gold demand
-
పదేళ్లలో ఇదే ప్రచండ బంగారం! కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందా?
ఈ ఏడాది ఇప్పటివరకు 30 శాతానికి పైగా పెరిగిన బంగారం ధరలు భారతీయ మార్కెట్లలో గ్రాముకు రూ. 7,300కి చేరుకున్నాయి. ఒక క్యాలెండర్ ఇయర్లో ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే గడిచిన 10 సంవత్సరాలలో ఈ ఏడాది పెరుగుదలే అత్యధిక కానుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక వెల్లడించింది.అయితే ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ స్థాయి పరుగు 2025 చివరి వరకు కొనసాగకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడానికి కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు, పెట్టుబడిదారుల కొనుగోళ్లే కారణమని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొందిడబ్ల్యూజీసీ డేటా ప్రకారం.. 2022లో చూసిన స్థాయిలతో పోలిస్తే 2024 క్యాలెండర్ ఇయర్ మూడో త్రైమాసికం నాటికి బంగారం కొనుగోలు 694 టన్నులకు చేరుకోవడంతో సెంట్రల్ బ్యాంక్ డిమాండ్ బలంగా ఉంది. 2024 అక్టోబర్ నాటికి తుర్కియే, పోలాండ్ సెంట్రల్ బ్యాంకులు వరుసగా 72 టన్నులు, 69 టన్నుల బంగారు నిల్వలను జోడించి బంగారం మార్కెట్లో ఆధిపత్యం ప్రదర్శించాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్‌లో 27 టన్నులను జోడించింది. ఈ నెల వరకు దాని మొత్తం బంగారం కొనుగోళ్లు 77 టన్నులకు చేరుకున్నాయి. అక్టోబర్ వరకు భారత్ నికర కొనుగోళ్లు దాని 2023 కార్యకలాపాలపై ఐదు రెట్లు పెరిగాయని నివేదిక పేర్కొంది.వచ్చే ఏడాది ఎలా ఉంటుంది?2025 బంగారానికి సవాలుగా ఉండే సంవత్సరంగా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అనేక ఎదురుగాలులను వారు చూస్తున్నారు. వాటిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లపై దాని ప్రభావం ఉన్నాయి. బంగారం అతిపెద్ద వినియోగదారులలో ఒకటైన చైనాలో కూడా పరిణామాలు కీలకంగా ఉన్నాయి. -
పసిడికి పెరిగిన డిమాండ్
ముంబై: దిగుమతి సుంకం తగ్గింపుతో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 248.3 టన్నులుగా నమోదైంది. ముఖ్యంగా సుంకం తగ్గింపు ఆభరణాల కొనుగోళ్లను పెంచినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ‘2024 క్యూ3 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదిక తెలిపింది. ‘‘బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరడంతో.. ధరలు తగ్గే వరకు కొనుగోళ్ల కోసం ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించొచ్చు. దీంతో పూర్తి ఏడాదికి (2024) బంగారం డిమాండ్ 700–750 టన్నుల మేర ఉంటుంది. గతేడాదితో పోలి్చతే కొంత తక్కువ. 2024 చివరి త్రైమాసికంలో ధనత్రయోదశి, వివాహాల సీజన్ మొత్తం మీద బంగారం డిమాండ్‌కు ఊతంగా నిలుస్తాయి’’అని ఈ నివేదిక తెలిపింది. 2023లో బంగారం డిమాండ్ 761 టన్నులుగా ఉంది. ధనత్రయోదశి సందర్భంగా డిమాండ్ పెరగడంతో మంగళవారం ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములకు రూ.300 పెరిగి రూ.81,400కు చేరడం గమనార్హం. ఇక విలువ పరంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం డిమాండ్ 53 శాతం పెరిగి రూ.1,65,380 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.1,07,700 కోట్లుగా ఉంది. బంగారం, వెండి దిగుమతులపై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి బడ్జెట్లో తగ్గించడం తెలిసిందే. బంగారం దిగుమతులు 22% జంప్ పస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు జోరుగా సాగుతున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో 22 శాతం అధికంగా 27 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బంగారం దిగుమతులు 22 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత పండుగల సీజన్ దిగుమతులు పెరగడానికి కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అత్యధికంగా స్విట్జర్లాండ్ 40 శాతం మేర మన దేశానికి బంగారం ఎగుమతి చేయగా, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా ఆక్రమించాయి. దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం దిగుమతుల వాటా 5 శాతంగా ఉంటుంది. బంగారం దిగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) మొదటి ఆరు నెలల్లో (సెప్టెంబర్ చివరికి) 137.44 బిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వాణిజ్య లోటు 119.24 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనించొచ్చు. బంగారానికి చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద వినియోగదారుగా భారత్ ఉంటోంది. వెండి దిగుమతులు సైతం 376 శాతం పెరిగి 2.3 బిలియన్ డాలర్లుగా ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి నమోదయ్యాయి. కరెంటు ఖాతా లోటు ఒక శాతం ఎగసి 9.7 బిలియన్ డాలర్లకు చేరింది. -
బంగారం డిమాండ్ తగ్గుతుందా.. పెరుగుతుందా?
ముంబై: పసిడి ధరల తీవ్రత నేపథ్యంలో.. వినియోగదారుల కొనుగోళ్లు ఎలా ఉంటాయన్న అంశంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆ అభిప్రాయాలు క్లుప్తంగా...డిమాండ్ పడిపోవచ్చు కస్టమ్స్ సుంకాలు తగ్గినప్పటికీ అటు అంతర్జాతీయ ఇటు దేశీయ పరిణామాలతో పసిడి ధరలు రికార్టులను సృష్టిస్తున్నాయి. దీపావళికి ముందు చోటుచేసుకుంటున్న ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ధన్‌తేరస్‌లో డిమాండ్, కొనుగోళ్ల పరిమాణాలు తగ్గుతాయని భావిస్తున్నాం. గత ధన్‌తేరాస్‌తో పోల్చితే కొనుగోళ్ల పరిమాణం కనీసం 10 నుంచి 12 శాతం తగ్గుతుందని అంచనా. అయితే పెరిగిన ధరల వల్ల విలువలో కొనుగోళ్లు 12 నుంచి 15 శాతం పెరగవచ్చు. – సువంకర్ సేన్, సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ, సీఈఎఓగత ఏడాదికి సమానంగా బిజినెస్ధరలు పెరుగుతున్నప్పటికీ మేము మంచి వ్యాపారాన్ని ఆశిస్తున్నాము. ధన్తేరస్ తర్వాత 40 లక్షలకు పైగా వివాహాలు జరుగుతున్నందున అమ్మకాలు గత సంవత్సరం మాదిరిగానే ఉండవచ్చని మేము ఆశిస్తున్నాము. ధన్తేరస్ నాడు అమ్మకాల పరిమాణం 20 నుంచి 22 టన్నులు ఉండవచ్చు. ఇది గత ఏడాదికి దాదాపు సమానం. – సయం మెహ్రా, ఆల్ ఇండియా జీజేసీ చైర్మన్ఆశాజనంగానే ఉన్నాం... రెండో త్రైమాసికంలో బులియన్ మార్కెట్ పటిష్టంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో పండుగల సమయంలో అమ్మకాలపై మేము ఆశాజనకంగా ఉన్నాము. పండుగలకు ప్రీ–బుక్ ఆర్డర్లు కూడా బాగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా సానుకూల సెంటిమెంట్ ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది. అకస్మాత్తుగా ధర పెరిగితే వినియోగదారులు కొంత విరామం తీసుకునే మాట వాస్తవమే. అయితే ఈ రోజుల్లో వినియోగదారులు తమ బడ్జెట్ మేరకు కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. కాబట్టి మేము ఈ దశలో ‘కొనుగోళ్ల పరిమాణం’ గురించి ఇప్పుడు మాట్లాడము. – టీఎస్ కళ్యాణరామన్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఎండీపెళ్లిళ్ల సీజన్‌తో డిమాండ్ పదిలం బంగారం ధరలు రికార్డు స్థాయిలను తాకినప్పటికీ కొనుగోళ్ల విషయంలో పరిశ్రమ నుండి వచ్చిన సమాచారం సానుకూలంగానే ఉంది. కొనసాగుతున్న పండుగల కారణంగా బంగారం కొనుగోళ్ల డిమాండ్ పటిష్టంగా ఉండే వీలుంది. పెట్టుబడి సెంటిమెంట్, వివాహ సంబంధిత కొనుగోళ్లు పరిశ్రమకు అండగా ఉండే అవకాశాలే ఎక్కువ. వ్యవసాయ పరిస్థితుల మెరుగుదల, ఆదాయాలు పెరగడం, ఎకానమీ, వినియోగం పటిష్టత వంటి అంశాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పసిడికి డిమాండ్ ఉటుంది. – సచిన్ జైన్, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ -
World Gold Council 2023: పడినా... పసిడిది పైచేయే..!
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2023లో 3 శాతం క్షీణించి 747.5 టన్నులకు చేరుకుంది. అయితే ధరలు తగ్గుముఖం పట్టి, అస్థిర పరిస్థితులు తొలగిపోయిన పక్షంలో డిమాండ్ రానున్న కాలంలో 800–900 టన్నుల మధ్య ఉండవచ్చు. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన 2023 ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. 2022లో భారత్ మొత్తం పసిడి డిమాండ్ 774.1 టన్నులు. నివేదికలోని కొన్ని అంశాలను పరిశీలిస్తే... ► పెరుగుతున్న బంగారం ధరలకు తోడు ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు 2023 డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. కొనుగోళ్లపట్ల వినియోగదారుల ఆసక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, వాణిజ్య సెంటిమెంట్ బలహీనంగా ఉంది. 2023 మే 4వ తేదీన దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర కొత్త గరిష్టం రూ.61,845కు చేరింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఔన్స్ 2,083 డాలర్లకు ఎగసింది. ఇక దేశీయ మార్కెట్లో ధర నవంబర్ 16న మరో కొత్త గరిష్టం రూ.61,914కు చేరింది. ► 2019 నుండి బంగారం డిమాండ్ 700–800 టన్నుల శ్రేణిలోనే ఉంటోంది. తగ్గిన డిమాండ్, నిరంతర ధరలు అలాగే సుంకాల పెరుగుదల, స్టాక్ మార్కెట్ పనితీరు, సమీప కాల ఎన్నికల ఖర్చు ప్రభావం దీనికి కారణం. అయితే భవిష్యత్తులో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ధరలు అధిక స్థాయిలోనే ఉంటాయన్న విషయాన్ని మార్కెట్ జీరి్ణంచుకుంటుండడం ఈ సానుకూల అంచనాలకు కారణం. ► ఇక మొత్తం ఆభరణాల డిమాండ్ 6 శాతం తగ్గి 562.3 టన్నులకు పడింది. 2022లో ఈ పరిమాణం 600.6 టన్నులు. ► పెట్టుబడుల డిమాండ్ మాత్రం 7 శాతం పెరిగి 173.6 టన్నుల నుంచి 185.2 టన్నులకు ఎగసింది. దిగుమతులు 20 శాతం అప్ కాగా మొత్తం పసిడి దిగుమతులు 2023లో 20 శాతం పెరిగి 650.7 టన్నుల నుంచి 780.7 టన్నులకు ఎగశాయి. 2024లో డిమాండ్‌కన్నా పసిడి దిగుమతులు అధికంగా ఉండే అవకాశం ఉందని అవుట్‌లుక్ ఆవిష్కరణ సందర్భంగా డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (ఇండియా) పీఆర్ సోమశేఖర్ పేర్కొన్నారు. భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) దీనికి కారణం అవుతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–డిసెంబర్ మధ్యకాలంలో 26.7 శాతం పెరిగి 35.95 బిలియన్ డాలర్లకు పసిడి దిగుమతులు చేరుకున్నట్లు నివేదిక వివరించింది. భారీ డిమాండ్ దీనికి కారణం. ప్రపంచ డిమాండ్ కూడా 5 శాతం డౌన్ ఇదిలావుండగా, 2023లో ప్రపంచ పసిడి డిమాండ్ 5 శాతం తగ్గి 4,448.4 టన్నులకు పడినట్లు నివేదిక పేర్కొంది. ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) భారీ ఉపసంహరణలు దీనికి కారణం. నివేదిక ప్రకారం ఇలాంటి పరిస్థితి వరుసగా ఇది మూడవ సంవత్సరం. ఈటీఎఫ్‌ల ఉపసంహరణల పరిమాణం 2022లో 109.5 టన్నులు. అయితే 2023లో ఈ పరిమాణం ఏకంగా 244.4 టన్నులకు ఎగసింది. కాగా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు 2022లో 1,082 టన్నులు అయితే 2023లో ఈ పరిమాణం 45 టన్నులు తగ్గి 1,037 టన్నులకు పడింది. అయితే సెంట్రల్ బ్యాంకుల అత్యధిక కొనుగోళ్లకు సంబంధించి ఈ రెండు సంవత్సరాలూ రికార్డుగా నిలిచాయి. ఇక భారత్ రిజర్వ్ బ్యాంక్ తన పసిడి నిల్వలను 2022లో 32 టన్నులు పెంచుకుంటే, 2023లో 16.2 టన్నులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారత్ దాదాపు 600 బిలియన్ డాలర్లకుపైగా విదేశీ మారకపు ద్రవ్య నిల్వల్లో పసిడి వాటా 48 బిలియన్ డాలర్లు. -
బంగారానికి భారీగా పెరిగిన డిమాండ్.. ధరల తగ్గుముఖం, పండుగలతో ఊపు!
న్యూఢిల్లీ: భారత్ పసిడి డిమాండ్ 2023 క్యాలెండర్ ఇయర్ మూడవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 10 శాతం పెరిగి 191.7 టన్నుల నుంచి 210.2 టన్నులకు ఎగసింది. పసిడి కొనుగోళ్లకు పవిత్రమైనదిగా భావించే ధన్‌తేరాస్ కొనుగోళ్లు భారీగా జరుగుతాయన్న విశ్వాసాన్ని పరిశ్రమ వ్యక్తం చేస్తోంది. ధరలు కొంత తగ్గడం, పండుగల డిమాండ్ దీనికి కారణం. చైనా తర్వాత పసిడి కొనుగోళ్లకు రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ సెప్టెంబర్ త్రైమాసికం డిమాండ్‌పై ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు.. వాణిజ్య వర్గాల అభిప్రాయం ప్రకారం, 10 గ్రాముల ధర రూ.60,000 వరకూ కొంత ఆమోదయోగ్యమైనదిగా వినియోగదారులు భావిస్తున్నారు. అంతకన్నా తక్కువ ధరలో పసిడి భారీ కొనుగోళ్లు జరగొచ్చని అంచనా. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 7 శాతం పెరిగి 146.2 టన్నుల నుంచి 155.7 టన్నులకు చేరింది. ఇదే కాలంలో కడ్డీలు, నాణేల డిమాండ్ 20 శాతం ఎగిసి 45.4 టన్నుల నుంచి 54.5 టన్నులకు ఎగసింది. కడ్డీలు, నాణేల విభాగంలో డిమాండ్ 2015 గరిష్ట స్థాయిని చూసింది. మూడవ త్రైమాసికంలో పసిడి దిగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 184.5 టన్నుల నుంచి 220 టన్నులకు ఎగసింది. తొమ్మిది నెలల్లో 481.2 టన్నుల డిమాండ్.. 2023 మొదటి 9 నెలల్లో బంగారం డిమాండ్ 481.2 టన్నులు. సంవత్సరం మొత్తంలో డిమాండ్ 700–750 టన్నులు ఉంటుందని అంచనా. 2022 డిమాండ్ 774 టన్నులతో పోల్చితే తగ్గడం గమనార్హం. అయితే దిగుమతులు మాత్రం పెరుగుతాయని అంచనా. 2022లో యల్లో మెటల్ దిగుమతులు 650.7 టన్నులు కాగా, 2023 సెప్టెంబర్ వరకూ జరిగిన దిగుమతుల విలువ 563 టన్నులు. అంతర్జాతీయంగా డిమాండ్ 6 శాతం డౌన్ ఇదిలాఉండగా, అంతర్జాతీయంగా మూడవ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 6 శాతం పడిపోయి 1,147.5 టన్నులకు చేరింది. సెంట్రల్ బ్యాంకుల నుంచి తగ్గిన కొనుగోళ్లు, కడ్డీలు, నాణేల డిమాండ్ తగ్గడం దీనికి కారణమని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది. చైనా డిమాండ్ మూడవ త్రైమాసికంలో 242.7 టన్నుల నుంచి స్వల్పంగా 247 టన్నులకు ఎగసింది. -
బంగారం ఎలా ఉన్నా బంగారమే
బంగారం అంటే ఆభరణాల రూపంలో కొనుగోలు చేయడమే ఎక్కువ మందికి తెలిసిన విషయం. కానీ, నేడు డిజిటల్ రూపంలోనూ ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. సార్వభౌమ బాండ్లు, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లు గురించి తెలిసింది తక్కువ మందికి. ఇటీవలి కాలంలో ప్రచారం కారణంగా డిజిటల్ బంగారం సాధనాల పట్ల అవగాహన పెరుగుతోంది. భౌతిక రూపంలో కంటే డిజిటల్ రూపంలో కొనుగోలు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అలా అని బంగారం ఆభరణాలు, కాయిన్లు కొనడానికి దూరంగా ఉండాలని కాదు. డిజిటల్ సాధనాలు వచి్చనప్పటికీ బంగారం ఆభరణాల రూపంలో పెద్ద మొత్తంలో విక్రయం అవుతూనే ఉంది. నిజానికి డిజిటల్‌గానూ, భౌతికంగానూ ఏ రూపంలో ఉన్నప్పటికీ పసిడికి ఉన్న డిమాండ్ ఎంతో ప్రత్యేకం. భౌతిక బంగారంతోనూ కొన్ని అనుకూలతలు ఉన్నాయి. అవేంటో తెలియజేసే కథనమే ఇది. బంగారం ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసినప్పుడు తయారీ చార్జీలు, తరుగు విధిస్తుంటారు. తయారీలో వృథాగా పోయే మొత్తాన్ని కస్టమర్ నుంచే వర్తకులు రాబడుతుంటారు. కనుక పెట్టుబడి కోసం చూసేవారు, భవిష్యత్తులో ఆభరణాల కోసమని కొంచెం, కొంచెం సమకూర్చుకునేవారు డిజిటల్ బంగారానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తుంటారు. డిజిటల్‌గా ఉంటే బంగారం భద్రంగా దాచుకునేందుకు లాకర్ల అవసరం ఉండదని చెబుతుంటారు. బంగారం తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లలో పెట్టడం ద్వారా రక్షణ పొందొచ్చు. కానీ ఏటా లాకర్ నిర్వహణ చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. డిజిటల్ రూపంలో ఉంటే కనిపించే ప్రయోజనాలు ఇవి. అలా అని భౌతిక బంగారం అవసరం లేదా? బంగారాన్ని భౌతిక రూపంలో కలిగి ఉంటే ప్రయోజనం లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అన్ని అంశాలను సమగ్రంగా తెలుసుకోవాల్సిందే. వినియోగ డిమాండ్ చారిత్రకంగా చూస్తే.. ఆభరణాల కోసం విస్తృతంగా వినియోగించడం వల్లే బంగారానికి ఈ స్థాయి విలువ సమకూరింది. అందుకే బంగారం ధరలను వినియోగం ప్రభావితం చేస్తుంటుంది. కాలక్రమేణా ఇన్వెస్టర్లు తమ సంపద విలువను కాపాడుకునే సాధనంగానూ ఇది మారిపోయింది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కాచుకునే హెడ్జింగ్ సాధనంగా అవతరించింది. పెట్టుబడుల పరంగా డిజిటల్ బంగారాన్ని ఎంతో ప్రోత్సహించినప్పటికీ, అదే సమయంలో భౌతిక రూపంలో బంగారానికి అంతకంటే డిమాండ్ ఎక్కువేనని చెప్పుకోవాలి. అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ మారకం నిల్వల్లో కొంత మొత్తాన్ని భౌతిక బంగారం రూపంలోనే నిర్వహిస్తుంటాయి. ఆరి్థక అనిశి్చతుల్లో దీన్ని రక్షణ సాధనంగా పరిగణిస్తుంటారు. అందుకే దశాబ్దాలు గడిచినా బంగారం డిమాండ్ పెరుగుతోంది. లిక్విడిటీ సాధనం పెట్టుబడి సాధనం ఏదైనా కానీయండి, అందులో లిక్విడిటీకి ప్రాధాన్యం ఇవ్వడం అన్నింటికంటే ముఖ్యమైన అంశం అవుతుంది. బంగారం విషయంలో లిక్విడిటీకి (కావాల్సినప్పుడు వెంటనే నగదుగా మార్చుకోవడం) ఢోకా ఉండదు. ఆభరణాల వర్తకుడి వద్దకు వెళ్లి సులభంగా విక్రయించుకోవచ్చు. బంగారం డిజిటల్, భౌతికం ఏ రూపంలో ఉన్నా లిక్విడిటీకి ఇబ్బంది దాదాపుగా ఉండదు. ‘‘బంగారం ఆభరణాలపై బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తుంటాయి. అవే బ్యాంకులు వజ్రాలపై రుణాలను ఇవ్వవు’’ అని ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ సురేంద్ర మెహతా తెలిపారు. భౌతిక బంగారం అయితే గంటలోపే దాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. లేదంటే పనిదినాల్లో అయితే బ్యాంక్‌కు వెళ్లి గంట, రెండు గంటల్లోనే రుణాన్ని పొందొచ్చు. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో విక్రయించిన తర్వాత సొమ్ము చేతికి అందాలంటే రెండు రోజులు పడుతుంది. సావరీన్ గోల్డ్ బాండ్లో పెట్టుబడుల కాలవ్యవధి ఎనిమిదేళ్లు. కానీ, ఐదేళ్ల తర్వాతే విక్రయించుకోవచ్చు. సెకండరీ మార్కెట్లో ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు కానీ లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు సావరీన్ గోల్డ్బాండ్పైనా రుణం ఇస్తున్నాయి. విలువ పరంగానే కాదు, భౌతిక బంగారంతో భావోద్వేగమైన బంధం కూడా ఉంటుందన్నది నిజం. ఒకవైపు పెట్టుబడికి, మరోవైపు ఆడంబర సాధనంగా వినియోగించే ఏకైక కమోడిటీ బంగారమే. భౌతిక రూపంలో బంగారా న్ని తమ గౌరవ చి హ్నంగానూ భావిస్తుంటారు. డిజిటల్ గోల్డ్‌తో ఇది రాదు. ఆదుకునే సాధనం ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు బంగారం ఆదుకునే సాధనంగా పూర్వ కాలం నుంచి గుర్తింపు ఉంది. కరోనా వంటి విపత్తులు ఎదురైనప్పుడు చాలా మందిని ఈ బంగారమే ఆదుకుందని మెహతా పేర్కొన్నారు. బంగారాన్ని బులియన్ రూపంలో (ఆభరణం కాకుండా) కలిగి ఉంటే అప్పుడు తయారీ చార్జీల రూపంలో నష్టపోయేదేమీ ఉండదు. అవసరమైనప్పుడు బులియన్ గోల్డ్‌ను ఆభరణాలుగా మార్చుకోవచ్చు. అలా సమకూర్చుకున్న బులియన్ గోల్డ్, బంగారం కాయిన్లను భవిష్యత్తులో వివాహ సమయాల్లో ఆభరణాల కోసం వినియోగించుకోవచ్చు. భౌతిక బంగారానికి ఉన్న ఒకే ఒక రిస్క్ భద్రత. అందుకని భద్రత కోసం బ్యాంక్ లాకర్‌ను ఆశ్రయించొచ్చు. లేదంటే ఇంట్లోనే ఆభరణాలను ఉంచుకునేట్టు అయితే, హోమ్ ఇన్సూరెన్స్ తీసుకుని వాటికి రక్షణ కలి్పంచుకోవాలి. బ్యాంక్ లాకర్‌కు వార్షిక నిర్వహణ చార్జీలు, హోమ్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం రూపంలో కొంత వ్యయం చేయాల్సి వస్తుంది. కాకపోతే ఈ చార్జీలు మరీ అంత ఎక్కువా? అన్నది ఒక్కసారి సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఇతర రూపాల్లోని బంగారంలోనూ కొంత వ్యయాలు ఉంటుంటాయి. ‘‘డిజిటల్ గోల్డ్ రూపంలోనూ చార్జీలు ఉంటాయి. కనుక ఇక్కడ చార్జీలనేవి ప్రధాన అంశం కాబోదు. కాకపోతే, భౌతిక రూపంలోని బంగారాన్ని నిల్వ చేసుకోవడంలోనే సమస్యలు. కానీ, చాలా మందికి భౌతిక బంగారం సౌకర్యాన్నిస్తుంది. ఇది డిజిటల్ గోల్డ్ వల్ల రాదు’’అని మై వెల్త్ గ్రోత్ సంస్థ వ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా పేర్కొన్నారు. అన్ని ముఖ్య వేడుకలు, శుభ కార్యక్రమాలకు బంగారం ఆభరణాలను ధరించడాన్ని చాలా మంది గొప్పగా భావిస్తుంటారు. ప్రియమైన వారిని సంతోష పెట్టేందుకు బంగారం మించిన సాధనం లేదన్నది మెహతా అభిప్రాయం. డిజిటల్, వర్చువల్ రూపంలోని బంగారంతో అంత సంతోషం రాదు. కనుక బ్యాంక్ లాకర్ లేదా బీమా ప్రీమి యం అనేది పెద్ద అంశం కాబోదని చేతన్ వాలా అభిప్రాయపడ్డారు. ‘‘అత్యవసర పరిస్థితులు ఏర్పడితే భౌతిక రూపంలోని బంగారాన్ని వెంటనే విక్రయించుకోవచ్చు. కాయిన్ లేదా ఆభరణం ఏ రూపంలో ఉందన్నది కీలకం అవుతుంది. ఆభరణాల రూపంలో అయితే జ్యుయలర్ కొంత మొత్తాన్ని చార్జీల రూపంలో మినహాయించుకోవచ్చు. డిజిటల్ గోల్డ్‌ను సైతం వెంటనే మానిటైజ్ (నగదుగా మార్చుకోవడం) చేసుకోవచ్చు. ఎక్సే్ఛంజ్‌లో