డిమాండ్ బంగారమే..
ముంబై: బంగారం దారి ఎప్పుడూ బంగారమేనని మరోసారి స్పష్టమైంది. 2013లో భారత్ పసిడి డిమాండ్ 2012తో పోల్చితే 13 శాతం పెరిగింది. పరిమాణంలో 864 టన్నుల నుంచి 975 టన్నులకు చేరింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ఒకటి ఈ విషయాలను తెలిపింది. కరెంట్ అకౌంట్ కట్టడి(క్యాడ్-మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య విలువ మధ్య వ్యత్యాసం)లో భాగంగా ప్రభుత్వం పసిడి దిగుమతులపై పలు ఆంక్షలు విధించినప్పటికీ పసిడి డిమాండ్ పెరగడం ఆసక్తికరం. 2013 గోల్డ్ డిమాండ్ ధోరణుల పేరుతో డబ్ల్యూజీసీ ఈ గణాంకాలను విడుదల చేసింది.
డబ్ల్యూజీసీ మేనేజింగ్ డెరైక్టర్(ఇండియా) సోమసుందరం తెలిపిన వివరాలు క్లుప్తంగా...
2013 మొదటి ఆరు నెలలతో పోల్చితే ద్వితీయార్థంలో డిమాండ్ తగ్గింది. సరఫరా ఇబ్బందులు దీనికి కారణం. ఏప్రిల్-మే నెలల్లో బంగారం ధర తగ్గడాన్ని గృహస్తులు కొనుగోళ్లకు అవకాశంగా భావించారు.
ఆభరణాలకు డిమాండ్ 11 శాతం పెరిగి 612.7 టన్నులుగా నమోదయ్యింది. విలువ రూపంలో ఇది రూ.1,61,751 కోట్లు. 2012లో ఈ పరిమాణం 552 టన్నులు. విలువలో రూ.1,58,359 కోట్లు.
పెట్టుబడుల డిమాండ్ 16% పెరిగి 362.1 టన్నులుగా నమోదయ్యింది. 2012లో ఇది 312.2 టన్నులు. విలువలో ఈ పరిమాణం 6 శాతం పెరిగి రూ. 90,184.6 కోట్ల నుంచి రూ.95,460.8 కోట్లకు చేరింది.
సైకిల్డ్ గోల్డ్ డిమాండ్ 10.79 శాతం పడిపోయింది. ఇది 113 టన్నుల నుంచి 100.8 టన్నులకు తగ్గింది.
2013 ద్వితీయార్థంలో గ్రే మార్కెట్ క్రియాశీలత పెరిగింది. ప్రభుత్వ నియంత్రణలు కొనసాగితే 2014లో ఈ ప్రభావం మరింత పెరిగి, స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
{పభుత్వ ఆంక్షల వల్ల బంగారం అక్రమ రవాణా తీవ్రమయ్యింది. నెలకు 20 నుంచి 30 టన్నుల వరకూ అక్రమ రవాణా మార్గాల్లో పయనించినట్లు అంచనా.
2014లో భారత్ బంగారం డిమాండ్ 900 టన్నుల నుంచి 1,000 టన్నుల వరకూ ఉండొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా డౌన్...
కాగా ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 2013లో 15 శాతం పడిపోయింది. 2012తో పోల్చితే 4,416 టన్నుల నుంచి 3,756 టన్నులకు పడిపోయింది. ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)నుంచి భారీ మొత్తంలో నిధుల ఈక్విటీ మార్కెట్లకు తరలిపోవడమే దీనికి కారణం. అయితే ఈటీఎఫ్ రూపంలో డిమాండ్ పడిపోయినా... బంగారం మార్కెట్ విషయంలో వినియోగదారుల నుంచి 21 శాతం వృద్ధి నమోదుకావడం విశేషం.
భారత్‌ను అధిగమించిన చైనా
ఇదిలావుండగా... 2013లో బంగారం డిమాండ్ విషయంలో భారత్‌ను చైనా అధిగమించింది. ప్రపంచంలో అతిపెద్ద పసిడి వినియోగదారుగా తన హోదాను భారత్ మొదటిసారిగా చైనాకు అప్పగించింది. చైనాలో 2013లో బంగారం డిమాండ్ 1,065.8 టన్నులుగా నమోదయ్యింది. భారత్ ఈ పరిమాణం 975 టన్నులు మాత్రమే. కాగా 2012లో చైనా బంగారం డిమాండ్ 806.8 టన్నులుగా ఉంది. 2014 సంవత్సరంలో చైనా బంగారం డిమాండ్ 1,000-1,100 టన్నులుగా ఉంటుందన్నది అంచనా.