న్యూఢిల్లీ: దాదాపు రూ. 22,100 కోట్ల పన్ను వివాదంలో బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ గ్రూప్‌నకు ఊరట లభించింది. దీనిపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ వొడాఫోన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో నిర్వహించిన లావాదేవీలకు కూడా వర్తింపచేసేలా సవరించిన చట్టం ప్రకారం (రెట్రాస్పెక్టివ్) పన్ను వసూలు చేయడమనేది ద్వైపాక్షిక పెట్టుబడుల రక్షణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అవుతుందని పేర్కొంది. ‘ట్రిబ్యునల్ ఉత్తర్వులు మాకు అనుకూలంగా ఉన్నట్లు ధ్రువీకరించగలం. పత్రాలను పరిశీలిస్తున్నాం.
ప్రస్తుతం ఇంతకు మించి వ్యాఖ్యానించలేము‘ అని వొడాఫోన్ పేర్కొంది. మరోవైపు, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులపై కేంద్రం స్పందించింది. చట్టపరమైన మార్గాలను అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ ఉత్తర్వుల కారణంగా కేంద్ర ప్రభుత్వం రూ. 75 కోట్లు (సుమారు రూ. 30 కోట్లు వ్యయాల కింద, రూ. 45 కోట్లు పన్నుల రీఫండ్ కింద) చెల్లించాల్సి రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. వొడాఫోన్ భారత కార్యకలాపాలను మరో టెలికం సంస్థ ఐడియాలో విలీనం చేయడం తెలిసిందే.
► 2007లో హచిసన్ వాంపోవా సంస్థకు భారత్‌లో ఉన్న టెలికం వ్యాపార విభాగంలో వొడాఫోన్ 67% వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం 11 బిలియన్ డాలర్లు వెచ్చించింది. అయితే, ఆ డీల్ సందర్భంగా హచిసన్‌కు జరిపిన చెల్లింపుల్లో నిర్దిష్ట పన్నులను మినహాయించుకోకపోవడంపై వొడాఫోన్‌కు ఆదాయ పన్ను శాఖ 2007లో నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును వొడాఫోన్ ఆశ్రయించగా 2012 జనవరిలో కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. లావాదేవీ విదేశీ గడ్డపై జరిగినందున భారత్‌లో పన్ను వర్తించదని సుప్రీం పేర్కొంది.
► కానీ, అదే ఏడాది మేలో గత లావాదేవీలకు కూడా పన్నులను వర్తింపచేసే విధంగా ఆదాయ పన్ను చట్టానికి కేంద్రం సవరణలు చేసింది.
► అసలు, వడ్డీ కలిపి రూ. 14,200 కోట్లు కట్టాలంటూ 2013 జనవరిలో వొడాఫోన్‌కు నోటీసులు జారీ అయ్యాయి. నెదర్లాండ్స్–భారత్ ద్వైపాక్షిక (బీఐటీ) కింద కంపెనీ వీటిని సవాలు చేసింది. కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు విఫలం కావడంతో 2014 లో కేంద్రానికి ఆర్బిట్రేషన్ నోటీసులు పంపింది.
► అయితే, తొలిసారిగా నోటీసులు ఇచ్చిన నాటి నుంచి వడ్డీని లెక్కేస్తూ మొత్తం రూ. 22,100 కోట్లు కట్టాలంటూ 2016 ఫిబ్రవరిలో వొడాఫోన్‌కు పన్నుల శాఖ మరోసారి డిమాండ్ నోటీసు పంపింది. దీనిపైనే తాజాగా ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment