నయా ట్రెండ్స్
కొత్త ఆశలతో వస్తున్న కొత్త సంవత్సరం కొంగొత్త ట్రెండ్స్‌నూ మోసుకొస్తోంది. ఫ్యాషన్ ప్రపంచంలో, డే టు డే లైఫ్‌లో నయా మార్పులకు శ్రీకారం చుడుతోంది. న్యూ ఇయర్ రాకతో క్యాలెండర్ మార్చినట్టే.. ఓల్డ్ ఫ్యాషన్స్‌ను మార్చేస్తున్నారు. ఒక్క ఫ్యాషన్‌లోనే కాదు... అన్ని రంగాల్లో డిఫరెంట్ యాంగిల్‌ను చూపిస్తున్నారు.
- శిరీష చల్లపల్లి
ఫ్యాషన్ అనగానే అమ్మాయిల కే అనుకుంటాం. సిటీలో అతివలకు సమానంగా ఫ్యాషన్ పోకడలకు స్వాగతం పలుకుతున్నారు మగాళ్లు. 2015లో అప్పీరియన్స్‌లో ఆడవాళ్లకు దీటుగా కనిపిస్తాం అంటున్నారు. బ్లూ జీన్స్, బొమ్మల టీ షర్ట్, కూలింగ్ గ్లాసెస్, మెడలో యాక్సెసరీస్ ఈ ట్రెండ్ ఓల్డ్ అయిపోయిందంటున్నారు యువకులు. సింపుల్ స్పన్ టీ షర్ట్, పైన సెమీ హెవీ జాకెట్, కలర్ చినోస్, బ్లాక్ ఫ్రేమ్ కూల్ గ్లాసెస్, వెట్టెడ్ ఫంక్ హ్యాండ్ కోంబింగ్ హెయిర్ స్టయిల్.. ఇలా సింపుల్ లుక్స్‌లో జెంటిల్‌గా కనిపించే ప్యాటర్న్ మీద మనసు పారేసుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు.. ఫ్యాషన్ షోల్లో, కాలేజీల్లో సైతం ఈ ట్రెండ్ ఫాలో
అవుతున్నారు.
- హర్ష, ఫ్యాషన్ డిజైనర్
గుండమ్మ రుచి
సిటీవాసులకు పిజ్జాలు, బర్గర్‌లు, బిర్యానీలు కామన్. కానీ వీటిని తోసిరాజని సరికొత్త రుచి ఒకటి భోజనప్రియులను చవులూరిస్తోంది. ఆ పాత రుచిని కాస్త మోడిఫై చేసిన వెరైటీ డిష్ 3జీ రైస్. జనరేషన్‌కు తగ్గట్టుగా మొబైల్‌లోనే కాదు ఫుడ్‌లో కూడా 3జీ వెరైటీని ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. ఇంతకీ 3జీ అంటే గుండమ్మ గారి గోంగూర రైస్. గుండమ్మకథ సినిమా నచ్చని వారు ఉండరు. అందుకే ఆ సినిమా పేరుతో గోంగూర రైస్‌ను సిటీవాసులకు పరిచయం చేస్తున్నారు. ఈ డిష్ 2015లో హాట్ డిష్‌గా మారబోతోందని చెబుతున్నారు భోజనప్రియులు.
- వెంకట్ (కిచెన్ ఆఫ్ కూచిపూడి)
నేచురల్ మేకప్
సహజంగానే అతివలకు మేకప్‌పై మక్కువ ఎక్కువ. అయితే మార్కెట్లోకి వస్తున్న లోషన్స్‌ను ఎడాపెడా రుద్దేస్తే చర్మం వికసించడం కాదు సరి కదా.. పాలిపోతుంది. అందుకే కెమికల్స్ రహిత ఆర్గానిక్ మేకప్ కిట్ మార్కెట్‌లోకి వచ్చింది. పసుపు, కుంకుమ పువ్వు, గంధం, విభూది చూర్ణం వంటి సహజమైన వస్తువులతో తయారు చేసిన ఈ మేకప్ కిట్ ద్వారా ఎలాంటి దుష్ర్పభావాలూ ఉండవనేది బ్యుటీషియన్ల మాట. సో... చిన్నపిల్లలకే కాదు సెన్సిటివ్ స్కిన్ ఉన్న మగువలకూ ఈ మేకప్ ఎంతో ఉపకరిస్తుంది.
- లక్ష్మీదీప, సాయి సంపద ట్రెడిషనల్ ఇండియన్ ప్రొడక్ట్స్