకాల, మధ్య కాల అనుకూలతల్లోనూ పెట్టుబడులు పెడుతుంది.
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో మొత్తం రూ.15,088 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 98.71 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. మిగిలిన 1.29 శాతం నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 49 శాతం వరకు లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. మిడ్‌క్యాప్ కంపెనీలకు 34.05 శాతం కేటాయించగా, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 17.29 శాతం పెట్టుబడులే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 91 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 27.73 శాతం పెట్టుబడులను ఈ రంగానికి చెందిన కంపెనీలకే కేటాయించింది. సేవల రంగ కంపెనీల్లో 19.39 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో 13 శాతం, హెల్త్‌కేర్‌లో 7.72 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీల్లో 5.19 శాతం, కెమికల్స్ కంపెనీల్లో 4.92 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.
టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ |
కంపెనీ | పెట్టుబడుల శాతం |
లిండే ఇండియా | 4.69 |
ఐసీఐసీఐ బ్యాంక్ | 4.26 |
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ | 4.03 |
రిలయన్స్ ఇండస్ట్రీస్ | 3.53 |
యాక్సిస్ బ్యాంక్ | 3.42 |
ఇండియన్ హోటల్స్ కంపెనీ | 3.37 |
ఎల్‌అండ్‌టీ | 3.13 |
ఈఐహెచ్ | 3.11 |
ఎస్‌బీఐ | 3.07 |
కెన్నమెటల్ ఇండియా | 3.06 |
Comments
Please login to add a commentAdd a comment