World Gold Council Report
-
పసిడికి పెరిగిన డిమాండ్
ముంబై: దిగుమతి సుంకం తగ్గింపుతో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 248.3 టన్నులుగా నమోదైంది. ముఖ్యంగా సుంకం తగ్గింపు ఆభరణాల కొనుగోళ్లను పెంచినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ‘2024 క్యూ3 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదిక తెలిపింది. ‘‘బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరడంతో.. ధరలు తగ్గే వరకు కొనుగోళ్ల కోసం ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించొచ్చు. దీంతో పూర్తి ఏడాదికి (2024) బంగారం డిమాండ్ 700–750 టన్నుల మేర ఉంటుంది. గతేడాదితో పోలి్చతే కొంత తక్కువ. 2024 చివరి త్రైమాసికంలో ధనత్రయోదశి, వివాహాల సీజన్ మొత్తం మీద బంగారం డిమాండ్‌కు ఊతంగా నిలుస్తాయి’’అని ఈ నివేదిక తెలిపింది. 2023లో బంగారం డిమాండ్ 761 టన్నులుగా ఉంది. ధనత్రయోదశి సందర్భంగా డిమాండ్ పెరగడంతో మంగళవారం ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములకు రూ.300 పెరిగి రూ.81,400కు చేరడం గమనార్హం. ఇక విలువ పరంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం డిమాండ్ 53 శాతం పెరిగి రూ.1,65,380 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.1,07,700 కోట్లుగా ఉంది. బంగారం, వెండి దిగుమతులపై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి బడ్జెట్లో తగ్గించడం తెలిసిందే. బంగారం దిగుమతులు 22% జంప్ పస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు జోరుగా సాగుతున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో 22 శాతం అధికంగా 27 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బంగారం దిగుమతులు 22 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత పండుగల సీజన్ దిగుమతులు పెరగడానికి కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అత్యధికంగా స్విట్జర్లాండ్ 40 శాతం మేర మన దేశానికి బంగారం ఎగుమతి చేయగా, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా ఆక్రమించాయి. దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం దిగుమతుల వాటా 5 శాతంగా ఉంటుంది. బంగారం దిగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) మొదటి ఆరు నెలల్లో (సెప్టెంబర్ చివరికి) 137.44 బిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వాణిజ్య లోటు 119.24 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనించొచ్చు. బంగారానికి చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద వినియోగదారుగా భారత్ ఉంటోంది. వెండి దిగుమతులు సైతం 376 శాతం పెరిగి 2.3 బిలియన్ డాలర్లుగా ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి నమోదయ్యాయి. కరెంటు ఖాతా లోటు ఒక శాతం ఎగసి 9.7 బిలియన్ డాలర్లకు చేరింది. -
పసిడి డిమాండ్‌కు ధరల చెక్
ముంబై: భారత్‌లో పసిడి పరిమాణం డిమాండ్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 5 శాతానికిపైగా పతనమైంది. 2023 ఇదే కాలంతో పోలి్చతే డిమాండ్ పరిమాణం 158.1 టన్నుల నుంచి 149.7 టన్నులకు పడిపోయింది. అధిక ధరలు, దీనితో కొనుగోళ్లు త్గగడం దీనికి కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) జూన్ త్రైమాసిక గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక పేర్కొంది. ఈ నెల 23వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కస్టమ్స్ సుంకాలను 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో బంగారం ధరలు భారీగా పడిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి డిమాండ్‌కు ఏమాత్రం దోహదపడిందన్న అంశం ఆగస్టు త్రైమాసికంలో తెలియనుంది. తాజా డబ్ల్యూజీసీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... → జూన్ త్రైమాసికం డిమాండ్ పరిమాణంలో తగ్గినా.. విలువలో మాత్రం 17 శాతం పెరిగి రూ.82,530 కోట్ల నుంచి రూ.93,850 కోట్లకు ఎగసింది. → 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.74,000 దాటితే, సగటు ధర ఇదే కాలంలో రూ.52,191.60 నుంచి రూ.62,700.50కు ఎగసింది. (దిగుమతి సుంకం, జీఎస్టీ మినహా). అంతర్జాతీయంగా చూస్తే, ఔన్స్ (31.1గ్రాములు) ధర ఇదే కాలంలో 1,975.9 డాలర్ల నుంచి 2,338.2 డాలర్లకు ఎగసింది. (అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయర్క్ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో జూలై 16వ తేదీన ఔన్స్ ధర ఆల్‌టైమ్ హై 2,489 డాలర్లను తాకిన సంగతి తెలిసిందే) → ఇక జూన్ త్రైమాసికంలో ఆభరణాలకు పరిమాణ డిమాండ్ 17 శాతం పడిపోయి 128.6 టన్నుల నుంచి 106.5 టన్నులకు చేరింది. → ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ మాత్రం ఇదే కాలంలోలో 46 శాతం పెరిగి 29.5 టన్నుల నుంచి 43.1 టన్నులకు ఎగసింది. → రీసైకిల్డ్ గోల్డ్ పరిమాణం 39 శాతం తగ్గి 37.6 టన్నుల నుంచి 23 టన్నులకు పడింది. → దిగుమతులు 8 శాతం పెరిగి 182.3 టన్నుల నుంచి 196.9 టన్నులకు ఎగసింది.గ్లోబల్ డిమాండ్ 4 శాతం అప్మరోవైపు అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ జూన్ త్రైమాసికంలో 4 శాతం పెరిగి 1,207.9 టన్నుల నుంచి 1,258.2 టన్నులకు ఎగసింది. హోల్‌సేల్, స్పాట్‌సహా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగడం, ఈటీఎఫ్ అవుట్ఫోస్లో మందగమనం దీనికి కారణం. గోల్డ్ సరఫరా 4 శాతం పెరిగి 929 టన్నులుగా ఉంది.ఎదురుగాలిలోనూ ముందుకే.. బంగారానికి ఎదురుగాలి వీసే అవకాశం ఉంది. అయినప్పటికీ, గ్లోబల్ మార్కెట్లో కూడా మార్పులు జరుగుతున్నాయి, ఇవి బంగారం డిమాండ్‌కు మద్దతునిస్తాయి. డిమాండ్‌ను మరింత పెంచుతాయి. – లూయిస్ స్ట్రీట్, డబ్ల్యూజీసీ సీనియర్ మార్కెట్స్ విశ్లేషకురాలు -
World Gold Council 2023: పడినా... పసిడిది పైచేయే..!
