న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన ఇంధన రంగ సంస్థ కెయిర్న్ ఎనర్జీతో రెట్రాస్పెక్టివ్ పన్ను వివాదంలో కేంద్రానికి చుక్కెదురైంది. ఈ కేసులో కెయిర్న్‌కు 1.4 బిలియన్ డాలర్ల దాకా పరిహారం చెల్లించాలంటూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చింది. 2006–07 సంవత్సరంలో కెయిర్న్ భారత విభాగం పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి రూ. 10,247 కోట్లు కట్టాలన్న ప్రభుత్వ డిమాండ్ అనుచితమైనదని ట్రిబ్యునల్ కొట్టిపారేసింది. బ్రిటన్‌తో ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడుల రక్షణ ఒప్పందం కింద .. కెయిర్న్ ఎనర్జీ పెట్టుబడులను కాపాడటంలో సముచితంగా వ్యవహరించడంలో భారత్ విఫలమైందని వ్యాఖ్యానించింది. భారత ప్రభుత్వం విక్రయించిన కెయిర్న్ ఎనర్జీ షేర్లు, స్వాధీనం చేసుకున్న డివిడెండ్లు, తన వద్దే అట్టే పెట్టుకున్న పన్ను రీఫండ్‌లకు సమానమైన విలువను కంపెనీకి వాపసు చేయాలని ట్రిబ్యునల్ సూచించింది.
కెయిర్న్‌కు వాటిల్లిన మొత్తం నష్టానికి పరిహారాన్ని వడ్డీ, ఆర్బిట్రేషన్ ఖర్చులు సహా చెల్లించాలని పేర్కొంది. 582 పేజీల ఉత్తర్వుల్లో త్రిసభ్య ట్రిబ్యునల్ ఏకగ్రీవంగా ఈ మేరకు ఆదేశాలిచ్చింది. భారత ప్రభుత్వం తరఫున ఒక నామినీ కూడా ఇందులో సభ్యుడిగా ఉన్నారు. ఒకవేళ ఈ ఉత్తర్వులను గానీ కేంద్రం పాటించకపోతే దీన్ని అడ్డం పెట్టుకుని బ్రిటన్ తదితర దేశాల్లోని భారత్ ఆస్తులను జప్తు చేసుకునేందుకు కెయిర్న్ ఎనర్జీ.. కోర్టులను ఆశ్రయించడానికి ఆస్కారం ఉందన్నది విశ్లేషణ. కెయిర్న్‌సహా టెలికం సంస్థ వొడాఫోన్‌తో కూడా ఇలాంటి వివాదమే నెలకొన్న నేపథ్యంలో భార త్ తీసుకోబోయే చర్యలపై విదేశీ ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని పేర్కొన్నాయి.
అసలు.. వడ్డీ.. వ్యయాలు..
ఆర్బిట్రేషన్ ప్యానెల్ తమకు 1.2 బిలియన్ డాలర్ల నష్టపరిహారంతో పాటు వడ్డీ, వ్యయాలు చెల్లించా లని ఉత్తర్వులు ఇచ్చినట్లు కెయిర్న్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది. 200 మిలియన్ డాలర్ల వడ్డీ, 20 మిలియన్ డాలర్ల ఆర్బిట్రేషన్ వ్యయాలు కలిపితే భారత ప్రభుత్వం మొత్తం 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,500 కోట్లు) చెల్లించాల్సి రావచ్చని పరిశ్రమవర్గాలు వివరించాయి. వివాదం వివరాల్లోకి వెడితే.. కెయిర్న్ ఎనర్జీ తమ భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే క్రమంలో 2006లో సంస్థ స్వరూపాన్ని పునర్‌వ్యవస్థీకరించింది. 2011లో ఈ కంపెనీలోని మెజారిటీ వాటాలను వేదాంత రిసోర్సెస్‌కు విక్రయించింది. అదే సమయంలో.. పూర్వం నిర్వహించిన లావాదేవీలకు కూడా వర్తింపచేసేలా రెట్రాస్పెక్టివ్ పన్ను విధానాన్ని భారత ప్రభుత్వం 2012లో అమల్లోకి తెచ్చింది.
2006–07లో చేసిన పునర్‌వ్యవస్థీకరణతో ప్రయోజనం పొందిన కెయిర్న్ ఎనర్జీ రూ. 10,247 కోట్ల పన్నులు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం వేదాంత గ్రూప్‌లో భాగంగా ఉన్న కెయిర్న్ ఇండియాకు కూడా ట్యాక్స్ డిమాండ్ పంపింది. దీనిపై కెయిర్న్ ఇండియా విడిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇక కెయిర్న్ ఎనర్జీ నుంచి పన్ను బకాయిలను రాబట్టుకునే క్రమంలో వేదాంతలో ఆ కంపెనీకి ఉన్న 5 శాతం వాటాలను ప్రభుత్వం విక్రయించేసింది. దానికి రావాల్సిన డివిడెండ్లను స్వాధీనం చేసుకుని బకాయిల కింద జమ వేసుకుంది. ఈ చర్యలన్నింటినీ సవాలు చేస్తూ.. కెయిర్న్ ఎనర్జీ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తలుపు తట్టగా.. తాజా ఆదేశాలు వచ్చాయి.
కార్యాచరణపై కేంద్రం కసరత్తు..
ఈ ఆదేశాలపై అప్పీల్‌కి వెళ్లే వెసులుబాటునిచ్చే నిబంధనలేమీ లేవని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఉత్తర్వులను అధ్యయనం చేస్తామని కేంద్రం తెలిపింది. అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రెండో దెబ్బ...
వొడాఫోన్ వ్యవహారంలోనూ ప్రభుత్వం ఇలాంటి పరిణామాలే ఎదుర్కొనగా, ప్రస్తుత కెయిర్న్ ఎనర్జీ పరిణామం ఆ కోవకు చెందిన కేసుల్లో రెండోది. దాదాపు రూ. 22,100 కోట్ల రెట్రాస్పెక్టివ్ పన్నుల వివాదంలో వొడాఫోన్ గ్రూప్‌నకు అనుకూలంగా సెప్టెంబర్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, వొడాఫోన్ కేసులో ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించాల్సిన పరిహారమేమీ లేదు. పైగా డిసెంబర్ 24లోగా దీన్ని సింగపూర్ కోర్టులో సవాలు చేసేందుకు కూడా వెసులుబాటు ఉంది. అటు కేజీ–డీ6 క్షేత్రాల నుంచి అంచనాల కన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కూడా కేంద్రం జరిమానా విధించింది. అయితే, దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినప్పట్నుంచీ నోటీసులివ్వడం ఆగింది.
రూ. 10,500 కోట్ల పరిహారం కట్టండి!
Published Thu, Dec 24 2020 12:31 AM | Last Updated on Thu, Dec 24 2020 12:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment