Ranbaxy
-
కుప్పకూలిన ఫోర్టిస్ హెల్త్ కేర్ షేర్లు
సాక్షి, ముంబై: సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు భారీగా కుప్పకూలాయి. జపాన్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ దైచీ శాంకో దాఖలు చేసిన కేసులొ రాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్, శివిందర్ సింగ్‌లు తమ ఆదేశాన్ని ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఇందుకు సోదరులిద్దరూ తలా 1,175 కోట్ల రూపాయలు జమ చేయాలని కోర్టు తెలిపింది. అలాగే ఫోర్టిస్ ఐహెచ్‌హెచ్ ఓపెన్ ఆఫర్‌పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. దీంతోపాటు ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా సుమో మోటో ధిక్కార చర్యల్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. తదుపరి విచారణలో ఓపెన్ ఆఫర్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఫోర్టిస్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి 161 రూపాయలను తాకిన తరువాత 17 శాతం పతనమయ్యాయి. అయితే ఫోర్టిస్ అనుబంధ సంస్థ ఎస్కార్ట్ హార్ట్ ఇన్సిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ లిమిటెడ్ (ఇహెచ్ఆర్సిఎల్)కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చి స్వల్ప ఊరటనిచ్చింది. ఢిల్లీలోని ఓఖ్లాలోనుంచి సంస్థను తొలగించే చర్యలను కోర్టు రద్దు చేసిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా 2005లో ఇహెచ్ఆర్సిఎల్ ఆసుపత్రి లీజును ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) రద్దు చేయడంతో సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రిట్ పిటిషన్‌ను 2006లో సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. ఆ తరువాత మరోసారి సంస్థ దాఖలు చేసుకున్నస్పెషల్ లీవ్ పిటీషన్‌ను కూడా ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తిరస్కరించింది. -
సింగ్ బ్రదర్స్‌కు సుప్రీంకోర్టు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ మోహన్ సింగ్, శివీందర్ సింగ్‌లకు సుప్రీంకోర్టు మరోసారి భారీ షాక్ ఇచ్చింది. జపాన్ ఫార్మా దిగ్గజం దైచీ శాంకో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌ను సమర్ధించింది. ఈ విషయంలో ఇప్పటికే సోదరులిద్దరికీ చివాట్లు పెట్టిన అత్యున్నత ధర్మాసనం తాజాగా సీరియస్‌గా స్పందించింది. సింగ్ సోదరులు తమ ఆదేశాన్ని ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఇందుకు సోదరులిద్దరూ ఒక్కొక్కరూ రూ. 1175 కోట్ల రూపాయలు జమ చేయాలని ఆదేశించింది. అలాగే ఫోర్టిస్ ఐహెచ్‌హెచ్ ఓపెన్ ఆఫర్‌పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా సుమోటో ధిక్కారాన్ని ప్రారంభించింది. తదుపరి విచారణలో ఓపెన్ ఆఫర్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కాగా 2008లో రాన్‌బాక్సీని దైచీ కొనుగోలు చేసింది. అయితే కంపెనీపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపడుతోందన్న నిజాన్ని దాచిపెట్టి రాన్‌బాక్సీ షేర్లను సింగ్ సోదరులు విక్రయించారంటూ దైచీ సంస్థ సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యూనల్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ అనంతరం సింగ్ సోదరులు దైచీ సంస్థకు రూ .3500 కోట్ల చెల్లించాలని 2016లో ఆదేశించింది. అయితే ఆమొత్తాన్ని చెల్లించక పోవడంతో దైచీ భారత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీం సింగ్ సోదరులు దైచీకి డబ్బులు చెల్లించాల్సిందేనని 2019 మార్చి 14న స్పష్టం చేసింది. అనంతరం సింగ్ బ్రదర్స్ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం..కోర్టు దిక్కరణకు పాల్పడినట్లయితే జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తూ, 2019, ఏప్రిల్‌లో తీర్పును రిజర్వులో ఉంచింది. ఇది ఇలా వుంటే వేలకోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలతో గత నెలలో సింగ్ బ్రదర్స్‌ను ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఫోర్టిస్ మాజీ ప్రమోటర్ శివీందర్ అరెస్ట్!
న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్వెస్ట్ (ఆర్ఎఫ్ఎల్)కి చెందిన రూ. 2,397 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివీందర్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరిలో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ (ఆర్ఈఎల్) మాజీ చైర్మన్ సునీల్ గోధ్వానీ (58), ఆర్ఈఎల్.. ఆర్‌ఎఫ్‌ఎల్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కవి అరోరా, అనిల్ సక్సేనా ఉన్నారు. నిధులను మళ్లించి ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. శివీందర్ సోదరుడు మల్వీందర్ సింగ్ పరారీలో ఉన్నారని, ఆయనపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయ్యిందని వివరించారు. ఆర్‌ఈఎల్‌కు ఆర్ఎఫ్ఎల్ అనుబంధ సంస్థ. 2018 ఫిబ్రవరి దాకా సింగ్ సోదరులు ఆర్ఈఎల్ ప్రమోటర్లుగా కొనసాగారు. వారి నిష్క్రమణ తర్వాత ఆర్ఈఎల్, ఆర్ఎఫ్ఎల్ బోర్డులు మారాయి. శివీందర్ సింగ్ ప్రమోటర్‌గా ఉన్న సమయంలో తీసుకున్న రుణాలను ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారన్న ఆర్ఎఫ్ఎల్ ఫిర్యాదు మేరకు తాజా అరెస్టులు జరిగాయి. ‘ఆర్ఎఫ్ఎల్ కొత్త మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్దిష్ట రుణమొత్తం.. సింగ్, ఆయన సోదరుడికి చెందిన కంపెనీల్లోకి మళ్లినట్లు గుర్తించింది. దీనిపై ఈవోడబ్ల్యూకి ఫిర్యాదు చేసింది. దానికి అనుగుణంగా ఎఫ్ఐఆర్ నమోదైంది‘ అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ర్యాన్‌బాక్సీ లేబొరేటరీస్ మాజీ ప్రమోటర్లు కూడా అయిన సింగ్ సోదరులతో పాటు గోధ్వానీపైనా పలు ఆరోపణలు ఉన్నాయి. ర్యాన్‌బాక్సీ విక్రయం విషయంలో మోసాలకు పాల్పడ్డారంటూ శివీందర్, మల్వీందర్ల నుంచి జపాన్ ఔషధ సంస్థ దైచీ శాంక్యో రూ. 2,600 కోట్ల మేర నష్టపరిహారాన్ని రాబట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. -
‘ర్యాన్‌బాక్సీ’ సింగ్ బ్రదర్స్ బాహాబాహీ!
న్యూఢిల్లీ: ఒకప్పటి ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ, ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లయిన సింగ్ సోదరుల మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. తాజాగా తమ్ముడు శివీందర్ సింగ్ తనపై దాడి చేశారంటూ అన్న మల్వీందర్ సింగ్ ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ మేరకు ఆరోపణలు చేశారు. డిసెంబర్ 5న శివీందర్ సింగ్ తనపై దాడి చేయడంతో చేతుల మీద గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఆరోపణలను శివీందర్ ఖండించారు. గ్రూప్ కంపెనీ ప్రియస్ రియల్ ఎస్టేట్ బోర్డు మీటింగ్‌లో ఉద్యోగులను మల్వీందర్ సింగ్ వర్గం బెదిరిస్తోందన్న సమాచారంతో తాను అక్కడికి వెళ్లినప్పుడు వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పారాయన. ఇదే క్రమంలో మల్వీందర్ సింగ్ తనను బలవంతంగా గోడకు అదిమిపెట్టేయడంతో తప్పించుకునే క్రమంలో ఆయన్ను పక్కకు తోసేసేందుకు మాత్రమే ప్రయత్నించానని చెప్పారు. ఇంత జరిగిన తర్వాత మల్వీందర్‌తో కలిసి పనిచేసే మార్గాలన్నీ మూసుకుపోయినట్లేనని ఆయ న స్పష్టం చేశారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో నిధుల మళ్లిం పు జరిగిందన్న ఆరోపణలు బయటపడినప్పట్నుంచి సింగ్ సోదరుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సం గతి తెలిసిందే. మల్వీందర్ సింగ్ ఫోర్జరీ, అవకతవక లకు పాల్పడ్డారని శివీందర్ సింగ్ ఆరోపిస్తున్నారు. -
భగ్గుమన్న విభేదాలు : కొట్టుకున్న బ్రదర్స్
ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు, ఒకప్పుడు బిజినెస్ టైకూన్లుగా వెలుగొందిన సింగ్ బ్రదర్స్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ అండ్ రెలిగేర్ యజమానులు సింగ్ బ్రదర్స్‌గా చెప్పుకునే మల్విందర్ సింగ్, శివిందర్మోహన్ సింగ్ (55) తాజాగా రోడ్డెక్కారు. దీంతో ఇప్పటికే ఒకరిమీద ఒకరు ఆరోపణలు, కేసులతో వార్తల్లో నిలిచిన సోదరులిద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ‘నువ్వు కొట్టావంటే.. నువ్వు కొట్టావంటూ’ ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా సాక్షిగా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక పరమైన వివాదం కొత్త మలుపు తీసుకుంది. శివిందర్ తనపై భౌతికంగా దాడికి పాల్పడ్డాడంటూ ఒక వీడియోలో మల్విందర్ ఆరోపించాడు. ఢిల్లీలోని హనుమాన్ రోడ్ కార్యాలయంలో డిసెంబర్ 5 ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నాడు. మరోవైపు శివిందర్.. అన్న మల్విందర్ ఆరోపణలను ఖండించాడు. ఇది అబద్ధమని, నిజానికి తనపైనే మల్విందర్ దాడి చేశాడని పేర్కొనడం గమనార్హం. ప్రియస్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని గురిందర్ సింగ్ ధిల్లానుంచి తనకు రావాల్సిన 2వేల కోట్ల రూపాయలను రికవరీ చేసుకునేందుకు వెళ్లినపుడు మల్విందర్ అడ్డు పడ్డాడని ఆరోపించారు. మరోవైపు అన్నదమ్ముల ఘర్షణను ధృవీకరించిన సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇద్దరినీ శాంతింపచేసి, పోలీస్ ఫిర్యాదును ఉపసంహరింపజేసినట్టు సమాచారం. గత దశాబ్దకాలంగా రగులుతున్న వివాదం కారణంగా సింగ్ బ్రదర్స్ బద్ధశత్రువులుగా మారిపోయారు. అంతేకాదు సుమారు 22,500 కోట్ల రూపాయలను నష్ట పోయారు. ఈ నేపథ్యంలో సింగ్ బ్రదర్స్ తల్లి నిమ్మిసింగ్, ఇతర కుటుంబ పెద్దలు వీరి మధ్య వున్న వైరాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సోదరులిద్దరూ కేసులను తాత్కాలికంగా ఉపసహరించుకునేందుకు కూడా సమ్మతించారు. కానీ ఇంతలోనే మళ్లీ కథ మొదటికి వచ్చింది. తాజాగా ప్రియస్ రియల్ ఎస్టేట్ బోర్డు మీటింగ్ సందర్భంగా (ఇద్దరూ బోర్డు సభ్యులు కాదు) గురువారం సాయంత్రం వీరిద్దరూ ముష్టిఘాతాలకు దిగారు. ఈ పరిణామంతో తమ ప్రతిష్టను మరింత దిగజార్చుకున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
సింగ్ బ్రదర్స్ వివాదం న్యూ ట్విస్ట్
సాక్షి, ముంబై: వ్యాపారాన్ని భారీ నష్టాన్ని కలిగిస్తున్నారంటూ సోదరుడిపై ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేసిన శివిందర్ సింగ్ యూ టర్న్ తీసుకున్నారు. సోదరుడు మల్వీందర్ సింగ్‌పై తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. కుటుంబ పెద్దలు, ఇతర సభ్యుల జోక్యంతో తన సోదరుడు మల్వీందర్‌పై దాఖలు చేసిన కేసుని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం నాడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) న్యూఢిల్లీ బెంచ్ ముందుకు ఈ కేసు శుక్రవారం విచారణకు రానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అన్నపై కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు శివిందర్ ప్రకటించారు. అంతేకాదు ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్యవర్తిత్వం విఫలమైతే తిరిగి కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పించాల్సిందిగా శివిందర్, అతని భార్య అదితి ఎస్.సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. ముఖ్యంగా సింగ్ బ్రదర్స్ తల్లి నిమ్మీ సింగ్ గత కొన్ని రోజులుగా నిద్రాహారాలు మాని, కొడుకులిద్దరితోనూ, వరుసగా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఔషధసంస్థ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లయిన సింగ్ సోదరుల మధ్య విభేదాలు ఇటీవల భగ్గుమన్నాయి. కుటుంబ వ్యాపారాల్లో అవకతవకలకు పాల్పడు తున్నారంటూ అన్న మల్వీందర్ సింగ్‌పై సోదరుడు శివీందర్ సింగ్ కోర్టుకెళ్లారు. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, రెలిగేర్, ఫోర్టిస్ సంస్థల నిర్వహణలో అవకతవకలు, అణిచివేత ధోరణులపై మల్వీందర్‌తో పాటు రెలిగేర్ మాజీ చీఫ్ సునీల్ గోద్వానీలపై శివీందర్ సెప్టెంబర్ 4న ఎన్సీఎల్టీలో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
‘ర్యాన్‌బాక్సీ బ్రదర్స్’ మధ్య విభేదాలు
న్యూఢిల్లీ: ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లయిన సింగ్ సోదరుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కుటుంబ వ్యాపారాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ అన్న మల్వీందర్ సింగ్‌పై సోదరుడు శివీందర్ సింగ్ కోర్టుకెళ్లారు. ‘ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, రెలిగేర్, ఫోర్టిస్ సంస్థల నిర్వహణలో అవకతవకలు, అణిచివేత ధోరణులపై మల్వీందర్‌తో పాటు రెలిగేర్ మాజీ చీఫ్ సునీల్ గోద్వానీలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసు దాఖలు చేశాను’ అని శివీందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వీరిద్దరూ కలిసి కంపెనీ, షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రెలిగేర్‌కి చెందిన ఎన్బీఎఫ్సీ విభాగంలో తీసుకున్న నిర్ణయాలు, ర్యాన్‌బాక్సీని దైచీకి విక్రయించే డీల్ నిర్వహణ, ప్రైవేట్ చార్టర్ లిగేర్ ఏవియేషన్ వ్యాపారంలో అనూహ్య నష్టాలు మొదలైనవన్నీ వ్యవస్థ ఎంత భ్రష్టుపట్టిపోయిందో చెప్పడానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ర్యాన్‌బాక్సీని జపాన్‌కి చెందిన దైచీ సాంక్యోకు విక్రయించిన సింగ్ సోదరులు ప్రస్తుతం ఈ డీల్ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సదరు ఒప్పందం తర్వాత హాస్పిటల్ చెయిన్ ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఆర్థిక సేవల సంస్థ రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌పై సోదరులు దృష్టి పెట్టారు. కానీ వీటిల్లోనూ ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తు సంస్థలు విచారణ కూడా జరుపుతున్నాయి. పరువు కోసం ఆగాను.. వాస్తవానికి ఈ చర్య ఎప్పుడో తీసుకోవాల్సిందని, కానీ పరిస్థితి మెరుగుపడుతుందేమోనన్న ఆశ, కుటుంబ పోరులో తమది కూడా మరో చెత్త అధ్యాయంగా మారకూడదన్న ఉద్దేశంతో ఇంతకాలం ఆగానని శివీందర్ సింగ్ పేర్కొన్నారు. తమ కుటుంబం, తాను వ్యక్తిగతంగా ఎంతో క్షోభకు గురవుతున్నప్పటికీ.. కుటుంబ వ్యాపార ప్రతిష్ట దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఇప్పటిదాకా బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదని ఆయన చెప్పారు. ‘మా కుటుంబం పరువు ప్రతిష్టలు, సంపద, వ్యక్తిగతంగా నా విశ్వసనీయత అంతా మసకబారుతున్నా.. నేను స్థాపించిన కంపెనీని బహిరంగంగా వేలం వేసే పరిస్థితి వచ్చినా కూడా ప్రేక్షకపాత్రే వహిస్తూ ఉండిపోయాను’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకత, నైతిక విలువలను నిరంతరం పాతరేస్తున్న పరిస్థితుల్లో మల్వీందర్‌తో ఇక తాను కలిసి పనిచేసే ప్రసక్తే లేదని శివీందర్ చెప్పారు. పరిస్థితులు ఇంతదాకా వచ్చిన నేపథ్యంలో సోదరుడితో వ్యాపార లావాదేవీలన్నీ తెగతెంపులు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 2015లో వ్యాపార కార్యకలాపాల నుం చి తప్పుకున్న శివీందర్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పంజాబ్‌లోని బియాస్లో స్థిరపడ్డారు. మల్వీందర్సింగ్కు జరిమానా కోర్టు ఆదేశాల ధిక్కరణ అభియోగం కింద 3.5 మిలియన్ సింగపూర్ డాలర్లు చెల్లించాలంటూ మల్వీందర్ సింగ్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం అనుమతి లేకుండా తమ స్థిరాస్తులు అమ్ముకోరాదంటూ సింగ్ సోదరులను ఆదేశించినప్పటికీ మల్వీందర్ వాటిని ధిక్కరించారని జస్టిస్ రాజీవ్ షక్దర్ పేర్కొన్నారు. రెలిగేర్ హెల్త్‌కేర్‌లో 45 లక్షల షేర్లను 3.5 మిలియన్ సింగపూర్ డాలర్లకు అమ్ముకున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలంటూ ఆదేశించారు. అయితే, సింగపూర్‌లో కొన్న అపార్ట్మెంట్ ఈఎంఐలు డిఫాల్టు కాకూడదనే ఉద్దేశంతో సదరు నిధులను బ్యాంకు వాయిదాలకు కట్టేందుకు వినియోగించినట్లు మల్వీందర్ సింగ్ తరఫు న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. ర్యాన్‌బాక్సీ డీల్‌కు సంబంధించి రూ. 3,500 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ తమకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వుల అమలు కోసం దైచీ సాంక్యో కోర్టును ఆశ్రయించిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. గురువారం విచారణ... తన భార్య అదితి సింగ్ సంతకాన్ని మల్వీందర్ ఫోర్జరీ చేశారని, అక్రమ ఆర్థిక లావాదేవీలతో పాటు కంపెనీని భారీ రుణాల్లో ముంచేశారని ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్లో శివీందర్ సింగ్ ఆరోపించారు. శివీందర్ తరఫున ఆర్ఆర్జీ అండ్ అసోసియేట్స్ వేసిన పిటిషన్ గురువారం విచారణకు రానుంది. అర్హెచ్సీ బోర్డు నుంచి మల్వీందర్‌ను తొలగించాలని, బోర్డును పునర్వ్యవస్థీకరించాలని పిటిషన్లో శివీందర్ కోరా రు. అలాగే, ఫోర్టిస్ హెల్త్‌కేర్, రెలిగేర్‌ల నుంచి చట్టవిరుద్ధంగా తీసుకున్న నిధులను కూడా వాపసు చేసేలా మల్వీందర్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్ రికార్డులన్నీ తనిఖీ చేసి, అవసరమైన పత్రాల కాపీలు తీసుకునేందుకు తనకు గానీ లేదా అధీకృత వ్యక్తులకు అనుమతివ్వాలని కోరారు. సింగ్ సోదరుల కుటుంబాలకు చెందిన ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌కి మల్వీందర్ సింగ్ ఎండీగా ఉన్నారు. అంతర్గత వ్యవస్థ పటిష్టం చేయడంపై దృష్టి: ఫోర్టిస్ హెల్త్‌కేర్ వ్యవస్థాగత లోటుపాట్లను ఉపయోగించుకునే మాజీ ప్రమోటర్లు సింగ్ సోదరులు నిధుల అవకతవకలకు పాల్పడ్డారని విచారణలో తేలడంతో అంతర్గతంగా వివిధ వ్యవస్థలను పటిష్టం చేసుకోవడంపై ఫోర్టిస్ హెల్త్‌కేర్ దృష్టి పెట్టింది. ఇందుకోసం బైటి ఏజెన్సీని నియమించుకోనున్నట్లు 2017–18 వార్షిక నివేదికలో సంస్థ పేర్కొంది. దర్యాప్తు నివేదికలోని అంశాల ఆధారంగా నిధుల అవకతవకలపై అంతర్గతంగా విచారణ కూడా జరిపే అవకాశం ఉందని వివరించింది. -
దైచీకి రూ. 2,500 కోట్లు చెల్లించండి
