Arbitration Tribunal
-
వివాద్ సే విశ్వాస్–2 స్కీము ముసాయిదా
న్యూఢిల్లీ: ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన వివాద్ సే విశ్వాస్ 2 స్కీము ముసాయిదాను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, కాంట్రాక్టర్లు, ప్రజలు దీనిపై మార్చి 8లోగా తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు. ముసాయిదా ప్రకారం వివాదంపై విచారణ దశను బట్టి కాంట్రాక్టర్లకు సెటిల్మెంట్ మొత్తాన్ని ఆఫర్ చేస్తారు. ఒకవేళ న్యాయస్థానం లేదా ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసి ఉంటే .. క్లెయిమ్ అమౌంటులో 80 శాతం లేదా ఉత్తర్వుల్లో పేర్కొన్న దానిలో 60 శాతం మొత్తం ఆఫర్ చేయవచ్చు. ఇక పనులు నిలిపివేసినా లేదా రద్దయిన కాంట్రాక్టులకు సంబంధించి ఇది నికరంగా క్లెయిమ్ చేసిన దానిలో 30 శాతంగా ఉంటుంది. వివాదాస్పద కాంట్రాక్టుపై లిటిగేషన్, పనులు కొనసాగుతుంటే ఇది 20 శాతానికి పరిమితమవుతుంది. ఒకవేళ మొత్తం క్లెయిమ్ అమౌంటు రూ. 500 కోట్లు దాటిన పక్షంలో ఆర్డరు ఇచ్చిన సంస్థలకు కాంట్రాక్టరు ఇచ్చే సెటిల్మెంట్ ఆఫర్‌ను తిరస్కరించే ఆప్షను ఉంటుంది. కానీ, అందుకు తగిన కారణాన్ని చూపాలి. సంబంధిత శాఖ, విభాగం కార్యదర్శి లేదా కంపెనీ అయితే సీఈవో దీన్ని ఆమోదించాలి. -
రెట్రో వివాద పరిష్కార దిశలో వేదాంత!
న్యూఢిల్లీ: కేంద్రంతో దాదాపు రూ.20,495 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారం దిశగా బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్ వేదాంతా ముందడుగు వేసింది. ప్రభుత్వంపై ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో అలాగే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ (ఐఏటీ)లో విచారణలో ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే... బ్రిటీష్ మాతృసంస్థ ద్వారా వచ్చిన మూలధన లాభాలపై పన్ను తీసివేయడంలో విఫలమైనందుకు కెయిర్న్ ఇండియా నుండి రూ. 20,495 కోట్ల పన్నులను (పెనాల్టీతో సహా) ఐటీ శాఖ డిమాండ్ చేసింది. అటు తర్వాత 2011లో కెయిర్న్ ఇండియాను అగర్వాల్ గ్రూప్ కొనుగోలు చేసింది. వేదాంతా లిమిటెడ్‌లో ఈ సంస్ధ విలీనమైంది. దీనితో పన్ను డిమాండ్ కేసు విషయంలో ఐటీ శాఖతో వేదాంత న్యాయ పోరాటం చేస్తోంది. మరోవైపు గతంలో ఎప్పుడో జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేలా (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) 2012లో చేసిన చట్టం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఇటీవల ఈ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే సామరస్యంగా ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
ఫ్యూచర్‌తో రిలయన్స్ ఒప్పందం గడువు పెంపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, సింగపూర్ ఆర్ర్‌బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో న్యాయ పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్‌తో రూ.24,713 కోట్ల ఒప్పంద పక్రియ పూర్తికి గడువును (లాంగ్ స్టాప్ డేట్) రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) మరోసారి పొడిగించింది. ఇప్పటి వరకూ 2021 సెపె్టంబర్ 30తో గడువు పూర్తికాగా, దీనిని 2022 మార్చి వరకూ ఆర్ఆర్వీఎల్ పొడిగించినట్లు ఫ్యూచర్ రిటైల్ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్ సమర్పించింది. సుదీర్ఘ న్యాయ వివాదం రిలయన్స్‌కు ఫ్యూచర్ గ్రూప్‌ల ఆస్తుల విక్రయానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందం వివాదం ప్రస్తుతం సింగపూర్ అర్ర్‌బిటేషన్, సుప్రీంకోర్టు న్యాయపరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాదారైన అమెజాన్‌కు.. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. అప్పటి ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయన్నది అమెజాన్ వాదన. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్‌నకు లీగల్ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ అమెజాన్‌కు అనుకూలంగా రూలింగ్ వచి్చంది. ఆర్ర్‌బిట్రేషన్ ట్రిబ్యునల్ అవార్డు భారత్ చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతుందని ఇటీవలే ఒక రూలింగ్ ఇచి్చంది. పూర్తి వివాదం అంశంలో ఇంకా తుది తీర్పు వెలువడాల్సి ఉంది. దేశంలో లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలన్నదే ఆయా సంస్థల న్యాయపోరాటం ప్రధాన ధ్యేయమన్న విమర్శలు ఉన్నాయి. ఈజీఎం నిర్వహణకు ఫ్యూచర్‌కు వెసులుబాటు... మరోవైపు ఈ ఒప్పందానికి ఆమోదం కోసం వాటాదారులు, రుణదాతల అసాధారణ సమావేశం (ఈజీఎం) నిర్వహించడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇటీవల కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్‌కు అనుమతి ఇచి్చంది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఒకవేళ ఫ్యూచర్ జరిపే ఈజీఎం గ్రూప్ సంస్థల విక్రయానికి ఆమోదముద్ర వేసినప్పటికీ, సంబంధిత స్కీమ్‌కు ఎన్సీఎల్టీ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ దశలో తన అభ్యంతరాలను అమెజాన్ ఎన్సీఎల్టీ ముందు ఉంచవచ్చని అభిప్రాయపడింది. అందువల్ల ఇప్పుడు ఫ్యూచర్ నిర్వహించే సమావేశం సరికాదనడం తప్పని ఎన్సీఎల్టీ పేర్కొంది. దీనివల్ల తక్షణం అమెజాన్‌కు జరిగే న్యాయపరమైన నష్టం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల విలీన పథకాన్ని ఆమోదిస్తూ, తుది ఉత్తర్వుఇవ్వవద్దని మాత్రమే సుప్రీంకోర్టు తనను ఆదేశించినట్లు వివరించింది. ఫ్యూచర్ ఈజీఎంను నిర్వహించి పథకానికి ముందుగానే ఆమోదముద్ర పొందినట్లయితే, ‘తరువాత ఆర్ర్‌బిట్రేషన్ పక్రియలో విజయం సాధిస్తే’ రిలయన్స్‌తో ఒప్పందం ప్రక్రియ పూర్తికి ఐదారు నెలల సమయం ఆదా అవుతుందనీ వివరించింది. -
రూ. 10,500 కోట్ల పరిహారం కట్టండి!
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన ఇంధన రంగ సంస్థ కెయిర్న్ ఎనర్జీతో రెట్రాస్పెక్టివ్ పన్ను వివాదంలో కేంద్రానికి చుక్కెదురైంది. ఈ కేసులో కెయిర్న్‌కు 1.4 బిలియన్ డాలర్ల దాకా పరిహారం చెల్లించాలంటూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చింది. 2006–07 సంవత్సరంలో కెయిర్న్ భారత విభాగం పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రూ. 10,247 కోట్లు కట్టాలన్న ప్రభుత్వ డిమాండ్ అనుచితమైనదని ట్రిబ్యునల్ కొట్టిపారేసింది. బ్రిటన్‌తో ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడుల రక్షణ ఒప్పందం కింద .. కెయిర్న్ ఎనర్జీ పెట్టుబడులను కాపాడటంలో సముచితంగా వ్యవహరించడంలో భారత్ విఫలమైందని వ్యాఖ్యానించింది. భారత ప్రభుత్వం విక్రయించిన కెయిర్న్ ఎనర్జీ షేర్లు, స్వాధీనం చేసుకున్న డివిడెండ్లు, తన వద్దే అట్టే పెట్టుకున్న పన్ను రీఫండ్లకు సమానమైన విలువను కంపెనీకి వాపసు చేయాలని ట్రిబ్యునల్ సూచించింది. కెయిర్న్‌కు వాటిల్లిన మొత్తం నష్టానికి పరిహారాన్ని వడ్డీ, ఆర్బిట్రేషన్ ఖర్చులు సహా చెల్లించాలని పేర్కొంది. 582 పేజీల ఉత్తర్వుల్లో త్రిసభ్య ట్రిబ్యునల్ ఏకగ్రీవంగా ఈ మేరకు ఆదేశాలిచ్చింది. భారత ప్రభుత్వం తరఫున ఒక నామినీ కూడా ఇందులో సభ్యుడిగా ఉన్నారు. ఒకవేళ ఈ ఉత్తర్వులను గానీ కేంద్రం పాటించకపోతే దీన్ని అడ్డం పెట్టుకుని బ్రిటన్ తదితర దేశాల్లోని భారత్ ఆస్తులను జప్తు చేసుకునేందుకు కెయిర్న్ ఎనర్జీ.. కోర్టులను ఆశ్రయించడానికి ఆస్కారం ఉందన్నది విశ్లేషణ. కెయిర్న్సహా టెలికం సంస్థ వొడాఫోన్తో కూడా ఇలాంటి వివాదమే నెలకొన్న నేపథ్యంలో భార త్ తీసుకోబోయే చర్యలపై విదేశీ ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని పేర్కొన్నాయి. అసలు.. వడ్డీ.. వ్యయాలు.. ఆర్బిట్రేషన్ ప్యానెల్ తమకు 1.2 బిలియన్ డాలర్ల నష్టపరిహారంతో పాటు వడ్డీ, వ్యయాలు చెల్లించా లని ఉత్తర్వులు ఇచ్చినట్లు కెయిర్న్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది. 200 మిలియన్ డాలర్ల వడ్డీ, 20 మిలియన్ డాలర్ల ఆర్బిట్రేషన్ వ్యయాలు కలిపితే భారత ప్రభుత్వం మొత్తం 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,500 కోట్లు) చెల్లించాల్సి రావచ్చని పరిశ్రమవర్గాలు వివరించాయి. వివాదం వివరాల్లోకి వెడితే.. కెయిర్న్ ఎనర్జీ తమ భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే క్రమంలో 2006లో సంస్థ స్వరూపాన్ని పునర్వ్యవస్థీకరించింది. 2011లో ఈ కంపెనీలోని మెజారిటీ వాటాలను వేదాంత రిసోర్సెస్‌కు విక్రయించింది. అదే సమయంలో.. పూర్వం నిర్వహించిన లావాదేవీలకు కూడా వర్తింపచేసేలా రెట్రాస్పెక్టివ్ పన్ను విధానాన్ని భారత ప్రభుత్వం 2012లో అమల్లోకి తెచ్చింది. 2006–07లో చేసిన పునర్వ్యవస్థీకరణతో ప్రయోజనం పొందిన కెయిర్న్ ఎనర్జీ రూ. 10,247 కోట్ల పన్నులు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం వేదాంత గ్రూప్‌లో భాగంగా ఉన్న కెయిర్న్ ఇండియాకు కూడా ట్యాక్స్ డిమాండ్ పంపింది. దీనిపై కెయిర్న్ ఇండియా విడిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇక కెయిర్న్ ఎనర్జీ నుంచి పన్ను బకాయిలను రాబట్టుకునే క్రమంలో వేదాంతలో ఆ కంపెనీకి ఉన్న 5 శాతం వాటాలను ప్రభుత్వం విక్రయించేసింది. దానికి రావాల్సిన డివిడెండ్లను స్వాధీనం చేసుకుని బకాయిల కింద జమ వేసుకుంది. ఈ చర్యలన్నింటినీ సవాలు చేస్తూ.. కెయిర్న్ ఎనర్జీ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తలుపు తట్టగా.. తాజా ఆదేశాలు వచ్చాయి. కార్యాచరణపై కేంద్రం కసరత్తు.. ఈ ఆదేశాలపై అప్పీల్‌కి వెళ్లే వెసులుబాటునిచ్చే నిబంధనలేమీ లేవని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఉత్తర్వులను అధ్యయనం చేస్తామని కేంద్రం తెలిపింది. అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రెండో దెబ్బ... వొడాఫోన్ వ్యవహారంలోనూ ప్రభుత్వం ఇలాంటి పరిణామాలే ఎదుర్కొనగా, ప్రస్తుత కెయిర్న్ ఎనర్జీ పరిణామం ఆ కోవకు చెందిన కేసుల్లో రెండోది. దాదాపు రూ. 22,100 కోట్ల రెట్రాస్పెక్టివ్ పన్నుల వివాదంలో వొడాఫోన్ గ్రూప్‌నకు అనుకూలంగా సెప్టెంబర్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, వొడాఫోన్ కేసులో ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించాల్సిన పరిహారమేమీ లేదు. పైగా డిసెంబర్ 24లోగా దీన్ని సింగపూర్ కోర్టులో సవాలు చేసేందుకు కూడా వెసులుబాటు ఉంది. అటు కేజీ–డీ6 క్షేత్రాల నుంచి అంచనాల కన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కూడా కేంద్రం జరిమానా విధించింది. అయితే, దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినప్పట్నుంచీ నోటీసులివ్వడం ఆగింది. -
వొడాఫోన్‌కు ఊరట
న్యూఢిల్లీ: దాదాపు రూ. 22,100 కోట్ల పన్ను వివాదంలో బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ గ్రూప్‌నకు ఊరట లభించింది. దీనిపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ వొడాఫోన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో నిర్వహించిన లావాదేవీలకు కూడా వర్తింపచేసేలా సవరించిన చట్టం ప్రకారం (రెట్రాస్పెక్టివ్) పన్ను వసూలు చేయడమనేది ద్వైపాక్షిక పెట్టుబడుల రక్షణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అవుతుందని పేర్కొంది. ‘ట్రిబ్యునల్ ఉత్తర్వులు మాకు అనుకూలంగా ఉన్నట్లు ధ్రువీకరించగలం. పత్రాలను పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం ఇంతకు మించి వ్యాఖ్యానించలేము‘ అని వొడాఫోన్ పేర్కొంది. మరోవైపు, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులపై కేంద్రం స్పందించింది. చట్టపరమైన మార్గాలను అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ ఉత్తర్వుల కారణంగా కేంద్ర ప్రభుత్వం రూ. 75 కోట్లు (సుమారు రూ. 30 కోట్లు వ్యయాల కింద, రూ. 45 కోట్లు పన్నుల రీఫండ్ కింద) చెల్లించాల్సి రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. వొడాఫోన్ భారత కార్యకలాపాలను మరో టెలికం సంస్థ ఐడియాలో విలీనం చేయడం తెలిసిందే. ► 2007లో హచిసన్ వాంపోవా సంస్థకు భారత్‌లో ఉన్న టెలికం వ్యాపార విభాగంలో వొడాఫోన్ 67% వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం 11 బిలియన్ డాలర్లు వెచ్చించింది. అయితే, ఆ డీల్ సందర్భంగా హచిసన్‌కు జరిపిన చెల్లింపుల్లో నిర్దిష్ట పన్నులను మినహాయించుకోకపోవడంపై వొడాఫోన్‌కు ఆదాయ పన్ను శాఖ 2007లో నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును వొడాఫోన్ ఆశ్రయించగా 2012 జనవరిలో కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. లావాదేవీ విదేశీ గడ్డపై జరిగినందున భారత్‌లో పన్ను వర్తించదని సుప్రీం పేర్కొంది. ► కానీ, అదే ఏడాది మేలో గత లావాదేవీలకు కూడా పన్నులను వర్తింపచేసే విధంగా ఆదాయ పన్ను చట్టానికి కేంద్రం సవరణలు చేసింది. ► అసలు, వడ్డీ కలిపి రూ. 14,200 కోట్లు కట్టాలంటూ 2013 జనవరిలో వొడాఫోన్‌కు నోటీసులు జారీ అయ్యాయి. నెదర్లాండ్స్–భారత్ ద్వైపాక్షిక (బీఐటీ) కింద కంపెనీ వీటిని సవాలు చేసింది. కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు విఫలం కావడంతో 2014 లో కేంద్రానికి ఆర్బిట్రేషన్ నోటీసులు పంపింది. ► అయితే, తొలిసారిగా నోటీసులు ఇచ్చిన నాటి నుంచి వడ్డీని లెక్కేస్తూ మొత్తం రూ. 22,100 కోట్లు కట్టాలంటూ 2016 ఫిబ్రవరిలో వొడాఫోన్‌కు పన్నుల శాఖ మరోసారి డిమాండ్ నోటీసు పంపింది. దీనిపైనే తాజాగా ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. -
చార్జర్స్‌కు రూ. 4,800 కోట్లు చెల్లించండి...
