అల్లరి రాక్షసి
మీ..స్రవంతి
ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్! ఇదిగో ఇలా చిలిపి నవ్వులు రువ్వుతూ.. సోగ కళ్లతో ఓ లుక్కేస్తున్న ఈ అల్లరి పిల్ల కూడా అంతే! గుడివాడలో పుట్టి..నెల్లూరులో చదివినా.. సిటీలో ‘కిర్రాక్’ పుట్టిస్తోంది. వరుస టీవీ షోలతో యాంకర్‌గా అదరగొట్టేస్తున్న ఈ అచ్చ తెలుగు అమ్మాయి పేరు స్రవంతి. మాటల మ్యాజిక్‌తో ఇంటింటికీచేరువైన అమ్మడు ‘సిటీప్లస్’తో కాసేపు ‘ప్లే బ్యాక్’కు వెళ్లింది. అది ఆమె మాటల్లోనే...
- శిరిష చల్లపల్లి
ఇంట్లో మగ పిల్లలు ఎవరూ లేరు. నేను.. చెల్లి! సో.. మనకు పూర్తి స్వేచ్ఛ. అమ్మాయినే అయినా.. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోని అల్లరి. చిన్నప్పుడైతే డ్రెస్సులు కూడా ప్యాంటులు, షర్ట్‌లే! హెయిరూ షార్ట్ కటింగే. అమ్మానాన్నలూ నన్ను అబ్బాయిలానే చూసుకున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మా నానమ్మ గొడవ మొదలు పెట్టింది.. మగాడిలా ఆ గెటప్ ఏమిటని! తన పోరు భరించలేక చివరకు ఇదిగో ఇలా లాంగ్ హెయిర్ పెంచాల్సి వచ్చింది.
నేను పుట్టింది కృష్ణాజిల్లా గుడివాడలో. స్కూలింగ్ అంతా నెల్లూరులో. నాన్న ఆస్ట్రాలజర్. అమ్మ హౌస్‌వైఫ్. ఇంటర్‌లో సిటీకి షిఫ్ట్ అయ్యాం. నాటి నుంచి సనత్‌నగర్‌లోనే మకాం. ఇక్కడి హిందూ జూనియర్ అండ్ డిగ్రీ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశా. కాలేజీ దగ్గరే ఇల్లు. ఒక్కోసారి లంచ్ బ్రేక్‌లో ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చేవారు. అమ్మ అందరికీ వండి పెట్టేది. ప్లేసు మారినా... నా అల్లరి తగ్గలేదు. నన్ను భరించలేక ఇంటి నుంచి కాలేజీ వరకూ అందరూ ‘అల్లరి రాక్షసి’ అని పిలిచేవారు.
మా కాలేజీ ఫంక్షన్‌కు ఓసారి ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్ వచ్చారు. వివిధ అంశాల్లో నా పెర్‌ఫార్మెన్స్ నచ్చి.. యాంకరింగ్ చేస్తావా అన్నారు. అలా అనుకోకుండా యాంకర్‌నయ్యా. తరువాత హాబీగా, ఇప్పుడు ప్రొఫెషన్‌గా మారిపోయింది. నా తొలి ప్రోగ్రామ్ ‘హ్యాపీ డేస్ జాలీ డేస్’. ఇక అక్కడి నుంచి లైవ్ షోస్, సెలబ్రిటీలు, పొలిటికల్ పర్సనాల్టీలతో ఇంటర్వ్యూలు. వాటిల్లో మొదటిది కేసీఆర్ గారితో చేశాను. ‘కిర్రాక్ విత్ క్యాండీ’తో మంచి క్రేజ్ వచ్చింది. మరికొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా. ‘పిల్లా నువ్వు లేని జీవితం, ఒక లైలా కోసం’ సినిమాల్లో చేశా. టెన్షన్స్ ఎన్ని ఉన్నా కెమెరా ముందుకెళ్లానంటే ప్రపంచాన్నే మర్చిపోతా.