సన్-ర్యాన్‌బాక్సీ డీల్‌పై సీసీఐ మరింత దృష్టి
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజాలు సన్-ర్యాన్‌బాక్సీల మధ్య కుదిరిన మల్టీబిలియన్ డాలర్ ఒప్పందంపై కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) మరింత నిశిత పరిశీలన చేయనుంది. దీనిలో భాగంగా ప్రతిపాదిత విలీన వివరాలను పది రోజుల్లోగా బహిరంగ పరచాల్సిందిగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అటు సన్ ఫార్మా, ఇటు ర్యాన్‌బాక్సీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేశాయి.
పది పనిదినాల్లోగా విలీన వివరాలను నిర్ధారించిన రీతిలో బహిరంగపరుస్తూ ప్రచురించాల్సిందిగా సీసీఐ ఆదేశించినట్లు తెలిపాయి. కాగా, విలీనం, కొనుగోలు(ఎంఅండ్‌ఏ) ఒప్పందంపై బహిరంగ పరిశీలనకు వీలుగా సీసీఐ ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారికావడం గమనార్హం. తద్వారా సీసీఐ నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీల మధ్య 4 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోలు, విలీనం ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ విలీనం వల్ల పోటీ వాతావరణంలో తలెత్తే పరిస్థితులు, దానివల్ల ప్రభావితమయ్యే వ్యక్తులు, సంస్థలకు విలీన వివరాలు తెలిసేలా చేసే యోచనతో సీసీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. వీటిపై సలహాలు, సూచనలు, వ్యాఖ్యలను సీసీఐ ఆహ్వానించనుంది.
ఇప్పటికే వివరణ కోరింది...: పూర్తి స్టాక్ రూపంలో ర్యాన్‌బాక్సీని కొనుగోలు చేసేందుకు సన్ ఫార్మా చేసిన ప్రతిపాదనపై గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడానికి ముందే సీసీఐ రెండు కంపెనీల నుంచి వివరణ కోరింది. ఫార్మా రంగంలోని అతిపెద్ద డీల్స్‌లో ఒకటైన ఈ ఒప్పందాన్ని అనుమతించడం ద్వారా దేశీ పరిశ్రమపై భారీ ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో సీసీఐ తాజా ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇది దేశీ ఫార్మా రంగంలో పోటీ వాతావరణాన్ని దెబ్బకొట్టే పక్షంలో విలీనానికి ముందు కొన్ని ఆస్తులను విడగొట్టమంటూ రెండు కంపెనీలకూ సీసీఐ సూచించే అవకాశముంది. రెండు కంపెనీల విలీనంవల్ల ప్రపంచంలోనే ఐదో పెద్ద స్పెషాలిటీ జనరిక్స్ ఫార్మా దిగ్గజంగా ఆవి ర్భవించనుంది. అంతేకాకుండా విలీన సంస్థ దేశీయ ఫార్మా రంగంలో నంబర్‌వన్ స్థానాన్ని పొందనుంది.