శారీ...సింగారీ
నల్లంచు తెల్ల చీరైనా.. చెంగావి రంగు చీరైనా.. అతివలు చుట్టుకుంటేనే వాటికి అందం. తరతరాలుగా విలువ తరగనివి చీరలే. మగువల మేను చుట్టుకుని మెరిసిపోయే కోకల రూపకల్పన మహాద్భుతంగా ఉంటుంది. రోజురోజుకూ ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న మార్పులు చీరల్లో సరికొత్త చేర్పులు చేస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్. సిటీలోని షాపింగ్ మాల్స్ విభిన్నమైన శారీ కలెక్షన్స్‌తో నిండిపోయాయి. అలనాటి పట్టు చీరలకు ఆధునిక హంగులు జోడించి మగువలకు కలర్‌ఫుల్‌గా అందిస్తున్నాయి. ఒకటేమిటి... కాంచీపురం, కుబేర, ఆవిష్కార, అరుంధతి తదితర హెవీ, లైట్ వెయిట్ పట్టు చీరలు వినూత్నమైన డిజైన్లు అద్దుకుని ముచ్చటగొలుపుతున్నాయి.
జీవితంలో ఒకసారి జరిగే పెళ్లి వేడుకలో తమ ఆహార్యం స్పెషల్ అట్రాక్షన్‌గానే కాదు, ఓ మెమరబుల్‌గా మిగిలిపోవాలని పెళ్లికూతుళ్లు కోరుకుంటున్నారు. వారితోపాటు ఆ వేడుకకు హాజరయ్యే అతివలు కూడా అదిరిపోయే అప్పీరెన్స్ ఉండాలనుకుంటున్నారు. అందుకే ధరకు వెనకాడకుండా నచ్చిన చీరలు కొనుగోలు చేస్తున్నారు. పాతతరం చీరలకు ఆధునికత జోడించిన వెరైటీలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.
లైట్ వెయిట్ పసిడి పట్టుకు ఇప్పుడు క్రేజ్ బాగా ఉంది. 90 శాతం వెండి, పది శాతం బంగారం మిక్స్ చేసి ఈ శారీలను డిఫరెంట్ డిజైన్లలో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. వీటిని ధనవంతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అధిక బరువు ఉన్నవి మధ్యతరగతివారు అడుగుతున్నారు. కాలేజీ అమ్మాయిల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరినీ దృష్టిలో ఉంచుకుని వీటిని సిద్ధం చేస్తున్నారు... అని షాపింగ్ మాల్ నిర్వాహకులు చెబుతున్నారు.
మెరిసి... మురిపించి
సికింద్రాబాద్ సీఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్‌లో శుక్రవారం జరిగిన ‘వివాహ్ కలెక్షన్స్ 2015’ లాంచింగ్‌లో... ముద్దుగుమ్మలు పట్టు చీరలు కట్టి... ఒంటి నిండా ఆభరణాలు ధరించి సంప్రదాయ సిరులు ఒలికించారు. మిస్ ఇండియా ఎర్త్ అలంకృత సహాయ్, నటి రామ్‌శ్రీ, ఆయేషా రావత్, మోడల్స్ కలర్‌ఫుల్ శారీల్లో ‘పట్టు’కే వన్నె తెచ్చారు.
-వీఎస్