Marriage season
-
ఇండియాలో పెళ్లిళ్లను ట్రంప్ ప్రభావితం చేస్తున్నాడా?
‘నేను పెళ్లి చేసుకునే అబ్బాయి ఫలానా హీరోలా ఉండాలి’ ‘నాకు భార్య కావాలంటే ఆ అమ్మాయికి అదృష్టం ఉండాలి’ ఇలాంటి... డైలాగ్‌లు టీన్స్ నుంచి ట్వంటీస్ వరకు చెప్పేవే. అమ్మానాన్నలు తెచ్చిన సంబంధాలు వాస్తవంలోకి తెచ్చేవి. అనేకానేక రాజీలతో బాసికానికి తలవంచి ఏడడుగులు పడేవి. అది ఒకప్పుడు... ఇప్పుడు కాలం మారింది. ట్రెండ్ మారింది. కొత్తకాలంలో కట్నం కాలగర్భంలోకి కలిసిపోనుందా? అయితే... ఇది మంచి పరిణామమే. అమ్మాయి విద్య ఉద్యోగాలతో సాధికారత సాధించిందా? అయితే... ఇది ఇంకా గొప్ప శుభపరిణామమే. భాగస్వామి ఎంపికలో యువత ప్రాధాన్యాలెలా ఉన్నాయి? ఇండియాలో పెళ్లిళ్లను ట్రంప్ ప్రభావితం చేస్తున్నాడా? అధ్యక్షుడిగా ట్రంప్ పోయినా ట్రంప్ భయం ఇంకా ఉందా? ‘పెళ్లిలో పెళ్లి కుదరడం’ ఒకప్పటి మాట. అంటే బంధువుల పెళ్లిలో పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు బంధువులందరి దృష్టిలో పడతారు. ఏం చదువుకున్నారు? ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? వంటి వివరాలన్నీ కబుర్లలో భాగంగా బంధువులందరికీ చేరిపోయేవి. అబ్బాయికీ, అమ్మాయికీ బంధుత్వం కలిసే ఎవరో పెద్దవాళ్లు ఎవరో ఓ మాటగా అంటారు. మాటలు కలుపుకుంటారు. పెళ్లి కుదిరేది. శ్రావణమాసం పెళ్లిలో కలిసిన అమ్మాయి, అబ్బాయి విజయదశమి ముహూర్తాల్లో వధూవరులయ్యేవాళ్లు. మరి ఇప్పుడు... కాలం మారింది. ఎంతగా మారిందీ అంటే... బంధువులను కూడా ఫేస్బుక్లో ఫ్రెండ్స్‌గా పలకరించుకునే తరం ఇది. దగ్గరి బంధువుల అమ్మాయి, అబ్బాయిల వివరాలు కూడా మ్యారేజ్ బ్యూరోల ద్వారా తెలుస్తున్న పరిస్థితి. సమాజంలో వచ్చిన ఈ మార్పుతోపాటు... జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో వచ్చిన మార్పు కూడా పెద్దదే. నుదుట బాసికాలు, మెడలో పూలదండలు ధరించకపోతే పెళ్లిపీటల మీద ఉన్న వాళ్లు వధూవరులా లేక కన్యాదాతలా అనే సందేహం కూడా ఎదురవుతుంటుంది. ‘తొలి ప్రసవం కనీసం ముప్పై ఏళ్ల లోపు జరగడం శ్రేయస్కరం’ అని వైద్యరంగం చెబుతూనే ఉంది. కానీ ఉన్నత విద్యావంతులైన అమ్మాయిలు పెళ్లికి సిద్ధమయ్యేటప్పటికే ముప్పయ్ దాటుతున్నాయి. ఆలస్యానికి కారణాలు ఒకటి–రెండు కాదు, అనేకం. భాగస్వామిని ఎంచుకోవడం పట్ల సమాజం ఎలా ఉందో తెలియాలంటే మ్యారేజ్ బ్యూరోతో మాట్లాడడం ఓ సులువైన మార్గం. హైదరాబాద్‌లోని అవినాష్‌రెడ్డి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు కోటిరెడ్డి, జ్యోతి మ్యాట్రిమొనీ నిర్వాహకురాలు జొన్నలగడ్డ జ్యోతి, శ్రీకాకుళంలోని శ్రీసాయి నరసింహ సేవాసంఘం నిర్వహకులు కరణం నరసింగరావు, తిరుపతికి చెందిన సాయి మ్యాట్రిమొనీ నిర్వాహకురాలు పసుపులేటి శ్వేత అనేక ఆసక్తికరమైన విషయాలను సాక్షితో పంచుకున్నారు. ఇదీ నా స్టైల్ షీట్! ‘‘పెళ్లి కుదర్చడం అనేది ఓ యాభై ఏళ్ల కిందట ఉన్నంత సులభం కాదిప్పుడు. తెరిచిన పుస్తకంలా ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ల మధ్య వివాహం జరిగే రోజులు కావివి. ఖండాల అవతలి వ్యక్తులతోనూ పెళ్లిబంధం కలపాలి. ప్రేమ పెళ్లిళ్లను పక్కన పెడితే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునే వాళ్లే మా దగ్గరకు వస్తారు. వాళ్లు తమ గురించి ఏ వివరాలిస్తారో ఆ వివరాలనే అవతలి వాళ్లకు అందివ్వగలుగుతాం. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. వంద పెళ్లిళ్లలో ఒక్క పెళ్లి విఫలమైనా మేము ఎక్కడో లోపం చేశామేమో అనిపిస్తుంది. నేను ఇరవై ఏళ్లుగా ఈ ఫీల్డులో ఉన్నాను. వేలాది మంది క్లయింట్లతో మాట్లాడాను. రెండువేలకు పైగా పెళ్లిళ్లు చేశాను. ఈ అనుభవంతో ఈ ప్రొఫెషన్ని సమగ్రంగా తీర్చిదిద్దుకోవడానికి నాకు నేనుగా కొన్ని నియమాలను రూపొందించుకున్నాను. ► అబ్బాయి, అమ్మాయి ఉద్యోగం, చదువు, ఆస్తిపాస్తుల గురించి ప్రశ్నావళిలో ఇచ్చిన వివరాలు వాస్తవమేనా అనే సందేహం కూడా కలుగుతుంటుంది. సమగ్రంగా విచారణ చేసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి. ఇలాంటి ఎంక్వయిరీ కూడా మ్యారేజ్ బ్యూరో చేసి పెట్టగలగాలి. అలాగే ఆధార్ నంబర్, శాలరీ సర్టిఫికేట్లు తీసుకునే నియమం బ్యూరోలకు ఉంటే అబద్ధాలతో పెళ్లి చేసుకోవచ్చనే దురాలోచనను మొగ్గలోనే అరికట్టవచ్చు. ► యువతీయువకులు భాగస్వామి ఎంపిక విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారు. తమకు నచ్చిన అంశాలన్నీ ఒక వ్యక్తిలో రాశిపోసి ఉండడం సాధ్యం కాదని, మనం కోరుకున్న లక్షణాలతో ఓ వ్యక్తిని తయారు చేయలేమని, ఉన్న ఆప్షన్స్‌లో సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మనం చేయగలిగింది అని పెద్దవాళ్లు చెప్పట్లేదు. ఈ విషయంలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు కొంత త్వరగా నిర్ణయం తీసుకుంటున్నారు’’ అన్నారు కోటిరెడ్డి. ఇన్ని వడపోతలు పూర్తయి పెళ్లి జరిగిన తర్వాత కూడా ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన ఈ తరం తల్లిదండ్రులకు తప్పడం లేదు. అందుకే వైవాహిక బంధం బలపడే వరకు కొంత కనిపెట్టి ఉండాలి. గాడి తప్పుతున్నట్లు అనిపిస్తే సరి చేయడం వరకే ఉండాలి పెద్దవాళ్ల జోక్యం. పిల్లల జీవితంలోకి దూరిపోయి వాళ్ల జీవితాలను తామే జీవించాలనుకోకూడదు. ఇప్పటి పేరెంట్స్ దాదాపు చదువుకున్న వాళ్లే. అబ్బాయి తల్లిదండ్రులకు కూడా కోడలు వచ్చి తమను చూసుకోవాలనే ఆంక్షల్లేవు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ల కుటుంబం వాళ్లను దిద్దుకోమని నూతన దంపతులను వేరే ఇంట్లో ఉంచడానికే ప్రయత్నిస్తున్నారు. మరో ముఖ్యమైన సంగతి... తల్లిదండ్రులు వృత్తి వ్యాపారాల్లో రిటైరై ఉంటే, పిల్లల పెళ్లి బాధ్యత పూర్తయిన తరవాత తమకిష్టమైన లేదా సమాజహితమైన వ్యాపకాన్ని పెట్టుకోవాలి. – వాకా మంజులారెడ్డి ట్రంప్ ప్రభావం నేను పాతికేళ్లుగా వివాహవేదిక నడుపుతున్నాను. అప్పట్లో అమ్మాయి తల్లిదండ్రులైనా, అబ్బాయి తల్లిదండ్రులైనా అవతలి వారి కుటుంబ నేపథ్యాన్ని ప్రధానంగా గమనించేవారు. ఇప్పుడు డబ్బు, ఆస్తులు ప్రధానం అయ్యాయి. పాతికేళ్ల కిందట విదేశాల మోజు బాగా ఉండేది. పదవ తరగతి అమ్మాయికి కూడా యూఎస్ సంబంధాల కోసం ప్రయత్నించేవారు. ఈ ట్రెండ్ 1990– 2000 మధ్య బాగా ఉండేది. ఇప్పుడు అమ్మాయిలే చదువుకుని విదేశాలకు వెళ్తున్నారు. ఇప్పుడు చదువు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన అమ్మాయిలు, అలాగే అక్క, అన్న విదేశాల్లో ఉన్న అమ్మాయిలు మాత్రమే విదేశీ సంబంధాలు కోరుకుంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇండియాలో ఉన్న అమ్మాయికి యూఎస్ అబ్బాయితో పెళ్లి చేసినవాళ్లు, అమ్మాయిని అమెరికా పంపించడానికి వీసా రాక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇక్కడ కూడా మంచి ఉద్యోగాలున్నాయి కాబట్టి అమ్మాయి మా కళ్ల ముందే ఉంటుంది, ఇండియా సంబంధాలే చెప్పండి అంటున్నారు. అయితే అబ్బాయికి లక్ష రూపాయల జీతం ఉన్నా సరే ‘ఏం సరిపోతుంది, ఇంకా పెద్ద జీతం ఉన్నవాళ్లను చెప్పండి’ అంటున్నారు. పైగా ‘మా అమ్మాయి సర్దుకుపోలేదు, కాబట్టి ఉమ్మడి కుటుంబం వద్దు’ అనే నిబంధనలు ఎక్కువయ్యాయి. కట్నం అనేది పెద్ద విషయంగా చర్చకు రావడం లేదు. ఆడంబరాలు మాత్రం ఆకాశమే హద్దు అన్నంతగా పెరిగిపోయాయి. ఇక పెళ్లి వయసుదాటిపోతోందనే ఆందోళన అటు పేరెంట్స్‌లోనూ కనిపంచడం లేదు, పెళ్లి చేసుకోవాల్సిన యువతీయువకుల్లోనూ కనిపించడం లేదు. ముప్పై సంవత్సరాలు దాటుతున్నా కూడా వయసును పట్టించుకోవడం లేదు. – జొన్నలగడ్డ జ్యోతి మళ్లీ యూఎస్ క్రేజ్ పదేళ్లుగా ఈ వ్యాపకంలో ఉన్నాను. మొదట్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నాలుగైదు సంబంధాలు చూసి నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు నలభై– యాభై సంబంధాలు చూసినా కూడా నిర్ణయం తీసుకోవడం లేదు. వయసు మీరిపోతున్నా ఎవరికీ పట్టింపు ఉండడం లేదు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా భాగస్వామి కోసం బంగారాన్ని గీటుపెట్టినట్లు చూస్తున్నారు. అబ్బాయి క్యాప్ పెట్టుకున్న ఫొటో పంపిస్తే ‘బట్టతల కావచ్చు, క్యాప్ లేని ఫొటోలు పంపించండి’ అంటున్నారు అమ్మాయిలు. ఇక అబ్బాయిలు కూడా తాము యావరేజ్‌గా ఉన్నా సరే... అందమైన అమ్మాయి కావాలంటారు. అబ్బాయిలైనా కొంతవరకు రాజీపడుతున్నారు కానీ అమ్మాయిలు కచ్చితంగా ఉంటున్నారు. ఓ మంచి మార్పు ఏమిటంటే... కట్నం ప్రాధాన్యం లేని విషయమైపోయింది. అలాగే ట్రంప్ హయాంలో అమ్మాయి తల్లిదండ్రులు యూఎస్ సంబంధాలు వద్దనేవాళ్లు. ఇప్పుడు మళ్లీ యూఎస్ సంబంధాలకు క్రేజ్ పెరిగింది. – శ్వేత పసుపులేటి నిర్ణయం వధూవరులదే! అమ్మాయికి పెళ్లి చేయాలంటే... ఓ ఇరవై ఏళ్ల కిందట అబ్బాయి కుటుంబ నేపథ్యాన్ని ప్రధానంగా చూసేవారు. ఇప్పుడు చదువు, ఉద్యోగం మొదటి ప్రాధాన్యంలో ఉంటున్నాయి. ఉద్యోగంలో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు తొలి ప్రాధాన్యం, ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఉంటోంది. వ్యాపారం అనగానే ‘రిస్క్ అవసరమా’ అంటున్నారు. వ్యవసాయం అయితే ఇక నాలుగో ప్రాధాన్యంలోకి వెళ్లిపోయింది. కరోనా తర్వాత విదేశాలంటే భయపడుతున్నారు. అంతవరకు విదేశాలతో సంబంధం లేని వాళ్లు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. వధువు అక్క లేదా అన్న యూఎస్, యూకేల్లో ఉన్న ఆ దేశంలో ఉన్న అబ్బాయికే మొగ్గు చూపుతున్నారు. ఇక డిమాండ్ల విషయానికి వస్తే... వరుని ఎంపిక విషయంలో అమ్మాయిలు చాలా కచ్చితంగా ఉంటున్నారు. ఎంతో కొంత రాజీ పడుతున్నది అబ్బాయిలే. చాదస్తం తగ్గింది ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లిని ఒకప్పుడు వధూవరుల తల్లిదండ్రులు కుదిర్చేవాళ్లు, ఇప్పుడు వధూవరులు స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నారు (అరేంజ్డ్ మ్యారేజ్‌ల విషయంలో కూడా). ఇప్పుడు దాదాపుగా అందరూ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులే. వాళ్లు కొడుకు, కూతురు ఇద్దరినీ చదివిస్తున్నారు. ఇద్దరినీ ఉద్యోగాలకు పంపిస్తున్నారు. ఆస్తిని దాదాపుగా సమంగా ఇస్తున్నారు. దీంతో కట్నం ప్రస్తావన ప్రధానంగా కనిపించడం లేదు. తల్లిదండ్రులు కూడా పరిణతి చెందారు. ఒకప్పటిలాగ కోడలు తెల్లవారు జామున లేచి ఇంటి పనులు చక్కబెట్టాలని, తాము నిద్రలేచే సరికి కాఫీ కప్పుతో సిద్ధంగా ఉండాలనే చాదస్తాల్లేవు. ఉద్యోగానికి వెళ్లాల్సిన అమ్మాయి ఇంటి పనుల్లోనే అలసిపోవాలని కోరుకోవడం లేదు. ఇక పిల్లలిద్దరికీ పెళ్లి చేసిన వెంటనే వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయి పిల్లలతో కలిసి జీవించాలనుకోవడం లేదు. బాధ్యతలు పూర్తయిన తమ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. – కరణం నరసింగరావు లేటెస్ట్ ఫొటోలుండాలి! మ్యారేజ్ బ్యూరోలో మేము ఒక ప్రశ్నావళిని సమగ్రంగా రూపొందించుకున్నాం. అబ్బాయి లేదా అమ్మాయితో స్వయంగా మాట్లాడతాం. సాధ్యమైతే బ్యూరోలోనే లైవ్ ఫొటో షూట్ చేయడం మంచిది. పేరెంట్స్ ఇచ్చే ఫైల్ ఫొటోలు కొన్ని సందర్భాల్లో బాగా పాతవి ఉంటాయి. ఫొటోలు ఉన్నట్లుగా లైవ్‌లో లేనట్లయితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా డిజప్పాయింట్ అవుతారు. ఇక ఆ తర్వాత మిగిలిన ప్రత్యేకతలేవీ పరిగణనలోకి రావు. – కోటిరెడ్డి -
పసిడికి ‘పెళ్లి సందడి’! తగ్గనున్న ధర ?
ముంబై: కరోనా వైరస్ ధాటి నుంచి ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికన్నా వేగంగానే కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత దీపావళి సీజన్‌పై ఆభరణాల విక్రేతలు ఆశావహంగా ఉన్నారు. కోవిడ్ పూర్వ స్థాయి కన్నా 30 శాతం అధికంగా అమ్మకాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు దిగి రావడం, వాయిదా వేస్తున్న వారు కొనుగోళ్లకు ముందుకు వచ్చి డిమాండ్ మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వారు అంటున్నారు. ఈసారి బాగున్నాయి ‘సాధారణంగా ఏటా మూడో త్రైమా సికంలో అంతగా విక్రయాలు ఉండవు. కానీ ఈసా రి మాత్రం అమ్మకాలు కొంత పుంజుకున్నాయి. బంగారం ధర తగ్గడం కూడా కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మెరుగుపడటానికి కొంత కారణం‘ అని అఖిల భారత రత్నాభరణాల దేశీ మండలి చైర్మన్ ఆశీశ్ పేఠే తెలిపారు. గడిచిన కొద్ది నెలలుగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల ధోరణి చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలోనే ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. మహమ్మారి కారణంగా వాయిదా పడిన వివాహాలు ఈ ఏడాది ఆఖర్లో జరగనుండటం రత్నాభరణాల విక్రయాలకు దోహదపడగలవని పేర్కొన్నారు. ఈ పరిణామాల దరిమిలా 2019తో పోలిస్తే 20–25 శాతం దాకా అమ్మకాల వృద్ధి ఉండొచ్చని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒకానొక దశలో రూ. 56,000 రికార్డు స్థాయిని తాకిన పసిడి ధర (పది గ్రాములు).. ప్రస్తుతం రూ. 49,200 స్థాయిలో తిరుగాడుతోంది. మరో 3–4 నెలలు జోరుగా పెళ్లిళ్లు... నవరాత్రుల దగ్గర్నుంచీ మార్కెట్లో డిమాండ్ గణనీయంగా కనిపిస్తోందని పీఎన్జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. గతేడాది దీపావళితో పోలిస్తే వ్యాపారం రెట్టింపు కాగలదని, 2019తో పోలిస్తే 25–30 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘కోవిడ్–19 భయాల నుంచి ప్రజలు కొంత బైటికి వచ్చినట్లు కనిపిస్తంది. సానుకూల భవిష్యత్ మీద వారు ఆశావహంగా ఉన్నారు. ఆభరణాల్లాంటివి కొనుగోలు చేయడం ద్వారా వారు సంతోషిస్తున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా మరో 3–4 నెలల పాటు కొనసాగవచ్చు. ఇది పరిశ్రమకు గట్టి ఊతమిస్తుంది. ఒకవేళ థర్డ్ వేవ్ అంశాలేమీ లేకపోతే పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపగలదు‘ అని తెలిపారు. ‘పేరుకుపోయిన డిమాండ్ వల్ల ఈసారి ధన్‌తెరాస్ నాడు ఆభరణాల అమ్మకాలు, గతేడాది దీపావళి సందర్భంతో పోలిస్తే 30–40 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నాం‘ అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ అహమ్మద్ ఎంపీ తెలిపారు. ‘దసరా నుంచి అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. నెమ్మదిగా మహమ్మారి మబ్బులు విడిపోతున్నాయి. వినియోగదారుల్లో విశ్వాసం పెరుగుతోంది. పేరుకుపోయిన డిమాండ్‌తో దీపావళి, రాబోయే పెళ్లిళ్ల సీజన్లో విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నాం. వార్షికంగా చూస్తే కనీసం 35–40 శాతం వృద్ధి అంచనా వేస్తున్నాం‘ అని డబ్ల్యూహెచ్పీ జ్యుయలర్స్ డైరెక్టర్ ఆదిత్య పేఠే చెప్పారు. వినియోగదారుల్లో సానుకూల సెంటిమెంటు వచ్చే ఏడాది ప్రథమార్ధం దాకా కొనసాగగలదని ఆశిస్తున్నట్లు పూజా డైమండ్స్ డైరెక్టర్ శ్రేయ్ మెహతా పేర్కొన్నారు. రిటైల్ డిమాండ్ మెరుగుపడుతోంది టీకా ప్రక్రియ పుంజుకోవడం, కోవిడ్ కేసులు నమోదయ్యే వేగం మందగించడం వంటి అంశాలతో ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా మెరుగుపడుతున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ప్రాంతీయ సీఈవో సోమసుందరం పీఆర్ తెలిపారు. జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో బంగారు ఆభరణాల డిమాండ్ 58 శాతం ఎగియగా, కడ్డీలు.. నాణేలకు పెట్టుబడులపరమైన డిమాండ్ 18% పెరిగిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కట్టడిపరమైన ఆంక్షలను క్రమంగా సడలించే కొద్దీ రిటైల్ డిమాండ్ తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి చేరుతోందని సోమసుందర్ చెప్పారు. ఈసారి పండుగ, పెళ్లిళ్ల సీజన్లో అత్యధికంగా పసిడి కొనుగోళ్లు జరగవచ్చని ఆయన పేర్కొన్నారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట.. -
పెళ్లి సందడి..
పెళ్లంటే.. పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మొత్తం కలిసి నూరేళ్ల జీవితం.. ఇది పెళ్లంటే. కరోనా నేపథ్యంలో ఏడు నెలలుగా ఇలాంటి వేడుకల ఊసే లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలు.. సన్నాయి మేళాల చప్పుళ్లు.. ఆత్మీయుల సందడి... అనుబంధాల కలయికతో పాటు కళ్యాణ వేదికలకు కొత్త కళవచ్చింది. ఏదీ ఏమైనా ఇన్నాళ్లు ముహూర్తాలు లేక కరోనా కారణంగా వాయిదా పడిన వివాహాలు, ఇతర శుభకార్యాలకు మోక్షం లభించింది. జనవరి మొదటి వారం ముగిసిందంటే ఉగాది వరకు ముహూర్తాలు లేకపోవడంతో ఇప్పుడున్న ముహూర్తాల్లోనే అన్నీ చకచకా జరిగేలా చూసుకుంటున్నారు. నవంబర్, డిసెంబర్, వచ్చే ఏడాది మొదటి వారం వరకూ మంచి రోజులు ఉండడంతో శుభకార్యాలు షురూ అయ్యాయి. ఇక వ్యాపార వర్గాల్లోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. మొదలైన ముహూర్తాలు.. ప్రస్తుతం వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు మంచి రోజులు ఉండటంతో వివాహాది, శుభకార్యాల పనులు ఊపందుకోనున్నాయి. మొన్నటి వరకు చాలా పెళ్లిళ్లు జరగగా నేడు శుక్రవారం మరోసారి భారీగా వివాహ వేడుకలు జరగనున్నాయి. గతంలో కరోనా కారణంగా లాక్డౌన్ నిబంధనలతో ఎలాంటి సడలింపులు లేకపోవడంతో వాయిదా పడిన పలు శుభకార్యాలు ఇప్పుడు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. శుభకార్యాలకు వేళాయె.. కరోనా ప్రభావంతో చాలా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఆగిపోయాయి. గత వేసవి కాలంలో అంటే మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో మంచి ముహూర్తాలు ఉన్నా లాక్డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నారు. ఫంక్షన్ హాళ్లకు అడ్వాన్స్‌లు ఇవ్వడంతో పాటు పెళ్లి పత్రికలు కూడా అచ్చు వేయించి చివరి సమయంలో శుభకార్యాలు నిలిపి వేసిన ఘటనలు సైతం ఉన్నాయి. లాక్డౌన్లో అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడం కష్టంగా ఉండటం, కోవిడ్ నిబంధనలతో పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేయడమే మేలుగా భావించి పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేశారు. మార్కెట్లో కళకళ.. శుభకార్యాలు మొదలు కావడంతో పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు సంబంధించి ఆధార పడిన వారంతా వచ్చే ఆర్డర్లతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెండ్లి మండపాలకు డిమాండ్ పెరుగగా ఇప్పటికే అన్నీ బుకింగ్‌లు అయ్యాయి. పురోహితులు బిజీ అయ్యారు. ముఖ్యంగా వస్త్ర, బంగారు వ్యాపారాలకు గిరాకీ పెరగడంతో దుకాణాలన్నీ కూడా కళకళలాడుతున్నాయి. పెళ్లి కార్డులు, ఫ్లెక్సీల పనులు ఇతర వివాహాది శుభకార్యాల పనుల్లో మునిగిపోయారు. జనవరి ఎనిమిది వరకు.. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మరో మూడు, నాలుగు మాసాల పాటు శుభముహూర్తాలు లేవు. ఈ ఏడాది కరోనా వైరస్‌తో చాలా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు వాయిదా పడ్డాయి. వేసవి కాలంలో జరగాల్సిన పెళ్లిళ్లు కార్తీక మాసంలో చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, నూతన గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు జరుపుకునేలా అంతా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సందడితో పూర్వ వైభవం రానుంది. – -సువర్ణం సంతోశ్‌శర్మ, వేదపండితులు, మంచిర్యాల -
పెళ్లి సందడి షురూ...!
అన్నింట్లో పోటీ.. ఏదీ చేసినా సెన్సేషన్.. అందరూ శభాష్ అనేలా చేయాలనేది నేటి కాస్సెప్ట్.. ఎవరూ చేయలేనిది చేయకూడనిది చేసి హౌరా అనిపించాలనేది ధనవంతుల మనస్సులో ప్రణాళిక. ఉన్నంతలో తమ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేయాలనేది మధ్య తరగతి కుటుంబాలు మనోగతం. వివాహాల విషయంలో శుభలేఖలు మొదలు.. వీడియో, ఫొటోలు, అలంకరణ, స్టేజీ ఏర్పాటు, లైటింగ్, గుర్రపుబండ్లతో ర్యాలీ.. మ్యూజికల్నైట్స్.. ఒక్కటేమిటి ప్రతీది ప్రత్యేకంగా ఉండాల్సిందే. బంధుమిత్రలతో పాటు ప్రతిఒక్కరు మీ బాబు, మీ అమ్మాయి వివాహం అదరహో.. సూపర్ చేశారు.. అంటూ ప్రసంశల వర్షం కురిపించుకుంటే చెప్పలేని ఆనందం. నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభం కానుండడం ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో.. పెళ్లిళ్ల సందడి నెలకొననుంది. సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాలో వివాహల సందడి నెలకొనుంది. నవంబర్ 1, 6, 14, 15, 22, 28, 30వ తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ తేదీల్లో వివాహాలు చేసుకోవడానికి అధికసంఖ్యలో ముహుర్తాలు పెట్టుకున్నారు. ఒకే రోజు వందల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ ముహుర్తాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. వీడియోలకు ప్రాధాన్యం... ఎంత తీసుకున్నా ఓకే. వీడియో, ఫొటోలు అద్భుతంగా ఉండాలి. ప్రతిఘట్టాన్ని మర్చిపోలేని రీతిలో.. భవిష్యత్‌లో తీపిగుర్తుగా మిగిలిపోయేలా టేకింగ్ ఉండాలని నిర్వహకులు కోరుతున్నారు. కనీసం రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వీడియోలు, ఫొటోలకు నజరానా ఇస్తున్నారు. అధునాతన కెమెరాలు ఉండాలి, ప్రతి సన్నివేశం చిత్రీకరించేందుకు స్టాప్ సరిపడా తెచుకోవాలని ఆంక్షలు విధిస్తున్నారు. అందుకే వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లకు ఈ నాలుగు రోజులకు డిమాండ్ పెరిగింది. బంగారం, వస్త్ర దుకాణాలకు క్యూ.. పెళ్లి అంటే ముందు గుర్తు వచ్చేది బంగారం, వస్త్రాలు. వీటి కోసం కనీసం 4 నుంచి 5రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే మంచి మోడల్స్ ఎంపిక చేయడం, పెళ్లికూతురు, పెళ్లి కొడుకులతో పాటు తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులకు కూడా స్థాయిని బట్టి బంగారం, వెండి, వస్త్రాలు పెడతారు. దీంతో బంగారు దుకాణాలు, వస్త్ర దుకాణాలు కిటకిటాలాడుతున్నాయి. కంపనీ వస్త్రాలకే పెళ్లి కుటుంబాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. పురోహితులు బిజీ.. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పురోహితులు బిజీగా మారిపోయారు. ఒకే రోజు ఒక్కో పురోహితుడు 3 వివాహాలు జరిపించేలా ముహుర్తాలు సెట్ చేసుకుంటున్నారు. మరికొందరు ప్రధాన పురోహితులు, ప్రధాన ఘట్టం మాత్రమే దగ్గరుండి నిర్వహించి, మిగిలిన కార్యక్రమం సహాయకులు చూసుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫంక్షన్‌హాల్స్ కూడా పూర్తిగా బుకింగ్ అయిపోయాయని పురోహితులు అంటున్నారు. క్యాటరింగ్‌కు డిమాండ్.. గతంలో మాదిరి వివాహానికి హాజరయ్యే అతిథులకు విందు కోసం కూరగాయలు, సరుకులు తెచ్చి వండించే విధానం దాదాపు లేదనే చెప్పాలి. అంతా కేటరింగ్‌కు ఇవ్వడమే ప్రస్తుత పరిస్థితులు. మాకు ఇన్ని రకాల స్వీట్లు, హాట్లు, పప్పు, సాంబారు, పచ్చళ్లు, మాంసం, అప్పడాలు వంటివన్ని సుమారు 20 నుంచి 25 రకాలు మెనూ కావాలి అంటూ కాంట్రాక్టులు ఇస్తున్నారు. మెనూను బట్టి ధర నిర్ణయిస్తున్నారు. ఇక పెళ్లిళ్ల నిర్వాహకులకు వంటలు, వడ్డనతో సంబంధం ఉండదు. వీరూ అతిథుల్లాగా వెళ్లడమే. డీజే.. బ్యాండ్.. భజంత్రీలు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వివాహం చేసుకునే కుటుంబాలు భాజా భజంత్రీలు, బ్యాండ్‌తో పాటు డీజే మ్యూజిక్‌ను ఎంచుకుంటున్నాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని చేసేటప్పుడు సంప్రదాయంగా బాజా భజంత్రీలు, జిలకర బెల్లం, తాళికట్టే సమయాల్లో భాజా, బ్యాండ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక సాయంత్రం భరాత్ తీయడానికి డీజేను అధికసంఖ్యలో ఎంచుకుని డ్యాన్స్‌లు చేస్తున్నారు. కళ్లు చెదిరేలా కల్యాణ మండపాలు.. సినిమా షూటింగ్‌ల తరహాలో కల్యాణ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. కాసులు కురిపించే కొద్దీ కాంతిలీనే కల్యాణ మండపాలు ముస్తబవుతాయి. దీని కోసం రూ.లక్షలు వేచిస్తున్నారు. డెకరేషన్స్ చేసే వారికి ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చేశారు. కళ్లుమిరుమిట్లు గొలిపేలా సెట్టింగ్‌లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మాసంలో మంచి ముహూర్తాలు.. మార్గశిర మాసంలో వివాహాలు మంచిది. కార్తీకమాసంలో కొద్ది రోజులు మూఢాలు రావడంతో వివాహలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ కార్తీకమాసంలో మంచి ముహుర్తాలు ఉన్నాయి. ఈ మాసంలో వివాహాలు చేసుకోవడంతో నూతన జంటల దాంపత్య జీవితం మంచిగా ఉంటుంది. ఇప్పటికే ఒక్కో రోజు 3 వివాహాలు జరిపించడానికి పురోహితులు సిద్ధమయ్యారు. కార్తీకమాసం భక్తితో పాటు శుభ కార్యాలకు మంచిదిగా చాలా మంది భావిస్తారు. – మార్తి పవన్‌కుమార్ శర్మ, పురోహితుడు -
ఇక కళ్యాణ‘మస్తు’..
-
ఇక కళ్యాణ‘మస్తు’..
► మూడు నెలల తర్వాత శుభ ముహూర్తాలు ► శ్రావణమాసం రాకతో వేల సంఖ్యలో వివాహాలు సాక్షి, హైదరాబాద్: ‘‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంఠే బద్నాని శుభగే త్వంజీవ శరదం శతం’ ఈ మంత్రం తెలుగు రాష్ట్రాల్లో మార్మోగే సమయం ఆసన్నమైంది. పచ్చని పందిళ్లు... మామిడి తోరణాలు... మేళతాళాలు... మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో వధూవరులను ఏకం చేసే వివాహ మహోత్సవాలు సమీపించాయి. మూడు నెలల విరామం తర్వాత శ్రావణ శుభ గడియలు ప్రవేశించడంతో వేలాది వివాహాలు జరుగనున్నాయి. చైత్రమాసం (ఏప్రిల్ 27వ) తేదీతో ముహూర్తాలు అయిపోయాయి. వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వరుసగా గురు, శుక్ర మూఢాలు రావడం ఆషాడం శూన్యమాసం కావడంతో మూడు నెలలుగా శుభ ముహూర్తాలు లేవు. ఆరో తేదీన పంచమి - మిథున లగ్నంతో శుభముహూర్తాలు ఆరంభమవుతున్నాయి. ఈ నెల 10, 13, 17, 18, 19, 20, 26 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. తదుపరి ఆశ్వయుజ మాసంలో పూర్తిగా ముహూర్తాలు లేవు. అందువల్ల శ్రావణమాసంలో కాకపోతే పెళ్లి ముహూర్తాల కోసం మళ్లీ మార్గశిర, కార్తీక మాసాల కోసం ఎదురుచూడాల్సిందే. ఇప్పటికే సంబంధాలు కుదిరిన వారికి ఈ నెలలో పెళ్లిళ్లు చేసేందుకు కళ్యాణ మంటపాల అడ్వాన్సు బుకింగ్‌లు జోరందుకున్నాయి. కల్యాణ వేదికల అలంకరణ, బ్యాండ్ మేళాలు, మంగళవాయిద్య బృందాలకు గిరాకీ పెరిగింది. కళ్యాణ మంటపాలు బిజీబిజీ.. పెళ్లిళ్లు ఉండటంతో కళ్యాణ మంటపాల అద్దెల రేట్లూ అదిరిపోతున్నాయి. ‘ఈనెల 18న శ్రావణ పౌర్ణమి, ధనిష్ట నక్షత్రం, కన్యాలగ్నం. గురువారం ఉదయం 8.51 గంటలకు కన్యాలగ్న ముహూర్తం చాలా బలమైనది. అందుకే ఎక్కువమంది ఆరోజుకు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. తిరుమలలో ఆరోజు పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి...’ అని ఒక వేదపండితుడు ‘సాక్షి’కి తెలిపారు. వామ్మో అనిపించే అలంకరణలు.. సంపన్నులే కాకుండా మధ్య తరగతి వారు కూడా పెళ్ళి మండపాల అలంకరణకు ప్రస్తుతం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఇందుకోసం బెంగళూరు నుంచి పూలను తెప్పించుకుంటున్నార ని తిరుపతికి చెందిన మంటపాల అలంకరణ కాంట్రాక్టరు నారాయణ తెలిపారు. మంటపం అలంకరణ ఖర్చు అనేది వారు కోరుకున్న తీరు, మంటపం సైజును బట్టి రూ.50 వేల నుంచి 5 లక్షల వరకూ, ఆపైన కూడా ఉంటుందని వివరించారు. -
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు
► ఏర్పాట్లు పూర్తి నేడు విజయవాడలో 86 కేంద్రాల్లో పరీక్షలు ► నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ► జిల్లా నుంచి వచ్చే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం ► బస్టాండ్, రైల్వేస్టేషన్లో హెల్ప్ డెస్క్‌లు ► వివాహాల సీజన్‌కు చివరి ముహూర్తం ► ఇదేరోజు కావటంతో పెరగనున్న ట్రాఫిక్ రద్దీ సాక్షి, విజయవాడ : ఎంసెట్ విద్యార్థులకు ప్రత్యేక సేవలు అందించటానికి విజయవాడ కమిషనరేట్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పరీక్ష రాయటానికి వచ్చే విద్యార్థులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించింది. పోలీసులు యథావిధిగా సెంటర్ల వద్ద బందోబస్తు మొదలుకొని పరీక్షా కేంద్రాల మార్గంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వరకు అన్నింటినీ పర్యవేక్షించనున్నారు. దూర ప్రాంత విద్యార్థుల సౌకర్యం కోసం బస్టాండ్, రైల్వేస్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచే ఇవి పనిచేయనున్నాయి. ఎంసెట్ కన్వీనర్‌తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఎంసెట్ నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఉచిత రవాణా ఆర్టీసీ అధికారులు ఎంసెట్ విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నారు. నగరంలోని పరీక్షా కేంద్రాల రూట్లకు ఆర్టీసీ సిటీ బస్సుల్ని ఏర్పాటు చేశారు. 400 సిటీ బస్సులు నగరంలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. ఎంసెట్ విద్యార్థులు హాల్‌టిక్కెట్ చూపించి వాటిలో ప్రయాణం చేయవవచ్చు. జిల్లా నుంచి వచ్చే విద్యార్థులు కూడా హాల్‌టిక్కెట్ చూపించి బస్సులో ఉచితంగా విజయవాడకు చేరుకోవచ్చు. ఆర్టీసీ ఆర్ఎం రామారావు ఇప్పటికే డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం నుంచి ఆర్ఎంతో పాటు అధికారులు పరిస్థితిని సమీక్షించనున్నారు. శుభకార్యాలకూ చివరి ముహూర్తం... వివాహాలు తదితర శుభకార్యాలకు ఈ సీజన్లో శుక్రవారం చివరి ముహూర్తం. నగరంలో సుమారు 120కి పైగా వివాహాలు జరగనున్నాయి. ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది. పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. నగరంలో వివాహాల ఊరేగింపులపై నిషేధం విధించారు. విద్యార్థులు రెండు గంటలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు. రద్దీ ప్రాంతాల్లో రెగ్యులర్ ట్రాఫిక్ పోలీసులతో పాటు అదనంగా మరికొంత మందిని నియంత్రణకు కేటాయించారు. ఉదయం ఇంజినీరింగ్.. మధ్యాహ్నం మెడిసిన్.. విజయవాడలో శుక్రవారం 86 పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్ (ఇంజినీరింగ్, మెడిసిన్) ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. దీనికి జిల్లాలో 42,224 మంది విద్యార్థులకు ఉన్నత విద్యామండలి హాల్ టికెట్లు జారీ చేసింది. ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ , మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. 86 పరీక్ష కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. -
పీ పీ పీ ..డుమ్ డుమ్ డుమ్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరిణయ ఘడియలు వచ్చేశాయి...తెల్ల కాగితాల్లాంటి రెండు కొత్త మనసులపై అనేక మధురస్మృతులను లిఖించే ఆనంద ఘడియలు తలుపు తట్టాయి..ఎన్నో ఊహల్లో..మరెన్నో ఆశల్లో.. ఇంకెన్నో తలపుల్లో నిలిచిన భాగస్వామితో ఏడడుగులు వేసే శుభ ఘడియలు పలకరించాయి.ఐదు నెలలుగా మూగబోయిన పెళ్లి బాజాలు మళ్లీ మోగనున్నాయి.. మాంగల్యం తంతునానేనా అనే వేద మంత్రంతో కొత్త జీవితాలకు పెళ్లి పుస్తకం తెరిచాయి. నేటి నుంచి పెళ్లిళ్ల సీజన్ షురూ.. హైదరాబాద్: ప్రస్తుతం ఆశ్వయుజమాసం రావడంతో శుభఘడియలు సమీపించాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో దివ్యమైన ముహూర్తాల్లో ఊరూరా కల్యాణవీణ మోగనుంది. ఐదు నెలల తరువాత ముహూర్తాలు రావడంతో జంట నగరాల్లో వేల సంఖ్యలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇవీ శుభ ముహూర్తాలు నవంబరు 7, 13, 14, 15, 17, 18, 19, 20, 22, 26 తేదీలు..డిసెంబరులో 2, 4, 5, 6, 14, 16,17, 20, 21, 24, 25, 27, 30, 31 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. జనవరి 11 నుంచి పుష్యమాసం కావడంతో మళ్లీ తిరిగి ఫిబ్రవరి 9 వరకు ముహూర్తాలు లేవని వెల్లడిస్తున్నారు. అన్నింటికీ డిమాండే.. ఐదు నెలల తరువాత ఒక్కసారిగా పెళ్లి గంటలు మోగనుండటంతో వివాహానికి సంబంధించిన అన్నింటికీ ఒక్కసారిగా డిమాండ్ పెరగనుంది. కల్యాణ మండపాలు, కేటరింగ్, పురోహితులు, బాజా భజంత్రీలు, మండపం డెకరేషన్లు, కార్లు, బస్సులు, షామియానా, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ.. ఇలా అన్నింటికీ ఒక్కసారిగా డిమాండ్ రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఆయా విభాగాల వారికి ముందుగా అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వధూవరులతో పాటు బంధుమిత్రులు సిద్ధమయ్యారు. -
బంగారం ఇప్పుడు కొనొచ్చా?
మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు! బంగారం ధర పెరిగిపోతుంది. సీజన్ ముగిసిపోయాక క్రమేపీ దిగివస్తుంది. ఇదే తరహాలో ఏడాదికాలంగా బంగారం ధర 8-10 శాతం హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడుతోంది. గతేడాది నవంబర్-డిసెంబర్ మధ్య పెళ్లిళ్ల సీజన్ సమయంలో దేశీయంగా 10 గ్రాముల ధర రూ. 27,500 స్థాయికి పెరిగింది. తర్వాత రూ. 26,500 స్థాయికి పడిపోయింది. మళ్లీ ఈ మే నెలలో సీజన్ కావడంతో 27,500 స్థాయిని దాటేసింది. అయితే వచ్చే కొద్ది నెలల్లో ధర ఇంతటి గరిష్ట స్థాయిలో కొనసాగుతుందని చెప్పలేమన్నది విశ్లేషకుల మాట. అవన్నీ సరే! ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారు కొనొచ్చా? ఇంకా తగ్గుతుందా? వేచి చూడాలా? ఏం చేయాలి?. స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు ఉంటాయన్న విశ్లేషకులు పెట్టుబడి కోసమైతే ఇపుడు అనవసరం... పెళ్లి కోసం, నగల కోసం ఎప్పుడు కొనాల్సి వస్తే అప్పుడు కొనాల్సిందే. కానీ పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకునేవారు ప్రస్తుత ధరలో కొనడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ వుండదని పలువురు కమోడిటీ విశ్లేషకులు చెపుతున్నారు. ఉదాహరణకు ఏడాది క్రితం బంగారం కొని ఉంటే ఇప్పటికి మీ సంపద 7% తగ్గిపోయినట్లే అని, అదే గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టి ఉంటే అది 11 శాతం హరించుకుపోయేదని వారు గుర్తుచేస్తున్నారు. కాకపోతే రెండు, మూడేళ్ల దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి చేస్తే బంగారం అనుకూల రాబడినిస్తుందని మరికొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు. ఏఎన్జెడ్ రీసెర్చ్ కమోడిటీ స్ట్రాటజిస్ట్ విక్టర్ థైన్ప్రియా మాటల్లో చెప్పాలంటే... ‘‘గ్రీసు సంక్షోభం, అమెరికా ద్రవ్య విధానం తదితరాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి’’. ఎందుకంటే గ్రీస్ తన రుణాల్ని సకాలంలో చెల్లించలేకపోతే యూరప్‌లో ఆర్థిక సంక్షోభం వస్తుంది. దాంతో బంగారం ధరలు పెరిగిపోతాయి. అదే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే పుత్తడి ధర పతనమైపోతుంది. వచ్చే ఆరు నెలల్లో వీటిలో ఏది జరిగినా, బంగారం హెచ్చుతగ్గులు తీవ్రంగా వుంటాయి. లేదంటే గత కొద్దినెలల్లానే స్తబ్దుగా 8% శ్రేణిలో కదులుతూ వుంటుంది. మన దగ్గరే అంత డిమాండ్.. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య బంగారానికి భారత్‌లో పెరిగినంతగా డిమాండ్ (అభరణాలు, పెట్టుబడులు) మరే దేశంలోనూ పెరగలేదని తాజాగా విడుదలైన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా పుత్తడి దిగుమతి చేసుకునే దేశాలు చైనా, భారత్‌లు కాగా, చైనాలో డిమాండ్ 7% తగ్గగా, భారత్ లో 15% పెరిగింది. అలాగే చైనాలో అభరణాల బంగారానికి డిమాండ్ 10% క్షీణించగా, భారత్‌లో 22%ఎగిసింది. బంగారం దిగుమతులపై ఆంక్షలు సడలించడం, పుత్తడి డిపాజిట్ స్కీము వంటి ప్రోత్సాహకాల్ని బడ్జెట్లో ప్రకటించడం భారత్‌లో డిమాండ్ పెరగానికి కారణమని, చైనాలో ఈక్విటీ మార్కెట్ ఈ ఏడాది పెద్ద ర్యాలీ జరపడం వల్ల అక్కడి వినియోగదారుల్లో బంగారంపై ఆసక్తి తగ్గిందని నివేదిక పేర్కొంది. సుంకం తగ్గించినా పుత్తడి తగ్గుతుంది... ప్రస్తుతం బంగారంపై దేశంలో 10 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు. మూడేళ్ల క్రితం బంగారం దిగుమతులు పెరిగిపోవడంవల్ల కరెంటు ఖాతా లోటు (దేశంలోకి వ చ్చే, పోయే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం) ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో పుత్తడిపై సుంకాల్ని పెంచివేశారు. ప్రస్తుతం కరెంటు ఖాతా లోటు సంతృప్తికరమైన స్థాయిలో వుంది. ఈ నేపథ్యంలో సుంకాల్ని క్రమేపీ తగ్గిస్తే, పుత్తడి ధర దిగివస్తుంది. కనుక ఈ తగ్గుదల ప్రమాదానికి లోబడి బంగారాన్ని కొనుక్కోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. నవంబర్-డిసెంబర్ అనుకూల సమయం.. అంతర్జాతీయంగా డాలరు తగ్గడంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర ఔన్సుకు 1180 డాలర్ల నుంచి 1225 డాలర్లకు పెరిగింది. ఇదే సమయంలో ఇక్కడి రూపాయి విలువ క్షీణించడంతో దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధర రూ. 26,500 నుంచి రూ. 27,500కు పెరిగింది. కానీ రానున్న కొద్దినెలల్లో డాలరు మళ్లీ పెరుగుతుందని, దాంతో ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌కల్లా ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర 1100 డాలర్ల వరకూ తగ్గవచ్చని, అప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదని కొందరి విశ్లేషకుల అంచనా. -
సర్ప్రైజ్ చేద్దామా!
ఇది పెళ్లిళ్ల సీజన్. ఎలాంటి బట్టలు కొనాలి? ఏ నగలు వేసుకోవాలని వధూవరులెంత తర్జనభర్జన పడతారో.. ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా? అని పెళ్లికి వెళ్లేవారూ అంతే ఆలోచిస్తారు. మరీ అంత కంగారు పడాల్సిన పనిలేదు. పెళ్లి మీ స్నేహితులదనుకోండి. గిఫ్ట్ ఎంపిక ఈజీ. ఎందుకంటే వాళ్ల ఇష్టాయిష్టాలేంటో మీకు తెలిసే ఉంటాయి. ఇక దగ్గరి బంధువులదైతే వాళ్ల అభిరుచులూ మీకు కొంతైనా అర్థమవుతాయి. దూరపు చుట్టాలదైతే! అక్కడే అసలు సమస్య షురూ.. ఇష్టాయిష్టాలు తెలియవు. గిఫ్ట్ దొరికే టైమ్ ఉండదు. సో ఈ కింది రూల్స్ ఫాలో అయిపోండి. వస్తువులు కానుకగా చాలామంది తెస్తారు. ఒక్కోసారి ఒకరు తెచ్చిందే మరొకరూ తేవొచ్చు. ఈ అవకాశం ఇవ్వకుండా మీరు దూరపు బంధువులైతే వెంటనే రూ.501 కానుకగా ఇచ్చేందుకు రెడీ అయిపోయిండి. పెళ్లి మీ ఫ్రెండ్ లేదా దగ్గరి బంధువులైతే రూ.2,001, రూ.5001 ఇవ్వండి. ఒక్క రూపాయి ఎందుకు రౌండ్‌ఫిగర్ అయితే సరిపోతుంది కదా అనుకోవద్దు. చివర ఒక రూపాయి అనేది బేసి సంఖ్యేకాదు... ఫ్యూచర్ సక్సెస్‌కి చిరునామా కూడా. ఇలా డబ్బు రూపంలో ఇస్తే పెళ్లి తరువాత వారికి ఏదైనా ఖర్చుకో, హానీమూన్ ట్రిప్కో ఉపయోగపడుతుంది. డబ్బు కవర్లో పెట్టి ఇవ్వాలన్నది అందరికీ తెలిసిందే... కవర్ ఎంపికే మీ ప్రత్యేకతను చెబుతుంది. కాబట్టి బ్రైట్ కలర్స్‌లో పైన ఎంబ్రాయిడరీతో ఉన్న కవర్స్‌ను ఎంపిక చేసుకోండి. తెలుపు, నలుపు రంగులొద్దు సుమా!. నో టూ వోచర్స్... ఈమధ్య షాపింగ్‌మాల్స్, ఆన్లైన్ స్టోర్స్ వోచర్స్ ఆఫర్ చేస్తున్నాయి. అవి రూ.5 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే గిఫ్ట్‌గా డబ్బు కాకుండా ఇలా ఫ్యాన్సీగా ఓచర్ రూపంలోనూ ఇవ్వొచ్చు. సమస్యల్లా దీనికి కాల, వస్తు పరిమితి ఉంటుంది. ఒకవేళ మీ గిఫ్ట్ తీసుకునేవారు ఆ టైమ్‌లోపు స్టోర్‌కు వెళ్లకుండా ఉంటే... ఆ టైమ్ లిమిట్ దాటిపోతుంది. సో సే నో టూ ఓచర్స్. బొకేస్, లాఫింగ్ బుద్ధాస్.. చేతిలో బొకేతో పెళ్లికి వెళ్లి స్టైల్‌గా వధూవరులకిచ్చి ఫొటోకి ఫోజివ్వడం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ ఎక్కువగా వచ్చే ఈ బొకేలు వాళ్లకు నిష్ర్పయోజనం. ఇవే కాదు.. అప్పుడప్పుడు లాఫింగ్ బుద్ధాస్, వినాయకుడి బొమ్మలు గిఫ్ట్‌గా ఇవ్వడం బాగుంటుంది. కానీ, ఇవే ఎక్కువ సంఖ్యలో వస్తే ఏం చేయాలో తెలియక కొత్తజంట తికమక పడుతుంది. ఆ విగ్రహాలు పసిడివో, వెండివో అయితే కరిగించొచ్చు. కానీ పెళ్లికి జ్ఞాపకంగా వచ్చిన వాటిని కరిగించడానికి ఇష్టపడరు. ఇక అవి ఇంట్లో పెట్టడానికి వాస్తు సమస్య కూడా అడ్డు రావచ్చు. కాబట్టి విగ్రహాలను ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి. అడిగితే తప్పులేదు.. పెళ్లంటేనే సందడి. ఇక రిసెప్షన్ వేళ హంగామానే వేరు. అలాంటి టైమ్‌లో మీరిచ్చిన కవరో, గిఫ్టో మిస్సయ్యే చాన్స్ లేకపోలేదు. కాబట్టి ప్రస్తుతానికి గిఫ్ట్ తీసుకోకుండా వెళ్లండి. పెళ్లి తరువాత వాళ్లు ఓ ఇంటివాళ్లయ్యాక వెళ్లి మీ కానుకనందించండి. అయితే ఈ సూత్రం దగ్గరి వారికి, స్నేహితులకే వర్తిస్తుంది. ఇక పెళ్లికొడుకో, పెళ్లికూతురో మీకు బాగా దగ్గరైతే ఎలాంటి గిఫ్ట్కావాలో వారినే అడగడంలో తప్పు లేదు. ఇప్పుడు ఛాయిస్ ఈజ్ యువర్స్! ..:: కట్టా కవిత -
ఫ్యాషన్ అన్లిమిటెడ్
ఫిబ్రవరి మాసం పెళ్లిళ్ల సీజన్. ఫ్యాషన్‌లో అప్ టు డేటెడ్‌గా ఉండే హైదరాబాదీస్ ఈ పెళ్లిళ్ల సీజన్లో మరిన్ని డిజైన్స్ కోరుకుంటారు. అలాంటివారికోసమే తాజ్‌డెక్కన్‌లో జరుగుతున్న ఈ ఫ్యాషన్ ఎక్స్పో. దేశ నలుమూలల నుంచి వచ్చిన డిజైనర్లు రూపొందించిన నగలు, చీరలు, సంప్రదాయ దుస్తులు, గృహాలంకరణ వస్తువుల స్పెషల్ కలెక్షన్స్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ‘ఫ్యాషన్ అన్లిమిటెడ్’ పేరుతో జరుగుతున్న ఈ ప్రదర్శన నిజంగానే సృజనాత్మకతకు హద్దులు లేవని నిరూపిస్తోంది. మంగళవారం ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ నేడూ కొనసాగనుంది. -
శారీ...సింగారీ
నల్లంచు తెల్ల చీరైనా.. చెంగావి రంగు చీరైనా.. అతివలు చుట్టుకుంటేనే వాటికి అందం. తరతరాలుగా విలువ తరగనివి చీరలే. మగువల మేను చుట్టుకుని మెరిసిపోయే కోకల రూపకల్పన మహాద్భుతంగా ఉంటుంది. రోజురోజుకూ ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న మార్పులు చీరల్లో సరికొత్త చేర్పులు చేస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్. సిటీలోని షాపింగ్ మాల్స్ విభిన్నమైన శారీ కలెక్షన్స్‌తో నిండిపోయాయి. అలనాటి పట్టు చీరలకు ఆధునిక హంగులు జోడించి మగువలకు కలర్ఫుల్గా అందిస్తున్నాయి. ఒకటేమిటి... కాంచీపురం, కుబేర, ఆవిష్కార, అరుంధతి తదితర హెవీ, లైట్ వెయిట్ పట్టు చీరలు వినూత్నమైన డిజైన్లు అద్దుకుని ముచ్చటగొలుపుతున్నాయి. జీవితంలో ఒకసారి జరిగే పెళ్లి వేడుకలో తమ ఆహార్యం స్పెషల్ అట్రాక్షన్‌గానే కాదు, ఓ మెమరబుల్‌గా మిగిలిపోవాలని పెళ్లికూతుళ్లు కోరుకుంటున్నారు. వారితోపాటు ఆ వేడుకకు హాజరయ్యే అతివలు కూడా అదిరిపోయే అప్పీరెన్స్ ఉండాలనుకుంటున్నారు. అందుకే ధరకు వెనకాడకుండా నచ్చిన చీరలు కొనుగోలు చేస్తున్నారు. పాతతరం చీరలకు ఆధునికత జోడించిన వెరైటీలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. లైట్ వెయిట్ పసిడి పట్టుకు ఇప్పుడు క్రేజ్ బాగా ఉంది. 90 శాతం వెండి, పది శాతం బంగారం మిక్స్ చేసి ఈ శారీలను డిఫరెంట్ డిజైన్లలో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. వీటిని ధనవంతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అధిక బరువు ఉన్నవి మధ్యతరగతివారు అడుగుతున్నారు. కాలేజీ అమ్మాయిల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరినీ దృష్టిలో ఉంచుకుని వీటిని సిద్ధం చేస్తున్నారు... అని షాపింగ్ మాల్ నిర్వాహకులు చెబుతున్నారు. మెరిసి... మురిపించి సికింద్రాబాద్ సీఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్లో శుక్రవారం జరిగిన ‘వివాహ్ కలెక్షన్స్ 2015’ లాంచింగ్‌లో... ముద్దుగుమ్మలు పట్టు చీరలు కట్టి... ఒంటి నిండా ఆభరణాలు ధరించి సంప్రదాయ సిరులు ఒలికించారు. మిస్ ఇండియా ఎర్త్ అలంకృత సహాయ్, నటి రామ్శ్రీ, ఆయేషా రావత్, మోడల్స్ కలర్‌ఫుల్ శారీల్లో ‘పట్టు’కే వన్నె తెచ్చారు. -వీఎస్ -
ఒంటరిగా వెళ్తే గొలుసు గోవిందా !
