Public Comments
-
గడవు పొడిగించిన సెబీ..
న్యూఢిల్లీ: క్లెయిమ్ చేయని నిధులు, సెక్యూరిటీలు బ్రోకర్ల వద్దే ఉండిపోతే.. వాటిని ‘విచారణ పరిధిలో’ పెట్టాలన్న ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 31 వరకు సెబీ పొడిగించింది. ఈ ప్రతిపాదనపై ఫిబ్రవరి 11న సెబీ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై స్పందనలు తెలియజేయడానికి మార్చి 4వరకు గడువు ఇవ్వడం గమనార్హం.సెబీ నిబంధనల ప్రకారం క్లయింట్ల ఖాతాల్లోని నిధులను (ఫండ్స్) ప్రతి త్రైమాసికానికి ఒకసారి వెనక్కి పంపాల్సి ఉంటుంది. సెక్యూరిటీలను నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు వారి డీమ్యాట్ ఖాతాల్లో జమ చేయాలి. ఒకవేళ నిధులు, సెక్యూరిటీలను బదిలీ చేసే విషయంలో క్లయింట్ల ఆచూకీ లేనట్టయితే.. సంబంధిత ఖాతాలను వెంటనే ‘ఎంక్వైరీ స్టేటస్’ కింద ఉంచాలని సెబీ ప్రతిపాదన తీసుకొచ్చింది.లేఖలు, ఈమెయిల్స్, టెలిఫోన్ ద్వారా బ్రోకర్లు క్లయింట్లను సంప్రదించాలి. ఇలా ఎంక్వైరీ స్టేటస్ కింద 30 రోజులకుపైగా నిధులు, సెక్యూరిటీలు ఉండిపోతే, వాటిని అన్క్లెయిమ్డ్గా పరిగణిస్తారు. ఆ తర్వాత క్లయింట్ నామినీని సంప్రదించాల్సి ఉంటుందని సెబీ తన ప్రతిపాదనలో పేర్కొంది. -
అవాంఛిత కాల్స్ నిబంధనలపై అభిప్రాయాలకు గడువు పెంపు
న్యూఢిల్లీ: అవాంఛిత మార్కెటింగ్ కాల్స్, మెసేజీల కట్టడి కోసం రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును కేంద్రం ఆగస్టు 8 వరకు పెంచింది. వివిధ ఫెడరేషన్లు, అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాల నుంచి అభ్యర్ధనలు వచ్చిన మీదట ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే వచ్చిన సలహాలు, అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్లు వివరించింది. వాస్తవానికి ఈ డెడ్‌లైన్ జూలై 21తో ముగిసింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా అన్‌రిజిస్టర్డ్ మార్కెటర్లు ప్రైవేట్ నంబర్ల నుంచి చేసే ప్రమోషనల్ కాల్స్, మెసేజీలను కట్టడి చేయడం ఈ మార్గదర్శకాల లక్ష్యం. టెల్కోలు, నియంత్రణ సంస్థలు తదితర వర్గాలతో సంప్రదింపుల మేరకు వీటిని రూపొందించారు. -
సన్-ర్యాన్‌బాక్సీ విలీనంపై రచ్చబండ
న్యూఢిల్లీ: సన్ ఫార్మాలో ర్యాన్‌బాక్సీ ల్యాబ్స్ విలీనంపై వ్యాఖ్యలు పంపించాల్సిందిగా సాధారణ పౌరులతో సహా స్టేక్‌హోల్డర్లందరినీ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గురువారం కోరింది. దాదాపు 400 కోట్ల డాలర్ల విలువైన ఈ విలీనంపై 15 రోజుల్లోగా కామెంట్లు పంపించాలని సూచించింది. రెండు కంపెనీల విలీనంవల్ల సంబంధిత వ్యక్తి/ సంస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉంటుందో ఆధార పత్రాలతో పంపాలని పేర్కొంది. తగిన రుజువుల్లేని అభ్యంతరాలను పట్టించుకోబోమని స్పష్టం చేసింది. ఓ విలీన ఒప్పందంపై ప్రజల వ్యాఖ్యలను సీసీఐ కోరడం ఇదే ప్రథమం. మార్కెట్లో పోటీపై ఈ విలీనం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చిన అనంతరం ప్రజల వ్యాఖ్యలను సీసీఐ కోరింది. సన్‌ఫార్మా - ర్యాన్‌బాక్సీ విలీనం సంబంధిత మార్కెట్లో పోటీపై గణనీయ ప్రతికూల ప్రభావం చూపుతుందా అనే అంశంపై ప్రజలను సంప్రదించే ప్రక్రియను ప్రారంభించినట్లు సీసీఐ తెలిపింది. మాలిక్యూల్స్‌కు సంబంధించిన అంశాలే ఈ ఉదంతంలో ప్రధానమైనవని సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా ఇటీవలే పేర్కొన్నారు. విలీనం కారణంగా మార్కెట్లో అవాంఛనీయ పోటీ ఏర్పడుతుందా అనేది ముఖ్యమైన అంశమని చెప్పారు. విలీనం ఆచరణలోకి వస్తే ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద స్పెషాలిటీ జెనెరిక్స్ కంపెనీ ఆవిర్భవిస్తుంది. ఇండియాలో అతిపెద్ద ఫార్మా కంపెనీ ఏర్పడుతుంది. ఈ కంపెనీకి 65 దేశాల్లో కార్యకలాపాలు ఉంటాయి. ఐదు ఖండాల్లో 47 ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయి. విలీన ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను నిర్ణీత ఫార్మాట్లో ప్రజల ముందుంచాలని సీసీఐ గత నెల 27న ఆదేశించింది. ఫార్మా రంగంలో ప్రవేశానికి పెద్దగా అవరోధాలు లేకపోవడంతో పెద్ద సంఖ్యలో కంపెనీలు విభిన్న ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఈ రంగంలో 20 వేలకుపైగా రిజిస్టర్డ్ యూనిట్లున్నాయి. వీటిలో 250 ప్రముఖ కంపెనీలకు కలిపి ఔషధ మార్కెట్లో 70 శాతం వాటా ఉంది. విలీనం తర్వాత దేశీయ మార్కెట్లో తమ వాటా దాదాపు 9.2 శాతానికి చేరుతుందని సన్‌ఫార్మా, ర్యాన్‌బాక్సీ కంపెనీలు సీసీఐకి తెలిపాయి. ఇందులో ర్యాన్‌బాక్సీ వాటా 3.87 శాతం కాగా సన్‌ఫార్మా వాటా 5.33 శాతంగా ఉంది. విలీనం పూర్వాపరాలు... సమస్యల్లో ఉన్న ప్రత్యర్థి కంపెనీ ర్యాన్‌బాక్సీని చేజిక్కించుకుంటున్నట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గత ఏప్రిల్‌లో ప్రకటించింది. ఒప్పందం విలువ 400 కోట్ల డాలర్లనీ, 80 కోట్ల డాలర్ల బకాయి కూడా ఇందులో ఉందనీ వెల్లడించింది. 2013లో ర్యాన్‌బాక్సీ ఆదాయం 180 కోట్ల డాలర్లతో పోలిస్తే ఒప్పందం విలువ 2.2 రెట్లు అధికం. ఆ లెక్కన ఒక్కో ర్యాన్‌బాక్సీ షేరు ధర రూ.457 అవుతుంది. ఈ రెండు కంపెనీల ఈక్విటీలు ట్రేడయ్యే బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నుంచి ఈ ఒప్పందానికి నిరభ్యంతర పత్రం లభించింది. ఈ ఒప్పందానికి తదుపరి అనుమతిని హైకోర్టు నుంచి పొందాల్సి ఉంది.