సరైన సమయంలో... సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎప్పుడైనా పెద్ద చిక్కే. ఆ సంగతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలిసొచ్చింది. బ్రిటన్‌కు చెందిన చమురు అన్వేషణ, ఉత్పత్తి సంస్థ కెయిర్న్ ఎనర్జీతో కొన్నేళ్ళుగా సాగుతున్న పన్నుల వివాదంలో గురువారం భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు ఆ సంస్థకు వీలు కల్పిస్తూ, న్యాయప్రక్రియ పూర్తయింది. ప్యారిస్‌లో ఆ సంస్థ స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న భారత ప్రభుత్వ ఆస్తుల విలువ దాదాపు 2 కోట్ల యూరోలు. ఇదే కాదు... అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ప్రకారం మన ప్రభుత్వం వెనక్కి కట్టాల్సిన 170 కోట్ల డాలర్ల సొమ్ము కోసం ఆ సంస్థ ఇప్పటికే వేర్వేరు దేశాల్లో కూడా కేసు వేసింది. అక్కడ కూడా స్వాధీనం చేసుకొనేందుకు భారత ప్రభుత్వ ఆస్తులను గుర్తిస్తోంది. దౌత్యవేత్తల నివాసాలే కాదు, చివరకు అక్కడి ఎయిర్ ఇండియా విమానం సహా భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకొని, విక్రయి స్తామని కెయిర్న్ గతంలోనే బెదిరించింది. ఇప్పుడు ఆ పనే చేయడానికి సిద్ధమవుతోంది. దిగ్భ్రాంతి కరమైన ఈ వార్త ఒక రకంగా ప్రభుత్వానికి పరువు తక్కువగా మారింది.
ఈ వివాదానికి మూలమైన భారత్‌లో కెయిర్న్ కథ చాలా ఏళ్ళ క్రితం మొదలైంది. 1994లోనే ఆ సంస్థ మన దేశంలో చమురు, సహజవాయు రంగంలో పెట్టుబడులు పెట్టింది. 2004 జనవరిలో రాజస్థాన్‌లోని బర్మేర్ దగ్గర చమురు బావులున్నట్టు ఆ సంస్థ అన్వేషణలో తేలింది. అక్కడ పని మొదలుపెట్టింది. సరిగ్గా మూడేళ్ళకు కెయిర్న్ ఇండియా సంస్థ మన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయింది. అటుపైన నాలుగేళ్ళకు షేర్లలో అధిక భాగాన్ని గనుల తవ్వక దిగ్గజమైన వేదాంత సంస్థకు అమ్మేసింది. ఇలా ఉండగా, 2012లో మన కేంద్ర ఆర్థిక శాఖ వెనుకటి తేదీ నుంచి వర్తిస్తూ పన్ను వేసేలా చట్టంలో సవరణ తెచ్చింది. దాని ప్రకారం కెయిర్న్‌పై వెనకటి తేదీ 2006 నుంచే వర్తించేలా పన్ను భారం పడింది. 2006–07లో ఆ సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ‘కెయిర్న్ ఇండియా హోల్డింగ్స్’ షేర్లను ‘కెయిర్న్ ఇండియా’కు బదలాయించింది. తద్వారా ఆ బ్రిటన్ సంస్థకు క్యాపిటల్ గెయిన్స్ వచ్చినందువల్ల, దానిపై రూ. 24.5 వేల కోట్ల క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలని అధికారులు ఆదేశించారు. అది వివాదమైంది. విషయం కోర్టుల దాకా వెళ్ళింది.
బ్రిటన్ – భారత్‌ల మధ్య ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద అది చెల్లదంటూ 2015 మార్చిలో కెయిర్న్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఇది పెట్టుబడులకు సంబంధిం చిన వివాదమే తప్ప, కేవలం పన్ను వ్యవహారం కాదంటూ హేగ్‌లోని అంతర్జాతీయ మధ్వవర్తిత్వ కోర్టు స్పష్టం చేసింది. అలా 2020 డిసెంబర్‌లో కెయిర్న్‌కు అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. వివాదం వల్ల భారత ప్రభుత్వం ఆపిన డబ్బులన్నీ లెక్క కట్టి, ప్రభుత్వమే ఆ సంస్థకు 120 కోట్ల డాలర్ల అసలు, 50 కోట్ల డాలర్ల వడ్డీ – మొత్తం 170 కోట్ల డాలర్లు చెల్లించాలని కోర్టు పేర్కొంది.
