ముంబై: పసిడి ధరల తీవ్రత నేపథ్యంలో.. వినియోగదారుల కొనుగోళ్లు ఎలా ఉంటాయన్న అంశంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆ అభిప్రాయాలు క్లుప్తంగా...
డిమాండ్ పడిపోవచ్చు
కస్టమ్స్ సుంకాలు తగ్గినప్పటికీ అటు అంతర్జాతీయ ఇటు దేశీయ పరిణామాలతో పసిడి ధరలు రికార్టులను సృష్టిస్తున్నాయి. దీపావళికి ముందు చోటుచేసుకుంటున్న ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ధన్‌తేరస్‌లో డిమాండ్, కొనుగోళ్ల పరిమాణాలు తగ్గుతాయని భావిస్తున్నాం. గత ధన్‌తేరాస్‌తో పోల్చితే కొనుగోళ్ల పరిమాణం కనీసం 10 నుంచి 12 శాతం తగ్గుతుందని అంచనా. అయితే పెరిగిన ధరల వల్ల విలువలో కొనుగోళ్లు 12 నుంచి 15 శాతం పెరగవచ్చు.
– సువంకర్ సేన్, సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ, సీఈఎఓ
గత ఏడాదికి సమానంగా బిజినెస్
ధరలు పెరుగుతున్నప్పటికీ మేము మంచి వ్యాపారాన్ని ఆశిస్తున్నాము. ధన్‌తేరస్ తర్వాత 40 లక్షలకు పైగా వివాహాలు జరుగుతున్నందున అమ్మకాలు గత సంవత్సరం మాదిరిగానే ఉండవచ్చని మేము ఆశిస్తున్నాము. ధన్‌తేరస్ నాడు అమ్మకాల పరిమాణం 20 నుంచి 22 టన్నులు ఉండవచ్చు. ఇది గత ఏడాదికి దాదాపు సమానం.
– సయం మెహ్రా, ఆల్ ఇండియా జీజేసీ చైర్మన్
ఆశాజనంగానే ఉన్నాం...
రెండో త్రైమాసికంలో బులియన్ మార్కెట్ పటిష్టంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో పండుగల సమయంలో అమ్మకాలపై మేము ఆశాజనకంగా ఉన్నాము. పండుగలకు ప్రీ–బుక్ ఆర్డర్‌లు కూడా బాగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా సానుకూల సెంటిమెంట్ ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది. అకస్మాత్తుగా ధర పెరిగితే వినియోగదారులు కొంత విరామం తీసుకునే మాట వాస్తవమే. అయితే ఈ రోజుల్లో వినియోగదారులు తమ బడ్జెట్ మేరకు కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. కాబట్టి మేము ఈ దశలో ‘కొనుగోళ్ల పరిమాణం’ గురించి ఇప్పుడు మాట్లాడము.
– టీఎస్ కళ్యాణరామన్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఎండీ
పెళ్లిళ్ల సీజన్‌తో డిమాండ్ పదిలం
బంగారం ధరలు రికార్డు స్థాయిలను తాకినప్పటికీ కొనుగోళ్ల విషయంలో పరిశ్రమ నుండి వచ్చిన సమాచారం సానుకూలంగానే ఉంది. కొనసాగుతున్న పండుగల కారణంగా బంగారం కొనుగోళ్ల డిమాండ్ పటిష్టంగా ఉండే వీలుంది. పెట్టుబడి సెంటిమెంట్, వివాహ సంబంధిత కొనుగోళ్లు పరిశ్రమకు అండగా ఉండే అవకాశాలే ఎక్కువ. వ్యవసాయ పరిస్థితుల మెరుగుదల, ఆదాయాలు పెరగడం, ఎకానమీ, వినియోగం పటిష్టత వంటి అంశాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పసిడికి డిమాండ్ ఉటుంది.
– సచిన్ జైన్, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment