Retrospective tax
-
పన్ను వివాద కేసుల ఉపసంహరణ: కెయిర్న్
న్యూఢిల్లీ: దాదాపు ఏడేళ్లుగా భారత ప్రభుత్వంతో నెలకొన్న రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ వివాదానికి ముగింపు పలికే దిశగా బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్ ఎనర్జీ చర్యలు తీసుకుంది. కేంద్రంతో కుదుర్చుకున్న సెటిల్మెట్ ఒప్పందం ప్రకారం.. అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తదితర దేశాల కోర్టుల్లో భారత్‌పై వేసిన దావాలన్నింటినీ ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి కేసులను ఉపసంహరించుకున్న వివరాలతో కేంద్రానికి ఫారం 3ని సమర్పించనున్నట్లు కెయిర్న్ ఎనర్జీ (ప్రస్తుతం క్యాప్రికార్న్ ఎనర్జీ) తెలిపింది. ఆ తర్వాత ట్యాక్స్‌ల రిఫండ్ కోసం ప్రభుత్వం ఫారం 4 జారీ చేస్తుందని పేర్కొంది. దీంతో రూ. 7,900 కోట్ల పన్ను మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రిఫండ్ పొందేందుకు కంపెనీకి మార్గం సుగమం అయ్యింది. ఇదీ నేపథ్యం 2006–07లో భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే ముందు వ్యాపార పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ గణనీయంగా క్యాపిటల్ గెయిన్స్ పొందిందన్నది ఆదాయ పన్ను శాఖ ఆరోపణ. లావాదేవీలు జరిగి చాలాకాలం గడిచినప్పటికీ వాటికి కూడా పన్నులను వర్తింపచేసే విధంగా (రెట్రాస్పెక్టివ్) 2012లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ప్రయోగించి రూ. 10,247 కోట్ల మేర పన్నులు కట్టాలంటూ కెయిర్న్‌కు నోటీసులు పంపించింది. దీనిపై కెయిర్న్.. ఆర్పిట్రేషన్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించగా కంపెనీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. అంతర్జాతీయంగా పరువు పోతుండటంతో గతేడాది ఆగస్టులో వివాదాస్పద రెట్రాస్పెక్టివ్ చట్టాన్ని కేంద్రం పక్కన పెట్టింది. -
వొడాఫోన్‌కు ఊరట
న్యూఢిల్లీ: దాదాపు రూ. 22,100 కోట్ల పన్ను వివాదంలో బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ గ్రూప్‌నకు ఊరట లభించింది. దీనిపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ వొడాఫోన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో నిర్వహించిన లావాదేవీలకు కూడా వర్తింపచేసేలా సవరించిన చట్టం ప్రకారం (రెట్రాస్పెక్టివ్) పన్ను వసూలు చేయడమనేది ద్వైపాక్షిక పెట్టుబడుల రక్షణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అవుతుందని పేర్కొంది. ‘ట్రిబ్యునల్ ఉత్తర్వులు మాకు అనుకూలంగా ఉన్నట్లు ధ్రువీకరించగలం. పత్రాలను పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం ఇంతకు మించి వ్యాఖ్యానించలేము‘ అని వొడాఫోన్ పేర్కొంది. మరోవైపు, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులపై కేంద్రం స్పందించింది. చట్టపరమైన మార్గాలను అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ ఉత్తర్వుల కారణంగా కేంద్ర ప్రభుత్వం రూ. 75 కోట్లు (సుమారు రూ. 30 కోట్లు వ్యయాల కింద, రూ. 45 కోట్లు పన్నుల రీఫండ్ కింద) చెల్లించాల్సి రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. వొడాఫోన్ భారత కార్యకలాపాలను మరో టెలికం సంస్థ ఐడియాలో విలీనం చేయడం తెలిసిందే. ► 2007లో హచిసన్ వాంపోవా సంస్థకు భారత్‌లో ఉన్న టెలికం వ్యాపార విభాగంలో వొడాఫోన్ 67% వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం 11 బిలియన్ డాలర్లు వెచ్చించింది. అయితే, ఆ డీల్ సందర్భంగా హచిసన్‌కు జరిపిన చెల్లింపుల్లో నిర్దిష్ట పన్నులను మినహాయించుకోకపోవడంపై వొడాఫోన్‌కు ఆదాయ పన్ను శాఖ 2007లో నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును వొడాఫోన్ ఆశ్రయించగా 2012 జనవరిలో కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. లావాదేవీ విదేశీ గడ్డపై జరిగినందున భారత్‌లో పన్ను వర్తించదని సుప్రీం పేర్కొంది. ► కానీ, అదే ఏడాది మేలో గత లావాదేవీలకు కూడా పన్నులను వర్తింపచేసే విధంగా ఆదాయ పన్ను చట్టానికి కేంద్రం సవరణలు చేసింది. ► అసలు, వడ్డీ కలిపి రూ. 14,200 కోట్లు కట్టాలంటూ 2013 జనవరిలో వొడాఫోన్‌కు నోటీసులు జారీ అయ్యాయి. నెదర్లాండ్స్–భారత్ ద్వైపాక్షిక (బీఐటీ) కింద కంపెనీ వీటిని సవాలు చేసింది. కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు విఫలం కావడంతో 2014 లో కేంద్రానికి ఆర్బిట్రేషన్ నోటీసులు పంపింది. ► అయితే, తొలిసారిగా నోటీసులు ఇచ్చిన నాటి నుంచి వడ్డీని లెక్కేస్తూ మొత్తం రూ. 22,100 కోట్లు కట్టాలంటూ 2016 ఫిబ్రవరిలో వొడాఫోన్‌కు పన్నుల శాఖ మరోసారి డిమాండ్ నోటీసు పంపింది. దీనిపైనే తాజాగా ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. -
రెట్రోస్పెక్టివ్ పన్నులపై వన్‌టైమ్ సెటిల్మెంట్కు ఒత్తిడి చేయం
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: రెట్రోస్పెక్టివ్ పన్ను(పాత లావాదేవీలకూ పన్ను వర్తింపు) కేసులకు సంబంధించి వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ వంటి కంపెనీలను వన్‌టైమ్ సెటిల్మెంట్ కోసం ఒత్తిడి చేయబోమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఒకపక్క, ఇలాంటి కేసుల్లో ఆర్బిట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుండటం, ప్రభుత్వం కూడా రెట్రోస్పెక్టివ్ చట్టం ప్రకారం కొత్తగా ఎలాంటి నోటీసులూ జారీచేయదని చెబుతున్నప్పటికీ.. వొడాఫోన్, కెయిర్న్లకు గత నెలలో తాజాగా పన్ను నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... ఇప్పటికే పన్ను అసెస్మెంట్ ఆదేశాలు పంపిన కంపెనీలకు నిబంధనల ప్రకారం నోటీసుల జారీ కొనసాగుతుందని జైట్లీ స్పష్టం చేశారు. లేదంటే గతంలో నోటీసులు పంపిన అధికారులను కాగ్, సీబీఐలు ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. ‘నోటీసులు అందుకున్న కంపెనీలు ప్రభుత్వం ప్రకటించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ ఆఫర్(పన్ను అసలు మొత్తాన్ని కడితే, వడ్డీ, జరిమానాలను మాఫీ చేయడం)కు ఓకే చెప్పొచ్చు. ఈ స్కీమ్ ప్రభుత్వం కల్పించిన ఒక ప్రత్యామ్నాయ మార్గం మాత్రమే. దీన్ని ఆమోదించడం తప్పనిసరేమీకాదు. కావాలంటే, సంబంధిత కంపెనీలు తమ న్యాయపరమైన చర్యలను(లిటిగేషన్) కొనసాగించవచ్చు’ అని జైట్లీ తేల్చిచెప్పారు. 2006లో భారత్‌లోని వ్యాపార పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఆర్జించిన మూలదన లాభాలపై రూ.29,000 కోట్లమేర(దీనిలో వడ్డీయే రూ.18,000 కోట్లు) చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ గత నెలలో కెయిర్న్ ఎనర్జీకి తుది నోటీసులు జారీచేయడం తెలిసిందే. 