ముంబై: ఐపీఎల్ నుంచి దక్కన్ చార్జర్స్ (డీసీ) జట్టును తొలగించడంపై ముంబై హైకోర్టు నియమించిన ఆర్బిట్రేటర్ శుక్రవారం ఇచ్చిన తీర్పు బోర్డుకు ప్రతికూలంగా వెలువడింది. నష్టపరిహారంతో పాటు ఇతర ఖర్చుల కింద డీసీ యాజమాన్యానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ. 4,800 కోట్లు చెల్లించాలని హైకోర్టు మధ్యవర్తి రిటైర్డ్ జస్టిస్ సీకే ఠక్కర్ ఆదేశించారు. 2012 నుంచి సాగిన ఈ వివాదంలో చివరకు హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ పైచేయి సాధించింది. ఈ ఉత్తర్వులను బీసీసీఐ హైకోర్టులో సవాల్ చేసే అవకాశముంది. నేపథ్యమిది... ఐపీఎల్లో 2008 నుంచి 2012 వరకు ఐదేళ్ల పాటు దక్కన్ చార్జర్స్ జట్టు కొనసాగింది. 2009లో టీమ్ చాంపియన్‌గా కూడా నిలిచింది. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) కంపెనీ ఈ టీమ్‌ను ప్రమోట్ చేసింది. అయితే 2012లో రూ.100 కోట్ల బ్యాంకు గ్యారంటీని చూపించడంలో విఫలమైందంటూ బీసీసీఐ షోకాజ్ నోటీసు ఇవ్వడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాతి పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. వివరణ కోసం చార్జర్స్‌కు 30 రోజుల గడువు ఇచ్చినా అది పూర్తి కాకముందే టీమ్‌ను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఆ తర్వాత ఇదే జట్టు స్థానంలో 2013 సీజన్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. కోర్టుకెక్కిన చార్జర్స్... తమ జట్టును రద్దు చేయడం అక్రమమని డీసీహెచ్ఎల్ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన జట్లను జరిమానావంటి స్వల్ప శిక్షలతో సరిపెట్టిన బోర్డు చిన్న తప్పుకే తమ జట్టును తొలగించడం అన్యాయమని వాదించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఒప్పందం ప్రకారం బాంబే హైకోర్టు ఆదేశాలతో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీకే ఠక్కర్ మధ్యవర్తిగా వాదనలు మొదలయ్యాయి. నష్టపరిహారం, వడ్డీ, ఇతర ఖర్చుల కింద తమకు రూ. 8 వేల కోట్లు చెల్లించాలని దక్కన్ చార్జర్స్ కోరింది. అయితే ఫ్రాంచైజీ ఫీజు కింద మిగిలిన ఐదేళ్లకు కలిపి రూ. 214 కోట్లు డీసీ తమకు చెల్లించాలని బోర్డు కౌంటర్ వేసింది. చివరకు శుక్రవారం ఆర్బిట్రేటర్ తుది తీర్పు వినిపించారు. జట్టును రద్దు చేయడం సరైంది కాదంటూ నష్టపరిహారంగా రూ. 4,814.67 కోట్లతో పాటు ఆర్బిట్రేషన్ మొదలైన 2012నుంచి ఏడాదికి 10 శాతం వడ్డీ, ఖర్చులకు మరో రూ. 50 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. భారీ మొత్తం కాబట్టి బీసీసీఐ హైకోర్టుకు వెళ్లనుంది. తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ సీఈఓ హేమంగ్ అమీన్ స్పష్టం చేశారు. -
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ
బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ రాజీవ్ బన్సాల్‌కు వడ్డీతో సహా రూ.12.17 కోట్లను చెల్లించాల్సిందేనని ఇన్ఫోసిస్‌ను ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. తనకు చెల్లించాల్సిన రూ.17 కోట్ల సెవరెన్స్ ప్యాకేజీ విషయంలో రాజీవ్ బన్సాల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బన్సాల్ ఫిర్యాదుకు వ్యతిరేకంగా కంపెనీ కౌంటర్ ఫిర్యాదును కూడా దాఖలు చేసింది. అంతకముందు చెల్లించిన రూ.5.2 కోట్లను, ఇతర డ్యామేజ్లను కంపెనీకి తిరిగి చెల్లించాలంటూ బన్సాల్‌ను ఆదేశించాలని ఇన్ఫీ తన ఫిర్యాదులో పేర్కొంది. కానీ ఈ ఫిర్యాదును ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఈ విషయంపై తదుపరి చర్యల కోసం న్యాయ సూచనలు తీసుకుంటామని కంపెనీ బొంబై స్టాక్ ఎక్స్చేంజ్కు తెలిపింది. రాజీవ్ బన్సాల్ సెవరెన్స్ ప్యాకేజ్ విషయంలో ఇన్ఫోసిస్‌లో పెద్ద వివాదమే నెలకొంది. కంపెనీ గవర్నెన్స్‌లు దెబ్బతిన్నాయంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, కంపెనీ బోర్డుకు వ్యతిరేకంగా పలు విమర్శలు చేశారు. సెవరెన్స్ ప్యాకేజీ కింద రాజీవ్‌కు పెద్ద మొత్తంలో ఆఫర్ చేశారంటూ ఆరోపించారు. చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా 2015లో రాజీవ్ బన్సాల్ రాజీనామా చేశారు. అప్పుడు రూ.17.38 కోట్ల సెవరెన్స్ ప్యాకేజీ ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. దానిలో కేవలం రూ.5 కోట్లు మాత్రమే రాజీవ్‌కు చెల్లించింది. మిగతా మొత్తాన్ని చెల్లించకుండా అలా ఆపివేసింది. మిగతా మొత్తాన్ని కూడా తనకు చెల్లించాలని కోరుతూ.. బన్సాల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. -
దైచీకి రూ. 2,500 కోట్లు చెల్లించండి
ర్యాన్‌బాక్సీ డీల్‌లో సింగ్ సోదరులకు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశం సింగపూర్: దైచీ శాంక్యో రూ.2,500 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్ ఒకప్పటి ప్రమోటర్లు సింగ్ సోదరులను ఇక్కడి ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ర్యాన్‌బాక్సీ షేర్లను జపాన్ సంస్థ దైచీ శాంక్యోకు విక్రయించే సమయంలో వీరు సంస్థకు సంబంధించి కీలక సమాచారాన్ని దాచిపెట్టారని, తప్పుడు సమాచారాన్ని అందించారనేది ఆరోపణ. ఈ ఆరోపణలు రుజువయినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. సింగ్ సోదరుల్లో ఒకరైన మల్విందర్ సింగ్ ప్రస్తుతం ఫోర్టీస్ హెల్త్‌కేర్ చైర్మన్‌గా ఉన్నారు. మల్విందర్ సింగ్ ఆయన సోదరుడు శివేందర్ సింగ్, కుటుంబ సభ్యులు ర్యాన్‌బాక్సీలోని తమ పూర్తి దాదాపు 35% వాటాలను 2008లో దైచీ శాంక్యోకు 2.4 బిలియన్ డాలర్లకు విక్రయించారు. 2013లో జపాన్ ఫార్మాసూటికల్ దిగ్గజం దైచీ.. సింగపూర్‌లో ఆర్బిట్రేషన్ కేసు దాఖలు చేసింది. ర్యాన్‌బాక్సీ ప్లాంట్లలో తయారీ ప్రక్రియ గురించి అమెరికా డ్రగ్ రెగ్యులేటర్ పలు ఆంక్షలు విధించిన అంశాన్ని ప్రమోటర్లు దాచిపెట్టారని దైచీ పేర్కొంది. ఈ వివాదం పరిష్కారానికి అమెరికా న్యాయ శాఖకు 500 మిలియన్ డాలర్లను ర్యాన్‌బాక్సీ చెల్లించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొంది. ఈ అంశాలను విచారించిన కోర్టు సింగ్ సోదరులతో పాటు తదనంతరం షేర్లు విక్రయించిన మరో రెండు సంస్థలకు వ్యతిరేకంగా తాజా జరిమానా విధించింది.