longterm
-
దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలంటే.. ఈ ఫండ్‌ను పరిశీలించండి
ప్రతీ ఇన్వెస్టర్ తన పెట్టుబడుల్లో ఈక్విటీలకు కచ్చితంగా స్థానం కల్పించాలి. అప్పుడే మెరుగైన సంపద సృష్టి, ఆర్థిక లక్ష్యాల సాధన సాధ్యపడుతుంది. ఇందుకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం అవుతుంది. ఈక్విటీల్లోనూ ఎన్నో రకాల విభాగాలున్నాయి. అందులో మల్టీక్యాప్ ఫండ్స్ విభాగం ఒకటి. అన్ని రకాల మార్కెట్ విలువలతో కూడిన కంపెనీలను పోర్ట్‌ఫోలియోలో భాగం చేసుకునేవే మల్టీక్యాప్ ఫండ్స్. అంటే, లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లో.. ఒక్కో విభాగంలో కనీసం 25 శాతం చొప్పున పెట్టుబడులు పెడతాయి. దీంతో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పెట్టుబడి అవకాశాలను సొంతం చేసుకునే అనుకూలత ఈ పథకాలకు ఉంటుంది. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా మల్టీక్యాప్ ఫండ్ దీర్ఘకాలం నుంచి స్థిరమైన, నమ్మకమైన పనితీరును చూపిస్తోంది. సొంతిల్లు, పిల్లల ఉన్నత విద్య, వివాహాల వంటి దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం, అలాగే దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలని భావించే వారు ఈ పథకంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. రాబడులు ఈ పథకం గడిచిన ఏడాది కాలలో 29 శాతం రాబడులను తెచ్చిపెట్టింది. కానీ, ఇదే కాలంలో ఈ పథకం రాబడికి పోల్చుకోతగిన ప్రామాణిక సూచీ బీఎస్ఈ 500 టీఆర్ఐ రాబడి కేవలం 15.63 శాతంగానే ఉంది. ఇక మూడేళ్ల కాలంలో చూసినా బీఎస్ఈ 500 టీఆర్ఐ రాబడి ఏటా 30 శాతంగా ఉంటే, ఈ పథకంలో రాబడి వార్షికంగా 41.50 శాతం మేర ఉంది. ఐదేళ్లలోనూ బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే 2 శాతం అధికంగా 14.47 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలం ఈ పథకంలో వచ్చింది. ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలో 15.61 శాతం చొప్పున వార్షిక రాబడి రేటు ఉంది. 2005 మార్చిలో ఈ పథకం మొదలైంది. అప్పటి నుంచి చూసుకుంటే ఏటా 17.18 శాతం చొప్పున రాబడి ఈ పథకంలో ఉండడం గమనించొచ్చు. ఇన్వెస్టర్లు సిప్ రూపంలో కనీసం రూ.1,000 నుంచి ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో ఈ పథకాన్ని 16 ఏళ్ల నుంచి శైలేష్ రాజ్ భాన్ నిర్వహిస్తుండడం సానుకూల అంశం. అతని మెరుగైన నిర్వహణ పథకం స్థిరమైన రాబడులకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మెరుగైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను, సరైన విలువల వద్ద ఉంటే ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం విధానంలో భాగం. పోటీ కంపెనీలతో పోలిస్తే అనుకూలతలు ఉన్న కంపెనీలు కొంచెం అధిక విలువల వద్ద ఉన్నా, పెట్టుబడులను కేటాయిస్తుంది. ఆయా రంగాల్లో అగ్రగామి కంపెనీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఆయా రంగాల్లో వచ్చే స్వల్పకాల, మధ్య కాల అనుకూలతల్లోనూ పెట్టుబడులు పెడుతుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో మొత్తం రూ.15,088 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 98.71 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. మిగిలిన 1.29 శాతం నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 49 శాతం వరకు లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. మిడ్‌క్యాప్ కంపెనీలకు 34.05 శాతం కేటాయించగా, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 17.29 శాతం పెట్టుబడులే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 91 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 27.73 శాతం పెట్టుబడులను ఈ రంగానికి చెందిన కంపెనీలకే కేటాయించింది. సేవల రంగ కంపెనీల్లో 19.39 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో 13 శాతం, హెల్త్‌కేర్‌లో 7.72 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీల్లో 5.19 శాతం, కెమికల్స్ కంపెనీల్లో 4.92 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం లిండే ఇండియా 4.69 ఐసీఐసీఐ బ్యాంక్ 4.26 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.03 రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.53 యాక్సిస్ బ్యాంక్ 3.42 ఇండియన్ హోటల్స్ కంపెనీ 3.37 ఎల్అండ్టీ 3.13 ఈఐహెచ్ 3.11 ఎస్బీఐ 3.07 కెన్నమెటల్ ఇండియా 3.06 -
నిఫ్టీ 250ని మించి లాభాలు తెస్తున మ్యూచువల్ ఫండ్ ఇదే!
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో స్వల్ప కాలంలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ, దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించగలిగే వీలుంటే ఈ పథకాలు అద్భుతమైన రాబడులతో ఇన్వెస్టర్లకు సంపద తెచ్చిపెడతాయనడంలో సందేహం అక్కర్లేదు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రాబడుల గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని దీర్ఘకాలం కోసం స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయించుకోవడం ద్వారా మెరుగైన రాబడులు వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. స్మాల్‌క్యాప్ విభాగంలో దీర్ఘకాలంలో అద్భుతమైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ (గతంలో రిలయన్స్ స్మాల్‌క్యాప్ ఫండ్) పథకం ఒకటి. రాబడులు ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.15వేల కోట్లకు పైనే ఇన్వెస్టర్ల పెట్టుబడులున్నాయి. ఒక స్మాల్‌క్యాప్ పథకం ఈ స్థాయిలో పెట్టుబడులను నిర్వహించడం అంత తేలికైన విషయం కానేకాదు. అయినప్పటికీ ఈ ఫండ్ నిర్వహణ బృందం తమ పనితీరుతో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూనే ఉంది. గడిచిన ఏడాది కాలంలో 107 శాతంగా ఉన్నాయి. అంటే పెట్టుబడులను ఏడాది కాలంలో రెట్టింపు చేసింది. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 21 శాతంగా, ఏడేళ్ల కాలంలో 22 శాతం, పదేళ్ల కాలంలోనూ 22 శాతం చొప్పున సగటు వార్షిక ప్రతిఫలాన్ని ఈ పథకం తెచ్చిపెట్టింది. నిఫ్టీ 250 టీఆర్ఐ రాబడులతో ఈ పథకం రాబడులను ప్రామాణికంగా పోల్చి చూసుకోవచ్చు. సూచీతో పోలిస్తే ఈ పథకమే 5 శాతానికి పైగా అధిక రాబడులను ఇస్తోంది. రూ.5,000 కోట్ల వరకు మార్కెట్ విలువ కలిగిన కంపెనీలు స్మాల్‌క్యాప్ కిందకు వస్తాయి. అధిక రిస్క్ తీసుకునే వారికి ఈ విభాగం చక్కగా సరిపోతుంది. ఈ పథకంలో ఉన్న మరో వెసులుబాటు సిప్ ద్వారా ప్రతీ నెలా రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనీసం రూ.100 నుంచి వెనక్కి తీసుకునే విధంగా సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ఆప్షన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. పెట్టుబడుల విధానం.. స్మాల్ క్యాప్ పథకం కనుక పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని చిన్న కంపెనీలకే కేటాయిస్తుంది. అదే సమయంలో మిడ్‌క్యాప్ కంపెనీలకూ చెప్పుకోతగ్గ పెట్టుబడులను కేటాయించడం ద్వారా రిస్క్‌ను కొంత తగ్గించే విధానాన్ని ఫండ్ మేనేజర్లు అనుసరిస్తున్నారు. భవిష్యత్తులో మల్టీబ్యాగర్ కాగల కంపెనీలను గుర్తించడంలో ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఈ పథకం ఎంచుకున్న కంపెనీల్లో చాలా వరకు తర్వాతి కాలంలో మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలుగా మారినవే ఉన్నాయి. ప్రస్తుతం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 98 శాతాన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన రెండు శాతం మేర నిధులను నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను పరిశీలిస్తే.. స్మాల్‌క్యాప్ కంపెనీలకు 55 శాతం, మిడ్‌క్యాప్ కంపెనీలకు 38 శాతం, మెగా, లార్జ్‌క్యాప్ కంపెనీలకు 7 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఇంజనీరింగ్, కెమికల్స్, ఫైనాన్షియల్స్, ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ, సేవలరంగ కంపెనీలకు పోర్ట్‌ఫోలియోలో ప్రాధాన్యం ఇచ్చింది. ఈ పథకం నిర్వహణలో 123 స్టాక్స్ ఉన్నాయి. రిస్క్ ఎక్కువగా ఉంటుంది కనుక స్మాల్‌క్యాప్ పథకాలు ఏకమొత్తంలో పెట్టుబడులకు ప్రస్తుత తరుణంలో అనుకూలం కాదు. దీర్ఘకాలం కోసం ప్రతీ నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవడం రిస్క్ కోణంలో నుంచి చూస్తే అనుకూలంగా ఉంటుంది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం దీపక్ నైట్రేట్ 3.76 నవీన్ ఫ్లోరిన్ 2.71 ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ 2.51 బలరామ్‌పూర్ చినీ 2.30 బిర్లా కార్పొరేషన్ 2.25 బజాజ్ ఎలక్ట్రికల్స్ 2.23 ఓరియంట్ ఎలక్ట్రిక్ 2.19 రాడికో ఖైతాన్ 1.88 డిక్సన్ టెక్నాలజీస్ 1.79 నిట్ 1.79 -
లాంగ్‌టర్మ్‌కు మంచి ఛాన్స్!
ఈ ఏడాది ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనునకునేవాళ్లు పీఈ మల్టిపుల్స్‌ను చూసి కాకుండా రంగాలవారీగా లాభదాయకత అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ సీఐఓ ప్రశాంత్ జైన్ చెప్పారు. డిమాండ్ పడిపోవడం, తద్వారా షేర్లు పతనం కావడంతో వాల్యూషన్లు బాగా దిగివచ్చి ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో మార్కెట్క్యాప్- జీడీపీ నిష్పత్తి 60 శాతానికి చేరిందని, ఇలాంటి స్థాయిలు గతంలో వచ్చినప్పుడు మంచి పెట్టుబడి అవకాశంగా నిలిచాయని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశీయ సూచీలు తమ ఆల్‌టైమ్ హై నుంచి దాదాపు 25 శాతం దిగువకు వచ్చిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఎకానమీలో, ఈక్విటీల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోందని, అయితే ఓపికతో ఎదురు చూడగలిగేవాళ్లకు ఇది మంచి అవకాశమని ఆయన చెప్పారు. ప్రస్తుత సంవత్సర కంపెనీల ఫలితాలు నిజ పరిస్థితిని ప్రతిబింబించవన్నారు. ప్రస్తుత రేట్ల తగ్గింపు తదితర ఉద్దీపనలు వచ్చే ఏడాదికి మంచి ఫలితాలిస్తాయన్నారు. తక్షణమైతే డిమాండ్ పుంజుకోవడమే సమస్యని చెప్పారు. గతం బాగాలేనప్పుడు భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుందని వివరించారు. ఏంచేయొచ్చు? ఇండియాకు అల్పవడ్డీరేట్లు, అల్ప క్రూడాయిల్ ధరలు కలిసివస్తాయని జైన్ చెప్పారు. ఇవి రెండూ కలిసి ఇండియాలో మంచి పెట్టుబడి అవకాశాలు కల్పిస్తాయన్నారు. లాక్‌డౌన్‌తో ఈ ప్రయోజనాలు పొందే అవకాశం తగ్గిందని, తిరిగి అన్నీ గాడినపడేందుకు సమయం పడుతుందని తెలిపారు. లాంగ్‌టర్మ్ ఇన్వెస్టర్లు ఈ ఏడాదిని పట్టించుకోకుండా ముందుకుసాగాలన్నారు. రంగాలవారీగా యుటిలిటీలు, టెలికం, పీఎస్‌యూ ఆయిల్, సిమెంట్, ఐటీ, ఫార్మాలను పెట్టుబడులకు పరిశీలించవచ్చని సూచించారు. షేర్లవారీగా ఎయిర్టెల్, ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఓఐఎల్, ఓఎన్జీసీ, ఐటీసీ, కాల్గెట్, బజాజ్కన్జూమర్ లాంటివి పరిశీలించవచ్చన్నారు. ఆటో, హోటల్స్, లగ్జరీగూడ్స్, వస్త్రాలు, పాదరక్షల్లాంటి రంగాలు ఒత్తిడిని ఎదుర్కొంటాయని అంచనా వేశారు. -
దీర్ఘకాలానికి... ‘డైనమిక్’ ఫండ్స్
ఈ ఏడాది జూన్‌లో ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్‌లో రూ.50,000 పెట్టుబడులు పెట్టాను. ఆర్బీఐ చర్యల తర్వాత ఈ ఫండ్ ఎన్ఏవీ బాగా తగ్గిపోయింది. తక్కువ ఎన్ఏవీ వద్ద మరో 50,000 పెట్టుబడులు పెట్టమంటారా? ఏడాది పాటు నా పెట్టుబడులను కొనసాగించాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. - నందిని, హైదరాబాద్ గత రెండు వారాల్లో భారత ఫైనాన్షియల్ మార్కెట్లలో ఊహించని సంఘటనలు జరిగాయి. డెట్ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నిధులు ఉపసంహరించుకున్నారు. ఆర్బీఐ హఠాత్తుగా వడ్డీరేట్లను పెంచింది. దీంతో డెట్ఫండ్స్కు నష్టాలొచ్చాయి. మామూలుగానైతే డెట్‌ఫండ్స్ సురక్షితమైనవని చెప్పుకోవచ్చు. కానీ ఎవరూ అంచనా వేయలేని పరిస్థితుల కారణంగా తాజాగా డెట్‌ఫండ్స్ నష్టాలపాలయ్యాయి. పెంచిన వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గిస్తుంది. అయితే ఎప్పుడనేదే ఎవరూ అంచనా వేయలేరు. వడ్డీరేట్లు ఎప్పుడు తగ్గితే అప్పుడు డెట్ఫండ్స్కు లాభాలొస్తాయి. ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్ మంచి పనితీరు కనబరుస్తున్న ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్. గత మూడేళ్లుగా ఈ ఫండ్ వార్షిక రాబడి 9.88 శాతంగా ఉంది. ఈ కేటగిరీ ఫండ్స్ సగటు రాబడి 7.82 శాతమే. ఈ ఫండ్‌లో మీ పెట్టుబడులను కొనసాగించండి. షార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్స్ ఆకర్షణీయమైన రాబడులనిస్తున్నాయి. మీకు డబ్బులు అవసరం లేకపోతే 1-2 సంవత్సరాలు ఈ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు కొనసాగించవచ్చు. కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్‌పై లిక్విడిటీ మీకు సమస్య కాకపోతే డైనమిక్ బాండ్ ఫండ్స్‌కు బదులుగా ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ)ను పరిశీలించవచ్చు. ఫండ్ మెచ్యూరిటీ కాలం ఎంత ఉందో అంతే కాలానికి మెచ్యూరయ్యే రుణ పత్రాల్లో ఎఫ్ఎంపీలు పెట్టుబడులు పెడతాయి. డైనమిక్ ఫండ్స్ దీర్ఘకాలానికి మంచి రాబడులనిస్తాయి. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమాప్లస్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌లో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆదే స్కీమ్ డెరైక్ట్ ఆప్షన్‌కు మార్చుకోవాలనుకుంటున్నాను. ఈ ఫండ్ రెగ్యులర్ స్కీమ్‌లో 10సంవత్సరాల నుంచి పెట్టుబడులు పెడుతూ ఉన్నాను. ఒకేసారి రెగ్యులర్ స్కీమ్నుంచి డెరైక్ట్ స్కీమ్‌కు మారమంటారా? లేదా 3-4 దఫాల్లో మారమంటారా? అధిక ఎన్ఏవీ లేదా తక్కువ ఎన్ఏవీ వద్ద మారితే ఏమైనా తేడా ఉంటుందా? - ఫణీంద్ర, అనంతపురం ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్‌కు ఫోర్ స్టార్ రేటింగ్ ఉంది. మంచి పనితీరు కనబరుస్తున్న ఈ ఫండ్‌కు మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఈ ఫండ్ పనితీరు బాగా ఉండదు. కానీ, మార్కెట్లు పతనమవుతున్నప్పుడు మరీ అంత అధ్వానంగా కూడా ఏమీ ఉండదు. గత పదేళ్లలో ఈ ఫండ్ వార్షిక రాబడి 23 శాతంగా ఉంది. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ కేటగిరీ ఫండ్స్‌ల్లో ఉన్న 19 ఫండ్స్‌ల్లో ఇది ఐదవ ఉత్తమ ఫండ్. ఈ ఫండ్ రెగ్యులర్ స్కీమ్ నుంచి డెరైక్ట్ స్కీమ్‌కు మారాలనుకుంటే, 3-4 దఫాలుగా కాకుండా ఒకేసారి మారడం మంచిది. ఒకేసారి మారుతున్నందున ఎన్ఏవీ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. పెట్టుబడిపై రాబడులను ఏడాది వరకూ అయితే పూర్తిగానూ, ఏడాది దాటితే వార్షికంగానూ పేర్కొంటారు. రెండింటికీ తేడా ఏమిటి? - గోపీనాథ్, మహబూబ్ నగర్ ఈ రెండింటికి తేడాను ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. రూ. 1,000 ని ఐదేళ్ల క్రితం పెట్టుబడి పెట్టామనుకోండి. ఇప్పుడు దాని విలువ రూ. 1,300 అయిందనుకుందాం. అప్పుడు పూర్తి లాభం రూ.300గా పరిగణిస్తాం. ఐదేళ్ల కాలంలో మన పెట్టుబడి 30 శాతం చొప్పున వృద్ధి చెందింది. ఇక మన పెట్టుబడి ప్రతీ ఏడాది ఎంత రాబడిని సాధించిందో వార్షిక రాబడి వెల్లడిస్తుంది. అంటే ఐదేళ్ల కాలంలో మన పెట్టుబడిపై ప్రతీ ఏడాది సగటున వచ్చిన రాబడి అని అర్థం. ప్రతి ఏడాది వచ్చిన లాభాన్ని అసలు మొత్తంతో కలిపి మరలా పెట్టుబడి పెట్టడం. పై ఉదాహరణలో పెట్టుబడిపై వచ్చిన వార్షిక లాభం 5.38 శాతం. అంటే రూ. 1,000 పెట్టుబడిపై ఏడాది కాలానికి వచ్చిన లాభం రూ.53.8. దీనిని అసలు(రూ.1,000)తో కలిపి పెట్టుబడిగా (రూ.1053.80)గా పెట్టుబడి పెట్టాలి. రెండో ఏడాది దీని విలువ రూ.1,150.50 అవుతుంది. ఇదీ పూర్తి రాబడికి, వార్షిక రాబడికి ఉన్న తేడా. సాధారణంగా వాల్యూ రీసెర్చ్‌లో ఏడాదిలోపు పెట్టుబడులపై రాబడులను పూర్తి రాబడులుగానూ, ఏడాది దాటిన తర్వాత వచ్చే రాబడులను వార్షిక రాబడులుగానూ పరిగణిస్తాం.