ఈ ఏడాది ఇప్పటివరకు 30 శాతానికి పైగా పెరిగిన బంగారం ధరలు భారతీయ మార్కెట్లలో గ్రాముకు రూ. 7,300కి చేరుకున్నాయి. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే గడిచిన 10 సంవత్సరాలలో ఈ ఏడాది పెరుగుదలే అత్యధిక కానుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక వెల్లడించింది.
అయితే ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ స్థాయి పరుగు 2025 చివరి వరకు కొనసాగకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడానికి కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు, పెట్టుబడిదారుల కొనుగోళ్లే కారణమని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది
డబ్ల్యూజీసీ డేటా ప్రకారం.. 2022లో చూసిన స్థాయిలతో పోలిస్తే 2024 క్యాలెండర్ ఇయర్ మూడో త్రైమాసికం నాటికి బంగారం కొనుగోలు 694 టన్నులకు చేరుకోవడంతో సెంట్రల్ బ్యాంక్ డిమాండ్ బలంగా ఉంది. 2024 అక్టోబర్ నాటికి తుర్కియే, పోలాండ్ సెంట్రల్ బ్యాంకులు వరుసగా 72 టన్నులు, 69 టన్నుల బంగారు నిల్వలను జోడించి బంగారం మార్కెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్‌లో 27 టన్నులను జోడించింది. ఈ నెల వరకు దాని మొత్తం బంగారం కొనుగోళ్లు 77 టన్నులకు చేరుకున్నాయి. అక్టోబర్ వరకు భారత్ నికర కొనుగోళ్లు దాని 2023 కార్యకలాపాలపై ఐదు రెట్లు పెరిగాయని నివేదిక పేర్కొంది.
వచ్చే ఏడాది ఎలా ఉంటుంది?
2025 బంగారానికి సవాలుగా ఉండే సంవత్సరంగా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అనేక ఎదురుగాలులను వారు చూస్తున్నారు. వాటిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లపై దాని ప్రభావం ఉన్నాయి. బంగారం అతిపెద్ద వినియోగదారులలో ఒకటైన చైనాలో కూడా పరిణామాలు కీలకంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment