హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పబ్లిక్ ఇష్యూకి వస్తున్న ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ కేఫిన్ టెక్నాలజీస్ అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. మలేసియా, ఫిలిప్పీన్స్, హాంకాంగ్ తదితర దేశాల్లో ఇప్పటికే 21 ఏఎంసీలకు (అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు) సర్వీసులు అందిస్తుండగా మలేసియా, సింగపూర్‌లలో ఏఎంసీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఐపీవో వివరాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఎండీ శ్రీకాంత్ నాదెళ్ల ఈ విషయాలు చెప్పారు.
ఈ మార్కెట్లలో పరిమాణం 1 ట్రిలియన్ డాలర్లకుపైగా ఉంటుందని వివరించారు. ఆగ్నేయాసియా, ఇతర మార్కెట్లలో అవకాశాలను దక్కించుకునేందుకు ఫండ్ అకౌంటింగ్, అడ్మినిస్ట్రేషన్ సర్వీసులు మొదలైనవి కూడా అందించడంపై దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం హెక్సాగ్రామ్ ఫిన్‌టెక్ వంటి కంపెనీలను కొనుగోలు చేసినట్లు వివరించారు. తమకు అనువుగా ఉండే మరిన్ని సంస్థలను కూడా కొనుగోలు చేసే యోచన ఉందని శ్రీకాంత్ చెప్పారు. మరోవైపు, ప్రస్తుతం సంస్థలో సుమారు 5,000 మంది పైచిలుకు సిబ్బంది ఉండగా, హైదరాబాద్‌లో 3,500 మంది ఉద్యోగులు ఉన్నారని శ్రీకాంత్ వివరించారు. కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే 12–18 నెలల్లో మరో 400–500 మందిని నియమించుకోనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 19తో ప్రారంభమయ్యే ఐపీవో ద్వారా కేఫిన్ టెక్నాలజీస్ రూ. 1,500 కోట్లు సమీకరిస్తోంది. ధర శ్రేణి రూ. 347–366గా ఉండగా, కనీసం 40 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది.
చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్!
Comments
Please login to add a commentAdd a comment