విక్రయించినప్పుడు ఆ మొత్తం బ్యాంక్ ఖాతాకు వచ్చి జమ అవుతుంది’’అని చేతన్ వాలా వివరించారు. ఎంత.. ఏ రూపంలో..? డిజిటల్, భౌతిక బంగారం రెండింటిలోనూ అనుకూలతలు, ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. ఆభరణాలు, కాయిన్లు, అలాగే డిజిటల్ గోల్డ్ సాధనాల రూపంలో పెట్టుబడులు కలిగి ఉండాలన్నది కొందరు నిపుణుల ఇచ్చే సూచన. ఒక వ్యక్తి తన మొత్తం పెట్టుబడుల్లో 5–15 శాతం మధ్య పసిడికి కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు పోర్ట్‌ఫోలియోలో 10 శాతాన్ని బంగారానికి కేటాయించారని అనుకుందాం. ఇప్పుడు ఈ 10 శాతంలో కొంత డిజిటల్ గోల్డ్, కొంత భౌతిక బంగారం రూపంలో ఉండాలి. భౌతికంగా అంటే ఆభరణాలా లేక కాయిన్లా? అన్నది తమ వ్యక్తిగత అవసరాలు, అభిరుచుల ఆధారంగానే నిర్ణయించుకోవాలి. ఆభరణాల రూపంలో అయితే అవసరమైన వాటికే పరిమితం కావాలి. మిగిలినది కాయిన్లు, బార్ల రూపంలో కలిగి ఉండాలి. దీనివల్ల తయారీ, తరుగు చార్జీలను ఆదా చేసుకోవచ్చు. భవిష్యత్తులో పిల్లల వివాహాల కోసం భౌతిక రూపంలోనే పసిడిని పోగేసుకునే వారు ఆభరణాలకు బదులు కాయిన్లు కొనుగోలు చేసుకోవడం నయం. ఎందుకంటే ఆభరణాల రూపంలో కొనుగోలు చేసినా, భవిష్యత్తులో వాటిని మళ్లీ కొత్త ఆభరణాల కోసం మార్చుకోవాల్సి వస్తుంది. కనుక భవిష్యత్తులో అదే రూపంలో వినియోగించనప్పుడు ఆభరణాలు తీసుకోవడం సరికాదు. అంతేకాదు భవిష్యత్తు కోసం లేదంటే అత్యవసరాల్లో ఆదుకుంటుందన్న ఉద్దేశంతో బంగారాన్ని సమకూర్చుకునే వారు ఆభరణాల రూపంలో కాకుండా వేరే మార్గాన్ని పరిశీలించాలి. ఎందుకంటే అవసరం వచి్చనప్పుడు విక్రయించేట్టు అయితే వర్తకులు ఆ ఆభరణాల నుంచి కొంత మొత్తాన్ని చార్జీల పేరుతో మినహాయించుకుంటారు. రోజువారీ ధరించేవి, పెళ్లిళ్లు, ముఖ్య వేడుకల సందర్భంగా ధరించేవి, ఇతరులకు బహుమానంగా ఇచ్చేవి మినహా మిగిలినదంతా డిజిటల్ సాధనాల రూపంలో తీసుకోవడాన్ని పరిశీలించాలి. పెట్టుబడి దృష్ట్యా డిజిటల్ సాధనాలు మెరుగైనవి. ఎందుకంటే వీటి క్రయ, విక్రయాలు చాలా సులభంగా, వేగంగా చేసుకోవచ్చు. డిజిటల్ గోల్డ్‌ను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ప్రతీ నెలా కొనుగోలు చేసుకుంటూ, అలా సమకూరిన పసడిని అవసరమైనప్పుడు ఆభరణాలుగా మార్చుకోవచ్చు. కొందరు అయితే ప్రతీ నెలా తమకు తోచినంత కాయిన్ల రూపంలో సమకూర్చుకుని, అవసరమైనప్పుడు వాటిని ఆభరణాలుగా మార్చుకుంటుంటారు. కనుక ప్రతి ఒక్కరూ తమ పోర్ట్‌ఫోలియోలో డిజిటల్, భౌతిక బంగారానికి చోటు కలి్పంచుకోవడం సరైనదేనన్నది నిపుణుల సూచన. డిజిటల్ సాధనాల్లో సావరీన్ గోల్డ్ బాండ్లో ఎలాంటి వ్యయాలు, ఖర్చులు ఉండవు. పైగా బంగారం పెట్టుబడి విలువపై ఎనిదేళ్ల పాటు ఏటా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. డిజిటల్‌గా ఇది మెరుగైన సాధనం. -
బంగారాన్ని కొనడమే మానేశారు.. అందుకు ఇదే కారణం!
న్యూఢిల్లీ: భారత్ పసిడి డిమాండ్‌పై ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రికార్డు స్థాయి ధరల ప్రతికూల ప్రభావం పడింది. సమీక్షా కాలంలో దేశ పసిడి డిమాండ్ 7 శాతంపైగా పతనమై(2022 ఇదే కాలంతో పోల్చి) 158.1 టన్నులకు తగ్గినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. పసిడికి సంబంధించి భారత్ రెండవ అతిపెద్ద వినియోగ దేశంగా ఉన్న సంగతి తెలిసిందే. డిమాండ్ తగ్గినప్పటికీ, దిగుమతులు మాత్రం 16 శాతం పెరిగి 209 టన్నులుగా నమోదయినట్లు మండలి పేర్కొంది. 2023 మొదటి ఆరు నెలలూ చూస్తే, భారత్ పసిడి డిమాండ్ 271 టన్నులు. క్యాలెండర్ ఇయర్లో 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉంటుందని అంచనా. మండలి భారత్ ప్రాంతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సోమసుందరం పీఆర్ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే.. ► సమీక్షాకాలంలో 10 గ్రాముల పసిడి ధర భారీగా రూ.64,000కు చేరింది. పన్నుల ప్రభావం కూడా దీనికి తోడయ్యింది. వెరసి డిమాండ్ భారీగా పడిపోయింది. ► డిమాండ్ 7 శాతం పతనం ఎలా అంటే... 2022 ఏప్రిల్–జూన్ మధ్య దేశ పసిడి డిమాండ్ 170.7 టన్నులు. 2023 ఇదే కాలంలో ఈ పరిమాణం 158.1 టన్నులకు పడిపోయింది. ► ధరల పెరుగుదల వల్ల విలువల్లో చూస్తే మాత్రం క్యూ2లో పసిడి డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య పసిడి దిగుమతుల విలువ రూ.79,270 కోట్లయితే, 2023 ఇదే కాలంలో ఈ విలువ రూ.82,530 కోట్లకు చేరింది. ► ఒక్క ఆభరణాల విషయానికి వస్తే, పసిడి డిమాండ్ 8 శాతం పడిపోయి 140.3 టన్నుల నుంచి 128.6 టన్నులకు తగ్గింది. ► 18 క్యారెట్ల పసిడి ఆభరణాలకు మాత్రం డిమాండ్ పెరగడం గమనార్హం. ధరలు కొంత అందుబాటులో ఉండడం దీనికి కారణం. ► కడ్డీలు, నాణేల డిమాండ్ 3 శాతం పడిపోయి 30.4 టన్నుల నుంచి 29.5 టన్నులకు తగ్గింది. ► పసిడి డిమాండ్‌లో రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం కూడా కొంత కనబడింది. ► పసిడి డిమాండ్ భారీగా పెరగడంతో రీసైక్లింగ్ డిమాండ్ ఏకంగా 61 శాతం పెరిగి 37.6 టన్నులకు ఎగసింది. ► పసిడి ధర భారీ పెరుగుదల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి చరిత్రాత్మక ధర వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆశావహ ధోరణి! ఓవర్–ది–కౌంటర్ లావాదేవీలు (ఓటీసీ– ఎక్సే్చంజీల్లో లిస్టెడ్కు సంబంధించిన కొనుగోళ్లు కాకుండా) మినహా గ్లోబల్ గోల్డ్ డిమాండ్ జూన్ త్రైమాసికంలో 2 శాతం పడిపోయి 921 టన్నులకు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో సగటు కొనుగోళ్లతో పోలిస్తే సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు సైతం తగ్గినట్లు మండలి పేర్కొంది. ఓటీసీ, స్టాక్ ఫ్లోలతో సహా, క్యూ2లో మొత్తం గ్లోబల్ డిమాండ్ మాత్రం 7 శాతం బలపడి 1,255 టన్నులకు చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పటిష్టమైన బంగారం మార్కెట్‌ను సూచిస్తోందని మండలి వివరించింది. సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ 103 టన్నులు తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. టర్కీలో కొన్ని కీలక ఆర్థిక, రాజకీయ పరిమాణల నేపథ్యంలో జరిగిన అమ్మకాలు దీనికి ప్రధాన కారణం. అయితే మొదటి ఆరు నెలల కాలాన్నీ చూస్తే మాత్రం సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో 387 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. దీర్ఘకాల సానుకూల ధోరణిని ఇది సూచిస్తోందని మండలి సీనియర్ మార్కెట్స్ విశ్లేషకులు లూయీస్ స్ట్రీట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా, టక్కీలుసహా కీలక మార్కెట్లలో వృద్ధి కారణంగా కడ్డీలు, నాణేల డిమాండ్ క్యూ2లో 6 శాతం పెరిగి 277 టన్నులుగా ఉంటే, మొదటి ఆరు నెలలోల 582 టన్నులుగా ఉంది. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) అవుట్‌ఫ్లోస్ క్యూ2లో 21 టన్నులయితే, మొదటి ఆరు నెలల్లో 50 టన్నులు. ఆభరణాల వినియోగ డిమాండ్ క్యూ2లో 3 శాతం పెరిగింది. ఆరు నెలల్లో ఈ పరిమాణం 951 టన్నులు. పసిడి సరఫరా క్యూ2లో 7 శాతం పెరిగి 1,255 టన్నులుగా ఉంది. గోల్డ్ మైన్స్ ఉత్పత్తి మొదటి ఆరు నెలల్లో 1,781 టన్నుల రికార్డు స్థాయికి చేరింది. అటు–ఇటు అంచనాలు... పెరిగిన స్థానిక ధరలు, విచక్షణతో కూడిన వ్యయంలో మందగమనం కారణంగా బంగారం అనిశి్చతిని ఎదుర్కొంటున్నందున, మేము బంగారం 2023 డిమాండ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి కొంత నిరాశగా ఉన్నప్పటికీ తగిన వర్షపాతంతో పంటలు, గ్రామీణ డిమాండ్ పటిష్టంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. దీపావళి సీజన్లో సెంటిమెంట్ మెరుగుపడుతుందని, సానుకూల ఆశ్చర్య ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నాం. ప్రస్తుత స్థాయిలోనే ధరలు కొనసాగితే 2023లో భారత్‌లో మొత్తం బంగారం డిమాండ్ 650–750 టన్నుల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ సీఈఓ -
బంగారం డిమాండ్‌కు ధర సెగ
ముంబై: దేశంలో బంగారం ధరలు తీవ్ర స్థాయికి చేరడంతో, జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొంది. ‘మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ పసిడి డిమండ్ 112.5 టన్నులు. 2022 ఇదే కాలంలో ఈ విలువ 135.5 టన్నులు. ► పసిడి ఆభరణాల డిమాండ్ ఇదే కాలంలో 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది. 2010 నుంచి ఒక్క మహమ్మారి కరోనా కాలాన్ని మినహాయిస్తే పసిడి ఆభరణాల డిమాండ్ మొదటి త్రైమాసికంలో 100 టన్నుల దిగువకు పడిపోవడం ఇది నాల్గవసారి. ► విలువల రూపంలో చూస్తే, మొత్తంగా పసిడి కొనుగోళ్లు 9 శాతం క్షీణించి రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు పడిపోయాయి. ► ఒక్క ఆభరణాల డిమాండ్ విలువల్లో చూస్తే, 9 శాతం పడిపోయి రూ.42,800 కోట్ల నుంచి రూ.39,000 కోట్లకు పడిపోయాయి. ► పెట్టుబడుల పరిమాణం పరంగా డిమాండ్ (కడ్డీలు, నాణేలు) 17 శాతం తగ్గి 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు క్షీణించింది. ప్రపంచ పసిడి డిమాండ్ కూడా మైనస్సే.. ఇదిలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా పసిడి డిమాండ్ మొదటి త్రైమాసికంలో బలహీనంగానే నమోదయ్యింది. 13 శాతం క్షీణతతో ఈ పరిమాణం 1,080.8 టన్నులుగా ఉంది. రూపాయి ఎఫెక్ట్... పసిడి ధరలు పెరడానికి అంతర్జాతీయ అంశాలు ప్రధాన కారణంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పెరుగుదలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. డాలర్ బలోపేతం, రూపాయి బలహీనత వంటి కారణాలతో గత ఏడాదితో పోల్చితే పసిడి ధర 19 శాతం పెరిగింది. పసిడి 10 గ్రాముల (స్వచ్ఛత) ధర రూ.60,000 పైన నిలకడగా కొనసాగుతోంది. ధర తీవ్రతతో తప్పనిసరి పసిడి అవసరాలకు వినియోగదారులు తమ పాత ఆభరణాల రీసైక్లింగ్, తద్వారా కొత్త కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ విభాగంలో కొనుగోళ్ల పరిమాణాలు కొంత మెరుగుపడుతున్నాయి. డిమాండ్ వార్షికంగా 750 నుంచి 800 టన్నలు శ్రేణిలో నమోదుకావచ్చు. – సోమసుందరం, డబ్ల్యూజీసీ భారత్ రీజినల్ సీఈఓ -
World Gold Council: కరోనా పూర్వపు స్థాయికి బంగారం డిమాండ్
ముంబై: బంగారం డిమాండ్ భారత్‌లో కరోనా ముందు నాటి స్థాయికి చేరుకుందుని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో డిమాండ్, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం పెరిగి 191.7 టన్నులుగా నమోదైనట్టు ప్రకటించింది. ‘బంగారం డిమాండ్ తీరు క్యూ3, 2022’ పేరుతో మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. క్రితం ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 168 టన్నులుగా ఉంది. విలువ పరంగా చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం డిమాండ్ 19 శాతం పెరిగి రూ.85,010 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.71,630 కోట్లు కావడం గమనార్హం. ఆభరణాల డిమాండ్ తీరు.. బంగారం ఆభరణాల డిమాండ్ మూడో క్వార్టర్లో 17 శాతం పెరిగి 146.2 టన్నులుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 125 టన్నులుగా ఉంది. విలువ పరంగా క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.53,300 కోట్ల డిమాండ్‌తో పోలిస్తే 22 శాతం పెరిగి రూ.64,800 కోట్లుగా ఉంది. ‘‘రుణ సదుపాయాలు విస్తరించడం ఈ డిమాండ్‌కు ప్రేరణనిస్తోంది. బ్యాంకు రుణ వితరణలో వృద్ధి తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరింది. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో వృద్ధి బలంగా ఉంది. దీంతో ఆభరణాలకు డిమాండ్ 17 శాతం పెరిగింది’’అని డబ్ల్యూజీసీ భారత్ హెడ్ పీఆర్ సోమసుందరం తెలిపారు. వర్షాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలతో గ్రామీణ ప్రాంతాల్లో బంగారం డిమాండ్‌పై ప్రభావం ఉన్నట్టు చెప్పారు. పెరిగిన పెట్టుబడులు.. ఇక బార్, కాయిన్ల డిమాండ్ సెప్టెంబర్ క్వార్టర్లో 6 శాతం పెరిగి 45.4 టన్నులుగా (విలువ పరంగా రూ.20,150 కోట్లు) ఉంది. ‘‘బంగారం ధరలు తగ్గడం, బలహీన ఈక్విటీ మార్కెట్లు, పండుగలతో ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తి చూపించారు. పెరుగుతున్న వడ్డీ రేట్ల వాతావరణం, రూపాయి బలహీనత వంటి అంశాలతో సురక్షిత సాధనమైన బంగారంలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతాయి. ఈ ఏడాది మిగిలిన కాలంపై ఆశావహ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వివాహాలు, దీపావళి డిమాండ్ నాలుగో త్రైమాసికం గణాంకాల్లో ప్రతిఫలిస్తుంది. అయితే గతేడాది ఇదే కాలంలో కనిపించిన రికార్డు స్థాయి పనితీరు సాధ్యపడకపోవచ్చు. ఈ ఏడాది మొత్తం మీద బంగారం డిమాండ్ 750–800 టన్నులుగా ఉంటుంది’’అని సోమసుందరం వివరించారు. 2021లో బంగారం దిగుమతులు 1,003 టన్నులుగా ఉండగా, ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్‌ను పరిశీలిస్తే గతేడాది గణాంకాలను మించదని ఆయన అంచనా వేశారు. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో (సెప్టెంబర్ వరకు) 559 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు చెప్పారు. రెండు, మూడో త్రైమాసికంలో బంగారం ధరలు 4 శాతం తగ్గినట్టు.. సెప్టెంబర్ క్వార్టర్లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.44,351గా ఉన్నట్టు చెప్పారు. -
పసిడి డిమాండ్‌కు ధర దడ
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) 18 శాతం పడిపోయింది. 135.5 టన్నులుగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో ఈ డిమాండ్ 165.8 టన్నులు. బంగారం ధరలు భారీగా పెరగడమే డిమాండ్ తగ్గడానికి కారణం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది. ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2022 క్యూ1’ పేరుతో విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► విలువ పరంగా జనవరి–మార్చి కాలంలో బంగారం డిమాండ్ 12 శాతం తగ్గి రూ.61,550 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది కాలంలో ఈ విలువ రూ.69,720 కోట్లు. ► జనవరిలో బంగారం ధరలు పెరగడం ప్రారంభమైంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10 గ్రాముల ధర (పన్నులు లేకుండా) 8 శాతం పెరిగి రూ. 45,434కు చేరుకుంది. ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి కారణం. 2021 జనవరి– మార్చి మధ్య ధర రూ.42,045గా ఉంది. ► మార్చి త్రైమాసికంలో దేశంలో మొత్తం ఆభరణాల డిమాండ్ 26 శాతం తగ్గి 94.2 టన్నులకు పడిపోయింది. గతేడాది ఇదే కాలంలో ఇది 126.5 టన్నులు. ► ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విలువ పరంగా ఆభరణాల డిమాండ్ 20 శాతం క్షీణించి రూ.42,800 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.53,200 కోట్లు. ► 2021 నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్–నవంబర్–డిసెంబర్) ధర రికార్డు స్థాయికి పెరిగిన తర్వాత, భారత్ బంగారు ఆభరణాల డిమాండ్ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 26 శాతం తగ్గి 94 టన్నులకు పడిపోయింది. 2010 నుండి (మహమ్మారి కాలాలను మినహాయించి) భారత్ బంగారు ఆభరణాల డిమాండ్ 100 ట న్నుల దిగువకు పడిపోవడం ఇది మూడవసారి. ► శుభ దినాల సందర్భాల్లో నెలకొన్న మహమ్మారి భయాలు, బంగారం ధరలు గణనీయంగా పెరగడం వంటి అంశాలు రిటైల్ డిమాండ్ తగ్గడానికి కారణం. ఆయా కారణాలతో కుటుంబాలు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకున్నాయి. ► ఈ ఏడాది మొత్తంగా బంగారానికి డిమాండ్ 800–850 టన్నులు ఉండవచ్చు. ► కాగా, మార్చి త్రైమాసికంలో బంగారం విషయంలో పెట్టుబడి డిమాండ్ 5 శాతం పెరిగి 41.3 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 39.3 టన్నులు. ► విలువ పరంగా బంగారం పెట్టుబడి డిమాండ్ 13 శాతం పెరిగి రూ.18,750 కోట్లకు చేరుకుంది. ఇది 2021 అదే త్రైమాసికంలో రూ.16,520 కోట్లు. ► పెట్టుబడుల్లో ప్రధానంగా బంగారు కడ్డీలు, నాణేలు ఉన్నాయి. వీటి డిమాండ్ 5 శాతం పెరిగి 41 టన్నులకు చేరింది. ధరలు పెరగడం, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా బంగారాన్ని ఎంచుకోవడం, ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలు పసిడి పెట్టుబడుల డిమాండ్‌కు మద్దతునిచ్చాయి. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. ఈ కాలంలో సెంట్రల్ బ్యాంక్ 8 టన్నులను కొనుగోలు చేసింది. సెంట్రల్ బ్యాంక్ 2017 చివరి నుండి బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుండి 200 టన్నులను కొనుగోలు చేసింది. ► 2022 మొదటి త్రైమాసికంలో దేశంలో రీసైకిల్ అయిన మొత్తం బంగారం 88 శాతం పెరిగి 27.8 టన్నులకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 14.8 టన్నులు. ► మార్చి త్రైమాసికంలో మొత్తం నికర బులియన్ దిగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 313.9 టన్నుల నుంచి 58 శాతం తగ్గి 132.2 టన్నులకు పడిపోయాయి. అంతర్జాతీయంగా మెరుపులు... కాగా, మార్చి త్రైమాసికంలో అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 34 శాతం పెరిగి 1,234 టన్నులకు చేరింది. అంతర్జాతీయ ఉద్రిక్తలు, ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు పసిడివైపు చూడ్డం, వంటి అంశాలు దీనికి కారణం. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి డిమాండ్ భారీగా వచ్చిందని నివేదిక గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1, 2022 నివేదిక పేర్కొంది. 2021 మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ 919.1 టన్నులు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా, అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులలో బంగారం కోసం డిమాండ్ వంటి అంశాలు యరో మెటల్‌కు ఆకర్షణ తీసుకుని వస్తాయిన డబ్ల్యూజీసీ సీనియర్ విశ్లేషకులు లూయిస్ స్ట్రీట్ పేర్కొన్నారు. పలు అంశాల ప్రభావం ధరలపై మార్కెట్లో మిశ్రమ ధోరణి, చైనా నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో కోవిడ్‌పై అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు, భౌగోళిక సంఘర్షణలు వంటి అంశాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వీటితోపాటు గ్రామీణ మార్కెట్లలో డిమండ్ పునరుద్ధరణ, సాధారణ రుతుపవన అంశాలు కూడా యల్లో మెటల్ డిమాండ్‌పై ప్రభావం చూపుతాయి. – పీఆర్ సోమసుందరం, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ -
బంగారం డిమాండ్ పదిలం!
ముంబై: బంగారం డిమాండ్ మళ్లీ పుంజుకుంటోంది. 2021 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే పసిడి డిమాండ్ 47 శాతం పెరిగింది. పరిమాణంలో 139.1 టన్నులుగా నమోదయ్యింది. మహమ్మారి సవాళ్ల తగ్గి, ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో బంగారానికి తిరిగి వినియోగ డిమాండ్ ఏర్పడుతున్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. డబ్ల్యూజీసీ ఆవిష్కరించిన క్యూ3 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2021 నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2020 సెప్టెంబర్ త్రైమాసికంలో దేశం మొత్తం డిమాండ్ 94.6 టన్నులు. అప్పటితో పోల్చితే 47 శాతం పెరిగి 139.1 టన్నులకు చేరింది. విలువ పరంగా, భారతదేశం మూడవ త్రైమాసిక బంగారం డిమాండ్ 37 శాతం పెరిగి రూ. 59,330 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం రూ.43,160 కోట్లు. ► ఇది తక్కువ బేస్ ఎఫెక్ట్ అలాగే సానుకూల వాణిజ్యం, వినియోగదారుల మనోభావాల మేళవింపును ఇది ప్రతిబింబిస్తుంది. వ్యాక్సినేషన్ విస్తృతి, ఆర్థిక కార్యకలాపాల్లో బలమైన పురోగతి బంగారం కొనుగోళ్లు భారీగా పెరగడానికి కారణం. ► దేశవ్యాప్తంగా ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్నందున, రిటైల్ డిమాండ్ కోవిడ్–పూర్వ స్థాయికి పుంజుకుంది. రాబోయే పండుగలు, వివాహాల సీజన్‌తో బంగారం డిమాండ్ మరింత పెరిగే వీలుంది. బంగారానికి ఇంతటి డిమాండ్ నెలకొనడం కోవిడ్ మహమ్మారి సవాళ్లు విసరడం ప్రారంభించిన తర్వాత ఇదే మొదటిసారి. ► డిజిటల్ బంగారానికి డిమాండ్ పలు రెట్లు పెరిగింది. వినూత్న సాంకేతిక చొరవలు, ప్రముఖ ఆభరణాల యూపీఐ ప్లాట్‌ఫారమ్‌ల వంటి అంశాలు ఆన్లైన్ కొనుగోళ్లను ఇష్టపడే కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల సంఖ్యను పెంచడానికి గణనీయంగా దోహదపడుతుండడం గమనార్హం. ► రాబోయే నెలల్లో కమోడిటీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రావాణా వ్యయాలు భారం పెరుగుతుంది. ఆయా అంశాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయవచ్చు. ఇది దీర్ఘకాలంలో బంగారం డిమాండ్ మరింత పటిష్టం కావడానికి కలిసివచ్చే అంశం. ► సెప్టెంబర్ త్రైమాసికంలో దేశం మొత్తం ఆభరణాల డిమాండ్ 58 శాతం పెరిగి 96.2 టన్నులకు చేరుకుంది. 2020 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ పరిమాణం 60.8 టన్నులు. విలువలో ఆభరణాల డిమాండ్ 48 శాతం పెరిగి రూ.41,030 కోట్లకు చేరింది, ఇది ఏడాది క్రితం రూ.27,750 కోట్లు. ► మూడవ త్రైమాసికంలో మొత్తం పెట్టుబడి డిమాండ్ 27 శాతం పెరిగి 42.9 టన్నులకు చేరుకుంది. 2020 అదే త్రైమాసికంలో ఈ డిమాండ్ 33.8 టన్నులు. విలువ పరంగా, జూలై–సెప్టెంబర్‌లో బంగారం ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 19 శాతం పెరిగి రూ.18,300 కోట్లకు చేరుకుంది.ఇది ఏడాది క్రితం రూ.15,410 కోట్లు. ► సమీక్షా కాలంలో భారతదేశంలో రీసైకిల్ చేసిన మొత్తం బంగారం 50 శాతం క్షీణించి 20.7 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 41.5 టన్నులు. బంగారం రీసైక్లింగ్‌లో 50 శాతం తగ్గుదలను పరిశీలిస్తే, బంగారాన్ని విక్రయించడం కంటే బంగారాన్ని కలిగి ఉండాలనే బలమైన వినియోగదారు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. ► బలమైన సంస్థాగత మార్కెట్ల దన్నుతో బంగారంపై రుణాల మార్కెట్ కూడా భారీగా పెరుగుతుండడం గమనార్హం. ► పన్నులు లేకుండా మొత్తం నికర బులియన్ దిగుమతులు మూడవ త్రైమాసికంలో 187 శాతం పెరిగి 255.6 టన్నులకు చేరింది. 2020 ఇదే త్రైమాసికంలో ఈ పరిమాణం 89 టన్నులు. ► మూడో త్రైమాసికంలో బంగారం ధర సగటున 10 గ్రాములకు రూ.42,635గా ఉంది. 2020 ఇదే త్రైమాసికంలో ఈ ధర రూ.45,640. 2021 ఏప్రిల్–జూన్‌లో సగటు ధర రూ.43,076. ► వివిధ కొనుగోలుదారు–విక్రేతల సమావేశాల సందర్భంలో వచ్చిన అభిప్రాయాలను, పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలనూ పరిశీలిస్తే నాల్గవ త్రైమాసికం పండుగ సీజన్లో పసిడి డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. దిగుమతులూ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా డౌన్ మరోవైపు అంతర్జాతీయంగా సెప్టెంబర్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 7 శాతం తగ్గింది. డిమాండ్ 831 టన్నులకు తగ్గినట్లు డబ్ల్యూజీసీ పేర్కొంది. గోల్డ్ ఎక్ఛ్సేంజ్ ట్రేడెట్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్) నుంచి భారీగా డబ్బు వెనక్కు వెళ్లినట్లు గణాంకాలు వెల్లడించాయి. మూడవ త్రైమాసికంలో సగటున ఔన్స్ (31.1గ్రాములు) ధర 6 శాతం తగ్గి, 1,790 డాలర్లకు చేరింది. 2020 ఇదే కాలంలో ఈ ధర 1,900 డాలర్లు. ఆభరణాలకు డిమాండ్ 33 శాతం పెరిగి 443 టన్నులకు చేరింది. టెక్నాలజీలో పసిడి వినియోగం 9 శాతం పెరిగి 83.8 టన్నులకు ఎగసింది. సెంట్రల్ బ్యాంకులు తమ పసిడి నిల్వలను మొత్తంగా 69 టన్నులు పెంచుకున్నాయి. 2020 ఇదే కాలంలో 10 టన్నుల విక్రయాలు జరిపాయి. కాగా సరఫరాలు మాత్రం మూడు శాతం తగ్గి 1,279 డాలర్ల నుంచి 1,239 డాలర్లకు పడింది. -
భారత్-2022.. బంగారానికి భారీ డిమాండ్!
ముంబై: భారత్‌లో పసిడికి 2022లో భారీ డిమాండ్ నెలకొనే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి(వరల్డ్ గోల్డ్ కౌన్సిల్) పేర్కొంది. అయితే కోవిడ్–19 సంబంధ సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో 2021 మాత్రం బంగారం డిమాండ్ తగ్గిపోతోందని నివేదిక అభిప్రాయపడింది. ‘భారత్‌లో బంగారం డిమాండ్‌కు చోదకాలు’(డబ్ల్యూజీసీ నివేదిక) శీర్షికన విడుదలైన నివేదికలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► కోవిడ్–19తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో 2021 ముగిసేలోపు పసిడి డిమాండ్ ఊహించినదానికన్నా ఎక్కువగా పడిపోయే వీలుంది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు క్రమంగా సడలిపోతున్న నేపథ్యంలో పరిస్థితి క్రమంగా మెరుగుపడే వీలుంది. 2022 నాటికి డిమాండ్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ► అయితే కరోనా మూడవ వేవ్ సవాళ్లు తలెత్తితే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ► భారత్ పసిడి పరిశ్రమల మరింత పారదర్శకత, ప్రమాణాల దిశగా అడుగులు వేయాలి. ఈ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు అనుసరించాలి. తద్వారా దేశంలోని యువత, సామాజిక మార్పుల వల్ల ఈ పరిశ్రమ మరెంతగానో పురోగమించే అవకాశం ఉంది. ► భారత్‌లో బంగారం డిమాండ్‌కు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. గృహ పొదుపురేట్లు పడిపోతుండడం, వ్యవసాయ వేతనాలపై కోవిడ్–19 ప్రభావం వంటివి ఇందులో ఉన్నాయి. ► అయితే ఈ సవాళ్లు స్వల్పకాలికమైనవేనని భావిస్తున్నాం. కోవిడ్ సవాళ్లు కొనసాగుతున్నా.. పసిడి దిగుమతులు భారీగా పెరుగుతుండడం గమనార్హం. రిటైల్ డిమాండ్ క్రమంగా ఊపందుకునే అవకాశం ఉంది.. అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన నివేదికలో పేర్కొంది. ఇక బంగారం ధర, రుతుపవనాలు, పన్నుల్లో మార్పులు, ద్రవ్యోల్బణం వంటివి బంగారం డిమాండ్‌పై స్వల్పకాలంలో ప్రభావితం చూపే అంశాలు. అయితే, గృహ ఆదాయం, పసిడిపై పన్నులు దీర్ఘకాలిక డిమాండ్‌ని నడిపిస్తాయి. చదవండి: బంగారం మీద ఎన్ని రకాల ట్యాక్స్ కట్టాలో తెలుసా? -
భారత్ బంగారం డిమాండ్ పటిష్టం
ముంబై: భారత్ పసిడి డిమాండ్ తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో వార్షికంగా 19 శాతం పెరిగి 76 టన్నులుగా నమోదయినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. అయితే శాతాల్లో భారీ పెరుగుదలకు గత ఏడాది ఇదే కాలంలో తక్కువ డిమాండ్ నమోదు (లో బేస్) ప్రధాన కారణం. 2020 ఏప్రిల్–జూన్ మధ్య పసిడి డిమాండ్ 63.8 టన్నులుగా ఉంది. కరోనా ప్రభావంతో అప్పట్లో కఠిన లాక్డౌన్ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. 2021 క్యూ2 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్‌పై డబ్ల్యూజీసీ విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ఏప్రిల్–జూన్ మధ్య పసిడి డిమాండ్ విలవ రూపంలో 23 శాతం పెరిగి రూ.26,600 కోట్ల నుంచి రూ.32,810 కోట్లకు చేరింది. ► ఇక మొత్తం ఆభరణాల డిమాండ్ రెండవ త్రైమాసికంలో వార్షికంగా 25 శాతం పెరిగి 44 టన్నుల నుంచి 55.1 టన్నులకు చేరింది. విలువలో 29 శాతం ఎగసి రూ.18,350 కోట్ల నుంచి రూ.23,750 కోట్లకు ఎగసింది. ► పెట్టుబడుల డిమాండ్ 6 శాతం పెరిగి 19.8 టన్నుల నుంచి 21 టన్నులకు ఎగసింది. విలువలో ఈ విలువ 10 శాతం పెరిగి రూ.8,250 కోట్ల నుంచి రూ.9,060 కోట్లకు ఎగసింది. ► గోల్డ్ రీసైక్లింగ్ 43 శాతం ఎగసి 13.8 టన్నుల నుంచి 19.7 టన్నులకు చేరింది. ► పసిడి దిగుమతులు 10.9 టన్నుల నుంచి భారీగా 120.4 టన్నులకు పెరిగాయి. ఆరు నెలల్లో ఇలా... త్రైమాసికం పరంగా చూస్తే, (2021 జనవరి–మార్చితో పోల్చి) పసిడి డిమాండ్ 46 శాతం పడిపోవడం గమనార్హం. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దేశ పసిడి డిమాండ్ 140 టన్నులు. కోవిడ్–19 సెకండ్‌వేవ్ ప్రభావం ఏప్రిల్–జూన్ త్రైమాసికం డిమాండ్‌పై కనబడింది. సెకండ్ వేవ్ కారణంగా అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్లో పసిడికి అంత డిమాండ్ రాలేదని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (ఇండియా) సోమసుందరం తెలిపారు. 2021 తొలి ఆరు నెలల్లో పసిడి డిమాండ్ 30 శాతం పెరిగి 216.1 టన్నులకు ఎగసింది. పెరిగిన సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు... డబ్ల్యూజీసీ నివేదిక ప్రకారం, ప్రపంచ పసిడి డిమాండ్ 2021 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో దాదాపు స్థిరంగా 955.1 టన్నులుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ డిమాండ్ 960.5 టన్నులు. ఆభరణాలకు సంబంధించి వినియోగదారు పసిడి డిమాండ్ 60 శాతం పెరిగి 244.5 టన్నుల నుంచి 390.7 టన్నులకు చేరింది. కడ్డీలు, నాణేల కొనుగోళ్లు వరుసగా నాల్గవ త్రైమాసికంలోనూ పెరిగాయి. వార్షికంగా 157 టన్నుల నుంచి 244 టన్నులకు చేరాయి. కాగా ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సంబంధిత ఇన్వెస్ట్మెంట్ల పరిమాణం నుంచి 90 శాతం పడిపోయి 427.5 టన్నుల నుంచి 40.7 టన్నులకు చేరింది. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగాయి. ఈ పరిమాణం 63.7 టన్నుల నుంచి భారీగా 199.9 టన్నులకు ఎగసింది. థాయ్‌లాండ్, హంగరీ, బ్రె జిల్ సెంట్రల్ బ్యాంకులు భారీగా కొనుగోలు చేశాయి. సంవత్సరం మొత్తంగా డిమాండ్ 1,600 టన్నుల నుంచి 1,800 టన్నుల శ్రేణిలో ఉంటుందని డబ్ల్యూజీసీ అంచనా. ఒక్క ఇన్వెస్ట్మెండ్ డిమాండ్ 1,250 నుంచి 1,400 టన్నుల శ్రేణిలో ఉంటుందని భావిస్తోంది. అలాగే సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లూ కొనసాగుతాయని విశ్వసిస్తోంది. -
2020లో బంగారం డిమాండ్ ఢమాల్
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2020లో భారీగా 35 శాతం పడిపోయింది. 446.4 టన్నులుగా నమోదయ్యింది. 2019లో 690.4 టన్నులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కఠిన లాక్డౌన్ పరిస్థితులు, ఉపాధి అవకాశాలకు అవరోధాలు, ఆదాయాలు పడిపోవడం, అధిక ధరలు వంటి పలు అంశాలు దీనికి కారణం. అయితే పటిష్ట ఆర్థిక రికవరీ నేపథ్యంలో 2021లో తిరిగి బంగారం డిమాండ్ పుంజుకునే అవకాశం ఉంది. అధిక స్థాయికి చేరిన ఈక్విటీ మార్కెట్లు, తక్కువ స్థాయి వడ్డీరేట్లు కూడా ఇందుకు దోహదపడతాయి. ‘‘2020 పసిడి డిమాండ్ ధోరణులు’’ అన్న శీర్షికన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) గురువారం విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాలను తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► 2020లో విలువ రూపంలో పసిడి డిమాండ్ 14 శాతం పడిపోయి రూ.1,88,280 కోట్లకు చేరింది. 2019లో ఈ విలువ రూ.2,17,770 కోట్లు. ► ఆభరణాల డిమాండ్ పరిమాణం రూపంలో 42 శాతం పడిపోయి 544.6 టన్నుల నుంచి 315.9 టన్నులకు చేరింది. ఇందుకు సంబంధించి విలువ 22.42 శాతం తగ్గి రూ.1,71,790 కోట్ల నుంచి రూ.1,33,260 కోట్లకు పడింది. ► పసిడి దిగుమతులు 47 శాతం పడిపోయి 646.8 టన్నుల నుంచి 344.2 టన్నులకు చేరాయి. అయితే డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 19 శాతం పెరిగి (2019 ఇదే కాలంతో పోల్చి) చేరడం గమనార్హం. లాక్డౌన్ నిబంధనల సడలింపు దీనికి కారణం. ► 2020 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో డిమాండ్ కేవలం 4శాతం పడిపోయి పరిమాణం 194.3 టన్నుల నుంచి 186.2 టన్నులకు చేరడం గమనార్హం. వినియోగ సెంటిమెంట్ మెరుగవుతుండడాన్ని ఇది సూచిస్తోంది. పండుగలు, పెండ్లి సీజన్ కూడా దీనికి కలిసి వచ్చింది. 11 సంవత్సరాల కనిష్టానికి గ్లోబల్ గోల్డ్ డిమాండ్ కాగా అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 2020లో 11 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిందని డబ్ల్యూజీసీ నివేదిక వివరించింది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమాండ్ 3,759.6 టన్నులని పేర్కొంది. 2019లో ఈ పరిమాణం 4,386.4 టన్నులు. 2009లో 3,385.8 టన్నులు. కోవిడ్ 19 ప్రేరిత సవాళ్లే పసిడి డిమాండ్ భారీ పతనానికి కారణమని డబ్ల్యూజీసీ వివరించింది. ఒక్క నాల్గవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) చూస్తే, ఏకంగా పసిడి డిమాండ్ 28 శాతం పడిపోయి 1,082.9 టన్నుల నుంచి 783.4 టన్నులుకు పడింది. ఒక్క ఆభరణాల డిమాండ్ నాల్గవ త్రైమాసికంలో 13 శాతం పడిపోయి 590.1 టన్నుల నుంచి 515.9 టన్నులకు చేరింది. ఏడాదిలో ఈ డిమాండ్ 34 శాతం పడిపోయి 2,122.7 టన్నుల నుంచి 1,411.6 టన్నులకు కుదేలయ్యింది. కాగా, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడుల డిమాండ్ 40 శాతం పెరిగి 1,269.2 టన్నుల నుంచి 1,773.2 టన్నులకు ఎగసింది. ఇందులో అధిక వాటా గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌ది కావడం గమనార్హం. ఈటీఎఫ్‌ల డిమాండ్ ఏకంగా 120 శాతం పెరిగి 398.3 టన్నుల నుంచి 877.1 టన్నులకు చేరింది. సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు 59 శాతం తగ్గి 668.5 టన్నుల నుంచి 273 టన్నులకు చేరాయి. -
బంగారు పండగపై కరోనా పడగ
సాక్షి, నెల్లూరు: అక్షయ తృతీయ బంగారు పండగ. ఎంతో మంది ఈ పండగకు బంగారం కొనేందుకు మక్కువ చూపుతారు. ఎంతో కొంత బంగారం కొంటే చాలు.. సిరి సంపదలు సమకూరుతాయనే ఓ నమ్మకం. ఆదివారం అక్షయ తృతీయ. జిల్లాలో ఏటా అక్షయ తృతీయ సందర్భంగా సుమారు రూ.40 కోట్ల మేర విక్రయాలు జరుగుతాయి. కానీ కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 23 నుంచి మే 3 వరకు లాక్డౌన్ అమలులో ఉంది. ఫలితంగా బంగారు దుకాణాలు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 2 వేలకు పైగా చిన్న, పెద్ద బంగారు దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా ఏడాదికి రూ.1,000 కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది. ప్రధానంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు, అక్షర తృతీయ తదితర వాటికి భారీగా బంగారాన్ని కొనుగోళ్లు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి వ్యాపారులు బంగారం కొనుగోళ్లపై భారీ రాయితీలు ప్రకటిస్తుంటారు. దీంతో బంగారు దుకాణాలన్నీ జనాలతో కళకళలాడుతుంటాయి. ప్రతి ఏటా అక్షర తృతీయ పండగకు బంగారు దుకాణాలు జనాలతో కిక్కిరిపోతుంటాయి. వ్యాపారులు సైతం రకరకాల ఆఫర్లు ప్రకటించి వినియోగదారుల మనసును గెలుచుకుంటున్నారు. ఏటా అక్షర తృతీయ పండగకు కనీసం రూ. 40 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని చెబుతున్నారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో ఒక రూపాయి కూడా వ్యాపారం జరిగే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి తగ్గనున్న జీఎస్టీ ఆదాయం బంగారు కొనుగోళ్లపై వ్యాపారులు 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ప్రతి ఏటా బంగారు వ్యాపారం సుమారు రూ.1000 కోట్లకు జిల్లా నుంచి జీఎస్టీ రూపంలో రూ. 30 కోట్లు మేర ఆదాయం వస్తుంది. ప్రస్తుతం పెళ్లిళ్లు జరిగే సీజన్‌తోపాటు అక్షయ తృతీయ నేపథ్యంలో ఈ నెలలోనే సుమారు రూ.200 కోట్ల మేర వ్యాపారం జరిగేది. నెల రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుండడం, ఇంకెంత కాలం లాక్డౌన్ ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతానికి ఈ సీజన్లో జీఎస్టీ రూపంలో సుమారు రూ.6 కోట్ల ఆదాయం కోల్పోయింది. లాక్డౌన్ కొనసాగితే ఇటు వ్యాపారులకు, అటు ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉంది. అక్షయ తృతీయకు వ్యాపారం నిల్ లాక్డౌన్ నేపథ్యంలో బంగారం దుకాణాలు తెరిసే పరిస్థితి లేదు. నెల రోజులుగా దుకాణాలు మూసివేశాం. ప్రతి ఏటా అక్షయ తృతీయకు దుకాణాలు కళకళలాడుతంండేవి. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ముహూర్తాలు ఉన్నా లాక్‌డౌన్‌తో పెళ్లిళ్లు, ఫంక్షన్లను వాయిదా వేసుకున్నారు. దీంతో బంగారాన్ని కొనుగోలు చేసే వారు లేరు. – శాంతిలాల్, ది నెల్లూరు డి్రస్టిక్ట్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర చీఫ్ ఆర్గనైజర్ -
పసిడి.. డిమాండ్ ఢమాల్!
న్యూఢిల్లీ: ధరల తీవ్రతతో భారత్‌లో బంగారం డిమాండ్ 2019లో 9 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. దేశీయ ఆర్థిక మందగమనం కూడా పసిడి డిమాండ్ తగ్గడానికి దారితీసిందని మండలి పేర్కొంది. మండలి మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం తెలిపిన సమాచారం ప్రకారం– నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... ► 2018లో దేశంలో బంగారం డిమాండ్ 760 టన్నులు. 2019లో 690 టన్నులకు పడింది. ► ఒక్క ఆభరణాల విషయానికి వస్తే, డిమాండ్ 598 టన్నుల నుంచి 544 టన్నులకు దిగింది. ► కడ్డీలు, నాణేల డిమాండ్ 10 శాతం తగ్గి 162.4 టన్నుల నుంచి 146 టన్నులు చేరింది. ► 2019 అక్టోబర్ 25న వచ్చిన దంతేరాస్‌లో కొనుగోళ్లు పెద్దగా జరగలేదు. దేశీయంగా పసిడి ధరల తీవ్రత, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలు దీనికి కారణం. ► అయితే విలువ పరంగా మాత్రం భారత్ పసిడి డిమాండ్ రూ.2,11,860 కోట్ల నుంచి రూ.2,17,770 కోట్లకు పెరగడం గమనార్హం. ► చైనా తర్వాత పసిడి డిమాండ్‌లో రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో 2020లో ఈ మెటల్ డిమాండ్ 700 నుంచి 800 టన్నుల మధ్య ఉండవచ్చన్నది అంచనా. ప్రభుత్వం తీసుకునే పలు చర్యలతో ఆర్థిక వృద్ధి పుంజుకునే అవకాశాలు ఉండడం దీనికి కారణం. ► 2019 ప్రారంభంలో ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.32,190 ఉంటే, సంవత్సరం చివరకు వచ్చే సరికి రూ.39,000పైన ముగిసింది. ఒక దశలో రూ.40,000 మార్క్‌ను దాటడం కూడా గమనార్హం. ► బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్క్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ నిబంధనలను కేంద్రం జనవరిలో నోటిఫై చేసింది. 2021 జనవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆభరణాల వర్తకులకు ఏడాది సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆభరణాలను హాల్ మార్క్ సర్టిఫికేషన్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. లేదంటే భారతీయ ప్రమాణాల చట్టం 2016 కింద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయా అంశాలు పసిడిని దేశంలో మరింత విశ్వసనీయ మెటల్‌గా పెంపొందిస్తాయి. ► అయితే పసిడికి స్వల్పకాలంలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పరిశ్రమలో లాభాలు తగ్గడం, పన్నుల అనిశ్చితి వంటివి ఇందులో ఉన్నాయి. ► 2019లో దేశ పసిడి దిగుమతులు స్మగ్లింగ్‌సహా 14% తగ్గి 756 టన్నుల నుంచి 647 టన్నులకు పడింది. స్మగ్లింగ్ 115–120 టన్నులు ఉంటుందని అంచనా. 2020లో డిమాండ్లు పెద్దగా పెరిగే అవకాశం లేదు. ► కస్టమ్స్ సుంకం ప్రస్తుతం 12.5 శాతం ఉంటే ఇది 10 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ► దేశ పసిడి డిమాండ్‌లో 60 శాతంపైగా గ్రామీణ ప్రాంతాల నుంచి రావడం గమనార్హం. ఇక్కడ ఆభరణాలను సాంప్రదాయక సంపదగా భావిస్తుండడం దీనికి కారణం. ప్రస్తుతం దేశంలో రూ. 40వేల పైనే... పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముంౖ»ñ æసహా దేశంలోని పలు ప్రధాన మార్కెట్లలో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.40,000పైనే కొనసాగుతోంది. గురువారం ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో ధర రూ.210 పెరిగి రూ.41,790కి చేరింది. న్యూఢిల్లీలో రూ.400 ఎగసి రూ.41,524కు చేరింది. అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా సమీప కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆర్థిక మందగమనం, చైనా కరోనా వైరస్ నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షిత సాధనంగా పసిడివైపు ఇన్వెస్టర్లు చూస్తుండడం గమనార్హం. గురువారం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు ఒకానొకదశలో 10 డాలర్లు పెరిగి 1,580 డాలర్లను తాకింది. -
పసిడి డిమాండ్‌కు ధరాఘాతం!
ముంబై: భారతదేశ బంగారం డిమాండ్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (జనవరి – మార్చి) 12 శాతం పడిపోయింది. అంటే 2017 మొదటి మూడు నెలల్లో 131.2 టన్నులుగా ఉన్న పసిడి డిమాండ్... 2018లో ఇదే కాలంలో 115.6 టన్నులకు తగ్గింది. ఇక దిగుమతులు సైతం ఇదే కాలంలో 50 శాతం పడిపోయాయి. పరిమాణం రూపంలో 260 టన్నుల నుంచి 153 టన్నులకు చేరింది. ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ సోమసుందరం సదరు నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించారు. వాటిని చూస్తే... ♦ క్యూ 1కు సంబంధించి డిమాండ్ విలువ రూపంలో 8 శాతం తగ్గి రూ.34,440 కోట్ల నుంచి రూ.31,800 కోట్లకు జారింది. ♦ ఆభరణాలకు డిమాండ్ 12 శాతం తగ్గి 99.2 టన్నుల నుంచి 87.7 టన్నులకు చేరింది. ఇందుకు సంబంధించి విలువ 7 శాతం తగ్గి, రూ.26,050 కోట్ల నుంచి రూ.24,130 కోట్లకు పడిపోయింది. ♦ పెట్టుబడులకు సంబంధించి డిమాండ్ 13 శాతం తగ్గి 32 టన్నుల నుంచి 27.9 టన్నులకు చేరింది. ఇందుకు సంబంధించిన విలువ 9 శాతం తగ్గి రూ. 8,390 కోట్ల నుంచి రూ. 7,660 కోట్లకు పడింది. ♦ రీసైకిల్డ్ గోల్డ్ డిమాండ్ కూడా 3 శాతం తగ్గింది. 14.5 టన్నుల నుంచి 14.1 టన్నులకు చేరింది. కారణాలేమిటంటే... ♦ అధిక ధరలు, పెట్టుబడులకు సంబంధించి పసిడిపై ఆసక్తి తగ్గింది. పెళ్లి ముహూర్తాలు వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది క్యూ1లో తగ్గాయి. ♦ వస్తు–సేవల పన్ను(జీఎస్టీ)లోకి మార్చటం వల్ల ప్రత్యేకించి అసంఘటిత రంగం దెబ్బతింది. ♦ మొదటి త్రైమాసికంలో సహజంగానే పసిడి కొనుగోళ్లు ప్రోత్సాహంగా ఉండవు. పన్ను చెల్లింపుల వంటి ఆర్థిక అవసరాలకు ప్రజలు మొగ్గుచూపడమే దీనికి కారణం. ♦ 2018 సంవత్సరం మొత్తంలో పసిడి డిమాండ్ 700 టన్నుల నుంచి 800 టన్నుల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. ♦ తగిన వర్షపాతం, గ్రామీణ ఆదాయాలు పెరగడం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మొత్తంగా బాగుండే అవకాశాలు పసిడి డిమాండ్ పటిష్టత కొనసాగడానికి దోహదపడతాయని డబ్ల్యూజీసీ విశ్వసిస్తోంది. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే ధోరణి... భారత్‌లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా చూసినా మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ బలహీనంగానే ఉంది. డిమాండ్ అంతర్జాతీయంగా 7 శాతం తగ్గి 1,047 టన్నుల నుంచి 973 టన్నులకు పడిపోయినట్లు డబ్ల్యూజీసీ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక పేర్కొంది. పెట్టుబడులకు డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని నివేదిక వివరించింది. పెట్టుబడులకు సంబంధించి పసిడి డిమాండ్ 27 శాతం తగ్గి 394 టన్నుల నుంచి 287 టన్నులకు చేరింది. ఈటీఎఫ్‌ల్లోకి ప్రవాహం 66 శాతం తగ్గి 96 టన్నుల నుంచి 32 టన్నులకు పడింది. ఆభరణాలకు డిమాండ్ 491.6 టన్నుల నుంచి 487.7 టన్నులకు పడింది. కాగా సెంట్రల్ బ్యాంకులు మాత్రం తమ బంగారం నిల్వలను 42 శాతం పెంచుకున్నాయి. ఈ నిల్వలు 82.2 టన్నుల నుంచి 116.5 టన్నులకు ఎగశాయి. కాగా టెక్నాలజీ రంగంలో పసిడి డిమాండ్ 4 శాతం వృద్ధితో 78.9 టన్నుల నుంచి 82.1 టన్నులకు చేరింది. -
జీఎస్టీ ఎఫెక్ట్: 8 ఏళ్ల కనిష్టానికి పసిడి డిమాండ్
సాక్షి, ముంబై: బులియన్ వ్యాపారంపై ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలు, గ్రామీణ ప్రాంతాలనుంచి డిమాండ్ బాగా తగ్గడంతో 2017లోబంగారం డిమాండ్ భారీగా క్షీణించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 24 శాతం తగ్గి 145.9 టన్నులకు చేరిందని గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. ప్రపంచంలో చైనా తరువాత రెండవ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న భారత్‌లో ఈ ఏడాది గణనీయమైన క్షీణత కన్పించింది. ముఖ్యంగా 845 టన్నుల 10 సంవత్సరాల సగటుతో పోల్చుకుంటే 2017లో డిమాండ్ సగటున 650 టన్నులుగా ఉండవచ్చని డబ్ల్యుజిసి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం అంచనా వేశారు. 2016లో ఇది 666.1 టన్నులుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో, నూతనంగా ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ), బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు, మనీలాండరింగ్ వ్యతిరేక చట్టాలు బంగారు రీటైల్ కొనుగోళ్లను ప్రభావితం చేశాయన్నారు. భారతదేశ బంగారు డిమాండులో మూడింట రెండు వంతుల గ్రామీణ ప్రాంతాలనుంచే లభిస్తుంది. అయితే, ఈ ఏడాది దేశంలోని రుతుపవనాల ప్రభావంతో కొన్ని వ్యవసాయ ప్రాంతాల్లో ఆదాయాలు పడిపోయాయి. దీంతో రాబోయే త్రైమాసికాల్లో కూడా ఈ ప్రాంతాల్లో ఆభరణాల గిరాకీని ప్రభావితం చేసే అవకాశం ఉందని సోమసుందరం తెలిపారు. కాగా, 2017 చివరి త్రైమాసికంలో బంగారం దిగుమతులు నాలుగో వంతు పడిపోతాయని పరిశ్రమల వర్గాలు గతంలోనే అంచనా వేశాయి. ఈక్విటీ మార్కెట్లనుంచి మంచి రిటర్న్స్ వస్తుండటంతో చాలామంది ఇన్వెస్టర్లు అటు వైపు మళ్లుతున్నట్టు పేర్కొన్నాయి. -
ప్రపంచ డిమాండ్ తగ్గినా... భారత్‌లో బంగారం మెరుపు!
♦ జనవరి–మార్చిలో కనకం కాంతి ♦ డబ్ల్యూజీసీ నివేదిక ముంబై: బంగారానికి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (2017 జనవరి–మార్చి) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గినా... భారత్‌లో మాత్రం డిమాండ్ బాగుంది. ప్రపంచ పసిడి వేదిక (డబ్ల్యూజీసీ) గణాంకాలు ఈ విషయాన్ని వెల్ల డించాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... 2017 మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా 18 శాతం తగ్గి 1,034 టన్నులకు పడిపోయింది. 2016 ఇదే త్రైమాసికంలో డిమాండ్ 1,262 టన్నులు. పసిడి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి తక్కువ నిధులు రావడం, సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం. భారత్ ధోరణి: ఇక భారత్‌లో మాత్రం మొదటి త్రైమాసికంలో డిమాండ్ 15 శాతం పెరిగి 107.3 టన్నుల నుంచి 123.5 టన్నులకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఎక్సైజ్ సుంకం ప్రవేశపెట్టడంపై ఆభరణ వర్తకుల సమ్మె ప్రభావం ఇండస్ట్రీపై ప్రధానంగా పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విలువ రూపంలో చూస్తే. డిమాండ్ 18 శాతం పెరిగి రూ. 27,540 కోట్ల నుంచి రూ.32,420 కోట్లకు చేరింది. దేశంలో ఈ కాలంలో డిమాండ్ పెరగడానికి డీమోనిటైజేషన్ కూడా ఒక కారణమని డబ్ల్యూజీసీ పేర్కొంది. -
భారత్ డిమాండ్ బంగారం!
♦ 2020 నాటికి 950 టన్నులకు అప్ ♦ ప్రపంచ స్వర్ణ మండలి అంచనా ముంబై: భారత్ పసిడి డిమాండ్ 2020 నాటికి 950 టన్నులకు చేరుతుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. ఆర్థికవృద్ధి, పసిడి మార్కెట్లో పారదర్శకత పసిడికి దేశంలో డిమాండ్‌ను గణనీయంగా పెంచుతాయని డబ్ల్యూజీసీ నివేదిక బుధవారం పేర్కొంది. గత ఏడాదిగా పసిడి డిమాండ్ తగ్గుతూ వస్తున్నా... భవిష్యత్‌లో తిరిగి రికవరీ అవుతుందని వివరించింది. కరెంట్ అకౌంట్ లోటు ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని పసిడికి డిమాండ్‌ను తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఆయా ప్రయత్నాలు ఫలించబోవని వివరించింది. సమాజంలో ఈ మెటల్ పట్ల ఉన్న ఆకర్షణే దీనికి కారణమని తెలిపింది. నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... ♦ డిమాండ్ మళ్లీ పుంజుకుంటుంది. 2017లో డిమాండ్ 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉండవచ్చు. అయితే 2020 నాటికి మాత్రం 850 టన్నుల నుంచి 950 టన్నులకు చేరే వీలుంది. ♦ ప్రస్తుతం పసిడి డిమాండ్ తగ్గడానికి డీమోనిటైజేషన్ ప్రభావం కూడా ఉంది. ♦ మేము 2016 మొదటి త్రైమాసికంలో ఒక వినియోగ సర్వే నిర్వహించాం. కరెన్సీలతో పోల్చితే, పసిడి పట్ల తమకు ఎంతో విశ్వాసం ఉందని 63 శాతం మంది భారతీయులు ఈ సర్వేలో తెలిపారు. దీర్ఘకాలంలో పసిడే తమ భరోసాకు పటిష్టమైనదని 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ విశ్వాసాలను డీమోనిటైజేషన్ మరింత పెంచింది. ♦ ప్రజలు ఒకసారి డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడినప్పుడు, ఈ ధోరణి పసిడి కొనుగోళ్లు పెరగడానికీ దోహదపడుతుంది. ఆర్థికవృద్ధి, పారదర్శకత అంశాలు ఇక్కడ పసిడి డిమాండ్ పెరగడానికి దోహదపడే అంశాలు. ఫిబ్రవరిలో మూడింతల దిగుమతులు.. కాగా పెళ్లిళ్ల సీజన్ పసిడి డిమాండ్ భారీగా ఉందని ఫిబ్రవరిలో ఆ మెటల్ దిగుమతులు వివరిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోల్చిచూస్తే 175 శాతం పెరిగి 96.4 మెట్రిక్ టన్నులకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకూ గడచిన 11 నెలల కాలంలో విదేశీ కొనుగోళ్లు 32 శాతం పెరుగుదలతో 595.5 టన్నులకు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో– ఆభరణాలకు ఏప్రిల్‌లో భారీ డిమాండ్ ఉంటుందని తాము భావిస్తున్నట్లు గీతాంజలి జమ్స్ లిమిటెడ్ చైర్మన్ మెహుల్ చోక్సీ పేర్కొన్నారు. ఈ ఏడాది డిమాండ్ 725 టన్నులు: సిటీగ్రూప్ మరోవైపు, 2017లో పసిడి డిమాండ్ వార్షికంగా పుంజుకుంటుందని ఆర్థిక సేవల సంస్థ– సిటీగ్రూప్ కూడా విశ్లేషించింది. పెళ్లిళ్లు, పండుగల సీజన్‌ను దీనికి కారణంగా వివరించింది. అంతర్జాతీయంగా నెల కనిష్ట స్థాయి... అమెరికాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడినట్లు వార్తలు, దీనితో మార్చి 14–15 సమావేశాల సందర్భంగా అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేటును (ప్రస్తుతం 0.50 శాతం) పెంచుతుందన్న ఊహాగానాలు పసిడికి అంతర్జాతీయ మార్కెట్లో నైమెక్స్‌లో నెల కనిష్ట స్థాయికి చేర్చాయి. కడపటి సమాచారం అందే సరికి ఔన్స్ (31.1గ్రా)కు 1,205 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రెండు వారాల్లో పసిడి దాదాపు 40 డాలర్లు తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన స్పాట్ మార్కెట్ ముంబైలో 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర బుధవారం రూ.29 వేల దిగువన ట్రేడవుతోంది. -
బంగారం డిమాండ్ పడిపోయింది!
న్యూఢిల్లీ : దేశీయంగా బంగారం డిమాండ్ పడిపోయిందట. 2016లో బంగారం డిమాండ్ 21 శాతం మేర పడిపోయి 675.5 టన్నులుగా నమోదైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) వెల్లడించింది. భారత్‌లో బంగారం డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణాలు జువెలరీ సమ్మె, పాన్ కార్డు అవసరాలు, డీమానిటైజేషనేనని డబ్ల్యూజీసీ పేర్కొంది. 2015లో బంగారం డిమాండ్ 857.2 టన్నులుగా ఉందని గోల్డ్ కౌన్సిల్ రివీల్ చేసింది. ఆభరణాల డిమాండ్ కూడా దేశంలో 22.4 శాతం క్షీణించిందని పేర్కొంది. 2015లో ఆభరణాల డిమాండ్ 662.3 టన్నులుగా ఉంటే, 2016కు వచ్చే సరికి ఈ డిమాండ్ 514 టన్నులుగా నమోదైందని తెలిపింది. ఆభరణాల పరిశ్రమ చాలా సవాళ్లను ఎదుర్కొంటుందని, ఇది డిమాండ్‌పై ప్రభావం చూపుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరమ్ పీఆర్ పేర్కొన్నారు. పాన్ కార్డు నిబంధన, జువెలరీపై ఎక్స్చేంజ్ డ్యూటీ, డీమానిటైజేషన్, ఆదాయపు పన్ను వెల్లడి పథకం డిమాండ్‌ను దెబ్బతీస్తుందన్నారు. కానీ ఇవన్నీ ఆర్థికవ్యవస్థను మరింత బలపర్చేలా చేస్తాయన్నారు. గోల్డ్ ఇండస్ట్రిలో పారదర్శకతను కూడా తీసుకొస్తాయన్నారు. నగదు కొరత గ్రామీణ ప్రాంతాన్ని ఎక్కువగా దెబ్బతీసిందని, కానీ ఈ ప్రభావం తాత్కాలికమేనని, మంచి రుతుపవనాలు బంగారం డిమాండ్‌కు మద్దతిస్తాయని వివరించారు. 2017లో బంగారం డిమాండ్ 650-750 టన్నుల వరకు ఉంటుందని సోమసుందరమ్ అంచనావేశారు. -
తగ్గిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: భారత్ వాణిజ్యలోటు డిసెంబర్లో 10 నెలల కనిష్ట స్థాయికి తగ్గింది. ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య ఉన్న వ్యత్యాసమే వాణిజ్యలోటు. డిసెం బర్లో ఈ లోటు 9.43 బిలియన్ డాలర్లుగా ఉంది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గణనీయంగా పడిపోవడం లోటు తగ్గడానికి ప్రధాన కారణం. డిసెంబర్లో దేశం ఎగుమతులు అసలు వృద్ధిలేకపోగా 3.8 శాతం క్షీణించాయి. 25.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే దిగుమతుల బిల్లు 4.8 శాతం తగ్గి 34.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒక్క చమురు దిగుమతుల విలువ 28.6 శాతం పడిపోయి 9.94 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. బంగారం ఇలా: 2013 డిసెంబర్‌తో పోల్చితే 2014 డిసెంబర్లో బంగారం దిగుమతులు 7.4 శాతం పెరిగి 1.34 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే 2014 నవంబర్‌తో పోల్చితే మాత్రం (5.61 బిలియన్ డాలర్లు) ఈ విలువ గణనీయంగా తగ్గడం గమనార్హం. తొమ్మిది నెలల్లో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య మొత్తం ఎగుమతులు 2013 ఇదే కాలంతో పోల్చితే 4.02 శాతం వృద్ధితో 241.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు ఇదే కాలంలో 3.63 శాతం పెరుగుదలతో 351.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 110 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 325 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు దేశం లక్ష్యం. -
డిసెంబర్‌కల్లా రూ. 24,500కు పసిడి!
ముంబై: డిసెంబర్‌కల్లా 10 గ్రాముల పసిడి ధర రూ. 24,500కు క్షీణించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేశారు. గడచిన శనివారం(1న) ఎంసీఎక్స్‌లో ఈ ధర రూ. 26,143గా నమోదైంది. అయితే ఇందుకు డాలరుతో మారకంలో రూపాయి ప్రస్తుతమున్న స్థాయిలో నిలకడగా కొనసాగాల్సి ఉన్నదని వివరించారు. సమీపకాలంలో బంగారం ధరలు మరింత బలహీనపడతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వారం లేదా రెండు వారాల్లో పసిడి ధరలు స్థీరీకరణ(కన్సాలిడేషన్) చెందుతాయని మోతీలాల్ ఓస్వాల్ అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్(కమోడిటీస్) కిషోర్ నార్నే అభిప్రాయపడ్డారు. డిసెంబర్ మధ్యకల్లా 10 గ్రాముల ధర రూ. 24,500కు దిగివస్తుందని అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్(31.1 గ్రాములు) ధర 1,173 డాలర్ల వద్ద ఉంది. ప్రధానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ సెప్టెంబర్ క్వార్టర్లో అనూహ్య వృద్ధిని సాధించడంతో పసిడి ధరలు బలహీనపడ్డాయని నార్నే పేర్కొన్నారు. క్యూ3లో అమెరికా జీడీపీ 3.5% పురోగమించడంతో అక్కడి కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై దృష్టిపెట్టే అవకాశముందని చెప్పారు. తద్వారా ఓవైపు డాలరు మరింత బలపడే అవకాశమున్నట్లే మరోపక్క బంగారం ధరలు పతనమయ్యే చాన్స్ ఉందన్నారు. విదేశీ మార్కెట్లలో ఔన్స్ పుత్తడి ధర డిసెంబర్ చివరికి 1,080-1,120 డాలర్ల స్థాయిలో స్ధిరపడవచ్చునని అంచనా వేశారు. కామ్ట్రెండ్ రీసెర్చ్ డెరైక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ సైతం ఇవే అభిప్రాయాలను వెల్లడించారు. దేశీయంగా డిసెంబర్‌కల్లా 10 గ్రాముల పసిడి ధర రూ. 25,000-25,500కు చేరొచ్చని అంచనా వేశారు. అయితే ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో విదేశీ మార్కెట్లలో బంగారం ఉత్పత్తి తగ్గితే ధరలు నిలబడే అవకాశముందని చెప్పారు. -
ద్వితీయార్థంలో పసిడి
న్యూఢిల్లీ: బలహీనమైన రుతుపవనాలు గ్రామీణ ప్రాంతాల్లో బంగారానికి డిమాండ్‌పై ప్రభావం చూపినప్పటికీ మొత్తమ్మీద మెరుగైన సెంటిమెంట్ కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థం(జూలై - డిసెంబరు)లో పసిడికి పూర్వవైభవం వస్తుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) తెలిపింది. ‘ఈ ఏడాది ప్రథమార్థంలో 80:20 ఫార్ములా (దిగుమతుల్లో 20 శాతాన్ని ఎగుమతి చేయాలనే నిబంధన) పుత్తడి డిమాండ్‌పై ప్రభావం చూపింది. దిగుమతి సుంకాన్ని తగ్గిస్తారనీ, 10 గ్రాముల ధర మళ్లీ రూ.25 వేల స్థాయికి వస్తుందనీ ప్రజలు భావించారు. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల ప్రభావం కూడా డిమాండ్‌పై పడింది...’ అని డబ్యూజీసీ ఎండీ పి.ఆర్.సోమసుందరం చెప్పారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.28 వేల శ్రేణిలో ఉంది. గతేడాది ఏప్రిల్‌లో రూ.26,440గా ఉన్న ధర ఆగస్టులో రూ.34,600కు చేరింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అయిపోయింది కాబట్టి దిగుమతి సుంకం తగ్గింపు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని సోమసుందరం తెలిపారు. -
క్యూ1లో వన్నె తగ్గిన బంగారం...
ముంబై: పసిడి రేటు మరింత తగ్గొచ్చన్న అంచనాల కారణంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) బంగారానికి డిమాండ్ గణనీయంగా క్షీణించింది. 39% తగ్గి 204.1 టన్నులకు పరిమితమైంది. గతేడాది క్యూ2లో ఇది 337 టన్నులు. విలువ పరంగా చూస్తే పసిడికి డిమాండు రూ. 85,533.8 కోట్ల నుంచి రూ. 50,564.3 కోట్లకు పడిపోయింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బంగారం ధర రూ. 25,000కు తగ్గిపోవచ్చన్న అంచనాలు, సార్వత్రిక ఎన్నికల వల్ల ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు బంగారం డిమాండ్‌పై ప్రభావం చూపినట్లు డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. అయితే, గడచిన అయిదేళ్ల దీర్ఘకాలిక సగటును చూస్తే ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో సైతం పసిడికి బాగానే డిమాండ్ ఉందని భావించవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఏడాది ప్రథమార్ధంలో బంగారం దిగుమతులు 43% క్షీణించి 351 టన్నులకు పరిమితమయ్యాయి. దిగుమతి సుంకాల పెంపు ఇందుకు కారణమని సోమసుందరం వివరించారు. గతేడాది ప్రథమార్ధంలో దిగుమతులు 620 టన్నులు. అంతర్జాతీయంగా డిమాండ్ 16% డౌన్.. బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయన్నదానిపై కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లలో సందిగ్ధం నెలకొనడంతో క్యూ2లో అంతర్జాతీయంగా కూడా పసిడికి డిమాండ్ తగ్గింది. 16 శాతం క్షీణించి 964 టన్నులుగా నమోదైంది. గతేడాది రెండో త్రైమాసికంలో ఇది 1,148 టన్నులు. విలువపరంగా చూస్తే 24 శాతం క్షీణించి 40 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు 28 శాతం ఎగిసి 92 టన్నుల నుంచి 118 టన్నులకు పెరిగాయి. ఇరాక్, ఉక్రెయిన్‌లో రాజకీయ సంక్షోభాలు, అమెరికా డాలరుకు ప్రత్యామ్నాయ సాధనాలవైపు సెంట్రల్ బ్యాంకులు దృష్టి సారిస్తుండటం ఇందుకు కారణమని డబ్ల్యూజీసీ ఎండీ మార్కస్ గ్రబ్ పేర్కొన్నారు. గతేడాది అసాధారణ పరిస్థితులు చూసిన మార్కెట్ ఇప్పుడిప్పుడే స్థిరపడుతోన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఇన్వెస్టర్లు ఎలక్ట్రానికల్లీ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వైపు మొగ్గు చూపడం రెండో త్రైమాసికంలో మరికాస్త పెరిగిందన్నారు. పెరిగిన పసిడి దిగుమతుల టారిఫ్ విలువ న్యూఢిల్లీ: బంగారం దిగుమతుల టారిఫ్ విలువను ప్రభుత్వం పెంచింది. ఈ విలువ (10గ్రా) 421 డాలర్ల నుంచి 426 డాలర్లకు చేరింది. వెండిపై (కేజీ)కి 650కు పెంచింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఒక ప్రకటన చేసింది. ప్రధానంగా దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. విలువను తక్కువచేసి చూపేందుకు(అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం. అంతర్జాతీయంగా బంగారం ధరల ధోరణికి అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ టారిఫ్ విలువలో మార్పులు చేస్తారు.