న్యూఢిల్లీ: భారత్ ప్రభుత్వంపై దావాల కొనసాగింపు విషయంలో కెయిర్న్ ఎనర్జీ వెనక్కు తగ్గుతుంది. ఇందుకు సంబంధించి న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఎయిర్ ఇండియాపై తాను వేసిన ఒక దావాపై స్టేను కోరుతూ స్వయంగా ముందుకు వచ్చింది. ఎయిర్ ఇండియాతో కలిసి ఈ మేరకు న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేసింది. రెట్రాస్పెక్టివ్ పన్ను రద్దుపై భారత్ నిర్ణయం, ఈ నిర్ణయం అమలుకు విధివిధానాల అమలు తత్సంబంధ అంశాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున దావాపై విచారణపై స్టే ఇవ్వాలని రెండు సంస్థలూ న్యాయస్థానాన్ని అభ్యర్థించాయి.
వివరాలు ఇవీ...
కెయిర్న్ ఎనర్జీ 1994లో భారత్‌లో చమురు, గ్యాస్ రంగంలో ఇన్వెస్ట్ చేసింది. 2006లో తన భారత విభాగాన్ని బీఎస్‌ఈలో లిస్ట్ చేసింది. ఈ క్రమంలో కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ ఎనర్జీ లబ్ధి పొందిందని, దానికి సంబంధించి రూ. 10,247 కోట్ల మేర పన్ను పెనాల్టీ, వడ్డీ కట్టాలని కెయిర్న్‌కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. గత డీల్స్‌కు కూడా వర్తించేలా సవరించిన పన్ను చట్టాలకు (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) అనుగుణంగా వీటిని జారీ చేసింది.
భారత విభాగంలో కెయిర్న్‌కు ఉన్న షేర్లను, దానికి రావాల్సిన డివిడెండ్లు మొదలైన వాటిని జప్తు చేసింది. వీటి విలువ దాదాపు రూ.7,900 కోట్లు. దీన్ని కెయిర్న్ ఎనర్జీ పలు న్యాయస్థానాలతో పాటు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయగా.. కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కెయిర్న్‌కు 1.2 బిలియన్ డాలర్లు పరిహారం ఇవ్వాలంటూ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ భారత్‌కు సూచించింది. కానీ కేంద్రం ఇందుకు సుముఖంగా లేకపోవడంతో విదేశాల్లో భారత్‌కి ఉన్న ఆస్తులను జప్తు చేయడం ద్వారా పరిహారాన్ని రాబట్టుకోవాలని కెయిర్న్ నిర్ణయించింది. అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఆదేశాల అమలు కోరుతూ పిటీషన్లు కూడా దాఖలు చేసింది. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియాపై సైతం ఒక దావాను మేలో న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ప్యారిస్‌లో భారత్‌కి ఉన్న 20 ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేందుకు కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా జూలైలో ఫ్రాన్స్ న్యాయస్థానం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే రెట్రాస్పెక్టివ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని కేంద్రం గత నెల్లో నిర్ణయం తీసుకుంది. రెట్రో పన్ను రద్దు పరిణామంతో ఈ పన్ను కింద వసూలయిన రూ.8,100 కోట్లను ప్రభుత్వం రిఫండ్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇందులో ఒక్క కెయిర్న్ ఎనర్జీకి చెల్లించాల్సిందే రూ.7,900 కోట్లు కావడం గమనార్హం. దీనితోపాటు మొత్తం రూ.1.10 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను డిమాండ్లను దాదాపు 17 కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి. వివాద పరిష్కారాలకు, రిఫండ్స్‌కు తొలుత ఆయా కంపెనీలు కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పలు కంపెనీలు ప్రారంభించాయి.
రెట్రాస్పెక్టివ్ పన్ను అంటే..
గత 50 సంవత్సరాల్లో జరిగిన లావాదేవీలకు కూడా పన్నులు వసూలు చేసే విధానాన్ని రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్‌గా వ్యవహరిస్తారు. భారతదేశంలోని ఆస్తుల అమ్మకం, షేర్ల బదలాయింపు వంటి లావాదేవీలు గతంలో విదేశాల్లో జరిగినా వాటికి సంబంధించి ఇక్కడ పన్ను కట్టాల్సిందేనన్న ఉద్దేశంతో 2012 మే 28న అప్పటి యూపీఏ ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. స్థిరమైన పన్ను విధానాలపై ఇన్వెస్టర్లలో భరోసా కల్పించేందుకు, కార్పొరేట్ సంస్థలతో నెలకొన్న రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వివాదాలకు ముగింపు పలికేందుకు రెట్రో ట్యాక్స్‌ను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment