
Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు కౌంటర్లలో విస్తృత స్థాయి అమ్మకాలతో వరుసగా మూడో సెషన్ లో తీవ్ర నష్టాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2226.79 పాయింట్లు (2.95 శాతం) క్షీణించి 73,137.90 వద్ద ముగిసింది.
నిఫ్టీ 50 కూడా 742.85 పాయింట్లు (3.24 శాతం) నష్టంతో 22,161.60 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ లోని మొత్తం 30 షేర్లు నష్టాల్లోనే స్థిరపడగా టాటా స్టీల్ అత్యధికంగా 7.16 శాతం నష్టపోయింది. ఒక్క రోజులో మార్కెట్ పతనం గత పది నెలల్లో ఇదే అత్యధికం. బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.403 లక్షల కోట్ల నుంచి రూ.389 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో మదుపరుల సంపద ఒక్క రోజులో రూ.14 లక్షల కోట్లు ఆవిరైంది.
వృద్ధిపై పెరుగుతున్న ఆందోళనలు, అమెరికా సుంకాల పతనం మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. ఇది ప్రస్తుత రిస్క్-ఆఫ్ సెంటిమెంట్‌ను మరింత తీవ్రతరం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటనలు, వాటికి ప్రతిగా చైనా తీసుకున్న ప్రతీకార చర్యలే ఇందుకు కారణమయ్యాయి.
అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల విధింపుతో గ్లోబల్ స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి , మాంద్యం భయాలు,అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భీష్మించుకున్నారు.

ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో సైతం అమ్మకాలకు తెరలేచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020 తరువాత గత వారం యూఎస్ మార్కెట్లు 6 శాతం పడిపోయాయి. 5 లక్షల కోట్ల డాలర్లకుపైగా మార్కెట్ విలువ ఆవిరైంది. ఈ వారం దేశీ మార్కెట్లు పతన బాటలో సాగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
కాగా.. వచ్చే గురువారం (ఏప్రిల్ 10) మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ట్రేడింగ్ ఈవారం 4 రోజులకే పరిమితంకానుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)