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2023లో 3 శాతం క్షీణించి 747.5 టన్నులకు చేరుకుంది. అయితే ధరలు తగ్గుముఖం పట్టి, అస్థిర పరిస్థితులు తొలగిపోయిన పక్షంలో డిమాండ్ రానున్న కాలంలో 800–900 టన్నుల మధ్య ఉండవచ్చు. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన 2023 ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. 2022లో భారత్ మొత్తం పసిడి డిమాండ్ 774.1 టన్నులు. నివేదికలోని కొన్ని అంశాలను పరిశీలిస్తే... ► పెరుగుతున్న బంగారం ధరలకు తోడు ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు 2023 డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. కొనుగోళ్లపట్ల వినియోగదారుల ఆసక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, వాణిజ్య సెంటిమెంట్ బలహీనంగా ఉంది. 2023 మే 4వ తేదీన దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర కొత్త గరిష్టం రూ.61,845కు చేరింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఔన్స్ 2,083 డాలర్లకు ఎగసింది. ఇక దేశీయ మార్కెట్లో ధర నవంబర్ 16న మరో కొత్త గరిష్టం రూ.61,914కు చేరింది. ► 2019 నుండి బంగారం డిమాండ్ 700–800 టన్నుల శ్రేణిలోనే ఉంటోంది. తగ్గిన డిమాండ్, నిరంతర ధరలు అలాగే సుంకాల పెరుగుదల, స్టాక్ మార్కెట్ పనితీరు, సమీప కాల ఎన్నికల ఖర్చు ప్రభావం దీనికి కారణం. అయితే భవిష్యత్తులో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ధరలు అధిక స్థాయిలోనే ఉంటాయన్న విషయాన్ని మార్కెట్ జీరి్ణంచుకుంటుండడం ఈ సానుకూల అంచనాలకు కారణం. ► ఇక మొత్తం ఆభరణాల డిమాండ్ 6 శాతం తగ్గి 562.3 టన్నులకు పడింది. 2022లో ఈ పరిమాణం 600.6 టన్నులు. ► పెట్టుబడుల డిమాండ్ మాత్రం 7 శాతం పెరిగి 173.6 టన్నుల నుంచి 185.2 టన్నులకు ఎగసింది. దిగుమతులు 20 శాతం అప్ కాగా మొత్తం పసిడి దిగుమతులు 2023లో 20 శాతం పెరిగి 650.7 టన్నుల నుంచి 780.7 టన్నులకు ఎగశాయి. 2024లో డిమాండ్‌కన్నా పసిడి దిగుమతులు అధికంగా ఉండే అవకాశం ఉందని అవుట్‌లుక్ ఆవిష్కరణ సందర్భంగా డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (ఇండియా) పీఆర్ సోమశేఖర్ పేర్కొన్నారు. భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) దీనికి కారణం అవుతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–డిసెంబర్ మధ్యకాలంలో 26.7 శాతం పెరిగి 35.95 బిలియన్ డాలర్లకు పసిడి దిగుమతులు చేరుకున్నట్లు నివేదిక వివరించింది. భారీ డిమాండ్ దీనికి కారణం. ప్రపంచ డిమాండ్ కూడా 5 శాతం డౌన్ ఇదిలావుండగా, 2023లో ప్రపంచ పసిడి డిమాండ్ 5 శాతం తగ్గి 4,448.4 టన్నులకు పడినట్లు నివేదిక పేర్కొంది. ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) భారీ ఉపసంహరణలు దీనికి కారణం. నివేదిక ప్రకారం ఇలాంటి పరిస్థితి వరుసగా ఇది మూడవ సంవత్సరం. ఈటీఎఫ్‌ల ఉపసంహరణల పరిమాణం 2022లో 109.5 టన్నులు. అయితే 2023లో ఈ పరిమాణం ఏకంగా 244.4 టన్నులకు ఎగసింది. కాగా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు 2022లో 1,082 టన్నులు అయితే 2023లో ఈ పరిమాణం 45 టన్నులు తగ్గి 1,037 టన్నులకు పడింది. అయితే సెంట్రల్ బ్యాంకుల అత్యధిక కొనుగోళ్లకు సంబంధించి ఈ రెండు సంవత్సరాలూ రికార్డుగా నిలిచాయి. ఇక భారత్ రిజర్వ్ బ్యాంక్ తన పసిడి నిల్వలను 2022లో 32 టన్నులు పెంచుకుంటే, 2023లో 16.2 టన్నులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారత్ దాదాపు 600 బిలియన్ డాలర్లకుపైగా విదేశీ మారకపు ద్రవ్య నిల్వల్లో పసిడి వాటా 48 బిలియన్ డాలర్లు. -
2024లో బంగారం డిమాండ్ మరింత పైపైకి - కారణం ఇదే..
భారతదేశంలో ఇప్పటికే బంగారం ధరలు చుక్కలు తాకుతున్నాయి. రానున్న రోజుల్లో (2024) పసిడికి మరింత డిమాండ్ ఏర్పడుతుందని, కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని 'వరల్డ్ గోల్డ్ కౌన్సిల్' (WGC) వెల్లడించింది. 2024లో గోల్డ్ రేటు పెరగటానికి కారణం ఏంటి? భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం, భారతదేశంలో వేతనాలు పెరగడం, యువ జనాభా సంఖ్య, పట్టణీకరణ కారణంగానే బంగారానికి డిమాండ్ భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్కువమంది బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతుండంతో తులం బంగారం ధరలు రూ. 60వేలు దాటేసింది. రాబోయే రోజుల్లో ఇది రూ. 70వేలుకి చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బంగారం మీద భారతీయులకు ఉన్న మక్కువ కారణంగానే.. చాలా మంది ఎప్పటికప్పుడు గోల్డ్ కొనేస్తూ ఉన్నారు, దీంతో బంగారానికి డిమాండ్ పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టం చేసింది. పెరగనున్న పనిచేసే వారి సంఖ్య ప్రస్తుతం ఇతరులపై ఆధారపడి జీవించే వారి కంటే.. పనిచేసుకుంటూ ఎదుగుతున్న జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ కేటగిరిలో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్కులు ఉన్నారు. దీంతో భారత్ ఆర్ధిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందని, ఇది 2040 వరకు కొనసాగే అవకాశం ఉందని కూడా నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: అనుకున్నది సాధించడమంటే ఇదే.. వీడియో వైరల్ 2000 నుంచి 2010 మధ్య కాలంలో బంగారానికి ఉన్న డిమాండ్ సుమారు 40 శాతానికి పైగా పెరిగింది. అంటే బంగారం అమ్మకాలు భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, పేరంటాలు ఇలా అన్ని కార్యక్రమాలకు బంగారు ఆభరణాలను వేసుకోవడం అలవాటు అయిపోవడంతో నగలు ఎక్కువగా కొంటున్నారు. సిటీలో ఉండేవారు గోల్డ్ కాయిన్స్ రూపంలో లేదా బంగారు కడ్డీల (గోల్డ్ బార్) రూపంలో కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
బంగారానికి భారీగా పెరిగిన డిమాండ్.. ధరల తగ్గుముఖం, పండుగలతో ఊపు!
న్యూఢిల్లీ: భారత్ పసిడి డిమాండ్ 2023 క్యాలెండర్ ఇయర్ మూడవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 10 శాతం పెరిగి 191.7 టన్నుల నుంచి 210.2 టన్నులకు ఎగసింది. పసిడి కొనుగోళ్లకు పవిత్రమైనదిగా భావించే ధన్‌తేరాస్ కొనుగోళ్లు భారీగా జరుగుతాయన్న విశ్వాసాన్ని పరిశ్రమ వ్యక్తం చేస్తోంది. ధరలు కొంత తగ్గడం, పండుగల డిమాండ్ దీనికి కారణం. చైనా తర్వాత పసిడి కొనుగోళ్లకు రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ సెప్టెంబర్ త్రైమాసికం డిమాండ్‌పై ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు.. వాణిజ్య వర్గాల అభిప్రాయం ప్రకారం, 10 గ్రాముల ధర రూ.60,000 వరకూ కొంత ఆమోదయోగ్యమైనదిగా వినియోగదారులు భావిస్తున్నారు. అంతకన్నా తక్కువ ధరలో పసిడి భారీ కొనుగోళ్లు జరగొచ్చని అంచనా. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 7 శాతం పెరిగి 146.2 టన్నుల నుంచి 155.7 టన్నులకు చేరింది. ఇదే కాలంలో కడ్డీలు, నాణేల డిమాండ్ 20 శాతం ఎగిసి 45.4 టన్నుల నుంచి 54.5 టన్నులకు ఎగసింది. కడ్డీలు, నాణేల విభాగంలో డిమాండ్ 2015 గరిష్ట స్థాయిని చూసింది. మూడవ త్రైమాసికంలో పసిడి దిగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 184.5 టన్నుల నుంచి 220 టన్నులకు ఎగసింది. తొమ్మిది నెలల్లో 481.2 టన్నుల డిమాండ్.. 2023 మొదటి 9 నెలల్లో బంగారం డిమాండ్ 481.2 టన్నులు. సంవత్సరం మొత్తంలో డిమాండ్ 700–750 టన్నులు ఉంటుందని అంచనా. 2022 డిమాండ్ 774 టన్నులతో పోల్చితే తగ్గడం గమనార్హం. అయితే దిగుమతులు మాత్రం పెరుగుతాయని అంచనా. 2022లో యల్లో మెటల్ దిగుమతులు 650.7 టన్నులు కాగా, 2023 సెప్టెంబర్ వరకూ జరిగిన దిగుమతుల విలువ 563 టన్నులు. అంతర్జాతీయంగా డిమాండ్ 6 శాతం డౌన్ ఇదిలాఉండగా, అంతర్జాతీయంగా మూడవ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 6 శాతం పడిపోయి 1,147.5 టన్నులకు చేరింది. సెంట్రల్ బ్యాంకుల నుంచి తగ్గిన కొనుగోళ్లు, కడ్డీలు, నాణేల డిమాండ్ తగ్గడం దీనికి కారణమని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది. చైనా డిమాండ్ మూడవ త్రైమాసికంలో 242.7 టన్నుల నుంచి స్వల్పంగా 247 టన్నులకు ఎగసింది. -
పసిడి డిమాండ్‌కు ధర దడ
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) 18 శాతం పడిపోయింది. 135.5 టన్నులుగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో ఈ డిమాండ్ 165.8 టన్నులు. బంగారం ధరలు భారీగా పెరగడమే డిమాండ్ తగ్గడానికి కారణం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది. ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2022 క్యూ1’ పేరుతో విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► విలువ పరంగా జనవరి–మార్చి కాలంలో బంగారం డిమాండ్ 12 శాతం తగ్గి రూ.61,550 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది కాలంలో ఈ విలువ రూ.69,720 కోట్లు. ► జనవరిలో బంగారం ధరలు పెరగడం ప్రారంభమైంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10 గ్రాముల ధర (పన్నులు లేకుండా) 8 శాతం పెరిగి రూ. 45,434కు చేరుకుంది. ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి కారణం. 2021 జనవరి– మార్చి మధ్య ధర రూ.42,045గా ఉంది. ► మార్చి త్రైమాసికంలో దేశంలో మొత్తం ఆభరణాల డిమాండ్ 26 శాతం తగ్గి 94.2 టన్నులకు పడిపోయింది. గతేడాది ఇదే కాలంలో ఇది 126.5 టన్నులు. ► ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విలువ పరంగా ఆభరణాల డిమాండ్ 20 శాతం క్షీణించి రూ.42,800 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.53,200 కోట్లు. ► 2021 నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్–నవంబర్–డిసెంబర్) ధర రికార్డు స్థాయికి పెరిగిన తర్వాత, భారత్ బంగారు ఆభరణాల డిమాండ్ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 26 శాతం తగ్గి 94 టన్నులకు పడిపోయింది. 2010 నుండి (మహమ్మారి కాలాలను మినహాయించి) భారత్ బంగారు ఆభరణాల డిమాండ్ 100 ట న్నుల దిగువకు పడిపోవడం ఇది మూడవసారి. ► శుభ దినాల సందర్భాల్లో నెలకొన్న మహమ్మారి భయాలు, బంగారం ధరలు గణనీయంగా పెరగడం వంటి అంశాలు రిటైల్ డిమాండ్ తగ్గడానికి కారణం. ఆయా కారణాలతో కుటుంబాలు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకున్నాయి. ► ఈ ఏడాది మొత్తంగా బంగారానికి డిమాండ్ 800–850 టన్నులు ఉండవచ్చు. ► కాగా, మార్చి త్రైమాసికంలో బంగారం విషయంలో పెట్టుబడి డిమాండ్ 5 శాతం పెరిగి 41.3 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 39.3 టన్నులు. ► విలువ పరంగా బంగారం పెట్టుబడి డిమాండ్ 13 శాతం పెరిగి రూ.18,750 కోట్లకు చేరుకుంది. ఇది 2021 అదే త్రైమాసికంలో రూ.16,520 కోట్లు. ► పెట్టుబడుల్లో ప్రధానంగా బంగారు కడ్డీలు, నాణేలు ఉన్నాయి. వీటి డిమాండ్ 5 శాతం పెరిగి 41 టన్నులకు చేరింది. ధరలు పెరగడం, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా బంగారాన్ని ఎంచుకోవడం, ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలు పసిడి పెట్టుబడుల డిమాండ్‌కు మద్దతునిచ్చాయి. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. ఈ కాలంలో సెంట్రల్ బ్యాంక్ 8 టన్నులను కొనుగోలు చేసింది. సెంట్రల్ బ్యాంక్ 2017 చివరి నుండి బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుండి 200 టన్నులను కొనుగోలు చేసింది. ► 2022 మొదటి త్రైమాసికంలో దేశంలో రీసైకిల్ అయిన మొత్తం బంగారం 88 శాతం పెరిగి 27.8 టన్నులకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 14.8 టన్నులు. ► మార్చి త్రైమాసికంలో మొత్తం నికర బులియన్ దిగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 313.9 టన్నుల నుంచి 58 శాతం తగ్గి 132.2 టన్నులకు పడిపోయాయి. అంతర్జాతీయంగా మెరుపులు... కాగా, మార్చి త్రైమాసికంలో అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 34 శాతం పెరిగి 1,234 టన్నులకు చేరింది. అంతర్జాతీయ ఉద్రిక్తలు, ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు పసిడివైపు చూడ్డం, వంటి అంశాలు దీనికి కారణం. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి డిమాండ్ భారీగా వచ్చిందని నివేదిక గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1, 2022 నివేదిక పేర్కొంది. 2021 మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ 919.1 టన్నులు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా, అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులలో బంగారం కోసం డిమాండ్ వంటి అంశాలు యరో మెటల్‌కు ఆకర్షణ తీసుకుని వస్తాయిన డబ్ల్యూజీసీ సీనియర్ విశ్లేషకులు లూయిస్ స్ట్రీట్ పేర్కొన్నారు. పలు అంశాల ప్రభావం ధరలపై మార్కెట్లో మిశ్రమ ధోరణి, చైనా నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో కోవిడ్‌పై అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు, భౌగోళిక సంఘర్షణలు వంటి అంశాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వీటితోపాటు గ్రామీణ మార్కెట్లలో డిమండ్ పునరుద్ధరణ, సాధారణ రుతుపవన అంశాలు కూడా యల్లో మెటల్ డిమాండ్‌పై ప్రభావం చూపుతాయి. – పీఆర్ సోమసుందరం, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ -
ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట!