2007లో హచిసన్ నుంచి 67 శాతం వాటా కొనుగోలుపై మూలధన లాభాల పన్ను కింద(వడ్డీ, జరిమానా కలిపి) రూ.14,200 కోట్లు చెల్లించాల్సిందిగా వొడాఫోన్‌కు కూడా ఐటీ శాఖ నోటీసులు పంపింది. జువెలర్స్‌పై వేధింపులు లేకుండా చర్యలు... పన్ను అధికారులు ఆభరణాల వర్తకులను వేధించకుండా ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటుందని జైట్లీ హామీనిచ్చారు. అయితే, జువెలరీ లాంటి విలాసవంతమైన ఉత్పత్తులను పన్నుల జాబితాలో లేకుండా వదిలిపెట్టడం కుదరదని ఆర్థిక మంత్రి తేల్చిచెప్పారు. అని జైట్లీ వ్యాఖ్యానించారు. కాగా, ఆభరణాలపై సుంకం ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకూ సమ్మెను విరమించే ప్రసక్తే లేదని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ; ఆల్ ఇండియా బులియన్ జువెలర్స్-స్వర్ణకార్ ఫెడరేషన్(ఏఐబీజేఎస్‌ఎఫ్) ఆదివారం స్పష్టం చేశాయి. కొన్ని జువెలరీ సంఘాలు కొనసాగిస్తున్న దేశవ్యాప్త సమ్మె 26వ రోజుకు చేరింది. -
‘పాత’ లావాదేవీలపై ‘కొత్త’ పన్ను కూడదు
ఆందోళనలు అక్కర్లేదని అమెరికా ఇన్వెస్టర్లకు జైట్లీ హామీ న్యూయార్క్ : పాత లావాదేవీలపై పన్నులు విధించడానికి (రెట్రాస్పెక్టివ్ పన్ను) సంబంధించిన నిర్ణయాలు, ఆయా నిర్ణయాలు ఇన్వెస్టర్లపై కొత్త భారాలను మోపడం ఎంతమాత్రం ఆమోదనీయంకాదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆందోళన అక్కర్లేదని మంత్రి అమెరికా వ్యాపార వర్గాలు, ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. ఏవో కొన్ని అసాధారణ అంశాలను మినహాయిస్తే.. రెట్రాస్పెక్టివ్ పన్ను భారాలు ఎంతమాత్రం ఆమోదనీయం కాదన్నది తన అభిప్రాయమని అన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలు ‘రెట్రాస్పెక్టివ్’ పన్నుల గురించి తమ ఆందోళనలను జైట్లీ ముందు ప్రస్తావించినప్పుడు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. మౌలికంపై... మౌలిక రంగంపై అడిగిన ఒక ప్రశ్నకు జైట్లీ సమాధానం చెబుతూ, ఈ రంగంలో కేంద్రం భారీ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిందని అన్నారు. ఈ రంగం పురోభివృద్ధే లక్ష్యంగా పలు కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. పెట్రోల్,డీజిల్‌పై పన్నుల పెంపు ఇందుకు సంబంధించి వనరుల సమీకరణలో ఒకటని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల వల్ల రెండేళ్లక్రితం పూర్తిగా నిలిచిపోయిన ఈ రంగం, తిరిగి పునరుత్తేజం పొందిందని అన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. వ్యవసాయంలో సంస్కరణలు... కాగా వ్యవసాయ రంగంపై తక్కువమంది ఆధారపడే విధంగా.. ఈ రంగంలో సంస్కరణలు తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ రంగంలో అదనంగా ఉన్న వారికి వేరొక రంగాల్లో ఉపాధి కల్పించడం ద్వారా ఈ దిశలో పురోగమించాలన్నది కేంద్రం వ్యూహమన్నారు. వ్యవసాయ రంగంపై అధిక జనాభా ఆధారపడ్డం వల్ల జీవన ప్రమాణాల మెరుగుదల విషయంలో ఒత్తిడి నెలకొన్న పరిస్థితి కొనసాగుతుందని వివరించారు. ఆయా అంశాల్లో పురోగతి లక్ష్యంగా తీసుకువచ్చిందే... ‘తాజా భూ సేకరణ సవరణ బిల్లు’ అన్నారు. దీనిపై దేశంలో ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతున్న విషయాన్నీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2013 లాండ్ లా గ్రామీణ రంగానికి ఎంతమాత్రం స్నేహపూర్వకమైనది కాదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను. గ్రామీణ రహదారులు, విద్యుత్ వ్యవస్థల అభివృద్ధి లక్ష్యాన్ని ఇది పూర్తిగా విస్మరించిందని తెలిపారు. -
విదేశీ ఇన్వెస్టర్లకు ‘మ్యాట్’ ఊరట