దానితో అసంతృప్తికి లోనైన భారత ప్రభుత్వం దానిపై అప్పీలు చేసుకుంది. మరోపక్క కెయిర్న్ సంస్థ తమకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వుల అమలు కోసం అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, కెనడా, సింగపూర్, జపాన్ సహా పలుచోట్ల కేసు వేసింది. తద్వారా విమానాలు, నౌకలు, బ్యాంకు ఖాతాలతో సహా ఆ దేశాల్లో మన దేశానికి ఉన్న వాణిజ్యపరమైన ఆస్తులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకొనే వీలు కలిగింది. ఈ పరిస్థితుల్లో తక్షణమే రంగంలోకి దిగి, సర్దుబాటు, దిద్దు బాటు చర్యలు చేపట్టాల్సిన మన సర్కారు ఆ పని చేయలేదు. ప్రభుత్వ వర్గాలు మొద్దునిద్ర పోవ డంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికీ ‘తగిన చర్యలన్నీ తీసుకుంటాం’, ‘న్యాయపోరాటానికి దిగుతాం’ లాంటి మాటలనే ప్రభుత్వ వర్గాలు వల్లె వేస్తున్నాయి. కానీ, వాద నకు వకీలుకు తగినంత సమాచారం ఇవ్వరంటూ సొంత అధికారుల నుంచి గతంలోనే ప్రభుత్వం విమర్శల పాలైంది. ఇప్పుడిక అంతర్జాతీయ ఉత్తర్వులు అమలుకు వీలున్న అనేక ప్రాంతాల్లో ఆస్తులు కాపాడుకొనేందుకు ప్రభుత్వం ఎంత సమర్థంగా పోరాటం చేయగలదన్నది ప్రశ్న.
మరోపక్క కెయిర్న్ చూపిన ఈ బాట ఇప్పుడు పలు విదేశీ సంస్థలకు అవకాశం కానుంది. ఇప్పటికే మరో విదేశీ సంస్థ దేవాస్ మల్టీమీడియా కూడా న్యూయార్క్‌లోని ఎయిరిండియా ఆస్తులపై కన్నేసి, ఇదే దోవలో వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. ఇస్రో అనుబంధ సంస్థ యాంత్రిక్స్ కార్పొ రేషన్‌కూ, దేవాస్‌కూ మధ్య కుదిరిన ఒప్పందాన్ని 2012లో ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు దానికీ భారీగానే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఒప్పందాలు కుదుర్చుకునే ముందే ఆలోచించాలి తప్ప, కుదుర్చుకున్నాక చటుక్కున బయటకు రావడం అంత సులభం కాదని ఆలస్యంగానైనా ప్రభుత్వానికి అర్థమై ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం రాజీ మార్గం వెతకాలి. ట్రిబ్యునల్ ఉత్తర్వుల ద్వారా భారత్ నుంచి రావాల్సిన మొత్తాన్ని భారత్‌లోనే పెట్టుబడిగా పెడతామని ఆ మధ్య కెయిర్న్ చేసిన ప్రతిపాదననూ పరిశీలించవచ్చు. తక్షణమే సమస్యను సామరస్యంగా పరిష్కరించకపోతే, ఒకపక్క ఆస్తులతో పాటు అంతర్జాతీయంగా ప్రభుత్వం పరువూ పోతుంది. చట్టబద్ధమైన ఒప్పందాలను గౌరవించరనే అపఖ్యాతే మిగులుతుంది. అంతర్జాతీయ పెట్టుబడులు వెనుకపట్టు పట్టే ప్రమాదం ఉంది. గెలవని యుద్ధాలు చేయడం కన్నా... చేసిన తప్పు నుంచి తక్కువ మూల్యంతో బయట పడడమే ఒక్కోసారి విజ్ఞత.
అలక్ష్యంతో వచ్చిపడ్డ అవమానం!
Published Sat, Jul 10 2021 12:30 AM | Last Updated on Sat, Jul 10 2021 12:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment