బంగారం ఇప్పుడు కొనొచ్చా? | India, China account for 54% of total gold demand during Q1 | Sakshi
Sakshi News home page

బంగారం ఇప్పుడు కొనొచ్చా?

Published Mon, May 18 2015 2:07 AM | Last Updated on Thu, Aug 2 2018 3:54 PM

బంగారం ఇప్పుడు కొనొచ్చా? - Sakshi

బంగారం ఇప్పుడు కొనొచ్చా?

మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు! బంగారం ధర పెరిగిపోతుంది. సీజన్ ముగిసిపోయాక క్రమేపీ దిగివస్తుంది. ఇదే తరహాలో ఏడాదికాలంగా బంగారం ధర 8-10 శాతం హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడుతోంది. గతేడాది నవంబర్-డిసెంబర్ మధ్య పెళ్లిళ్ల సీజన్ సమయంలో దేశీయంగా 10 గ్రాముల ధర రూ. 27,500 స్థాయికి పెరిగింది. తర్వాత రూ. 26,500 స్థాయికి పడిపోయింది. మళ్లీ ఈ మే నెలలో సీజన్ కావడంతో 27,500 స్థాయిని దాటేసింది.

అయితే వచ్చే కొద్ది నెలల్లో ధర ఇంతటి గరిష్ట స్థాయిలో కొనసాగుతుందని చెప్పలేమన్నది విశ్లేషకుల మాట. అవన్నీ సరే! ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారు కొనొచ్చా? ఇంకా తగ్గుతుందా? వేచి చూడాలా? ఏం చేయాలి?.

 
స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు ఉంటాయన్న విశ్లేషకులు
 
పెట్టుబడి కోసమైతే ఇపుడు అనవసరం...
పెళ్లి కోసం, నగల కోసం ఎప్పుడు కొనాల్సి వస్తే అప్పుడు కొనాల్సిందే. కానీ పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకునేవారు ప్రస్తుత ధరలో కొనడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ వుండదని పలువురు కమోడిటీ విశ్లేషకులు చెపుతున్నారు. ఉదాహరణకు ఏడాది క్రితం బంగారం కొని ఉంటే ఇప్పటికి మీ సంపద 7% తగ్గిపోయినట్లే అని, అదే గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టి ఉంటే అది 11 శాతం హరించుకుపోయేదని వారు గుర్తుచేస్తున్నారు. కాకపోతే రెండు, మూడేళ్ల దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి చేస్తే బంగారం అనుకూల రాబడినిస్తుందని మరికొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఏఎన్‌జెడ్ రీసెర్చ్ కమోడిటీ స్ట్రాటజిస్ట్ విక్టర్ థైన్‌ప్రియా మాటల్లో చెప్పాలంటే... ‘‘గ్రీసు సంక్షోభం, అమెరికా ద్రవ్య విధానం తదితరాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి’’. ఎందుకంటే గ్రీస్ తన రుణాల్ని సకాలంలో చెల్లించలేకపోతే యూరప్‌లో ఆర్థిక సంక్షోభం వస్తుంది. దాంతో బంగారం ధరలు పెరిగిపోతాయి. అదే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే పుత్తడి ధర పతనమైపోతుంది. వచ్చే ఆరు నెలల్లో వీటిలో ఏది జరిగినా, బంగారం హెచ్చుతగ్గులు తీవ్రంగా వుంటాయి. లేదంటే గత కొద్దినెలల్లానే స్తబ్దుగా 8% శ్రేణిలో కదులుతూ వుంటుంది.
 
మన దగ్గరే అంత డిమాండ్..
ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య బంగారానికి భారత్‌లో  పెరిగినంతగా డిమాండ్  (అభరణాలు, పెట్టుబడులు) మరే దేశంలోనూ పెరగలేదని తాజాగా విడుదలైన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా పుత్తడి దిగుమతి చేసుకునే దేశాలు చైనా, భారత్‌లు కాగా, చైనాలో డిమాండ్ 7% తగ్గగా, భారత్ లో 15% పెరిగింది. అలాగే చైనాలో అభరణాల బంగారానికి డిమాండ్ 10% క్షీణించగా, భారత్‌లో 22%ఎగిసింది.

బంగారం దిగుమతులపై ఆంక్షలు సడలించడం, పుత్తడి డిపాజిట్ స్కీము వంటి ప్రోత్సాహకాల్ని బడ్జెట్లో ప్రకటించడం భారత్‌లో డిమాండ్ పెరగానికి కారణమని, చైనాలో ఈక్విటీ మార్కెట్ ఈ ఏడాది పెద్ద ర్యాలీ జరపడం వల్ల అక్కడి వినియోగదారుల్లో బంగారంపై ఆసక్తి తగ్గిందని నివేదిక పేర్కొంది.
 
సుంకం తగ్గించినా పుత్తడి తగ్గుతుంది...
ప్రస్తుతం బంగారంపై దేశంలో 10 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు. మూడేళ్ల క్రితం బంగారం దిగుమతులు పెరిగిపోవడంవల్ల కరెంటు ఖాతా లోటు (దేశంలోకి వ చ్చే, పోయే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం) ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో పుత్తడిపై సుంకాల్ని పెంచివేశారు. ప్రస్తుతం కరెంటు ఖాతా లోటు సంతృప్తికరమైన స్థాయిలో వుంది. ఈ నేపథ్యంలో సుంకాల్ని క్రమేపీ తగ్గిస్తే, పుత్తడి ధర దిగివస్తుంది. కనుక ఈ తగ్గుదల ప్రమాదానికి లోబడి బంగారాన్ని కొనుక్కోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
 
నవంబర్-డిసెంబర్ అనుకూల సమయం..
అంతర్జాతీయంగా డాలరు తగ్గడంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర ఔన్సుకు 1180 డాలర్ల నుంచి 1225 డాలర్లకు పెరిగింది. ఇదే సమయంలో ఇక్కడి రూపాయి విలువ క్షీణించడంతో దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధర రూ. 26,500 నుంచి రూ. 27,500కు పెరిగింది. కానీ రానున్న కొద్దినెలల్లో డాలరు మళ్లీ పెరుగుతుందని, దాంతో ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌కల్లా ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర 1100 డాలర్ల వరకూ తగ్గవచ్చని, అప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదని కొందరి విశ్లేషకుల అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement