సన్-ర్యాన్‌బాక్సీ విలీనంపై రచ్చబండ
న్యూఢిల్లీ: సన్ ఫార్మాలో ర్యాన్‌బాక్సీ ల్యాబ్స్ విలీనంపై వ్యాఖ్యలు పంపించాల్సిందిగా సాధారణ పౌరులతో సహా స్టేక్‌హోల్డర్లందరినీ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గురువారం కోరింది. దాదాపు 400 కోట్ల డాలర్ల విలువైన ఈ విలీనంపై 15 రోజుల్లోగా కామెంట్లు పంపించాలని సూచించింది. రెండు కంపెనీల విలీనంవల్ల సంబంధిత వ్యక్తి/ సంస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉంటుందో ఆధార పత్రాలతో పంపాలని పేర్కొంది.
తగిన రుజువుల్లేని అభ్యంతరాలను పట్టించుకోబోమని స్పష్టం చేసింది. ఓ విలీన ఒప్పందంపై ప్రజల వ్యాఖ్యలను సీసీఐ కోరడం ఇదే ప్రథమం. మార్కెట్లో పోటీపై ఈ విలీనం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చిన అనంతరం ప్రజల వ్యాఖ్యలను సీసీఐ కోరింది.
సన్‌ఫార్మా - ర్యాన్‌బాక్సీ విలీనం సంబంధిత మార్కెట్లో పోటీపై గణనీయ ప్రతికూల ప్రభావం చూపుతుందా అనే అంశంపై ప్రజలను సంప్రదించే ప్రక్రియను ప్రారంభించినట్లు సీసీఐ తెలిపింది. మాలిక్యూల్స్‌కు సంబంధించిన అంశాలే ఈ ఉదంతంలో ప్రధానమైనవని సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా ఇటీవలే పేర్కొన్నారు. విలీనం కారణంగా మార్కెట్లో అవాంఛనీయ పోటీ ఏర్పడుతుందా అనేది ముఖ్యమైన అంశమని చెప్పారు.
విలీనం ఆచరణలోకి వస్తే ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద స్పెషాలిటీ జెనెరిక్స్ కంపెనీ ఆవిర్భవిస్తుంది. ఇండియాలో అతిపెద్ద ఫార్మా కంపెనీ ఏర్పడుతుంది. ఈ కంపెనీకి 65 దేశాల్లో కార్యకలాపాలు ఉంటాయి. ఐదు ఖండాల్లో 47 ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయి. విలీన ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను నిర్ణీత ఫార్మాట్‌లో ప్రజల ముందుంచాలని సీసీఐ గత నెల 27న ఆదేశించింది.
ఫార్మా రంగంలో ప్రవేశానికి పెద్దగా అవరోధాలు లేకపోవడంతో పెద్ద సంఖ్యలో కంపెనీలు విభిన్న ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఈ రంగంలో 20 వేలకుపైగా రిజిస్టర్డ్ యూనిట్లున్నాయి. వీటిలో 250 ప్రముఖ కంపెనీలకు కలిపి ఔషధ మార్కెట్లో 70 శాతం వాటా ఉంది. విలీనం తర్వాత దేశీయ మార్కెట్లో తమ వాటా దాదాపు 9.2 శాతానికి చేరుతుందని సన్‌ఫార్మా, ర్యాన్‌బాక్సీ కంపెనీలు సీసీఐకి తెలిపాయి. ఇందులో ర్యాన్‌బాక్సీ వాటా 3.87 శాతం కాగా సన్‌ఫార్మా వాటా 5.33 శాతంగా ఉంది.
విలీనం పూర్వాపరాలు...
సమస్యల్లో ఉన్న ప్రత్యర్థి కంపెనీ ర్యాన్‌బాక్సీని చేజిక్కించుకుంటున్నట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గత ఏప్రిల్‌లో ప్రకటించింది. ఒప్పందం విలువ 400 కోట్ల డాలర్లనీ, 80 కోట్ల డాలర్ల బకాయి కూడా ఇందులో ఉందనీ వెల్లడించింది. 2013లో ర్యాన్‌బాక్సీ ఆదాయం 180 కోట్ల డాలర్లతో పోలిస్తే ఒప్పందం విలువ 2.2 రెట్లు అధికం. ఆ లెక్కన ఒక్కో ర్యాన్‌బాక్సీ షేరు ధర రూ.457 అవుతుంది. ఈ రెండు కంపెనీల ఈక్విటీలు ట్రేడయ్యే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల నుంచి ఈ ఒప్పందానికి నిరభ్యంతర పత్రం లభించింది. ఈ ఒప్పందానికి తదుపరి అనుమతిని హైకోర్టు నుంచి పొందాల్సి ఉంది.