ఫైనాన్స్ బిల్లు-2015పై చర్చలో ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టత... ⇒ ఐటీఆర్ ఫారాలను మరింత సరళం చేస్తామని హామీ.. ⇒ ఎఫ్ఐఐలపై రెట్రోస్పెక్టివ్ పన్ను ⇒ అంశం సుప్రీంకోర్టులో ఉందని వెల్లడి... ⇒ లోక్‌సభలో మూజువాణి ఓటుతో ⇒ ఫైనాన్స్ బిల్లుకు ఆమోదం.. న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాస్త ఊరటనిచ్చారు. కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) విధింపు విషయంలో కొన్ని రకాల ఆదాయాలను మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ఎఫ్ఐఐలపై ఇక మ్యాట్ ఉండదని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా వివాదాస్పదమైన 14 పేజీల ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్) ఫారం స్థానంలో పూర్తిగా సరళీకరించిన కొత్త ఫారాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చారు. గురువారం లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లు-2015పై చర్చ అనంతరం జైట్లీ సమాధానమిస్తూ ఈ విషయాలను వెల్లడించారు. ఇక ప్రధాన మంత్రి సామాజిక భద్రత పథకాలకు జరిపే చెల్లింపులను సేవల పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు కూడా చెప్పారు. ముడి పట్టు, ఇనుప ఖనిజం, రబ్బరులపై పరోక్ష పన్నుల్లో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయవ్యయ పద్దులు, పన్నులు ఇతరత్రా ప్రతిపాదనలతో కూడిన ఈ ఫైనాన్స్ బిల్లుకు... ఆ తర్వాత లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదముద్ర పడింది. కాగా, భూసేకరణ బిల్లు వంటి కీలక సంస్కరణల విషయంలో ప్రతిపక్షాలు సహకరించాలని జైట్లీ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిస్థితులను అనువుగా మలచుకొని వృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ చర్యలు చాలా అవసరమని ఆయన చెప్పారు. మ్యాట్ మినహాయింపులు ఇలా... గడిచిన మూడేళ్లకు సంబంధించి మూలధన లాభాలపై(ఈ మార్చి 31 వరకూ) ఎఫ్ఐఐలు 20% మ్యాట్ బకాయిలను చెల్లించాలంటూ రెవెన్యూ విభాగం ఇటీవలే డిమాండ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. అయితే, దీనిపై ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తం కావడంతో కేంద్రం తాజాగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. షేర్ల లావాదేవీలు, వడ్డీల ద్వారా విదేశీ సంస్థలకు వచ్చిన ఆదాయాలపై అదేవిధంగా సాంకేతిక సేవలకుగాను ఆర్జించే రాయల్టీలు, ఫీజులను మ్యాట్ నుంచి మినహాయిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. సాధారణ పన్ను రేటు 18.5% కంటే దిగువనున్న కేసులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందన్నారు. అయితే, ఎఫ్ఐఐ(వీరినే ఎఫ్‌పీఐలుగా వ్యవహరిస్తారు)లకు పాత బకాయిలకు(రెట్రోస్పెక్టివ్) సంబంధించి పన్నులపై జైట్లీ ఎలాంటి ఊరటనూ కల్పించకపోవడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎఫ్ఐఐలకు మ్యాట్ ఉండదని.. పాత బకాయిల విషయం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని జైట్లీ వివరించారు. ఐటీఆర్‌ల విషయానికొస్తే... ⇒ కొత్తగా తీసుకొచ్చిన ఐటీఆర్ ఫారంలో అసెస్సీలు బ్యాంక్ ఖాతాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాలంటూ ఐటీ శాఖ కొత్త నిబంధనలను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై తీవ్ర వ్యతిరేకతలు, విమర్శలు వ్యక్తం కావడంతో అత్యంత సులువైన రీతిలో కొత్త ఫారాన్ని త్వరలోనే తీసుకొస్తామని జైట్లీ ఈ వివాదానికి తెరదించారు. ⇒ తక్కువ గ్రేడ్ ఇనుప ఖనిజ ఎగుమతులు(గోవా నుంచి) పెంచేందుకు వీలుగా ఎగుమతి సుంకాన్ని ఇప్పుడున్న 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ⇒ ఇక సహజ రబ్బరుపై బేసిక్ దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 25 శాతానికి పెంపు. ⇒ ప్రైవేటు రంగ డిఫెన్స్ పరికరాల తయారీ కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లతో సమాన స్థాయిని కల్పించడం కోసం డిఫెన్స్ పీఎస్‌యూలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులకు కల్పిస్తున్న ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఉపసంహరణ. ఆర్బీఐ అధికారాలకు కోతపై వెనక్కి... రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అధికారాలకు కోత విషయంలో మోదీ సర్కారు వెనక్కి తగ్గింది. ప్రభుత్వ రుణ పత్రాల(బాండ్లు) నిర్వహణను ఆర్బీఐ నుంచి విడదీసి ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించాలన్న ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కనబెట్టింది. ప్రభుత్వ రుణ నిర్వహణ ఏజెన్సీ(పీఎండీఏ) ఏర్పాటు ప్రతిపాదనను ఫైనాన్స్ బిల్లు-2015 నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు లోక్ సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రకటించారు. అయితే, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఒక ప్రత్యేక రుణ నిర్వహణ ఏజెన్సీ నెలకొల్పేందుకు తగిన రోడ్‌మ్యాప్ తయారు చేసేందుకు ఆర్బీఐతో సంప్రతింపులు జరపనున్నట్లు ఆయన చెప్పారు. -
నెల కనిష్టానికి సెన్సెక్స్
- ప్రభావం చూపుతున్న బలహీనమైన ఫలితాలు - కీలక 8,400 పాయింట్ల దిగువకు నిఫ్టీ - 210 పాయింట్ల నష్టంతో 27,676కు సెన్సెక్స్ - 70 పాయింట్ల నష్టంతో 8,378కు నిఫ్టీ స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లోనే ముగిసింది. సూచీలు నాలుగు వారాల కనిష్టస్థాయికి పడిపోయాయి. రెట్రాస్పెక్టివ్ పన్ను ఆందోళనలు, నిరాశమయంగా ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు, రూపాయి బలహీనత.. ఈ అంశాలన్నీ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 210 పాయింట్లు నష్టపోయి 27,676 పాయింట్లకు, నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 8,378 పాయింట్లకు పతనమయ్యాయి. ఫలితాలే కీలకం... బీఎస్ఈ సెన్సెక్స్ నష్టాల్లో ప్రారంభమైంది. కొన్ని షేర్లు తక్కువ ధరల్లో లభ్యమవుతుండటంతో ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో మధ్యాహ్నం కల్లా సెన్సెక్స్ రికవరీ అయి 27,977 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ట్రేడింగ్ చివరలో అమ్మకాల జోరు పెరగడంతో 27,598 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 210 పాయింట్ల నష్టంతో 27,676 వద్ద ముగిసింది. మార్చి 27 తర్వాత ఇదే కనిష్ట స్థాయి. ఇక నిఫ్టీ 8,469-8,353 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి 70 పాయింట్లు నష్టపోయి 8,378 వద్ద మగిసింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1.370 పాయింట్లు నష్టపోయింది.సమీప భవిష్యత్తులో కంపెనీల ఆర్థిక ఫలితాలే బాగా ప్రభావం చూపుతాయని జియోజిత్ బీఎన్పీ పారిబస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఎన్ఎస్ఈలో రికార్డ్ టర్నోవర్ ఎన్ఎస్ఈలో మంగళవారం రికార్డ్ స్థాయి టర్నోవర్(రూ.41,165 కోట్లు) నమోదైంది. రూ.20 కోట్ల సన్ ఫార్మా షేర్ల బల్క్ డీల్ కారణంగా ఈ స్థాయి టర్నోవర్ సాధ్యమైందని ఎన్ఎస్ఈ పేర్కొంది. గత రికార్డ్ 2009 మే19న నమోదైం ది. ఆ రోజు రూ.40,150.91 కోట్ల టర్నోవర్ నమోదైంది. -
‘కెయిర్న్’ ట్యాక్స్ వివాదం.. జైట్లీకి సంకటం
న్యూఢిల్లీ: ఇంధన రంగ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను శాఖ రూ. 10,247 కోట్ల పన్నుల నోటీసులు జారీ చేయడం.. బ్రిటన్‌లో పర్యటించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సంకటంగా మారనుంది. శుక్రవారం లండన్‌లో ఆయన విదేశీ ఇన్వెస్టర్లతో భేటీ కానున్నారు. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ (గత డీల్స్‌ను తిరగదోడి పన్నులు విధించడం)పై తమ ప్రభుత్వ విధానాన్ని ఈ సమావేశంలో ఆయన వివరించనున్నారు. ఈలోగా కెయిర్న్ ఎనర్జీకి నోటీసులివ్వడంతో ఇన్వెస్టర్ల నుంచి ఆయన ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కొనాల్సి రావొచ్చని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. జైట్లీ మూడు రోజుల పాటు బ్రిటన్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. మరోవైపు, నిబంధనల ప్రకారమే కెయిర్న్ ఎనర్జీకి నోటీసులు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. నిబద్ధత చేతల్లోనూ చూపాలి: బ్రిటన్ భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి హామండ్ గురువారం జైట్లీతో సమావేశంలో కెయిర్న్ ఎనర్జీకి నోటీసుల అంశాన్ని చర్చించారు. నోటీసులు గత ప్రభుత్వ హయాంనకు సంబంధించినవని, ఇకపై కొత్తవి ఉండబోవని జైట్లీ హామీ ఇచ్చినట్లు హామండ్ విలేకరులకు తెలిపారు. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించడమన్నదిమాటలకే పరిమితం చేయకుండా భారత్ ఆచరణలో కూడా చూపించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో పర్యటించబోతున్న జైట్లీ ఇదే విషయంపై అక్కడి ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించాల్సి ఉంటుందన్నారు. భారీ సంస్కరణల ఆశలు సరికావు: అరవింద్ సుబ్రమణియన్ కాగా భారత్‌వంటి భారీ ప్రజాస్వామ్య దేశాల్లో భారీ సంస్కరణల అంచనాలు పెట్టుకోవడం సముచితం కాదని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు. భారత్‌లో అధికార కేంద్రాలు అనేకం ఉంటాయని, కేంద్రం తీసుకునే నిర్ణయాలను రాష్ట్రాలు, ప్రభుత్వ సంస్థలు కూడా తిరస్కరించవచ్చని పేర్కొన్నారు. వాషింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌లో ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. -
అన్ని జాగ్రత్తలతో రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్..
న్యూఢిల్లీ: పన్ను చట్టాలకు గతం నుంచి అమల్లోకి వచ్చే (రెట్రాస్పెక్టివ్) సవరణలు చేసే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటామని ఇన్వెస్టర్లకు జైట్లీ భరోసా ఇచ్చారు. ఐటీ చట్టం సవరణ(2012)కు సంబంధించిన తాజా కేసులన్నిటినీ ఉన్నత స్థాయి సీబీడీటీ కమిటీ పరిశీలిస్తుందన్నారు. అయితే, ఆదాయ పన్ను చట్టం -1961కు రెట్రాస్పెక్టివ్ సవరణతో ఇప్పటికే ఉత్పన్నమై, కోర్టుల్లో పెండింగులో ఉన్న వివాదాలు హేతుబద్ధంగా పరిష్కారమయ్యేలా చూస్తామని చెప్పారు. ఆర్బిట్రేషన్ కొనసాగిస్తాం : జైట్లీ ప్రకటన నేపథ్యంలో రూ.20 వేల కోట్ల పన్ను వివాదానికి సంబంధించి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్) ప్రక్రియను కొనసాగించాలని వొడాఫోన్ నిర్ణయించింది. రెండేళ్లలో కొత్త అకౌంటింగ్ ప్రమాణాలు...: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన కొత్త అకౌంటింగ్ ప్రమాణాలను 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు తప్పనిసరిగా పాటించాలని జైట్లీ చెప్పారు. నూతన భారతీయ అకౌంటింగ్ ప్రమాణాల(ఇండ్ ఏఎస్)ను 2015-16 నుంచి స్వచ్ఛందంగా, 2016-17 నుంచి తప్పనిసరిగా పాటించాల్సిందేనని అన్నారు. బ్యాంకులు, బీమా కంపెనీలతో సహా ద్రవ్య సేవల రంగంలోని సంస్థలకు గడువును ఆయా రంగాల రెగ్యులేటర్లు ప్రకటిస్తారని చెప్పారు.