ర్యాన్‌బాక్సీ డీల్‌లో సింగ్ సోదరులకు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశం సింగపూర్: దైచీ శాంక్యో రూ.2,500 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్ ఒకప్పటి ప్రమోటర్లు సింగ్ సోదరులను ఇక్కడి ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ర్యాన్‌బాక్సీ షేర్లను జపాన్ సంస్థ దైచీ శాంక్యోకు విక్రయించే సమయంలో వీరు సంస్థకు సంబంధించి కీలక సమాచారాన్ని దాచిపెట్టారని, తప్పుడు సమాచారాన్ని అందించారనేది ఆరోపణ. ఈ ఆరోపణలు రుజువయినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. సింగ్ సోదరుల్లో ఒకరైన మల్విందర్ సింగ్ ప్రస్తుతం ఫోర్టీస్ హెల్త్‌కేర్ చైర్మన్‌గా ఉన్నారు. మల్విందర్ సింగ్ ఆయన సోదరుడు శివేందర్ సింగ్, కుటుంబ సభ్యులు ర్యాన్‌బాక్సీలోని తమ పూర్తి దాదాపు 35% వాటాలను 2008లో దైచీ శాంక్యోకు 2.4 బిలియన్ డాలర్లకు విక్రయించారు. 2013లో జపాన్ ఫార్మాసూటికల్ దిగ్గజం దైచీ.. సింగపూర్‌లో ఆర్బిట్రేషన్ కేసు దాఖలు చేసింది. ర్యాన్‌బాక్సీ ప్లాంట్లలో తయారీ ప్రక్రియ గురించి అమెరికా డ్రగ్ రెగ్యులేటర్ పలు ఆంక్షలు విధించిన అంశాన్ని ప్రమోటర్లు దాచిపెట్టారని దైచీ పేర్కొంది. ఈ వివాదం పరిష్కారానికి అమెరికా న్యాయ శాఖకు 500 మిలియన్ డాలర్లను ర్యాన్‌బాక్సీ చెల్లించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొంది. ఈ అంశాలను విచారించిన కోర్టు సింగ్ సోదరులతో పాటు తదనంతరం షేర్లు విక్రయించిన మరో రెండు సంస్థలకు వ్యతిరేకంగా తాజా జరిమానా విధించింది. -
సన్ ఫార్మాకు ర్యాన్‌బాక్సీ ఎఫెక్ట్
క్యూ4లో రూ.888 కోట్ల నికర లాభం న్యూఢిల్లీ: ఔషధ రంగ దిగ్గజ కంపెనీ, సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.888 కోట్ల నికర లాభాన్ని(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలానికి రూ.1,587 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. ర్యాన్‌బాక్సీ విలీనం, అమెరికా మార్కెట్లలో కొన్ని ఔషధాల ధరలు తగ్గించడం వల్ల నికర లాభం తగ్గిందని కంపెనీ వివరించింది. నికర అమ్మకాలు 2013-14 క్యూ4లో రూ.4,044 కోట్లుగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,145 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే... 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.3,141 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.4,541 కోట్లకు పెరిగిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.16,004 కోట్ల నుంచి రూ.27,287 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ర్యాన్‌బాక్సీ కంపెనీని కొనుగోలు చేసినందున ఆర్థిక ఫలితాల(పూర్తి సంవత్సరం, క్యూ4 కూడా)ను పోల్చడానికి లేదని కంపెనీ స్పష్టం చేసింది. మొత్తం అమ్మకాల్లో అమెరికా మార్కెట్ వాటా 50 శాతంగా ఉందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేర్ ఎన్ఎస్ఈలో 1 శాతం వృద్ధితో రూ.966 వద్ద ముగిసింది. -
ఆగిపోనున్న ర్యాన్‌బాక్సీ ట్రేడింగ్
-
ర్యాన్‌బాక్సీ నష్టం రూ. 1,029 కోట్లు
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో కంపెనీ రూ.1,029 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీ నికర నష్టం రూ.159 కోట్లుగా ఉంది. అధిక ఉత్పాదక వ్యయాలు, విదేశీ మారకానికి(ఫారెక్స్) సంబంధించిన నష్టాలు కంపెనీని దెబ్బతీశాయి. కాగా, క్యూ3లో ర్యాన్‌బాక్సీ మొత్తం ఆదాయం కూడా 9.5 శాతం దిగజారి రూ.2,859 కోట్ల నుంచి రూ.2,588 కోట్లకు తగ్గింది. భారత్, రష్యా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా దేశాల్లో అమ్మకాల వృద్ధి మెరుగ్గానే ఉందని.. అయితే, కొన్ని మార్కెట్లలో కరెన్సీల క్షీణతతో ప్రతికూల ప్రభావం పడిందని ర్యాన్‌బాక్సీ సీఈఓ, ఎండీ అరుణ్ సాహ్ని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, సన్ ఫార్మాలో ర్యాన్‌బాక్సీ విలీనం ప్రక్రియ సజావుగానే కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బుధవారం బీఎస్ఈలో 1 శాతం మేర నష్టంతో రూ.699.75 వద్ద ముగిసింది. -
సన్, ర్యాన్‌బాక్సీ విలీనానికి షరతులతో ఓకే
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ దిగ్గజాలు సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీల మధ్య విలీనానికి ఎట్టకేలకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 24,000 కోట్లు) విలువైన ఈ విలీనానికి సీసీఐ కొన్ని షరతులు విధించింది. వీటి ప్రకారం కొన్ని రకాల ఉత్పత్తులను ఇతర సంస్థలకు విక్రయించడమేకాకుండా, పోటీ నివారణ వంటి అంశాలకు సంబంధించి ఒప్పందంలో మార్పులను సైతం చేపట్టవలసి ఉంటుంది. రెండు దిగ్గజాలు విలీనమైతే దేశీయంగా అతిపెద్ద ఫార్మా సంస్థ ఆవిర్భవించడంతోపాటు, ప్రపంచంలోనే ఐదో పెద్ద కంపెనీగా సన్-ర్యాన్‌బాక్సీ నిలుస్తుంది. వివాద పరిష్కారం ప్రకారం ‘టామ్సులోసిన్ప్లస్ టోల్టరోడిన్’ సంబంధిత మొత్తం ఉత్పత్తులను సన్ ఫార్మా ఇతర సంస్థలకు విక్రయించాల్సి ఉంటుంది. వీటిని ప్రస్తుతం టామ్లెట్ బ్రాండ్‌తో కంపెనీ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇదే విధంగా ర్యాన్‌బాక్సీ కూడా లియుప్రోలిన్ సంబంధ ఉత్పత్తులన్నింటినీ ఇతర సంస్థకు అమ్మేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీటిని ఎలిగార్డ్ బ్రాండ్‌తో మార్కెట్లో విక్రయిస్తోంది. దీంతోపాటు ర్యాన్‌బాక్సీ టెర్లిబాక్స్, రోసువాస్ ఈజెడ్, ఒలానెక్స్ ఎఫ్, రేసిపర్ ఎల్, ట్రిలోవాన్స్లను సైతం విక్రయించాలి. వెరసి సన్ ఫార్మా ఒకటి, ర్యాన్‌బాక్సీ ఆరు చొప్పున ఉత్పత్తులను వొదులుకోవలసి ఉంటుంది. ఇందుకు ఆరు నెలల గడువును సీసీఐ విధించింది. తద్వారా మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతున్న పోటీ వాతావరణాన్ని కొనసాగించవచ్చునని సీసీఐ అభిప్రాయపడింది. -
సన్-ర్యాన్‌బాక్సీ విలీనంపై రచ్చబండ
న్యూఢిల్లీ: సన్ ఫార్మాలో ర్యాన్‌బాక్సీ ల్యాబ్స్ విలీనంపై వ్యాఖ్యలు పంపించాల్సిందిగా సాధారణ పౌరులతో సహా స్టేక్‌హోల్డర్లందరినీ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గురువారం కోరింది. దాదాపు 400 కోట్ల డాలర్ల విలువైన ఈ విలీనంపై 15 రోజుల్లోగా కామెంట్లు పంపించాలని సూచించింది. రెండు కంపెనీల విలీనంవల్ల సంబంధిత వ్యక్తి/ సంస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉంటుందో ఆధార పత్రాలతో పంపాలని పేర్కొంది. తగిన రుజువుల్లేని అభ్యంతరాలను పట్టించుకోబోమని స్పష్టం చేసింది. ఓ విలీన ఒప్పందంపై ప్రజల వ్యాఖ్యలను సీసీఐ కోరడం ఇదే ప్రథమం. మార్కెట్లో పోటీపై ఈ విలీనం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చిన అనంతరం ప్రజల వ్యాఖ్యలను సీసీఐ కోరింది. సన్‌ఫార్మా - ర్యాన్‌బాక్సీ విలీనం సంబంధిత మార్కెట్లో పోటీపై గణనీయ ప్రతికూల ప్రభావం చూపుతుందా అనే అంశంపై ప్రజలను సంప్రదించే ప్రక్రియను ప్రారంభించినట్లు సీసీఐ తెలిపింది. మాలిక్యూల్స్‌కు సంబంధించిన అంశాలే ఈ ఉదంతంలో ప్రధానమైనవని సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా ఇటీవలే పేర్కొన్నారు. విలీనం కారణంగా మార్కెట్లో అవాంఛనీయ పోటీ ఏర్పడుతుందా అనేది ముఖ్యమైన అంశమని చెప్పారు. విలీనం ఆచరణలోకి వస్తే ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద స్పెషాలిటీ జెనెరిక్స్ కంపెనీ ఆవిర్భవిస్తుంది. ఇండియాలో అతిపెద్ద ఫార్మా కంపెనీ ఏర్పడుతుంది. ఈ కంపెనీకి 65 దేశాల్లో కార్యకలాపాలు ఉంటాయి. ఐదు ఖండాల్లో 47 ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయి. విలీన ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను నిర్ణీత ఫార్మాట్లో ప్రజల ముందుంచాలని సీసీఐ గత నెల 27న ఆదేశించింది. ఫార్మా రంగంలో ప్రవేశానికి పెద్దగా అవరోధాలు లేకపోవడంతో పెద్ద సంఖ్యలో కంపెనీలు విభిన్న ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఈ రంగంలో 20 వేలకుపైగా రిజిస్టర్డ్ యూనిట్లున్నాయి. వీటిలో 250 ప్రముఖ కంపెనీలకు కలిపి ఔషధ మార్కెట్లో 70 శాతం వాటా ఉంది. విలీనం తర్వాత దేశీయ మార్కెట్లో తమ వాటా దాదాపు 9.2 శాతానికి చేరుతుందని సన్‌ఫార్మా, ర్యాన్‌బాక్సీ కంపెనీలు సీసీఐకి తెలిపాయి. ఇందులో ర్యాన్‌బాక్సీ వాటా 3.87 శాతం కాగా సన్‌ఫార్మా వాటా 5.33 శాతంగా ఉంది. విలీనం పూర్వాపరాలు... సమస్యల్లో ఉన్న ప్రత్యర్థి కంపెనీ ర్యాన్‌బాక్సీని చేజిక్కించుకుంటున్నట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గత ఏప్రిల్‌లో ప్రకటించింది. ఒప్పందం విలువ 400 కోట్ల డాలర్లనీ, 80 కోట్ల డాలర్ల బకాయి కూడా ఇందులో ఉందనీ వెల్లడించింది. 2013లో ర్యాన్‌బాక్సీ ఆదాయం 180 కోట్ల డాలర్లతో పోలిస్తే ఒప్పందం విలువ 2.2 రెట్లు అధికం. ఆ లెక్కన ఒక్కో ర్యాన్‌బాక్సీ షేరు ధర రూ.457 అవుతుంది. ఈ రెండు కంపెనీల ఈక్విటీలు ట్రేడయ్యే బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నుంచి ఈ ఒప్పందానికి నిరభ్యంతర పత్రం లభించింది. ఈ ఒప్పందానికి తదుపరి అనుమతిని హైకోర్టు నుంచి పొందాల్సి ఉంది. -
సన్-ర్యాన్‌బాక్సీ డీల్‌పై సీసీఐ మరింత దృష్టి
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజాలు సన్-ర్యాన్‌బాక్సీల మధ్య కుదిరిన మల్టీబిలియన్ డాలర్ ఒప్పందంపై కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) మరింత నిశిత పరిశీలన చేయనుంది. దీనిలో భాగంగా ప్రతిపాదిత విలీన వివరాలను పది రోజుల్లోగా బహిరంగ పరచాల్సిందిగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అటు సన్ ఫార్మా, ఇటు ర్యాన్‌బాక్సీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేశాయి. పది పనిదినాల్లోగా విలీన వివరాలను నిర్ధారించిన రీతిలో బహిరంగపరుస్తూ ప్రచురించాల్సిందిగా సీసీఐ ఆదేశించినట్లు తెలిపాయి. కాగా, విలీనం, కొనుగోలు(ఎంఅండ్ఏ) ఒప్పందంపై బహిరంగ పరిశీలనకు వీలుగా సీసీఐ ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారికావడం గమనార్హం. తద్వారా సీసీఐ నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీల మధ్య 4 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోలు, విలీనం ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ విలీనం వల్ల పోటీ వాతావరణంలో తలెత్తే పరిస్థితులు, దానివల్ల ప్రభావితమయ్యే వ్యక్తులు, సంస్థలకు విలీన వివరాలు తెలిసేలా చేసే యోచనతో సీసీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. వీటిపై సలహాలు, సూచనలు, వ్యాఖ్యలను సీసీఐ ఆహ్వానించనుంది. ఇప్పటికే వివరణ కోరింది...: పూర్తి స్టాక్ రూపంలో ర్యాన్‌బాక్సీని కొనుగోలు చేసేందుకు సన్ ఫార్మా చేసిన ప్రతిపాదనపై గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడానికి ముందే సీసీఐ రెండు కంపెనీల నుంచి వివరణ కోరింది. ఫార్మా రంగంలోని అతిపెద్ద డీల్స్‌లో ఒకటైన ఈ ఒప్పందాన్ని అనుమతించడం ద్వారా దేశీ పరిశ్రమపై భారీ ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో సీసీఐ తాజా ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇది దేశీ ఫార్మా రంగంలో పోటీ వాతావరణాన్ని దెబ్బకొట్టే పక్షంలో విలీనానికి ముందు కొన్ని ఆస్తులను విడగొట్టమంటూ రెండు కంపెనీలకూ సీసీఐ సూచించే అవకాశముంది. రెండు కంపెనీల విలీనంవల్ల ప్రపంచంలోనే ఐదో పెద్ద స్పెషాలిటీ జనరిక్స్ ఫార్మా దిగ్గజంగా ఆవి ర్భవించనుంది. అంతేకాకుండా విలీన సంస్థ దేశీయ ఫార్మా రంగంలో నంబర్‌వన్ స్థానాన్ని పొందనుంది. -
సన్ ఫార్మా,రాన్బాక్సీల విలీనానికి ఓకే
-
ర్యాన్‌బాక్సీ ప్లాంట్‌పై ఈయూ నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: ర్యాన్‌బాక్సీ ప్లాంట్‌పై విధించిన సస్పెన్షన్‌ను యూరోపియన్ ఆరోగ్య నియం త్రణ సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) గురువారం తొలగించింది. పంజాబ్‌లోని తోన్స గ్రామంలో వున్న ఈ ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాల్లో కొన్ని తయారీ లోపాలున్నప్పటికీ, ఈ ఔషధాలను వినియోగించుకోవచ్చని ఈఎంఏ వివరణ ఇచ్చింది. ఈ కారణంగా ఈ ఏడాది జనవరిలో సస్పెండ్ చేసిన జీఎంపీ సర్టిఫికెట్‌ను పునరుద్ధరిస్తున్నామని పేర్కొంది. రోగులు నిరభ్యంతరంగా ఈ ఔషధాలను ఉపయోగించుకోవచ్చని భరోసానిచ్చింది. తోన్స ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాలపై ఈ ఏడాది జనవరిలో అమెరికా ఆహార, ఆహార నియంత్రణ సంస్థ, యూఎస్ఎఫ్డీఏ నిషేధం విధించింది. దీంతో ఈ ప్లాంట్ నుంచి యూరప్‌కు జరిగే ఎగుమతులను కంపెనీయే స్వచ్ఛందంగా సస్పెండ్ చేసింది. అయితే కంపెనీకి మధ్యప్రదేశ్‌లో ఉన్న దేవాస్ ప్లాంట్‌పై విధించిన నిషేధాన్ని ఈయూ కొనసాగిస్తోంది. -
సన్, ర్యాన్‌బాక్సీల విలీనానికి తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: సన్‌ఫార్మా, ర్యాన్‌బాక్సీల విలీనానికి అడ్డంకులు తొలగిపోయాయి. ర్యాన్‌బాక్సీలో సన్‌ఫార్మా విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు శనివారం ఎత్తివేసింది. అంతేకాక విలీన ప్రక్రియకు సంబంధించి సన్‌ఫార్మా అనుబంధ కంపెనీ సిల్వర్ స్ట్రీట్ భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందన్న పిటిషనర్ల ఆరోపణలపై చేస్తున్న విచారణను చట్ట ప్రకారం పూర్తిస్థాయిలో చేపట్టాలని సెబీని ఆదేశించింది. న్యాయమూర్తి గుండా చంద్రయ్య శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విలీన ప్రకటనకు ముందే సిల్వర్ స్ట్రీట్ భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, ఈ మొత్తం వ్యవహారంపై సెబీ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ర్యాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి హైకోర్టు నివేదించి, రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై నిర్ణయం వెలువరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం జస్టిస్ గుండా చంద్రయ్య ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విని నిర్ణయాన్ని శనివారం వెలువరిస్తానని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆయన శనివారం ఉత్తర్వులు జారీ చేస్తూ, విలీన ప్రక్రియపై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ, ఇన్సైడర్ ట్రేడింగ్‌పైనే తమ ప్రధాన అభ్యంతరమని, దానిపై సెబీ విచారణ జరుపుతున్నందున, దానిని రికార్డ్ చేసి ఈ వ్యాజ్యాలను పరిష్కరించాలని కోరారు. నిర్ణీత వ్యవధిలోపు విచారణ పూర్తి చేసేలా సెబీని ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై సెబీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణను నిర్దిష్ట కాల వ్యవధిలోపు పూర్తి చేయడం సాధ్యం కాదని తెలిపారు. దీంతో న్యాయమూర్తి, ఇన్సైడర్ ట్రేడింగ్‌పై చట్ట ప్రకారం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సెబీని ఆదేశిస్తూ, ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సన్‌ఫార్మా, రాన్‌బాక్సీ విలీనంపై స్టే ఎత్తివేత
హైదరాబాద్ : ఔషధ రంగంలో దిగ్గజాలైన సన్‌ఫార్మా, రాన్బాక్సీల విలీన ప్రక్రియపై హైకోర్టు శనివారం స్టే ఎత్తివేసింది. సుప్రీంకోర్టు సూచనతో హైకోర్టు తక్షణ చర్య తీసుకుంది. రాన్‌బాక్సీలో సన్‌ఫార్మా విలీన ప్రకటనకు ముందే సన్‌ఫార్మాకు చెందిన అనుబంధ సంస్థ భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, ఈ మొత్తం వ్యవహారంపై సెబీ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు వాటాదారులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దాంతో విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి హైకోర్టు నివేదించి, రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై నిర్ణయం వెలువరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల నేపథ్యంలో జస్టిస్ గుండా చంద్రయ్య స్టే ఎత్తివేస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు. -
సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ విలీనంపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఔషధ రంగంలో దిగ్గజాలైన సన్‌ఫార్మా, రాన్బాక్సీల విలీన ప్రక్రియపై హైకోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెలువరించనున్నది. తమ విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో శనివారం ఇచ్చే ఉత్తర్వులపై సర్వత్రా ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. రాన్‌బాక్సీలో సన్‌ఫార్మా విలీన ప్రకటనకు ముందే సన్‌ఫార్మాకు చెందిన అనుబంధ సంస్థ భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, ఈ మొత్తం వ్యవహారంపై సెబీ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి హైకోర్టు నివేదించి, రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై నిర్ణయం వెలువరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం జస్టిస్ గుండా చంద్రయ్య విచారణ జరిపారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై తాము ఇప్పటికే దర్యాప్తు చేపట్టామని, తాము ఏమీ చేయడం లేదన్న పిటిషనర్ల ఆరోపణల్లో అర్ధం లేదని సెబీ తరఫు న్యాయవాది వై.సూర్యనారాయణ కోర్టుకు నివేదించారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సెబీ దర్యాప్తు సాగుతోందని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని సన్‌ఫార్మా, రాన్‌బాక్సీ, దైచీ కంపెనీల తరఫు సీనియర్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు, విలీన ప్రక్రియకు సంబంధం లేదని, అందువల్ల విలీన ప్రక్రియను ఆమోదించాలని వారు కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంపై శనివారం తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని స్పష్టం చేశారు. -
ర్యాన్‌బాక్సీ లిపిటార్ జనరిక్ ఔషధం రీకాల్
న్యూఢిల్లీ: ర్యాన్‌బాక్సీ మరో వివాదంలో చిక్కుకుంది. డోసేజీల్లో తేడాలున్న ఆరోపణలు రావడంతో అమెరికాలో 64,000 పైచిలుకు అటోర్వాస్టాటిన్ క్యాల్షియం ట్యాబ్లెట్ల బాటిళ్లను రీకాల్ చేసింది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే లిపిటార్ ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్. పది మిల్లీగ్రాముల ట్యాబ్లెట్స్ ఉండాల్సిన బాటిల్లో 20 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్లు ఉన్నాయని అమెరికాలో ఒక ఫార్మాసిస్టు ఫిర్యాదు చేయడంతో కంపెనీ తాజా రీకాల్ చేపట్టింది. అధిక డోసేజీ మాత్రలుండే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ.. తాము 2 లాట్లకు సంబంధించి స్వచ్ఛందంగా రీకాల్ చేపట్టినట్లు తెలిపింది. ఔషధాల తయారీలో ప్రమాణాలు పాటించకపోవడం ఆరోపణలపై అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ర్యాన్‌బాక్సీకి చెందిన పలు ప్లాంట్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
ర్యాన్‌బాక్సీకి షాక్!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: దేశీ ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీకి మరోసారి అమెరికా నుంచి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌లో కంపెనీకి చెందిన మరొక ప్లాంట్ నుంచి ఔషధాల దిగుమతిపై నియంత్రణ సంస్థ యూఎస్ ఆహార, ఔషధ యంత్రాంగం(యూఎస్ఎఫ్డీఏ) నిషేధం విధించింది. దీంతో భారత్ నుంచి అమెరికాకు ర్యాన్‌బాక్సీ సరఫరా చేస్తున్న మొత్తం ఔషధాల ఎగుమతులన్నీ నిలిచిపోనున్నాయి. పంజాబ్‌లోని తోన్సా ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్న మందులతోపాటు అమెరికాలోని న్యూజెర్సీలో కంపెనీకి ఉన్న ఓహమ్ ల్యాబ్స్ ప్లాంట్‌లో ఔషధాలపైన కూడా నిషేధం విధిస్తూ యూఎస్ఎఫ్డీఏ ఆదేశాలు జారీ చేసింది. అమెరికా వినియోగదారులకు ఉత్పత్తులను అందిస్తున్న ర్యాన్‌బాక్సీ ఇతర తయారీ కేంద్రాలన్నింటికీ తోన్సా ప్లాంట్ నుంచి యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్(ఏపీఐ)ల తయారీ-సరఫరా చేయకూడదని కూడా ఈ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇప్పటిదా కా నిషేధానికి గురైన ప్లాంట్లలో ఇది నాలుగోది కావడం గమనార్హం. ‘అమెరికాలోని కన్జ్యూమర్లకు నాసిరకమైన ఉత్పత్తులు చేరకుండా మేం కఠిన చర్యలను సాధ్యమైనంత వేగంగా చేపడుతున్నాం’ అని ఎఫ్‌డీఏకి చెందిన ఔషధాల మదింపు, పరిశోధన కేంద్రం యాక్టింగ్ డెరైక్టర్ కరోల్ బెన్నెట్ పేర్కొన్నారు. 2012 జనవరిలో జారీ చేసిన కన్సెంట్ డిక్రీలోని నిబంధనల ప్రకారమే ఈ చర్యలకు ఉపక్రమించినట్లు యూఎస్ఎఫ్డీఏ పేర్కొంది. తమ ఆహార, ఔషధ, కాస్మెటిక్ చట్టం; ఎఫ్‌డీఏ నిబంధనల విషయంలో ఉల్లంఘనలు జరిగినట్లు తనిఖీలో తేలితే ర్యాన్‌బాక్సీ సొంత, నిర్వహణలో ఉన్న ప్లాంట్లలో దేనిపైనైనా నిషేధం, చర్యలు చేపట్టేందుకు ఈ కన్సెంట్ డిక్రీ వీలు కల్పిస్తుంది. తయారీలో నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనకుగాను తోన్సా ప్లాంట్‌కు యూఎస్ఎఫ్డీఏ ఈ నెల మొదట్లోనే నోటీసులు జారీచేసింది. అప్పటి నుంచే తాము ఇక్కడ ఏపీఐల తయారీ, సరఫరాలను నిలిపేసినట్లు ర్యాన్‌బాక్సీ చెబుతోంది. నిరాశపరిచింది చర్యలు చేపడతాం: ర్యాన్‌బాక్సీ తోన్సా ప్లాంట్‌పై నిషేధం విధింపు నిరాశపరిచిందని ర్యాన్‌బాక్సీ ప్రతి స్పందించింది. దీనివల్ల తలెత్తే అసౌకర్యానికిగాను కంపెనీ వాటాదారులను క్షమాపణ కోరుతున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ పరిణామాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అంతర్గతంగా దర్యాప్తు పూర్తయిన తర్వాత తదనుగుణంగా యాజమాన్యపరమైన చర్యలు తీసుకుకుంటాం’ అని ర్యాన్‌బాక్సీ సీఈఓ, ఎండీ అరుణ్ సాహ్నే పేర్కొన్నారు. కాగా, యూఎస్ఎఫ్డీఏ కన్సెంట్ డిక్రీకి అనుగుణంగా తాము అన్నివిధాలా సహకరిస్తామని ర్యాన్‌బాక్సీ మాతృసంస్థ జపాన్‌కు చెందిన దైచీ శాంక్యో పేర్కొంది. షేరు... టపటపా... అమెరికా నిషేధం వార్తలతో ర్యాన్‌బాక్సీ షేరు విలవిల్లాడింది. శుక్రవారం బీఎస్ఈలో షేరు ధర 20 శాతం కుప్పకూలింది. క్రితం ముగింపు రూ.417తో పోలిస్తే... రూ.83 మేర క్షీణించి రూ.334 కనిష్టానికి పడిపోయింది. చివరకు 19.54 శాతం నష్టంతో రూ. 335.65 వద్ద ముగిసింది. ఈ కంపెనీ స్టాక్ 53 వారాల గరిష్టస్థాయి రూ. 490 (ఈ నెల 6న) కాగా, కనిష్టస్థాయి రూ.254 (గతేడాది ఆగస్టు 2న)గా నమోదైంది. కాగా, శుక్రవారం ఒక్కరోజే కంపెనీ మార్కెట్ విలువ రూ.3,416 కోట్లు ఆవిరై... రూ.14,260 కోట్లకు దిగజారింది. కంపెనీపై ప్రభావం ఏంటి..? భారత ఔషధ కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ అమెరికాయే. ప్రధానంగా దేశంలో అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటైన ర్యాన్‌బాక్సీ మొత్తం వ్యాపారంలో అమెరికాకు ఎగుమతులే దాదాపు 40 శాతం దాకా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎగుమతులన్నీ ఆగిపోతే కంపెనీ ఆదాయాలు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. కీలకమైన ముడివస్తువుల సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలూ తలెత్తకుండా చూసుకోవడం, నిషేధం తొలగింపునకు తక్షణం తగిన చర్యలు చేపట్టడం చాలా అవసరం. లేదంటే కంపెనీపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఏంజెల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్(ఫార్మా రీసెర్చ్) సరభ్జిత్ కౌర్ నంగ్రా వ్యాఖ్యానించారు. అమెరికాలో ర్యాన్‌బాక్సీ త్రైమాసిక(3 నెలలు) అమ్మకాలు కనీసం 12.5 కోట్ల డాలర్ల వరకూ ఉంటాయి. తాజా నిషేధం వల్ల కీలక ఉత్పత్తుల తయారీని ఇతర ప్లాంట్లకు తాజా నిషేధంతో వచ్చే 3-4 త్రైమాసికాల్లో ఈ అమ్మకాల్లో 35-40% దెబ్బతినే అవకాశం ఉందని రెలిగేర్ క్యాపిటల్ మార్కెట్స్ వైస్ ప్రెసిడెంట్(సంస్థాగత పరిశోధన) అరవింద్ బోత్రా చెబుతున్నారు. భారత్, అమెరికా మార్కెట్లే కంపెనీకి మొత్తం ఆదాయంలో అత్యధిక శాతం సమకూరుస్తున్నాయి. యూఎస్ ఎఫ్‌డీఏ చర్యలతో వచ్చే 4-5 క్వార్టర్లలో లాభాల్లో భారీ తగ్గుదలకు దారితీయొచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ర్యాన్‌బాక్సీ తమ తోన్సా ప్లాంట్‌లో నిబంధనలకు అను గుణంగా ఉత్పత్తి కొనసాగుతుందన్న హామీనిచ్చేలా ఒక థర్డ్ పార్టీ నిపుణులచేత తనిఖీలను నిర్వహించి యూఎస్ఎఫ్డీఏకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నివేదికలపై, తయారీలో లోపాలను సరిదిద్దారన్న అంశంపై సంతృప్తి చెందేవరకూ ఎఫ్‌డీఏ నియంత్రిత ఔషధాల ఉత్పత్తికి ఏపీఏల తయారీ-సరఫరాలను తిరిగి ప్రారంభిచడం కుదరదు. కీలక ప్లాంట్లపై కొరడా... ర్యాన్‌బాక్సీకి కీలక ప్లాంట్లలో పోంటా సాహిబ్(హిమాచల్ ప్రదేశ్), దేవాస్(మధ్యప్రదేశ్), మొహాలీ(పంజాబ్)లు కూడా ఉన్నాయి. 2008 నుంచే పోంటా సాహిబ్, దేవాస్ ప్లాంట్లపై యూఎస్ఎఫ్డీఏ నిషేధం(ఇంపోర్ట్ అలర్ట్) అమలవుతోంది. ఇక్కడ తయారయ్యే దాదాపు 30 జనరిక్ డ్రగ్స్‌ను అమెరికాలోకి దిగుమతి కాకుండా కొరడా ఝళిపించింది. కాగా, పోంటా సాహిబ్, దేవాస్ ప్లాంట్లలో ఔషధాలు నాసిరకంగా ఉన్నట్లు తనిఖీల్లో తేలడంతో అమెరికా నియంత్రణ సంస్థలకు 50 కోట్ల డాలర్ల మొత్తాన్ని జరిమానాగా చెల్లించేందుకు కూడా గతేడాది మే నెలలో ర్యాన్‌బాక్సీ అంగీకరించింది. మొహాలీ ప్లాంట్‌పై గతేడాది సెప్టెంబర్‌లో నిషేధం విధించింది. తాజాగా నాలుగో కీలక ప్లాంట్‌ను కూడా ఈ జాబితాలో చేర్చడంతో కంపెనీ అమెరికా వ్యాపారం తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లయింది. -
ర్యాన్‌బాక్సీ నష్టం రూ. 454 కోట్లు
న్యూఢిల్లీ: విదేశీమారకద్రవ్య నష్టాల కారణంగా ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో రూ. 454 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఆంక్షలతో మొహాలీ ప్లాంటు ఉత్పత్తిని ఖాతాల నుంచి తొలగించాల్సి రావడం కూడా దీనికి కారణమైంది. గతేడాది ఇదే వ్యవధిలో ర్యాన్‌బాక్సీ రూ. 754 కోట్ల లాభం ఆర్జించింది. తాజాగా అకౌంటింగ్ ప్రమాణాలను మార్చాల్సి రావడంతో తాజా క్వార్టర్లో నష్టాల పరిమాణం పెరిగినట్లయిందని సంస్థ పేర్కొంది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 360 కోట్ల మేర ఫారెక్స్ నష్టాలు వచ్చినట్లు వివరించింది. మరోవైపు ఆదాయం మాత్రం రూ. 2,669 కోట్ల నుంచి రూ. 2,750 కోట్లకు పెరిగింది. దేశీయంగా ఔషధ ధరల నియంత్రణ వల్ల అమ్మకాలపై కొంత ప్రభావం పడినట్లు కంపెనీ పేర్కొంది. ఔషధాల నాణ్యత విషయంలో అత్యుత్తమ ప్రమాణాలకు కట్టుబడి ఉంటామని ర్యాన్‌బాక్సీ సీఈవో అరుణ్ సాహ్ని తెలిపారు. ఆసియా, తూర్పు యూరప్, ఆఫ్రికా దేశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం కొనసాగుతుందన్నారు. కంపెనీ ఆర్థిక సంవత్సర వ్యవధిని జనవరి-డిసెంబర్ కాకుండా, ఏప్రిల్-మార్చ్‌కి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మారుస్తున్నట్లు ర్యాన్‌బాక్సీ తెలిపింది. దీంతో, ఈసారి ఆర్థిక సంవత్సరం 15 నెలల కాలంగా (2013 జనవరి నుంచి 2014 మార్చ్ దాకా) ఉంటుందని పేర్కొంది. -
కుప్పకూలిన ర్యాన్‌బాక్సీ షేరు
ముంబై: అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) హెచ్చరికల నేపథ్యంలో ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ షేరు సోమవారం ట్రేడింగ్‌లో ఏకంగా 30% దిగజారి రూ. 319 వద్ద ముగిసింది. ఒక దశలో బీఎస్ఈలో 35% వరకూ పతనమై కనిష్టంగా రూ. 297ను సైతం తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువలో రూ. 5,855 కోట్లు ఆవిరైంది. వెరసి ర్యాన్‌బాక్సీ మార్కెట్ క్యాప్ రూ. 13,491 కోట్లకు పరిమితమైంది. ఇప్పటికే రెండు ప్లాంట్లలో ఉత్పత్తయ్యే ఔషధాలకు సంబంధించి యూఎస్ ఎఫ్‌డీఏ ఆగ్రహానికి గురైన సంస్థ ఇప్పుడు ఇలాంటి మరో సమస్యలో చిక్కుకుంది. పంజాబ్‌లోని మొహాలీ ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ యూఎస్ ఎఫ్‌డీఏ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాల దిగుమతులను నిషేధించింది. కాగా, ఈ ప్లాంట్ ద్వారా 2009 నుంచీ ర్యాన్‌బాక్సీ మొత్తం 18 దరఖాస్తులను(ఫైలింగ్స్) దాఖలు చేసింది. అయితే ఈ విషయమై యూఎస్ ఎఫ్‌డీఏ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని కంపెనీ బీఎస్ఈకి తెలిపింది. ఈ అంశానికి సంబంధించి తమ వెబ్సైట్లో ఉంచిన సమాచారంపై యూఎస్ ఎఫ్‌డీఏను సంప్రదిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే దేవాస్, పోంటా సాహిబ్ ప్లాంట్లలో తయారయ్యే ఔషధాలకు సంబంధించి తలెత్తిన కేసుల పరిష్కారానికిగాను ఈ ఏడాది మే నెలలో యూఎస్ ఎఫ్‌డీఏతో ర్యాన్‌బాక్సీ కన్సెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 50 కోట్ల డాలర్లను చెల్లించేందుకు అంగీకరించింది కూడా. స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్కూ దెబ్బ స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్కూ యూఎస్ ఎఫ్‌డీఏ దెబ్బ తగిలింది. అనుబంధ సంస్థ అగిలా స్పెషాలిటీస్‌కు చెందిన బెంగళూరు స్టెరైల్ తయారీ ప్లాంట్-2పై హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అగిలా స్పెషాలిటీస్ టేకోవర్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది. అమెరికా కంపెనీ మైలాన్ రూ. 5,168 కోట్లకు అగిలాను కొనుగోలు చేసేందుకు స్ట్రైడ్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా, యూఎస్ ఎఫ్‌డీఏకు సహకరించడం ద్వారా సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్ట్రైడ్స్ తెలిపింది. జూన్‌లో యూఎస్ ఎఫ్‌డీఏ ప్లాంట్‌ను సందర్శించి హెచ్చరికలు జారీ చేసిందని, ఇప్పటికే వీటిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నామని వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో స్ట్రైడ్స్ షేరు రూ. 839 వద్ద కనిష్టాన్ని తాకినప్పటికీ, చివరికి 3.5% నష్టంతో రూ. 869 వద్ద ముగిసింది.