దైచీకి రూ. 2,500 కోట్లు చెల్లించండి
ర్యాన్‌బాక్సీ డీల్‌లో సింగ్ సోదరులకు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశం
సింగపూర్: దైచీ శాంక్యో రూ.2,500 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్ ఒకప్పటి ప్రమోటర్లు సింగ్ సోదరులను ఇక్కడి ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ర్యాన్‌బాక్సీ షేర్లను జపాన్ సంస్థ దైచీ శాంక్యోకు విక్రయించే సమయంలో వీరు సంస్థకు సంబంధించి కీలక సమాచారాన్ని దాచిపెట్టారని, తప్పుడు సమాచారాన్ని అందించారనేది ఆరోపణ. ఈ ఆరోపణలు రుజువయినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. సింగ్ సోదరుల్లో ఒకరైన మల్విందర్ సింగ్ ప్రస్తుతం ఫోర్టీస్ హెల్త్‌కేర్ చైర్మన్‌గా ఉన్నారు. మల్విందర్ సింగ్ ఆయన సోదరుడు శివేందర్ సింగ్, కుటుంబ సభ్యులు ర్యాన్‌బాక్సీలోని తమ పూర్తి దాదాపు 35% వాటాలను 2008లో దైచీ శాంక్యోకు 2.4 బిలియన్ డాలర్లకు విక్రయించారు.
2013లో జపాన్ ఫార్మాసూటికల్ దిగ్గజం దైచీ.. సింగపూర్‌లో ఆర్బిట్రేషన్ కేసు దాఖలు చేసింది. ర్యాన్‌బాక్సీ ప్లాంట్లలో తయారీ ప్రక్రియ గురించి అమెరికా డ్రగ్ రెగ్యులేటర్ పలు ఆంక్షలు విధించిన అంశాన్ని ప్రమోటర్లు దాచిపెట్టారని దైచీ పేర్కొంది. ఈ వివాదం పరిష్కారానికి అమెరికా న్యాయ శాఖకు 500 మిలియన్ డాలర్లను ర్యాన్‌బాక్సీ చెల్లించాల్సి వచ్చిందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ అంశాలను విచారించిన కోర్టు సింగ్ సోదరులతో పాటు తదనంతరం షేర్లు విక్రయించిన మరో రెండు సంస్థలకు వ్యతిరేకంగా తాజా జరిమానా విధించింది.