
పసిడి డిమాండ్ 15% డౌన్
మార్చి త్రైమాసికంలో 118 టన్నులు నమోదు
విలువ పరంగా 22 శాతం అప్..
ఈ ఏడాది 700–880 టన్నుల డిమాండ్
ప్రపంచ స్వర్ణ మండలి అంచనా
బంగారం డిమాండ్ ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (మార్చి త్రైమాసికం) 15 శాతం తగ్గి 118.1 టన్నులుగా ఉంది. విలువ పరంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మాత్రం 22 శాతం వృద్ధితో రూ.94,030 కోట్లుగా నమోదైంది. ఈ వివరాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసింది. 2025-26లో భారత్ నుంచి పసిడి డిమాండ్ 700–800 టన్నుల మేర ఉండొచ్చని అంచనా వేసింది.
‘ధరలు పెరగడంతో కొనుగోలు శక్తిపై ప్రభావం పడింది. అయినప్పటికీ సాంస్కృతికంగా ఉన్న ప్రాధాన్యం.. అక్షయ తృతీయకుతోడు వివాహాల సీజన్ కావడంతో కొనుగోళ్లకు డిమాండ్ కొనసాగుతోంది’ అని డబ్ల్యూజీసీ ఇండియా సీఈవో సచిన్ జైన్ మార్చి త్రైమాసిక నివేదికలో తెలిపారు. ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో వినియోగదారులు లైట్ వెయిట్ ఆభరణాల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు జ్యుయలర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మే చివరి వరకు వివాహాలు ఉండడం, భారతీయ సంస్కృతిలో బంగారం ఆభరణాలకు ఉన్న ప్రాధాన్యంతో కొనుగోళ్లకు డిమాండ్ కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు.
పసిడిపై జోరుగా పెట్టుబడులు
ఇక ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో బంగారంపై పెట్టుబడులకు డిమాండ్ కొనసాగింది. క్రితం ఏడాది మొదటి మూడు నెలలతో పోల్చి చూస్తే 7 శాతం అధికంగా 46.7 టన్నులుగా నమోదైంది. క్రితం ఏడాది మొదటి త్రైమాసికంలో పసిడి పెట్టుబడుల డిమాండ్ 43.6 టన్నులుగా ఉంది. అంతర్జాతీయంగా భౌగోళిక, వాణిజ్య ఉద్రిక్తతలతో ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లను చూస్తున్న తరుణంలో.. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత సాధనంగా బంగారాన్ని పరిగణిస్తుండడం ఇందుకు నేపథ్యంగా ఉంది.
ఆభరణాల డిమాండ్‌లోనూ క్షీణతే..
ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో బంగారం ఆభరణాల డిమాండ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 25 శాతం తగ్గి 71.4 టన్నులుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 95.5 టన్నులుగా ఉంది. 2020 నుంచి చూస్తే ఒక ఏడాది మొదటి త్రైమాసికంలో కనిష్ట ఆభరణాల డిమాండ్ ఇదే కావడం గమనార్హం. క్రితం ఏడాది మొదటి క్వార్టర్‌తో పోలిస్తే ఆభరణాల కొనుగోళ్ల విలువ 3 శాతం పెరిగింది.
ఇదీ చదవండి: మంచి తరుణం మించి పోరాదు! పసిడి తులం ఎంతంటే..
పెరిగిన దిగుమతులు
పసిడి దిగుమతులు 8 శాతం పెరిగి 167.4 టన్నులుగా ఉన్నాయి. రీసైక్లింగ్ పరిమాణం 32 శాతం తగ్గి 26 టన్నులుగా నమోదైంది. అధిక ధరల నేపథ్యంలో వినియోగదారులు పాత ఆభరణాలను తమవద్ద ఉంచుకునేందుకు మొగ్గు చూపించడం ఇందుకు కారణం. ఇక అంతర్జాతీయంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ ఒక శాతం పెరిగి 1,206 టన్నులుగా ఉంది.