దీర్ఘకాలానికి... ‘డైనమిక్’ ఫండ్స్
ఈ ఏడాది జూన్‌లో ఎస్‌బీఐ డైనమిక్ బాండ్ ఫండ్‌లో రూ.50,000 పెట్టుబడులు పెట్టాను. ఆర్‌బీఐ చర్యల తర్వాత ఈ ఫండ్ ఎన్‌ఏవీ బాగా తగ్గిపోయింది. తక్కువ ఎన్‌ఏవీ వద్ద మరో 50,000 పెట్టుబడులు పెట్టమంటారా? ఏడాది పాటు నా పెట్టుబడులను కొనసాగించాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి.
- నందిని, హైదరాబాద్
గత రెండు వారాల్లో భారత ఫైనాన్షియల్ మార్కెట్లలో ఊహించని సంఘటనలు జరిగాయి. డెట్ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) నిధులు ఉపసంహరించుకున్నారు. ఆర్‌బీఐ హఠాత్తుగా వడ్డీరేట్లను పెంచింది. దీంతో డెట్‌ఫండ్స్‌కు నష్టాలొచ్చాయి. మామూలుగానైతే డెట్‌ఫండ్స్ సురక్షితమైనవని చెప్పుకోవచ్చు. కానీ ఎవరూ అంచనా వేయలేని పరిస్థితుల కారణంగా తాజాగా డెట్‌ఫండ్స్ నష్టాలపాలయ్యాయి. పెంచిన వడ్డీరేట్లను ఆర్‌బీఐ తగ్గిస్తుంది. అయితే ఎప్పుడనేదే ఎవరూ అంచనా వేయలేరు. వడ్డీరేట్లు ఎప్పుడు తగ్గితే అప్పుడు డెట్‌ఫండ్స్‌కు లాభాలొస్తాయి. ఎస్‌బీఐ డైనమిక్ బాండ్ ఫండ్ మంచి పనితీరు కనబరుస్తున్న ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్. గత మూడేళ్లుగా ఈ ఫండ్ వార్షిక రాబడి 9.88 శాతంగా ఉంది. ఈ కేటగిరీ ఫండ్స్ సగటు రాబడి 7.82 శాతమే. ఈ ఫండ్‌లో మీ పెట్టుబడులను కొనసాగించండి. షార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్స్ ఆకర్షణీయమైన రాబడులనిస్తున్నాయి. మీకు డబ్బులు అవసరం లేకపోతే 1-2 సంవత్సరాలు ఈ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు కొనసాగించవచ్చు. కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్‌పై లిక్విడిటీ మీకు సమస్య కాకపోతే డైనమిక్ బాండ్ ఫండ్స్‌కు బదులుగా ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్‌ఎంపీ)ను పరిశీలించవచ్చు. ఫండ్ మెచ్యూరిటీ కాలం ఎంత ఉందో అంతే కాలానికి మెచ్యూరయ్యే రుణ పత్రాల్లో ఎఫ్‌ఎంపీలు పెట్టుబడులు పెడతాయి. డైనమిక్ ఫండ్స్ దీర్ఘకాలానికి మంచి రాబడులనిస్తాయి.
ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమాప్లస్ డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆదే స్కీమ్ డెరైక్ట్ ఆప్షన్‌కు మార్చుకోవాలనుకుంటున్నాను. ఈ ఫండ్ రెగ్యులర్ స్కీమ్‌లో 10సంవత్సరాల నుంచి పెట్టుబడులు పెడుతూ ఉన్నాను. ఒకేసారి రెగ్యులర్ స్కీమ్‌నుంచి డెరైక్ట్ స్కీమ్‌కు మారమంటారా? లేదా 3-4 దఫాల్లో మారమంటారా? అధిక ఎన్‌ఏవీ లేదా తక్కువ ఎన్‌ఏవీ వద్ద మారితే ఏమైనా తేడా ఉంటుందా?
- ఫణీంద్ర, అనంతపురం
ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్‌కు ఫోర్ స్టార్ రేటింగ్ ఉంది. మంచి పనితీరు కనబరుస్తున్న ఈ ఫండ్‌కు మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఈ ఫండ్ పనితీరు బాగా ఉండదు. కానీ, మార్కెట్లు పతనమవుతున్నప్పుడు మరీ అంత అధ్వానంగా కూడా ఏమీ ఉండదు. గత పదేళ్లలో ఈ ఫండ్ వార్షిక రాబడి 23 శాతంగా ఉంది. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ కేటగిరీ ఫండ్స్‌ల్లో ఉన్న 19 ఫండ్స్‌ల్లో ఇది ఐదవ ఉత్తమ ఫండ్. ఈ ఫండ్ రెగ్యులర్ స్కీమ్ నుంచి డెరైక్ట్ స్కీమ్‌కు మారాలనుకుంటే, 3-4 దఫాలుగా కాకుండా ఒకేసారి మారడం మంచిది. ఒకేసారి మారుతున్నందున ఎన్‌ఏవీ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు.
పెట్టుబడిపై రాబడులను ఏడాది వరకూ అయితే పూర్తిగానూ, ఏడాది దాటితే వార్షికంగానూ పేర్కొంటారు. రెండింటికీ తేడా ఏమిటి?
- గోపీనాథ్, మహబూబ్ నగర్
ఈ రెండింటికి తేడాను ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. రూ. 1,000 ని ఐదేళ్ల క్రితం పెట్టుబడి పెట్టామనుకోండి. ఇప్పుడు దాని విలువ రూ. 1,300 అయిందనుకుందాం. అప్పుడు పూర్తి లాభం రూ.300గా పరిగణిస్తాం. ఐదేళ్ల కాలంలో మన పెట్టుబడి 30 శాతం చొప్పున వృద్ధి చెందింది. ఇక మన పెట్టుబడి ప్రతీ ఏడాది ఎంత రాబడిని సాధించిందో వార్షిక రాబడి వెల్లడిస్తుంది. అంటే ఐదేళ్ల కాలంలో మన పెట్టుబడిపై ప్రతీ ఏడాది సగటున వచ్చిన రాబడి అని అర్థం. ప్రతి ఏడాది వచ్చిన లాభాన్ని అసలు మొత్తంతో కలిపి మరలా పెట్టుబడి పెట్టడం. పై ఉదాహరణలో పెట్టుబడిపై వచ్చిన వార్షిక లాభం 5.38 శాతం. అంటే రూ. 1,000 పెట్టుబడిపై ఏడాది కాలానికి వచ్చిన లాభం రూ.53.8. దీనిని అసలు(రూ.1,000)తో కలిపి పెట్టుబడిగా (రూ.1053.80)గా పెట్టుబడి పెట్టాలి. రెండో ఏడాది దీని విలువ రూ.1,150.50 అవుతుంది. ఇదీ పూర్తి రాబడికి, వార్షిక రాబడికి ఉన్న తేడా. సాధారణంగా వాల్యూ రీసెర్చ్‌లో ఏడాదిలోపు పెట్టుబడులపై రాబడులను పూర్తి రాబడులుగానూ, ఏడాది దాటిన తర్వాత వచ్చే రాబడులను వార్షిక రాబడులుగానూ పరిగణిస్తాం.