న్యూఢిల్లీ: దాదాపు ఏడేళ్లుగా భారత ప్రభుత్వంతో నెలకొన్న రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ వివాదానికి ముగింపు పలికే దిశగా బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్ ఎనర్జీ చర్యలు తీసుకుంది. కేంద్రంతో కుదుర్చుకున్న సెటిల్మెట్ ఒప్పందం ప్రకారం.. అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తదితర దేశాల కోర్టుల్లో భారత్‌పై వేసిన దావాలన్నింటినీ ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి కేసులను ఉపసంహరించుకున్న వివరాలతో కేంద్రానికి ఫారం 3ని సమర్పించనున్నట్లు కెయిర్న్ ఎనర్జీ (ప్రస్తుతం క్యాప్రికార్న్ ఎనర్జీ) తెలిపింది. ఆ తర్వాత ట్యాక్స్‌ల రిఫండ్ కోసం ప్రభుత్వం ఫారం 4 జారీ చేస్తుందని పేర్కొంది. దీంతో రూ. 7,900 కోట్ల పన్ను మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రిఫండ్ పొందేందుకు కంపెనీకి మార్గం సుగమం అయ్యింది.
ఇదీ నేపథ్యం
2006–07లో భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే ముందు వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ గణనీయంగా క్యాపిటల్ గెయిన్స్ పొందిందన్నది ఆదాయ పన్ను శాఖ ఆరోపణ. లావాదేవీలు జరిగి చాలాకాలం గడిచినప్పటికీ వాటికి కూడా పన్నులను వర్తింపచేసే విధంగా (రెట్రాస్పెక్టివ్) 2012లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ప్రయోగించి రూ. 10,247 కోట్ల మేర పన్నులు కట్టాలంటూ కెయిర్న్‌కు నోటీసులు పంపించింది. దీనిపై కెయిర్న్.. ఆర్పిట్రేషన్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించగా కంపెనీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. అంతర్జాతీయంగా పరువు పోతుండటంతో గతేడాది ఆగస్టులో వివాదాస్పద రెట్రాస్పెక్టివ్ చట్టాన్ని కేంద్రం పక్కన పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment