నెల కనిష్టానికి సెన్సెక్స్
- ప్రభావం చూపుతున్న బలహీనమైన ఫలితాలు
- కీలక 8,400 పాయింట్ల దిగువకు నిఫ్టీ
- 210 పాయింట్ల నష్టంతో 27,676కు సెన్సెక్స్
- 70 పాయింట్ల నష్టంతో 8,378కు నిఫ్టీ
స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లో నష్టాల్లోనే ముగిసింది. సూచీలు నాలుగు వారాల కనిష్టస్థాయికి పడిపోయాయి.
రెట్రాస్పెక్టివ్ పన్ను ఆందోళనలు, నిరాశమయంగా ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు, రూపాయి బలహీనత.. ఈ అంశాలన్నీ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 210 పాయింట్లు నష్టపోయి 27,676 పాయింట్లకు, నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 8,378 పాయింట్లకు పతనమయ్యాయి.
ఫలితాలే కీలకం... బీఎస్‌ఈ సెన్సెక్స్ నష్టాల్లో ప్రారంభమైంది. కొన్ని షేర్లు తక్కువ ధరల్లో లభ్యమవుతుండటంతో ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో మధ్యాహ్నం కల్లా సెన్సెక్స్ రికవరీ అయి 27,977 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ట్రేడింగ్ చివరలో అమ్మకాల జోరు పెరగడంతో 27,598 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 210 పాయింట్ల నష్టంతో 27,676 వద్ద ముగిసింది. మార్చి 27 తర్వాత ఇదే కనిష్ట స్థాయి.
ఇక నిఫ్టీ 8,469-8,353 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి 70 పాయింట్లు నష్టపోయి 8,378 వద్ద మగిసింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1.370 పాయింట్లు నష్టపోయింది.సమీప భవిష్యత్తులో కంపెనీల ఆర్థిక ఫలితాలే బాగా ప్రభావం చూపుతాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు.
ఎన్‌ఎస్‌ఈలో రికార్డ్ టర్నోవర్
ఎన్‌ఎస్‌ఈలో మంగళవారం రికార్డ్ స్థాయి టర్నోవర్(రూ.41,165 కోట్లు) నమోదైంది. రూ.20 కోట్ల సన్ ఫార్మా షేర్ల బల్క్ డీల్ కారణంగా ఈ స్థాయి టర్నోవర్ సాధ్యమైందని ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. గత రికార్డ్ 2009 మే19న నమోదైం ది. ఆ రోజు రూ.40,150.91 కోట్ల టర్నోవర్ నమోదైంది.