తాళి బొట్టుకు రక్షణ కరువైంది. మెడలో బంగారం వేసుకుంటే చాలు దొంగలు ఎగబడుతున్నారు. పట్టపగలే బంగారు గొలుసులను లాక్కుని బైకులపై దర్జాగా పారిపోతున్నారు. వారానికో చైన్‌స్నాచింగ్ జరుగుతుండడంతో మహిళలు నగలు ధరించి గడపదాటాలంటేనే వణుకుతున్నారు. కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో మూడు నెలల కాలంలో పదికి పైగా చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. ఇళ్ల ముందు నిల్చున్నా, రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నా దొంగలు మహిళల మెడలోని గొలుసులపై కన్నేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి గేటుదాటి బయటకు వచ్చిన గజవాడ సుగుణ అనే మహిళ మెడలో నుంచి ఆరు తులాల బంగారు గొలుసులను దొంగలు లాక్కు ని పరారయ్యారు. దొంగలు ఒక్కసారి గా ఆమె మెడలో నుంచి చైన్ లాగడంతో కిందపడిపోయి అరిచినా లాభం లేకుం డా పోయింది. మూడు రోజుల క్రితం కామారెడ్డి పట్టణానికి సమీపంలోని నర్సన్నపల్లి చౌరస్తా వద్ద ఆటోలో వస్తు న్న మహిళ మెడలో నుంచి గొలుసును లాక్కున్నారు. అంతకన్నా వారం రోజు ల ముందు పట్టణంలోని విద్యానగర్ కా లనీలో లక్ష్మి అనే మహిళ మెడలో నుంచి చైన్‌ను లాక్కుని పరారయ్యారు. ఇలా వరుసగా కామారెడ్డి పట్టణంలో గొలు సు దొంగతనాలు జరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.... గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటు న్నా ఫలితం కనిపించడం లేదు. పోలీ సులు తనిఖీలు నిర్వహిస్తున్నా దొంగలు మాత్రం ఎక్కడో ఒక చోట తమ పని కానిచేస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న కాలనీలు, వీధుల్లోనే ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. రోడ్లపై జనసంచారం లేని ప్రాంతాలను ఎంచుకుని దొంగలు మహిళల మెడలో నుంచి చైన్లు లాక్కెళుతున్నారు. చైన్ స్నాచర్లు, దొంగలను పోలీసులు అరెస్టు చేసినట్టు చూపుతున్నా చోరీలు మాత్రం ఆగడం లేదు. పెళ్లిళ్ల సీజన్లో పెరిగిన చోరీలు... మహిళలు సాధారణంగా తాళిబొట్టుతో ఉన్న బంగారు గొలుసును రెగ్యులర్‌గా ధరిస్తారు. అదే శుభ ముహూర్తాల సమయంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లే సమయంలో తమకు ఉన్న ఆభరణాలన్నిటినీ ధరించడానికి ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మహిళలు నగలు ధరించి వెళ్లే సందర్భంలో చైన్ స్నాచింగులు జరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. తమ వెంట మగవారు లేకుండా బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. మరింత నిఘా అవసరం పట్టణంలో పెరిగిన దొంగతనాల నివారణకు పోలీసులు మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మూ డు జిల్లాల కూడలి కావడం వల్ల ఇక్కడి కి నిత్యం వేలాది మంది ప్రజలు వచ్చిపోతుంటారు. అయితే అనుమానితులపై నిఘా ఉంచి వారిని ప్రశ్నించడం ద్వారా కొంత వరకు దొంగతనాలను అరికట్టవచ్చని అంటున్నారు. పాత నేరస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరు తులాలు.. కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీలో గురువారం ఉదయం ఓ మహిళ మెడలో నుంచి బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆరు తులాల గొలుసులను లాక్కెళ్లారు. ఇంటి గేటు నుంచి బయటకు వచ్చిన గజవాడ సుగుణ వద్దకు వచ్చిన యువకుడు మెడలో నుంచి బంగారు గొలుసులను లాక్కున్నాడు. బలంగా లాగడంతో సుగుణ కిందపడిపోయింది.చైన్ లాక్కున్న దొంగలు బైకుపై పరారయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పెళ్లికి బాజా మోగింది
మళ్లీ పెళ్లిళ్ల సీజన్ వచ్చింది. మూడు నెలల విరామం తర్వాత మార్గశిర మాసం మంచి ముహూర్తాలు తీసుకువచ్చింది. ఆకాశాన్ని పందిరిగా మార్చి.. .భూలోకాన్ని పీటగా చేసి వధూవరులు కొత్త జీవితం ప్రారంభించేందుకు శుభ ఘడియలు రానే వచ్చాయి. శుభ కార్యాల కోసం మండపాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. వధూవరుల కోసం వస్త్ర దుకాణాలు, జువెలరీ షాపులు సందడిగా మారాయి. జిల్లాలోని ముఖ్యపట్టణాలు, మండలకేంద్రాలు, గ్రామాలు పెళ్లి వేడుకలకు సర్వం సిద్ధమయ్యాయి. మార్గశిర మాసం...మంచి ముహుర్తాలు తెచ్చింది. జిల్లాకు పెళ్లి కళ వచ్చింది. బంధుమిత్రుల రాకతో కోలాహలం పెరిగింది. కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లు సందడిగా మారాయి. ఆకాశాన్ని పందిరిగా మార్చి...భూలోకాన్ని పీఠగా పేర్చి వధూవరులు కొత్త జీవితం ప్రారంభించేందుకు శుభ ఘడియలు మొదలయ్యాయి. మౌఢ్యాల మూలంగా ఈ ఏడాది భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక మాసాల్లో పెళ్లిళ్లు జరగలేదు. ఈసారి వివాహ మహోత్సవ వేడుకలకు ముహూర్తాలు తక్కువగా ఉండటంతో ముందస్తుగానే జాగ్రత్త పడి ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో వివాహ వేడుకలకు సర్వం సిద్ధమైంది. - మహబూబ్‌నగర్ కల్చరల్ ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మరుపురాని ఘట్టం. మూడు ముళ్లు, ఏడడుగులతో ఏకమయ్యే అపూర్వమైన సుదినం. ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. వివాహానికి సుముహూర్తమే కొండంత బలం. దివ్యమైన ముహూర్తం లేకపోతే వివాహం జరిగే అవకాశాలు తక్కువే. ఈ ఏడాది భాద్రపద, అశ్వీయుజ, కార్తీక మాసాల్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు లేవు. మార్గశిర మాసం మాత్రమే పెళ్లిముహూర్తాలను మోసుకొచ్చింది. ఈ నెల 6, 7, 10, 12, 13, 17, 18 తేదీల్లో వివాహ శుభ ముహూర్తాలున్నాయి. ఇందులో 13, 18 తేదీల్లో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నట్లు అర్చకులు చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ దాటితే 2015 జనవరి 22వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు మరో దఫా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. తక్కువ రోజులు శుభఘడియలు ఉండటంతో ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకున్న కుటుంబాలు బిడ్డలు, కొడుకుల పెళ్లి చేయడానికి తహతహలాడుతున్నారు. ఆ ముహూర్తం కోసం ఎంతో ఆతృతగా నిరీక్షిస్తున్నారు. శుభఘడియలు ఆరంభమై పెళ్లి ముహూర్తాలు దగ్గరపడటంతో వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వందలాది వివాహాలు జిల్లాకు పెళ్లి కళ వచ్చేసింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకు ర్తి, అయిజ, కొత్తకోట, దేవరకద్ర, మక్తల్, ఆత్మకూర్, అలంపూర్ తదితర ప్రధాన పట్టణాల్లో ఎక్కడ చూసిన పెళ్లి సందడి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా మార్గశిర మాసంలో వందలాది పెళ్లిళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లిలు జరిగే కుటుంబాలు వివాహ వేడుకల్లో తల మునకలయ్యారు. పెళ్లిళ్లు నిర్వహించడానికి కల్యాణ మండపాలు, గార్డెన్లు, ఫంక్షన్‌హా ళ్లు, ప్రింటింగ్ ప్రెస్, బ్యాండ్, టెంట్‌హౌజ్, ఫొటో, వీడియోగ్రాఫర్లు, క్యాటరింగ్ నిర్వాహకులు, పురోహితులకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. చాలావరకు పెళ్లి ముహూర్తంతోనే ముందస్తుగా ఎక్కడికక్కడ బుక్ చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో హోటళ్లను, లాడ్జీలను కూడా రిజర్వు చేసుకున్నారు. బస్సులను మాట్లాడుకున్నారు. రెండు నెలల ముందే బుకింగ్ కార్తీక మాసంలో పెళ్లిల్లు లేకపోవడంతో మార్గశిరంలో ఎక్కువగా జరుగుతాయని గ్రహించిన వారంతా రెండు నెలల ముందే ఫంక్షన్‌హాళ్లను బుక్ చేసుకున్నారు. ఒకే ముహుర్తంలో ఎ క్కువ సంఖ్యలో వివాహాలు జరుగుతుండటంతో ఉన్న ఫంక్షన్‌హాళ్లలోనే పార్టిషన్లు చేసి సుందరంగా తీర్చిదిద్ది కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నాం. రిసెప్షన్లు రాత్రిపూట జరుగుతుండడంతో పెళ్లి ముహుర్తాలకు కొంత వెసులుబాట్లు లభిస్తున్నది. - మద్ది అనంతరెడ్డి, బృందావన్ గార్డెన్స్ యజమాని వేదికలు ముస్తాబు... వివాహ మహోత్సవ వేడుకలు నిర్వహించే కల్యాణ మండపాలు, ఫంక్షన్‌హా ళ్లు సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్నాయి. ఖరీదైన పెళ్లి జరిపించే వారి కోసం నిర్వాహకులు తగిన రీతిలో ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కల్యాణ మండపాల్లో ప్రత్యేకంగా డెకరేషన్ చేస్తున్నారు. కొన్నిచోట్ల సెట్టింగ్‌లు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఆర్ట్ డెరైక్టర్లను రప్పిస్తున్నారు. వివాహ వేడుకను అతిథులంతా వీక్షించేందుకు వీలుగా పలుచోట్ల ఎల్ఈడీలు, స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లి నిర్వాహకుల ఆర్థికస్థోమతను బట్టి ఫంక్షన్‌హాళ్లు రెడీ అవుతున్నాయి. జీవితంలో మరుపురాని రోజు కావడంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా పెళ్లి చేయడానికి కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. ఖరీదైన పెళ్లిళ్లు... మారిన కాలంలో పెళ్లిళ్లు ఖరీదైపోయాయి. సాదాసీదాగా పెళ్లి నిర్వహించే పరిస్థితులు కరువయ్యాయి. ఇక కట్నకానుకలు సరేసరి. పెళ్లి నిర్వహించడానికి రూ.లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి దాపురించాయి. పెళ్లి ముహూర్తాలు ఖరారు కావడంతో అందుకు సంబంధించిన రంగాలు ధరలను ఏకంగా పెంచేశాయి. కల్యాణ మండలం అద్దెను పెంచేశారు. ఇతర రోజుల కన్నా సుమారు 20 నుంచి 25 శాతం అద్దె పెంచారు. బ్యాండ్ నిర్వాహకులు పెళ్లికి రూ.10-15 వేలకు తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. ముఖ్యపట్టణాల్లో రూ.20 వేల వరకు కూడా వసూలు చేస్తున్నారు. క్యాటరింగ్, ఫొటో, వీడియోగ్రాఫర్లు కూడా తమదైన శైలిలో అధిక మొత్తాన్ని ఆశిస్తున్నారు. గతం కన్నా రూ.3వేల వరకు పెంచేశారు. పురోహితులు కూడా డిమాండ్‌ను బట్టి అడుగుతున్నారు. ఒక్కో పురోహితుడు రెండు, మూడు పెళ్లిళ్లు ఏకకాలంలో నిర్వహించడానికి నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రింటింగ్ ప్రెస్‌ల యజమానులు కూడా పెరిగిన ముడి సరుకుధరలను బేరీజు వేసుకుని తీసుకుంటున్నారు. ఈ రకంగా పెళ్లికి రూ. లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బంగారం ధరలు పెరుగుతుండటంతో ముందుగానే బంగారం కొనేందు కు ఎగబడుతున్నారు. నవంబర్‌లో 10 గ్రాముల బంగారం రూ.26 వేలకు తగ్గినా, పెళ్లిళ్ల సీజన్‌తో మళ్లీ పుంజుకుని రూ.27వేలకు పైగా పలుకుతోంది. ఆ రెండు రోజుల్లో సుముహూర్తాలు కార్తీక మాసంలో శుక్లమౌఢ్యమి ఉన్నందున పెళ్లిల్లు తదితర శుభాకార్యాలు జరగలేదు. అందుకే ఈనెల 6, 7, 10, 12, 13, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉం డడంతో జిల్లాలో వేలాది పెళ్లిల్లు జరగనున్నాయి. ఒకేసారి పెళ్లిల్లు ఉండడం వల్ల పురోహితుల కొరత ఏర్పడినప్పటికీ వధూవరుల జన్మనక్షత్రాల ప్రకారం వేర్వే రు సమయాల్లో శుభ లగ్నాలు జరుగుతుండడం వల్ల కొంత వెసులుబా టు కుదురుతున్నది. 17, 18 తేదీల్లో సుముహూర్తాలు ఉండడం వల్ల ఆ రెండు రోజుల్లో అత్యధికంగా వివాహాలు జరగనున్నాయి. - రామాచారి, టీటీడీ జిల్లా సహాయకులు -
రెక్కలు ముడిచిన పసిడి రేటు
- నాలుగేళ్లలో కనిష్టస్థాయికి పతనం - అంతర్జాతీయ పరిణామాలే కారణం - కళకళలాడుతున్న బంగారం దుకాణాలు సాక్షి, రాజమండ్రి : ఒకప్పుడు మిడిసిపడి, మిన్నంటిన పసిడి ధర ఇప్పుడు క్రమక్రమంగా దిగి వస్తోంది. బంగారం మార్కెట్లో స్పెక్యులేటర్లు, స్టాకిస్టులపెద్ద ఎత్తున అమ్మకాలు సాగించడం, పారిశ్రామిక రంగం నుంచి కూడా పసిడికి డిమాండ్ బాగా తగ్గడం వంటి పరిణామాలతో గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 2010లో ధనత్రయోదశి సందర్భంగా 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి రూ.31,250 పలికింది. 2011, 2012 సంవత్సరాల్లో ధర రూ.31,150 నుంచి రూ.30,350 మధ్య కొనసాగింది. 2013 సంవత్సరాంతానికి 24 క్యారెట్ల పదిగ్రాముల ధర రూ.30,000 నుంచి రూ.31,500 మధ్య ఉంది. నెల రోజుల క్రితం ఏప్రిల్ 29న పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.27,280, 24 క్యారెట్ల ధర రూ.30,300 గా ఉంది. మే 29 గురువారం నాటికి 22 క్యారెట్ల బంగారం రూ.25,950కు, 24 క్యారెట్ల ధర రూ.27,500కు పడిపోయాయి. అంటే 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.1850 మేర, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.2,800 మేర పతనమయ్యాయి. అప్పటి లగ్గాలకూ ఇప్పుడే.. పెళ్లిళ్ల సీజన్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రెండు నెలల తర్వాత వచ్చే శ్రావణంలో జరిగే పెళ్లిళ్ల నిమిత్తం కూడా ఇప్పుడే బంగారం కొంటున్నారు. దీంతో బంగారం దుకాణాలు కళ కళలాడుతున్నాయి. జిల్లాలో సుమారు 2000 వరకూ చిన్నా, పెద్దా బంగారం దుకాణాలుండగా వీటిలో 50 వరకూ కార్పొరేట్ షాపులు. వీటన్నింటిలో రోజుకు రూ.రెండు కోట్ల నుంచి రూ.నాలుగు కోట్ల వ్యాపారం జరుగుతుంది. పండగలు, వివాహాల సీజన్లో రూ.పది కోట్ల వ్యాపారం జరుగుతుంది. మే మొదటి వారం నుంచీ బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా శక్తి మేరకు బంగారం కొనాలని ఆశిస్తున్నారు. కాగా కొందరు ధర ఇప్పుడు తగ్గినా భవిష్యత్తులో పెరుగుతుందన్న నమ్మకంతో, వ్యాపార దృక్పథంతో కొనుగోలు చేస్తున్నారు. ఇప్పట్లో పెరగకపోవచ్చు.. విదేశాల్లో బంగారానికి డిమాండ్ తగ్గిపోయింది. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాల్లో ఆర్థిక సంస్కరణల ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనం అయ్యాయి. ధరలు తగ్గుతుండడంతో మార్కెట్లో స్పెక్యులేటర్లు భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలతో మొదలైన తగ్గుదల మరింత కాలం కొనసాగవచ్చని, పసిడి ధర తిరిగి పెరగడానికి చాలా కాలం పట్టవచ్చని ఈ రంగంలో నిపుణులైనవారు అంచనా వేస్తున్నారు. -
అక్షయ తృతీయ అదుర్స్
సిద్దిపేట జోన్/మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: అక్షయ తృతీయ రోజున బంగారం కొని, దాన్ని గౌరీదేవి ముందు పెట్టి పూజిస్తే ఐదోతనంతోపాటు ఐశ్వర్యం సిద్ధిస్తుందనే నమ్మకం ప్రజల్లో పెరిగిపోయింది. అందువల్లే ప్రతి అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఈసారి అక్షయ తృతీయకు శుక్రవారం, బసవజయంతి, పెళ్లిళ్ల సీజన్ కూడా కలసి రావడంతో జిల్లాలో పసిడి కొనుగోళ్లు పరవళ్లు తొక్కాయి. జ్యూయలరీ షాపులన్నీ కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. మరోవైపు బంగారం ధర కూడా రూ. 29 వేల నుంచి రూ.30 వేలను దాటి వెళ్లిపోయింది. అయినప్పటికీ కొనుగోలు దారులు జ్యూయలరీ షాపుల ఎదుట బారులు తీరడంతో శుక్రవారం జిల్లాలో 50 కిలోల ఆభరణాలు అమ్ముడయినట్లు సమాచారం. కొనుగోళ్లు ఫుల్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, రామాయంపేట, గజ్వేల్, పటాన్చెరు, నారాయణఖేడ్, సదాశివపేట, రామచంద్రాపురంలోని జువెలరీ షాపులన్నీ అక్షయ తృతీయ రోజైన శుక్రవారం కిటకిటలాడాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసిరావడంతో కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి. ఒక్క మెదక్ పట్టణంలోనే రూ.8 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇక జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనూ చెప్పకోదగ్గ స్థాయిలోనే కొనుగోళ్లు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో నిన్నటివరకూ వెలవెలబోయిన జువెలరీషాపులన్నీ కిటకిటలాడాయి. వ్యాపారం బాగా సాగడంతో వ్యాపారులు కూడా ఆనందంలో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు ప్రత్యేక డిస్కౌంట్లిస్తూ కొనుగోలుదారులను ఆకర్షించడంతో అక్షయ తృతీయ సెంటిమెంట్ అందరికీ కలిసి వచ్చింది.