ఆందోళనలు అక్కర్లేదని అమెరికా ఇన్వెస్టర్లకు జైట్లీ హామీ
న్యూయార్క్ : పాత లావాదేవీలపై పన్నులు విధించడానికి (రెట్రాస్పెక్టివ్ పన్ను) సంబంధించిన నిర్ణయాలు, ఆయా నిర్ణయాలు ఇన్వెస్టర్లపై కొత్త భారాలను మోపడం ఎంతమాత్రం ఆమోదనీయంకాదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆందోళన అక్కర్లేదని మంత్రి అమెరికా వ్యాపార వర్గాలు, ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. ఏవో కొన్ని అసాధారణ అంశాలను మినహాయిస్తే.. రెట్రాస్పెక్టివ్ పన్ను భారాలు ఎంతమాత్రం ఆమోదనీయం కాదన్నది తన అభిప్రాయమని అన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలు ‘రెట్రాస్పెక్టివ్’ పన్నుల గురించి తమ ఆందోళనలను జైట్లీ ముందు ప్రస్తావించినప్పుడు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.
మౌలికంపై...
మౌలిక రంగంపై అడిగిన ఒక ప్రశ్నకు జైట్లీ సమాధానం చెబుతూ, ఈ రంగంలో కేంద్రం భారీ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిందని అన్నారు. ఈ రంగం పురోభివృద్ధే లక్ష్యంగా పలు కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. పెట్రోల్,డీజిల్‌పై పన్నుల పెంపు ఇందుకు సంబంధించి వనరుల సమీకరణలో ఒకటని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల వల్ల రెండేళ్లక్రితం పూర్తిగా నిలిచిపోయిన ఈ రంగం, తిరిగి పునరుత్తేజం పొందిందని అన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.
వ్యవసాయంలో సంస్కరణలు...
కాగా వ్యవసాయ రంగంపై తక్కువమంది ఆధారపడే విధంగా.. ఈ రంగంలో సంస్కరణలు తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ రంగంలో అదనంగా ఉన్న వారికి వేరొక రంగాల్లో ఉపాధి కల్పించడం ద్వారా ఈ దిశలో పురోగమించాలన్నది కేంద్రం వ్యూహమన్నారు. వ్యవసాయ రంగంపై అధిక జనాభా ఆధారపడ్డం వల్ల జీవన ప్రమాణాల మెరుగుదల విషయంలో ఒత్తిడి నెలకొన్న పరిస్థితి కొనసాగుతుందని వివరించారు.
ఆయా అంశాల్లో పురోగతి లక్ష్యంగా తీసుకువచ్చిందే... ‘తాజా భూ సేకరణ సవరణ బిల్లు’ అన్నారు. దీనిపై దేశంలో ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతున్న విషయాన్నీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2013 లాండ్ లా గ్రామీణ రంగానికి ఎంతమాత్రం స్నేహపూర్వకమైనది కాదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను. గ్రామీణ రహదారులు, విద్యుత్ వ్యవస్థల అభివృద్ధి లక్ష్యాన్ని ఇది పూర్తిగా విస్మరించిందని తెలిపారు.
‘పాత’ లావాదేవీలపై ‘కొత్త’ పన్ను కూడదు
Published Sat, Jun 20 2015 2:00 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement