న్యూఢిల్లీ: ఇంధన రంగ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను శాఖ రూ. 10,247 కోట్ల పన్నుల నోటీసులు జారీ చేయడం.. బ్రిటన్‌లో పర్యటించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సంకటంగా మారనుంది. శుక్రవారం లండన్‌లో ఆయన విదేశీ ఇన్వెస్టర్లతో భేటీ కానున్నారు. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ (గత డీల్స్‌ను తిరగదోడి పన్నులు విధించడం)పై తమ ప్రభుత్వ విధానాన్ని ఈ సమావేశంలో ఆయన వివరించనున్నారు.
ఈలోగా కెయిర్న్ ఎనర్జీకి నోటీసులివ్వడంతో ఇన్వెస్టర్ల నుంచి ఆయన ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కొనాల్సి రావొచ్చని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. జైట్లీ మూడు రోజుల పాటు బ్రిటన్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. మరోవైపు, నిబంధనల ప్రకారమే కెయిర్న్ ఎనర్జీకి నోటీసులు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
నిబద్ధత చేతల్లోనూ చూపాలి: బ్రిటన్
భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి హామండ్ గురువారం జైట్లీతో సమావేశంలో కెయిర్న్ ఎనర్జీకి నోటీసుల అంశాన్ని చర్చించారు. నోటీసులు గత ప్రభుత్వ హయాంనకు సంబంధించినవని, ఇకపై కొత్తవి ఉండబోవని జైట్లీ హామీ ఇచ్చినట్లు హామండ్ విలేకరులకు తెలిపారు. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించడమన్నదిమాటలకే పరిమితం చేయకుండా భారత్ ఆచరణలో కూడా చూపించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో పర్యటించబోతున్న జైట్లీ ఇదే విషయంపై అక్కడి ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించాల్సి ఉంటుందన్నారు.
భారీ సంస్కరణల ఆశలు సరికావు: అరవింద్ సుబ్రమణియన్
కాగా భారత్‌వంటి భారీ ప్రజాస్వామ్య దేశాల్లో భారీ సంస్కరణల అంచనాలు పెట్టుకోవడం సముచితం కాదని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు. భారత్‌లో అధికార కేంద్రాలు అనేకం ఉంటాయని, కేంద్రం తీసుకునే నిర్ణయాలను రాష్ట్రాలు, ప్రభుత్వ సంస్థలు కూడా తిరస్కరించవచ్చని పేర్కొన్నారు. వాషింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌లో ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు.
‘కెయిర్న్’ ట్యాక్స్ వివాదం.. జైట్లీకి సంకటం
Published Fri, Mar 13 2015 1:32 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement