భారీగా తగ్గిన పసిడి డిమాండ్
♦ జనవరి-మార్చి నెలల్లో 39% డౌన్
♦ వర్తకుల సమ్మె ప్రధాన కారణం
♦ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలో వెల్లడి...
ముంబై: భారత్‌లో పసిడి డిమాండ్ 2016 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) భారీగా పడిపోయింది. 2015 ఇదే కాలంలో డిమాండ్ 192 టన్నుల డిమాండ్ ఉంటే- 2016 ఇదే కాలంలో ఈ డిమాండ్ 39 శాతం తగ్గి 117 టన్నులకు పడిపోయింది. వెండి యేతర ఆభరణాలపై ఒకశాతం ఎక్సైజ్ సుంకం విధింపు, దీనిని నిరసిస్తూ ఆభరణాల వర్తకుల సమ్మె వంటి కారణాలు పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు ‘డిమాండ్ ధోరణులపై’ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. నివేదికలోని మరిన్ని అంశాలను చూస్తే...
♦ విలువ రూపంలో డిమాండ్ 36 శాతం పడింది. రూ.46,730 కోట్ల నుంచి రూ.29,900 కోట్లకు తగ్గింది.
♦ త్రైమాసికంలో ఆభరణాలకు డిమాండ్ 150.8 టన్నుల నుంచి 88.4 టన్నులకు(41%) పడిపోయింది. విలువ రూపంలో డిమాండ్ 38% పడిపోయి రూ.36,761 కోట్ల నుంచి రూ. 22,702 కోట్లకు తగ్గింది.
♦ ఇక పెట్టుబడులకు డిమాండ్ 31 శాతం తగ్గి 40.9 టన్నుల నుంచి 28 టన్నులకు పడింది. ఈ డిమాండ్ విలువ రూపంలో 28 శాతం తగ్గి రూ.9,969 కోట్ల నుంచి రూ.7,198 కోట్లకు తగ్గింది.
♦ ఈ ఏడాది మొదటినుంచీ ధర తీవ్రంగా పెరగడం, ఎక్సైజ్ సుంకాలు తగ్గిస్తారన్న అంచనాలూ డిమాండ్‌పై ప్రభావం చూపాయి.
♦ రూ.2 లక్షలు దాటిన కొనుగోళ్లకు పాన్ కార్డ్ వినియోగం తప్పనిసరి అన్న నిబంధన సైతం డిమాండ్ తగ్గడానికి కారణం.
గ్రామీణ ప్రాంతాల్లో భారీ వ్యయాలకు తగిన బడ్జెట్, తగిన వర్షపాతం అవకాశాలు వంటి అంశాలు తిరిగి పసిడి డిమాండ్‌ను పటిష్ట స్థాయికి తీసుకువస్తాయన్న విశ్వాసాన్ని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత్ విభాగం డెరైక్టర్ సోమసుందరం పేర్కొన్నారు. ఈ ఏడాది పసిడి డిమాండ్ 850 నుంచి 950 టన్నుల శ్రేణిలో నమోదవుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా రీసైక్లింగ్ గోల్డ్ 18 టన్నుల నుంచి 14 టన్నులకు పడింది.
ఏప్రిల్‌లో దిగుమతులు భారీ పతనం...
కాగా భారత్ పసిడి దిగుమతులు ఏప్రిల్‌లో భారీగా 66.33 శాతం తగ్గాయి. 19.6 టన్నులుగా నమోదయ్యాయి. 2015 ఏప్రిల్‌లో ఈ దిగుమతుల విలువ 60 టన్నులు. 2014-15లో భారత్ పసిడి దిగుమతులు 971 టన్నులు. అయితే 2015-16 నాటికి ఈ పరిమాణం 750 టన్నులకు తగ్గింది. మందగమన పరిస్థితుల వల్ల అమెరికా, యూరప్ వంటి సాంప్రదాయ మార్కెట్లకు ఎగుమతులు తగ్గిన ప్రభావం... పసిడి దిగుమతులపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. అయితే దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నుంచి 15 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని సోమసుందరం అభిప్రాయపడ్డారు.
గోల్డ్ ఈటీఎఫ్‌లలో అమ్మకాల జోరు..
ఇదిలావుండగా... గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లో ఇన్వెస్టర్ల నిరుత్సాహ ధోరణి ఏప్రిల్‌లోనూ కొనసాగింది. ఈ నెల్లో ప్రాఫిట్ బుకింగ్స్‌తో నికరంగా రూ.69 కోట్లు ఇన్వెస్టర్లు వెనక్కు తిరిగి తీసుకున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నికరంగా రూ.1,475 కోట్ల ఈటీఎఫ్‌ల్లో నిధులు వెనక్కు తీసుకుంటే, గడచిన ఆర్థిక సంవత్సరం ఈ విలువ రూ.903 కోట్లుగా ఉంది. 2013-14ల్లో ఈ మొత్తం ఏకంగా రూ.2,293 కోట్లు ఉంది. అయితే గత ఆర్థిక సంవత్సరం అవుట్‌ఫ్లో నెమ్మదించడం పరిశ్రమలో కొంత ఉత్సాహాన్ని ఇస్తోంది.