బంగారానికి పసిడి, సువర్ణం, సురభి, కాంచనం, హిరణ్యం.. వంటి అనేక పేర్లున్నాయి. ఏ పేరుతో పిలిచినా పుత్తడి లోహం మాత్రం చాలా విలువైనది. అంత విలువైన బంగారంతో తయారుచేసిన కనకాభరణాలంటే మోజు పడనివారంటూ ఉండరేమో! బంగారం ఆకర్షణీయంగా ఉండటమేకాకుండా విలువకూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇక మనదేశంలో ఐతే బంగారాన్నిఏకంగా ఆస్తిగా భావిస్తారు. ఇంత విలువైన బంగారం గనుల నుంచి లభ్యమౌతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఐతే ప్రపంచంలోనే అత్యధికం బంగారం ఏక్కడ లభ్యమౌతుంది? అక్కడ ఎంత బంగారం వెలికితీస్తున్నారో? దాని విలువ ఎంతుంటుందో?.. ఎప్పుడైనా ఆలోచించారా! ఆ విశేషాలు మీ కోసం.. అతిపెద్ద గోల్డ్ మైన్.. ప్రపంచదేశాలకు ఎగుమతి.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గనుల నుంచి బంగారం లభ్యమవుతున్నా.. అత్యధిక బంగారాన్ని మాత్రం నెవాడా బంగారం గని నుంచే లభ్యమవుతుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ మైన్. అమెరికాలోని నెవాడా సిటీలో ఈ బంగారం గని ఉంది. ఈ బంగారం గని సంవత్సరానికి లక్షల కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇక్కడి నుంచి బంగారం ఎగుమతి అవుతుంది. అంటే ఈ బంగారం గని ద్వారా ఏటా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో అంచనా వేయండి. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. ఇప్పటివరకు ఎంత బంగారం తవ్వారంటే.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ఆధారంగా ‘స్టాటిస్టా’ రూపొందించిన జాబితా ప్రకారం నెవాడా బంగారం గని నుంచి ప్రతీ ఏట 1 లక్ష 70 వేల కిలోల వరకు బంగారం తవ్వబడుతుంది. దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం ఎగుమతి అవుతుందట. 1835 నుండి 2017 వరకు నెవాడా దాదాపుగా 20,59,31,000 ట్రాయ్ ఔన్సుల బంగారాన్ని ఉత్పత్తి చేసిందని ఆ నివేదిక వెల్లడించింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మొత్తం ప్రపంచ జనాభాలో 5 శాతం ఇక్కడే ఉన్నారని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఏదిఏమైనా పసుపు రంగులో మెరిసిపోయే బంగారం చూడటానికే కాదు... దాని విశేషాలు వినడానికి కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి కదా!! చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
బంగారం డిమాండ్ పదిలం!
ముంబై: బంగారం డిమాండ్ మళ్లీ పుంజుకుంటోంది. 2021 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే పసిడి డిమాండ్ 47 శాతం పెరిగింది. పరిమాణంలో 139.1 టన్నులుగా నమోదయ్యింది. మహమ్మారి సవాళ్ల తగ్గి, ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో బంగారానికి తిరిగి వినియోగ డిమాండ్ ఏర్పడుతున్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. డబ్ల్యూజీసీ ఆవిష్కరించిన క్యూ3 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2021 నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2020 సెప్టెంబర్ త్రైమాసికంలో దేశం మొత్తం డిమాండ్ 94.6 టన్నులు. అప్పటితో పోల్చితే 47 శాతం పెరిగి 139.1 టన్నులకు చేరింది. విలువ పరంగా, భారతదేశం మూడవ త్రైమాసిక బంగారం డిమాండ్ 37 శాతం పెరిగి రూ. 59,330 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం రూ.43,160 కోట్లు. ► ఇది తక్కువ బేస్ ఎఫెక్ట్ అలాగే సానుకూల వాణిజ్యం, వినియోగదారుల మనోభావాల మేళవింపును ఇది ప్రతిబింబిస్తుంది. వ్యాక్సినేషన్ విస్తృతి, ఆర్థిక కార్యకలాపాల్లో బలమైన పురోగతి బంగారం కొనుగోళ్లు భారీగా పెరగడానికి కారణం. ► దేశవ్యాప్తంగా ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్నందున, రిటైల్ డిమాండ్ కోవిడ్–పూర్వ స్థాయికి పుంజుకుంది. రాబోయే పండుగలు, వివాహాల సీజన్‌తో బంగారం డిమాండ్ మరింత పెరిగే వీలుంది. బంగారానికి ఇంతటి డిమాండ్ నెలకొనడం కోవిడ్ మహమ్మారి సవాళ్లు విసరడం ప్రారంభించిన తర్వాత ఇదే మొదటిసారి. ► డిజిటల్ బంగారానికి డిమాండ్ పలు రెట్లు పెరిగింది. వినూత్న సాంకేతిక చొరవలు, ప్రముఖ ఆభరణాల యూపీఐ ప్లాట్‌ఫారమ్‌ల వంటి అంశాలు ఆన్లైన్ కొనుగోళ్లను ఇష్టపడే కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల సంఖ్యను పెంచడానికి గణనీయంగా దోహదపడుతుండడం గమనార్హం. ► రాబోయే నెలల్లో కమోడిటీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రావాణా వ్యయాలు భారం పెరుగుతుంది. ఆయా అంశాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయవచ్చు. ఇది దీర్ఘకాలంలో బంగారం డిమాండ్ మరింత పటిష్టం కావడానికి కలిసివచ్చే అంశం. ► సెప్టెంబర్ త్రైమాసికంలో దేశం మొత్తం ఆభరణాల డిమాండ్ 58 శాతం పెరిగి 96.2 టన్నులకు చేరుకుంది. 2020 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ పరిమాణం 60.8 టన్నులు. విలువలో ఆభరణాల డిమాండ్ 48 శాతం పెరిగి రూ.41,030 కోట్లకు చేరింది, ఇది ఏడాది క్రితం రూ.27,750 కోట్లు. ► మూడవ త్రైమాసికంలో మొత్తం పెట్టుబడి డిమాండ్ 27 శాతం పెరిగి 42.9 టన్నులకు చేరుకుంది. 2020 అదే త్రైమాసికంలో ఈ డిమాండ్ 33.8 టన్నులు. విలువ పరంగా, జూలై–సెప్టెంబర్‌లో బంగారం ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 19 శాతం పెరిగి రూ.18,300 కోట్లకు చేరుకుంది.ఇది ఏడాది క్రితం రూ.15,410 కోట్లు. ► సమీక్షా కాలంలో భారతదేశంలో రీసైకిల్ చేసిన మొత్తం బంగారం 50 శాతం క్షీణించి 20.7 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 41.5 టన్నులు. బంగారం రీసైక్లింగ్‌లో 50 శాతం తగ్గుదలను పరిశీలిస్తే, బంగారాన్ని విక్రయించడం కంటే బంగారాన్ని కలిగి ఉండాలనే బలమైన వినియోగదారు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. ► బలమైన సంస్థాగత మార్కెట్ల దన్నుతో బంగారంపై రుణాల మార్కెట్ కూడా భారీగా పెరుగుతుండడం గమనార్హం. ► పన్నులు లేకుండా మొత్తం నికర బులియన్ దిగుమతులు మూడవ త్రైమాసికంలో 187 శాతం పెరిగి 255.6 టన్నులకు చేరింది. 2020 ఇదే త్రైమాసికంలో ఈ పరిమాణం 89 టన్నులు. ► మూడో త్రైమాసికంలో బంగారం ధర సగటున 10 గ్రాములకు రూ.42,635గా ఉంది. 2020 ఇదే త్రైమాసికంలో ఈ ధర రూ.45,640. 2021 ఏప్రిల్–జూన్‌లో సగటు ధర రూ.43,076. ► వివిధ కొనుగోలుదారు–విక్రేతల సమావేశాల సందర్భంలో వచ్చిన అభిప్రాయాలను, పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలనూ పరిశీలిస్తే నాల్గవ త్రైమాసికం పండుగ సీజన్లో పసిడి డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. దిగుమతులూ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా డౌన్ మరోవైపు అంతర్జాతీయంగా సెప్టెంబర్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 7 శాతం తగ్గింది. డిమాండ్ 831 టన్నులకు తగ్గినట్లు డబ్ల్యూజీసీ పేర్కొంది. గోల్డ్ ఎక్ఛ్సేంజ్ ట్రేడెట్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్) నుంచి భారీగా డబ్బు వెనక్కు వెళ్లినట్లు గణాంకాలు వెల్లడించాయి. మూడవ త్రైమాసికంలో సగటున ఔన్స్ (31.1గ్రాములు) ధర 6 శాతం తగ్గి, 1,790 డాలర్లకు చేరింది. 2020 ఇదే కాలంలో ఈ ధర 1,900 డాలర్లు. ఆభరణాలకు డిమాండ్ 33 శాతం పెరిగి 443 టన్నులకు చేరింది. టెక్నాలజీలో పసిడి వినియోగం 9 శాతం పెరిగి 83.8 టన్నులకు ఎగసింది. సెంట్రల్ బ్యాంకులు తమ పసిడి నిల్వలను మొత్తంగా 69 టన్నులు పెంచుకున్నాయి. 2020 ఇదే కాలంలో 10 టన్నుల విక్రయాలు జరిపాయి. కాగా సరఫరాలు మాత్రం మూడు శాతం తగ్గి 1,279 డాలర్ల నుంచి 1,239 డాలర్లకు పడింది. -
2020లో బంగారం డిమాండ్ ఢమాల్
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2020లో భారీగా 35 శాతం పడిపోయింది. 446.4 టన్నులుగా నమోదయ్యింది. 2019లో 690.4 టన్నులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కఠిన లాక్డౌన్ పరిస్థితులు, ఉపాధి అవకాశాలకు అవరోధాలు, ఆదాయాలు పడిపోవడం, అధిక ధరలు వంటి పలు అంశాలు దీనికి కారణం. అయితే పటిష్ట ఆర్థిక రికవరీ నేపథ్యంలో 2021లో తిరిగి బంగారం డిమాండ్ పుంజుకునే అవకాశం ఉంది. అధిక స్థాయికి చేరిన ఈక్విటీ మార్కెట్లు, తక్కువ స్థాయి వడ్డీరేట్లు కూడా ఇందుకు దోహదపడతాయి. ‘‘2020 పసిడి డిమాండ్ ధోరణులు’’ అన్న శీర్షికన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) గురువారం విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాలను తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► 2020లో విలువ రూపంలో పసిడి డిమాండ్ 14 శాతం పడిపోయి రూ.1,88,280 కోట్లకు చేరింది. 2019లో ఈ విలువ రూ.2,17,770 కోట్లు. ► ఆభరణాల డిమాండ్ పరిమాణం రూపంలో 42 శాతం పడిపోయి 544.6 టన్నుల నుంచి 315.9 టన్నులకు చేరింది. ఇందుకు సంబంధించి విలువ 22.42 శాతం తగ్గి రూ.1,71,790 కోట్ల నుంచి రూ.1,33,260 కోట్లకు పడింది. ► పసిడి దిగుమతులు 47 శాతం పడిపోయి 646.8 టన్నుల నుంచి 344.2 టన్నులకు చేరాయి. అయితే డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 19 శాతం పెరిగి (2019 ఇదే కాలంతో పోల్చి) చేరడం గమనార్హం. లాక్డౌన్ నిబంధనల సడలింపు దీనికి కారణం. ► 2020 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో డిమాండ్ కేవలం 4శాతం పడిపోయి పరిమాణం 194.3 టన్నుల నుంచి 186.2 టన్నులకు చేరడం గమనార్హం. వినియోగ సెంటిమెంట్ మెరుగవుతుండడాన్ని ఇది సూచిస్తోంది. పండుగలు, పెండ్లి సీజన్ కూడా దీనికి కలిసి వచ్చింది. 11 సంవత్సరాల కనిష్టానికి గ్లోబల్ గోల్డ్ డిమాండ్ కాగా అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 2020లో 11 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిందని డబ్ల్యూజీసీ నివేదిక వివరించింది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమాండ్ 3,759.6 టన్నులని పేర్కొంది. 2019లో ఈ పరిమాణం 4,386.4 టన్నులు. 2009లో 3,385.8 టన్నులు. కోవిడ్ 19 ప్రేరిత సవాళ్లే పసిడి డిమాండ్ భారీ పతనానికి కారణమని డబ్ల్యూజీసీ వివరించింది. ఒక్క నాల్గవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) చూస్తే, ఏకంగా పసిడి డిమాండ్ 28 శాతం పడిపోయి 1,082.9 టన్నుల నుంచి 783.4 టన్నులుకు పడింది. ఒక్క ఆభరణాల డిమాండ్ నాల్గవ త్రైమాసికంలో 13 శాతం పడిపోయి 590.1 టన్నుల నుంచి 515.9 టన్నులకు చేరింది. ఏడాదిలో ఈ డిమాండ్ 34 శాతం పడిపోయి 2,122.7 టన్నుల నుంచి 1,411.6 టన్నులకు కుదేలయ్యింది. కాగా, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడుల డిమాండ్ 40 శాతం పెరిగి 1,269.2 టన్నుల నుంచి 1,773.2 టన్నులకు ఎగసింది. ఇందులో అధిక వాటా గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌ది కావడం గమనార్హం. ఈటీఎఫ్‌ల డిమాండ్ ఏకంగా 120 శాతం పెరిగి 398.3 టన్నుల నుంచి 877.1 టన్నులకు చేరింది. సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు 59 శాతం తగ్గి 668.5 టన్నుల నుంచి 273 టన్నులకు చేరాయి. -
బంగారం డిమాండ్ 70% డౌన్
ముంబై: భారత్ పసిడి డిమాండ్ ఏప్రిల్–జూన్ మధ్య 70 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక పేర్కొంది. కోవిడ్–19 నేపథ్యంలో మార్చి 25 నుంచి విధించిన లాక్డౌన్ ప్రభావం, అధిక ధరల వంటి అంశాలు డిమాండ్ భారీ పతనానికి కారణమని వివరించింది. ‘క్యూ2 పసిడి డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో విడుదలైన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2019 రెండవ త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో పసిడి డిమాండ్ 213.2 టన్నులు. ఈ పరిమాణం 2020 ఇదే నెలల మధ్య 63.7 టన్నులకు పరిమితమైంది. ► ఇక డిమాండ్ విలువ విషయానికి వస్తే, 57 శాతం పతనమై రూ.62,420 కోట్ల నుంచి రూ.26,600 కోట్లకు క్షీణించింది. ► ఆభరణాల డిమాండ్ పరిమాణంలో 74 శాతం తగ్గి 168.6 టన్నుల నుంచి 44 టన్నులకు పడింది. విలువలో చూస్తే, 63 శాతం పడిపోయి, రూ.49,380 కోట్ల నుంచి రూ. 18,350 కోట్లకు చేరింది. పెళ్లిళ్లు జరక్కపోవడం, భవిష్యత్తుపై అనిశ్చితి వాతావరణం వంటి అంశాలు దీనికి కారణం. ► ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, పరిమాణం డిమాండ్ 56 శాతం క్షీణించి 44.5 టన్నుల నుంచి 19.8 టన్నులకు జారింది. విలువల్లో 37 శాతం క్షీణించి 13,040 కోట్ల నుంచి రూ.8,250 కోట్లకు చేరింది. ► పసిడి రీసైకిల్డ్ పరిమాణం కూడా 64 శాతం క్షీణతతో 37.9 టన్నుల నుంచి 13.8 టన్నులకు దిగివచ్చింది. నేషనల్ లాక్‌డౌన్‌తో రిఫైనరీలు మూతపడ్డం దీనికి ప్రధాన కారణం. ► పసిడి దిగుమతులు భారీగా 95 శాతం క్షీణించి 247.4 టన్నుల నుంచి కేవలం 11.6 టన్నులకు పరిమితం. ► కాగా 2020 మొదటి ఆరునెలల్లో భారత్ పసిడి డిమాండ్ 56 శాతం పతనమై 165.6 టన్నులకు క్షీణించింది. పెట్టుబడులు అదుర్స్... పసిడి అంతర్జాతీయంగా డిమాండ్ సైతం ఏప్రిల్–జూన్ మధ్య 11 శాతం పడిపోయింది. 2019 ఇదే కాలంలో పోల్చి చూస్తే డిమాండ్ 1,136.9 టన్నుల నుంచి 1,015.7 టన్నులకు క్షీణించినట్లు డబ్ల్యూజీసీ తాజా నివేదిక పేర్కొంది. అయితే పెట్టుబడులకు సంబంధించి డిమాండ్ మాత్రం భారీగా పెరగడం గమనార్హం. జీవితకాల గరిష్ట స్థాయిల్లో ధర... మరోవైపు పసిడి ధరలు అంతర్జాతీయంగా జీవితకాల గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వారం మొదట్లో సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ఔన్స్ (31.1 గ్రా) ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన తర్వాత తిరిగి అంతకన్న కిందకు దిగిరాలేదు. అటు తర్వాత రెండు రోజుల్లో 1,974.7 డాలర్లకు చేరి సరికొత్త రికార్డును సృష్టించిన ధర గురువారం 1,936–1,965 డాలర్ల శ్రేణిలో ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే, అంతర్జాతీయ దూకుడు ధోరణికితోడు రూపాయి బలహీన ధోరణి (ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గురువారం డాలర్ మారకంలో ముగింపు 74.84) పసిడికి వరంగా మారుతోంది. స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.53,000– రూ.54,000 మధ్య తిరుగుతుండగా, ఆభర ణాల బంగారం రూ.50,000పైనే ట్రేడవుతోంది. -
37% మహిళల వద్ద బంగారం లేదు
ముంబై: వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. మన దేశంలోని 37 శాతం మంది ఇంత వరకు బంగారం ఆభరణాలను కొనుగోలు చేయలేదట. ప్రపంచ స్వర్ణ మండలి సంస్థ (డబ్ల్యూజీసీ) ఒక సర్వే చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించింది. కాకపోతే భవిష్యత్తులో బంగారం ఆభరణాలను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్టు వారు చెప్పారు. ‘‘37 శాతం మంది మహిళలు కొనుగోలు సామర్థ్యంతో ఉన్నారు. బంగారం ఆభరణాల పరిశ్రమకు వారు కొత్త వినియోగదారులు కానున్నారు. వీరిలో 44 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 30 శాతం మంది పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నారు’’ అని డబ్ల్యూజీసీ భారత ఆభరణాల పరిశ్రమపై విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మన దేశ మహిళలకు బంగారం ఆభరణాలు మొదటి ప్రాధాన్యమన్న విషయం తెలిసిందే. బంగారం మన్నిౖMðనదే కాకుండా, చక్కని పెట్టుబడి సాధనమని, కుటుంబ వారసత్వ సంపదంటూ.. మహిళలకు ఇది చక్కని ఎంపిక అని ఈ సర్వే పేర్కొంది. అయితే, నేటి యువ మహిళల అవసరాలను పసిడి తీర్చలేకపోతుందని తెలిపింది. ఇక 18–24 ఏళ్ల వయసున్న భారతీయ మహిళలలో 33 శాతం మం ది గడిచిన ఏడాది కాలంలో బంగారం ఆభరణాలను కొనుగోలు చేసినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. -
భారీగా తగ్గిన పసిడి డిమాండ్
