
న్యూఢిల్లీ: క్లెయిమ్ చేయని నిధులు, సెక్యూరిటీలు బ్రోకర్ల వద్దే ఉండిపోతే.. వాటిని ‘విచారణ పరిధిలో’ పెట్టాలన్న ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 31 వరకు సెబీ పొడిగించింది. ఈ ప్రతిపాదనపై ఫిబ్రవరి 11న సెబీ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై స్పందనలు తెలియజేయడానికి మార్చి 4వరకు గడువు ఇవ్వడం గమనార్హం.
సెబీ నిబంధనల ప్రకారం క్లయింట్ల ఖాతాల్లోని నిధులను (ఫండ్స్) ప్రతి త్రైమాసికానికి ఒకసారి వెనక్కి పంపాల్సి ఉంటుంది. సెక్యూరిటీలను నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు వారి డీమ్యాట్ ఖాతాల్లో జమ చేయాలి. ఒకవేళ నిధులు, సెక్యూరిటీలను బదిలీ చేసే విషయంలో క్లయింట్ల ఆచూకీ లేనట్టయితే.. సంబంధిత ఖాతాలను వెంటనే ‘ఎంక్వైరీ స్టేటస్’ కింద ఉంచాలని సెబీ ప్రతిపాదన తీసుకొచ్చింది.
లేఖలు, ఈమెయిల్స్, టెలిఫోన్ ద్వారా బ్రోకర్లు క్లయింట్లను సంప్రదించాలి. ఇలా ఎంక్వైరీ స్టేటస్ కింద 30 రోజులకుపైగా నిధులు, సెక్యూరిటీలు ఉండిపోతే, వాటిని అన్‌క్లెయిమ్డ్‌గా పరిగణిస్తారు. ఆ తర్వాత క్లయింట్ నామినీని సంప్రదించాల్సి ఉంటుందని సెబీ తన ప్రతిపాదనలో పేర్కొంది.