♦ జనవరి-మార్చి నెలల్లో 39% డౌన్ ♦ వర్తకుల సమ్మె ప్రధాన కారణం ♦ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలో వెల్లడి... ముంబై: భారత్‌లో పసిడి డిమాండ్ 2016 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) భారీగా పడిపోయింది. 2015 ఇదే కాలంలో డిమాండ్ 192 టన్నుల డిమాండ్ ఉంటే- 2016 ఇదే కాలంలో ఈ డిమాండ్ 39 శాతం తగ్గి 117 టన్నులకు పడిపోయింది. వెండి యేతర ఆభరణాలపై ఒకశాతం ఎక్సైజ్ సుంకం విధింపు, దీనిని నిరసిస్తూ ఆభరణాల వర్తకుల సమ్మె వంటి కారణాలు పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు ‘డిమాండ్ ధోరణులపై’ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. నివేదికలోని మరిన్ని అంశాలను చూస్తే... ♦ విలువ రూపంలో డిమాండ్ 36 శాతం పడింది. రూ.46,730 కోట్ల నుంచి రూ.29,900 కోట్లకు తగ్గింది. ♦ త్రైమాసికంలో ఆభరణాలకు డిమాండ్ 150.8 టన్నుల నుంచి 88.4 టన్నులకు(41%) పడిపోయింది. విలువ రూపంలో డిమాండ్ 38% పడిపోయి రూ.36,761 కోట్ల నుంచి రూ. 22,702 కోట్లకు తగ్గింది. ♦ ఇక పెట్టుబడులకు డిమాండ్ 31 శాతం తగ్గి 40.9 టన్నుల నుంచి 28 టన్నులకు పడింది. ఈ డిమాండ్ విలువ రూపంలో 28 శాతం తగ్గి రూ.9,969 కోట్ల నుంచి రూ.7,198 కోట్లకు తగ్గింది. ♦ ఈ ఏడాది మొదటినుంచీ ధర తీవ్రంగా పెరగడం, ఎక్సైజ్ సుంకాలు తగ్గిస్తారన్న అంచనాలూ డిమాండ్‌పై ప్రభావం చూపాయి. ♦ రూ.2 లక్షలు దాటిన కొనుగోళ్లకు పాన్ కార్డ్ వినియోగం తప్పనిసరి అన్న నిబంధన సైతం డిమాండ్ తగ్గడానికి కారణం. గ్రామీణ ప్రాంతాల్లో భారీ వ్యయాలకు తగిన బడ్జెట్, తగిన వర్షపాతం అవకాశాలు వంటి అంశాలు తిరిగి పసిడి డిమాండ్‌ను పటిష్ట స్థాయికి తీసుకువస్తాయన్న విశ్వాసాన్ని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత్ విభాగం డెరైక్టర్ సోమసుందరం పేర్కొన్నారు. ఈ ఏడాది పసిడి డిమాండ్ 850 నుంచి 950 టన్నుల శ్రేణిలో నమోదవుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా రీసైక్లింగ్ గోల్డ్ 18 టన్నుల నుంచి 14 టన్నులకు పడింది. ఏప్రిల్‌లో దిగుమతులు భారీ పతనం... కాగా భారత్ పసిడి దిగుమతులు ఏప్రిల్‌లో భారీగా 66.33 శాతం తగ్గాయి. 19.6 టన్నులుగా నమోదయ్యాయి. 2015 ఏప్రిల్‌లో ఈ దిగుమతుల విలువ 60 టన్నులు. 2014-15లో భారత్ పసిడి దిగుమతులు 971 టన్నులు. అయితే 2015-16 నాటికి ఈ పరిమాణం 750 టన్నులకు తగ్గింది. మందగమన పరిస్థితుల వల్ల అమెరికా, యూరప్ వంటి సాంప్రదాయ మార్కెట్లకు ఎగుమతులు తగ్గిన ప్రభావం... పసిడి దిగుమతులపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. అయితే దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నుంచి 15 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని సోమసుందరం అభిప్రాయపడ్డారు. గోల్డ్ ఈటీఎఫ్‌లలో అమ్మకాల జోరు.. ఇదిలావుండగా... గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లో ఇన్వెస్టర్ల నిరుత్సాహ ధోరణి ఏప్రిల్‌లోనూ కొనసాగింది. ఈ నెల్లో ప్రాఫిట్ బుకింగ్స్‌తో నికరంగా రూ.69 కోట్లు ఇన్వెస్టర్లు వెనక్కు తిరిగి తీసుకున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నికరంగా రూ.1,475 కోట్ల ఈటీఎఫ్‌ల్లో నిధులు వెనక్కు తీసుకుంటే, గడచిన ఆర్థిక సంవత్సరం ఈ విలువ రూ.903 కోట్లుగా ఉంది. 2013-14ల్లో ఈ మొత్తం ఏకంగా రూ.2,293 కోట్లు ఉంది. అయితే గత ఆర్థిక సంవత్సరం అవుట్‌ఫ్లో నెమ్మదించడం పరిశ్రమలో కొంత ఉత్సాహాన్ని ఇస్తోంది. -
బంగారం ఇప్పుడు కొనొచ్చా?
మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు! బంగారం ధర పెరిగిపోతుంది. సీజన్ ముగిసిపోయాక క్రమేపీ దిగివస్తుంది. ఇదే తరహాలో ఏడాదికాలంగా బంగారం ధర 8-10 శాతం హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడుతోంది. గతేడాది నవంబర్-డిసెంబర్ మధ్య పెళ్లిళ్ల సీజన్ సమయంలో దేశీయంగా 10 గ్రాముల ధర రూ. 27,500 స్థాయికి పెరిగింది. తర్వాత రూ. 26,500 స్థాయికి పడిపోయింది. మళ్లీ ఈ మే నెలలో సీజన్ కావడంతో 27,500 స్థాయిని దాటేసింది. అయితే వచ్చే కొద్ది నెలల్లో ధర ఇంతటి గరిష్ట స్థాయిలో కొనసాగుతుందని చెప్పలేమన్నది విశ్లేషకుల మాట. అవన్నీ సరే! ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారు కొనొచ్చా? ఇంకా తగ్గుతుందా? వేచి చూడాలా? ఏం చేయాలి?. స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు ఉంటాయన్న విశ్లేషకులు పెట్టుబడి కోసమైతే ఇపుడు అనవసరం... పెళ్లి కోసం, నగల కోసం ఎప్పుడు కొనాల్సి వస్తే అప్పుడు కొనాల్సిందే. కానీ పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకునేవారు ప్రస్తుత ధరలో కొనడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ వుండదని పలువురు కమోడిటీ విశ్లేషకులు చెపుతున్నారు. ఉదాహరణకు ఏడాది క్రితం బంగారం కొని ఉంటే ఇప్పటికి మీ సంపద 7% తగ్గిపోయినట్లే అని, అదే గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టి ఉంటే అది 11 శాతం హరించుకుపోయేదని వారు గుర్తుచేస్తున్నారు. కాకపోతే రెండు, మూడేళ్ల దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి చేస్తే బంగారం అనుకూల రాబడినిస్తుందని మరికొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు. ఏఎన్జెడ్ రీసెర్చ్ కమోడిటీ స్ట్రాటజిస్ట్ విక్టర్ థైన్ప్రియా మాటల్లో చెప్పాలంటే... ‘‘గ్రీసు సంక్షోభం, అమెరికా ద్రవ్య విధానం తదితరాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి’’. ఎందుకంటే గ్రీస్ తన రుణాల్ని సకాలంలో చెల్లించలేకపోతే యూరప్‌లో ఆర్థిక సంక్షోభం వస్తుంది. దాంతో బంగారం ధరలు పెరిగిపోతాయి. అదే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే పుత్తడి ధర పతనమైపోతుంది. వచ్చే ఆరు నెలల్లో వీటిలో ఏది జరిగినా, బంగారం హెచ్చుతగ్గులు తీవ్రంగా వుంటాయి. లేదంటే గత కొద్దినెలల్లానే స్తబ్దుగా 8% శ్రేణిలో కదులుతూ వుంటుంది. మన దగ్గరే అంత డిమాండ్.. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య బంగారానికి భారత్‌లో పెరిగినంతగా డిమాండ్ (అభరణాలు, పెట్టుబడులు) మరే దేశంలోనూ పెరగలేదని తాజాగా విడుదలైన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా పుత్తడి దిగుమతి చేసుకునే దేశాలు చైనా, భారత్‌లు కాగా, చైనాలో డిమాండ్ 7% తగ్గగా, భారత్ లో 15% పెరిగింది. అలాగే చైనాలో అభరణాల బంగారానికి డిమాండ్ 10% క్షీణించగా, భారత్‌లో 22%ఎగిసింది. బంగారం దిగుమతులపై ఆంక్షలు సడలించడం, పుత్తడి డిపాజిట్ స్కీము వంటి ప్రోత్సాహకాల్ని బడ్జెట్లో ప్రకటించడం భారత్‌లో డిమాండ్ పెరగానికి కారణమని, చైనాలో ఈక్విటీ మార్కెట్ ఈ ఏడాది పెద్ద ర్యాలీ జరపడం వల్ల అక్కడి వినియోగదారుల్లో బంగారంపై ఆసక్తి తగ్గిందని నివేదిక పేర్కొంది. సుంకం తగ్గించినా పుత్తడి తగ్గుతుంది... ప్రస్తుతం బంగారంపై దేశంలో 10 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు. మూడేళ్ల క్రితం బంగారం దిగుమతులు పెరిగిపోవడంవల్ల కరెంటు ఖాతా లోటు (దేశంలోకి వ చ్చే, పోయే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం) ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో పుత్తడిపై సుంకాల్ని పెంచివేశారు. ప్రస్తుతం కరెంటు ఖాతా లోటు సంతృప్తికరమైన స్థాయిలో వుంది. ఈ నేపథ్యంలో సుంకాల్ని క్రమేపీ తగ్గిస్తే, పుత్తడి ధర దిగివస్తుంది. కనుక ఈ తగ్గుదల ప్రమాదానికి లోబడి బంగారాన్ని కొనుక్కోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. నవంబర్-డిసెంబర్ అనుకూల సమయం.. అంతర్జాతీయంగా డాలరు తగ్గడంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర ఔన్సుకు 1180 డాలర్ల నుంచి 1225 డాలర్లకు పెరిగింది. ఇదే సమయంలో ఇక్కడి రూపాయి విలువ క్షీణించడంతో దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధర రూ. 26,500 నుంచి రూ. 27,500కు పెరిగింది. కానీ రానున్న కొద్దినెలల్లో డాలరు మళ్లీ పెరుగుతుందని, దాంతో ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌కల్లా ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర 1100 డాలర్ల వరకూ తగ్గవచ్చని, అప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదని కొందరి విశ్లేషకుల అంచనా. -
డిమాండ్ బంగారమే..
ముంబై: బంగారం దారి ఎప్పుడూ బంగారమేనని మరోసారి స్పష్టమైంది. 2013లో భారత్ పసిడి డిమాండ్ 2012తో పోల్చితే 13 శాతం పెరిగింది. పరిమాణంలో 864 టన్నుల నుంచి 975 టన్నులకు చేరింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ఒకటి ఈ విషయాలను తెలిపింది. కరెంట్ అకౌంట్ కట్టడి(క్యాడ్-మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య విలువ మధ్య వ్యత్యాసం)లో భాగంగా ప్రభుత్వం పసిడి దిగుమతులపై పలు ఆంక్షలు విధించినప్పటికీ పసిడి డిమాండ్ పెరగడం ఆసక్తికరం. 2013 గోల్డ్ డిమాండ్ ధోరణుల పేరుతో డబ్ల్యూజీసీ ఈ గణాంకాలను విడుదల చేసింది. డబ్ల్యూజీసీ మేనేజింగ్ డెరైక్టర్(ఇండియా) సోమసుందరం తెలిపిన వివరాలు క్లుప్తంగా... 2013 మొదటి ఆరు నెలలతో పోల్చితే ద్వితీయార్థంలో డిమాండ్ తగ్గింది. సరఫరా ఇబ్బందులు దీనికి కారణం. ఏప్రిల్-మే నెలల్లో బంగారం ధర తగ్గడాన్ని గృహస్తులు కొనుగోళ్లకు అవకాశంగా భావించారు. ఆభరణాలకు డిమాండ్ 11 శాతం పెరిగి 612.7 టన్నులుగా నమోదయ్యింది. విలువ రూపంలో ఇది రూ.1,61,751 కోట్లు. 2012లో ఈ పరిమాణం 552 టన్నులు. విలువలో రూ.1,58,359 కోట్లు. పెట్టుబడుల డిమాండ్ 16% పెరిగి 362.1 టన్నులుగా నమోదయ్యింది. 2012లో ఇది 312.2 టన్నులు. విలువలో ఈ పరిమాణం 6 శాతం పెరిగి రూ. 90,184.6 కోట్ల నుంచి రూ.95,460.8 కోట్లకు చేరింది. సైకిల్డ్ గోల్డ్ డిమాండ్ 10.79 శాతం పడిపోయింది. ఇది 113 టన్నుల నుంచి 100.8 టన్నులకు తగ్గింది. 2013 ద్వితీయార్థంలో గ్రే మార్కెట్ క్రియాశీలత పెరిగింది. ప్రభుత్వ నియంత్రణలు కొనసాగితే 2014లో ఈ ప్రభావం మరింత పెరిగి, స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. {పభుత్వ ఆంక్షల వల్ల బంగారం అక్రమ రవాణా తీవ్రమయ్యింది. నెలకు 20 నుంచి 30 టన్నుల వరకూ అక్రమ రవాణా మార్గాల్లో పయనించినట్లు అంచనా. 2014లో భారత్ బంగారం డిమాండ్ 900 టన్నుల నుంచి 1,000 టన్నుల వరకూ ఉండొచ్చు. ప్రపంచవ్యాప్తంగా డౌన్... కాగా ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 2013లో 15 శాతం పడిపోయింది. 2012తో పోల్చితే 4,416 టన్నుల నుంచి 3,756 టన్నులకు పడిపోయింది. ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)నుంచి భారీ మొత్తంలో నిధుల ఈక్విటీ మార్కెట్లకు తరలిపోవడమే దీనికి కారణం. అయితే ఈటీఎఫ్ రూపంలో డిమాండ్ పడిపోయినా... బంగారం మార్కెట్ విషయంలో వినియోగదారుల నుంచి 21 శాతం వృద్ధి నమోదుకావడం విశేషం. భారత్‌ను అధిగమించిన చైనా ఇదిలావుండగా... 2013లో బంగారం డిమాండ్ విషయంలో భారత్‌ను చైనా అధిగమించింది. ప్రపంచంలో అతిపెద్ద పసిడి వినియోగదారుగా తన హోదాను భారత్ మొదటిసారిగా చైనాకు అప్పగించింది. చైనాలో 2013లో బంగారం డిమాండ్ 1,065.8 టన్నులుగా నమోదయ్యింది. భారత్ ఈ పరిమాణం 975 టన్నులు మాత్రమే. కాగా 2012లో చైనా బంగారం డిమాండ్ 806.8 టన్నులుగా ఉంది. 2014 సంవత్సరంలో చైనా బంగారం డిమాండ్ 1,000-1,100 టన్నులుగా ఉంటుందన్నది అంచనా.