sirisha Challapalli
-
అల్లరి రాక్షసి
మీ..స్రవంతి ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్! ఇదిగో ఇలా చిలిపి నవ్వులు రువ్వుతూ.. సోగ కళ్లతో ఓ లుక్కేస్తున్న ఈ అల్లరి పిల్ల కూడా అంతే! గుడివాడలో పుట్టి..నెల్లూరులో చదివినా.. సిటీలో ‘కిర్రాక్’ పుట్టిస్తోంది. వరుస టీవీ షోలతో యాంకర్‌గా అదరగొట్టేస్తున్న ఈ అచ్చ తెలుగు అమ్మాయి పేరు స్రవంతి. మాటల మ్యాజిక్‌తో ఇంటింటికీచేరువైన అమ్మడు ‘సిటీప్లస్’తో కాసేపు ‘ప్లే బ్యాక్’కు వెళ్లింది. అది ఆమె మాటల్లోనే... - శిరిష చల్లపల్లి ఇంట్లో మగ పిల్లలు ఎవరూ లేరు. నేను.. చెల్లి! సో.. మనకు పూర్తి స్వేచ్ఛ. అమ్మాయినే అయినా.. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోని అల్లరి. చిన్నప్పుడైతే డ్రెస్సులు కూడా ప్యాంటులు, షర్ట్లే! హెయిరూ షార్ట్ కటింగే. అమ్మానాన్నలూ నన్ను అబ్బాయిలానే చూసుకున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మా నానమ్మ గొడవ మొదలు పెట్టింది.. మగాడిలా ఆ గెటప్ ఏమిటని! తన పోరు భరించలేక చివరకు ఇదిగో ఇలా లాంగ్ హెయిర్ పెంచాల్సి వచ్చింది. నేను పుట్టింది కృష్ణాజిల్లా గుడివాడలో. స్కూలింగ్ అంతా నెల్లూరులో. నాన్న ఆస్ట్రాలజర్. అమ్మ హౌస్‌వైఫ్. ఇంటర్లో సిటీకి షిఫ్ట్ అయ్యాం. నాటి నుంచి సనత్‌నగర్‌లోనే మకాం. ఇక్కడి హిందూ జూనియర్ అండ్ డిగ్రీ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశా. కాలేజీ దగ్గరే ఇల్లు. ఒక్కోసారి లంచ్ బ్రేక్‌లో ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చేవారు. అమ్మ అందరికీ వండి పెట్టేది. ప్లేసు మారినా... నా అల్లరి తగ్గలేదు. నన్ను భరించలేక ఇంటి నుంచి కాలేజీ వరకూ అందరూ ‘అల్లరి రాక్షసి’ అని పిలిచేవారు. మా కాలేజీ ఫంక్షన్‌కు ఓసారి ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్ వచ్చారు. వివిధ అంశాల్లో నా పెర్ఫార్మెన్స్ నచ్చి.. యాంకరింగ్ చేస్తావా అన్నారు. అలా అనుకోకుండా యాంకర్నయ్యా. తరువాత హాబీగా, ఇప్పుడు ప్రొఫెషన్‌గా మారిపోయింది. నా తొలి ప్రోగ్రామ్ ‘హ్యాపీ డేస్ జాలీ డేస్’. ఇక అక్కడి నుంచి లైవ్ షోస్, సెలబ్రిటీలు, పొలిటికల్ పర్సనాల్టీలతో ఇంటర్వ్యూలు. వాటిల్లో మొదటిది కేసీఆర్ గారితో చేశాను. ‘కిర్రాక్ విత్ క్యాండీ’తో మంచి క్రేజ్ వచ్చింది. మరికొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా. ‘పిల్లా నువ్వు లేని జీవితం, ఒక లైలా కోసం’ సినిమాల్లో చేశా. టెన్షన్స్ ఎన్ని ఉన్నా కెమెరా ముందుకెళ్లానంటే ప్రపంచాన్నే మర్చిపోతా. -
ఠండీ సండీ
బయట ఎండలు మండిపోతుంటే... గొంతులోకి చల్లగా ఐస్‌క్రీమ్ జారడం అద్భుతమైన అనుభూతి. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఐస్‌క్రీమ్స్ ఇష్టపడని వారు ఉండరు. ఇలాంటి హిమక్రీమ్ల ప్రేమికుల కోసమే... రెస్టారెంట్స్, ఐస్‌క్రీమ్ పార్లర్స్, మాల్స్... డిఫరెంట్ ఐస్‌క్రీమ్స్‌ను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇక ఈ సమ్మర్ స్పెషల్‌గా అందరి నోరూరించనుంది సండీ. చాక్లెట్ ైబె ట్స్, కలర్‌ఫుల్ జెమ్స్, సీజనల్ ఫ్రూట్స్, డ్రై-ఫ్రూట్స్, చెర్రీస్, డేట్స్, వాల్నట్స్, సేమియా ఇలా అనేక రకాల కాంబినేషన్స్‌తో తయారు చేసి.. దానికి ఓరియో, వేపర్, చాక్లెట్ అండ్ కారమేల్ స్ప్రింకిల్స్, పైన్ ఆపిల్, ఆపిల్ క్రష్డ్ పీసెస్.. వంటి వాటితో డెకరేట్ చే స్తున్నారు. కోల్డ్ కాఫీ, ఐస్‌క్రీమ్ పంచ్, మాక్టైల్స్, కోక్ఫ్లోట్, ఫ్రూట్ సలాడ్ వంటి తినుబ ండారాల్లో సైతం కలుపుతున్నారు. నోరు తీపి చేసే గులాబ్‌జామూన్, హల్వా, ఖుర్బానీ-కా-మీటా, డబుల్-కా-మీటాల్లో సైతం ఈ సండీని కాంబినేషన్‌గా వాడుతున్నారు. ‘డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ ఇష్టపడుతున్నట్టే... ఐస్‌క్రీమ్స్‌లోనూ వెరైటీలను కోరుకుంటున్నారు. అలాంటి ఐస్‌క్రీమ్ లవర్స్ వీటిని ఇష్టంగా టేస్ట్ చేస్తారు’ అని చెబుతున్నారు హాజెల్ ఐస్‌క్రీమ్ కెఫే మేనేజర్ రాకేష్ కుమార్. - శిరీష చల్లపల్లి చిన్నారుల కోసం.. రొటీన్ సమ్మర్ క్యాంపులకు భిన్నంగా తాహెర్ అలీ బేగ్ థియేటర్ గ్రూప్ పిల్లల కోసం ప్రత్యేక వర్క్‌షాపు నిర్వహిస్తోంది. ‘స్కెచ్చింగ్, క్రియేటివ్‌గా ఆలోచించడం’ అనే అంశాలపై నిర్వహించే శిక్షణకు మూడు నుంచి ఏడేళ్లలోపు చిన్నారులు అర్హులు. మే 2 నుంచి 23 వరకు వారాంతాల్లో తరగతులు ఉంటాయి. వివరాలకు taher@ flickrollers.com -
తీన్మార్ రచ్చ
మీ.. రాములమ్మ (రమ్యకృష్ణ) రాములమ్మ.. తీరైన బొట్టు, వాలుజడ, చేతినిండా గాజులతో ‘తీన్మార్ న్యూస్’లో యాంకర్‌గా పరిచయమైన హైదరాబాదీ. తెలంగాణ యాసతో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకుంది. ఫిజియో థెరపీ చదువుతూనే ‘రాకింగ్ రాములమ్మ’గా అప్పుడప్పుడూ ప్రేక్షకులను పలకరిస్తోంది. ఏదో ట్రైచేద్దామనుకుంటే నా స్టార్ తిరిగిందంటున్న ఈ సిటీగాళ్ ముచ్చట్లు ‘మీ’కోసం... నా అసలు పేరు రమ్యకృష్ణ. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. చదువు కూడా ఇక్కడే. ఫిజియోథెరపీ ఫైనల్ ఇయర్ చేస్తున్న. స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అయితే ఒక్క చదువు విషయంలో తప్ప దేనికీ ప్లానింగ్ చేయను. ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేస్తా. అందుకే ఫిజియోథెరపీలో ఉండగానే చానల్లో ఒక స్పెషల్ ప్రోగ్రాం కోసం ఆడిషన్స్ నడుస్తున్నయని చెబితే... చలో పబ్లిక్‌తో మాట్లాడనీకి ఒక ఆప్షన్ దొరుకుతుంది గదా, నా జాతకం ఎట్లుందో ట్రైజేద్దాం అని పొయిన. లక్కీగా సెలక్ట్ అయిన. నా స్టార్ తిరిగింది. తీన్మార్ ప్రోగ్రామ్‌ల రాములమ్మలా అవతరామెత్తిన. ఒక ఏడాదంతా ప్రోగ్రాం చేసిన. దాంతో ఆ ఏడంతా నాకు ఇష్టమైన చదువుకు దూరమైన. మళ్లీ స్టడీస్... ఇట్ల కాదులే అని మళ్లీ కాలేజీలో జాయిన్ అయిన. ఇప్పుడు రోజూ కాలేజీకి వెళ్తూ వీకెండ్స్‌లో 6టీవీలో ‘రాకింగ్ రాములమ్మ’ ప్రోగ్రామ్‌తో మళ్లీ జనానికి దగ్గరైన. సెలబ్రిటీస్‌తో ముచ్చట్లు, కామన్మ్యాన్తో చిట్‌చాట్, వీక్‌డేస్‌లో స్పెషల్‌క్లాసులు, హోమ్‌వర్క్‌లు మస్తు బిజీ. మస్తు ఖుషీ! అయితే అప్పుడప్పుడు నేనేంది ఛానల్స్‌లో పనిజేసుడేంది అని ఆలోచిస్తుంటి. అప్పుడు మా అమ్మ చెప్పింది.. నేను చిన్నప్పుడు పగిలిపోయిన ఎర్రటి రబ్బర్బాల్కి కట్టె గుచ్చి మైక్లాగ చేతిలో పట్టుకుని టీవీ చూస్తూ న్యూస్రీడర్లాగ చేసేదాన్నట. బహుశా నాకు ఊహ తెల్వనప్పటినుంచే ఈ ఫీల్డ్ అంటే ఇష్టం అనుకుంటా. గోల్గప్పాలంటే ఇష్టం... నీళ్లల్లో ఉన్న చేప బయటికొస్తే ఎంత విలవిల్లాడుతుందో... హైదరాబాద్ ఇడిసి బయటకు పోవాల్సి వస్తే నాదీ ఇంచుమించు అలాంటి పరిస్థితే. ఊపిరి ఆడనట్టు ఫీలవుతా. సిటీ విషయానికొస్తే... బేగం బజార్లో గాజులు, కోఠిలో బట్టలు, అబిడ్స్‌లో చెప్పులు... ఇలా చిన్నప్పటినుంచి ఇప్పటివరకు తిరగని ప్లేసంటూ లేదు. నాకు బాగా నచ్చే ఫుడ్ ‘గోల్గప్పాలు’.. అంటే పానీపూరి. అవి ఉంటే చాలు నాకు అన్నం కూడా అవసరం లేదు.నిజం చెప్పాలంటే నాకు పల్లెలు, అక్కడి పచ్చటి పొలాలు అన్నా ఇష్టమే. ‘చంటి’ సినిమాలో మీనాలా ఆటలాడుకోవాలనిపిస్తది. కానీ నాకు చుట్టాలుపక్కాలు, అక్కలు, చెల్లెళ్లు అందరూ హైదరాబాద్‌లోనే ఉన్నరు. పల్లెటూరికి పోదామంటే తెల్సినోళ్లెవ్వరు లేరు. ఈ విషయంలో మాత్రం అన్‌లక్కీ! - శిరీష చల్లపల్లి -
ది లాస్ట్ స్పారో
చిన్నతనంలో పిచ్చుక కనిపిస్తే మచ్చిక చేసుకోవాలన్న ఉబలాటం. అది అందీ అందకుండా తుర్రుమంటుంటే... దాంతో మనసూ ఉరకలేసేది. మరి ఇప్పుడో... ఆ పిచ్చుకలు లేక ఇంటి చూరు చిన్నబోతోంది. తన జ్ఞాపకాలతో చేదబావి బోరుమంటోంది. ఆ పికిలి పిట్టల పాదముద్రల కోసం పచ్చని చెట్లు సైతం పరితపిస్తున్నాయి. ఇప్పటి తరానికి పిచ్చుకను చూపించాలంటే గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే! ఆ పిచ్చుకల కిచకిచను వినిపించాలంటే పాత టేపుల దుమ్ము దులపాల్సిందే! నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సంద ర్భంగా... - శిరీష చల్లపల్లి మనసుకు ఉల్లాసాన్నిచ్చే ప్రకృతిలో పక్షులది మొదటిస్థానం. కిచకిచమంటూ ఇంటి చూరు చుట్టూ తిరిగే పిచ్చుకలంటే ఇష్టపడనివారుండరు. గడ్డిపోచలతో అవి గూళ్లు కడుతుంటే చూడటం, గుడ్లు పెట్టాక వాటిని లెక్కపెట్టడం, ఆహారం తెచ్చి పిల్లలకు పెడుతుంటే చూసిన ఆనందం, పిచ్చుక గూడు కూలినప్పుడు... కుమిలి ఏడ్చిన అనుభవం, వ్యవసాయంలో పురుగుల మందుల వాడకం, వాతావరణంలో మార్పులు... ఏవైతేనేం పిచ్చుకలు ఎగిరిపోయాయి. అవి అల్లుకున్న గూళ్లూ చెదిరిపోయాయి. నిరాటంకంగా సాగుతున్న చెట్ల నరికివేత, తరుగుతున్న అడవులు, సెల్ టవర్ల రేడియేషన్... ఆ చిన్ని పక్షుల ఉసురు తీస్తున్నాయి. ఫలితంగా పిచ్చుకలు అంతరిస్తున్న పక్షుల జాబితాలోకి చేరుతున్నాయి. అయితే, మించిపోయిందేమీ లేదు.. ఇప్పటికైనా నిద్రలేచి పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే పిచ్చుకలను కాపాడుకోవచ్చంటున్నారు ఏఆర్‌పీఎఫ్ ఫౌండర్ నిహార్. మనమే కాపాడాలి... ‘సిటీలో పిచ్చుకలకే కాదు... 28 రకాల ఇతర జాతి పక్షుల మనుగడకు భారీ ముప్పు వాటిల్లుతోంది. పొల్యూషన్ వల్ల పిచ్చుకలకు ప్రధాన ఆహారమైన క్రిమికీటకాలు చనిపోతున్నాయి. నగరమంతా కాంక్రీట్ బిల్డింగ్స్ నిండి... చెట్లు లేకుండా పోవడంతో పిచ్చుకలు కూడా లేకుండా పోతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోగలిగితే... వాటిని కొంతమేరకైనా రక్షించుకోగలిగినవారమవుతాం. సరదాగా ఓ హాబీలాగా పనికిరాని చెక్కముక్కలు, అట్టముక్కలను గూడులాగా తయారు చేసి... ఆ బాక్సులను బంధుమిత్రులు, స్నేహితులు, ఇరుగుపొరుగుకు ఇవ్వండి. ఇంటిబయట వెంటిలేటర్కో, కిటికీల మీద పెట్టడమో, ఇంటి ముందు చెట్ల కొమ్మలకు కట్టడమో చేయమనండి. ఒక్క పిచ్చుకలకే కాదు... ఇతర పక్షుల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. మొక్కలు నాటమని చెప్పడం కాకుండా.. గిఫ్ట్‌గా మొక్కలనే ఇవ్వాలి. సజ్జలు, నూకలు, జొన్నలు వంటి చిరుధాన్యాలని కూడా డాబాలపైన వెదజల్లండి. చిన్నచిన్న పాత్రల్లో వాటికి నీళ్లు పోసి ఉంచండి. ఇలాంటి చిన్నచిన్న పనులతో పర్యావరణాన్ని కాపాడితే మనతోపాటు పిచ్చుకలకూ బతుకునిచ్చినట్లవుతుంది. బయోడైవర్సిటీని కొంతైనా కాపాడినవారమవుతాం’ అని చెబుతున్నారు వాయిస్‌లెస్ బర్డ్స్ అండ్ యానిమల్స్ కోసం వాయిస్‌గా మారిన నిహార్. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు జలగం వెంగళరావు పార్క్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
దానికి ఇంకా టైముంది
డాక్టర్ కావాలనుకున్న అనూష శేషు యాంకర్లా మారింది. బుల్లితెరపై కనువిందు చేస్తూ తెలుగువారికి దగ్గరైంది. తమిళం, ఆంగ్లం తప్ప మరో భాష రాని ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో అదరగొడుతోంది. టీవీలో గలగలా మాట్లాడే అనూష తన కెరీర్ ముచ్చట్లను మీ అంటూ సిటీప్లస్‌తో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే. - శిరీష చల్లపల్లి మీ.. అనూష శేషు చాలా మందిలాగే నేనూ.. డాక్టర్ అయిపోవాలి, పల్లెలకు వెళ్లి సేవ చేయాలనే ఆశయంతో ఉండేదాన్ని. అందుకే ఇంటర్లో సైన్స్ గ్రూప్ తీసుకున్నా. డిసెక్షన్స్ సమయంలో కప్పలను, పాములను కోయడానికి చాలా బాధపడేదాన్ని. డాక్టర్ వృత్తి నాకు సెట్ కాదనిపించింది. వేరే ప్రొఫెషన్లో ట్రై చేద్దామనుకుని మా టీవీ ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. అప్పుడు నేను ఎనభై కిలోలు, బుగ్గలతో బొద్దుగా ఉండేదాన్ని. తెలుగు అస్సలు రాదు. దీంతో చాలా సార్లు రిజెక్టయ్యాను. తర్వాత కాస్త గట్టిగా డైట్ మెయింటైన్ చేసి, వర్కవుట్స్ చేయడంతో రెండు మూడు నెలల్లోనే చాలా బరువు తగ్గాను. ఇప్పటికీ అదే వెయిట్ కంటిన్యూ అవుతోంది. అంతేకాదు ఇంటికి దగ్గర్లోనే ఉన్న తెలుగు పండిత్ దగ్గర ట్యూషన్‌కు వెళ్లి మరీ భాష నేర్చుకున్నాను. ఎంతో మెచ్చుకున్నారు.. మొదట నన్ను రిజెక్ట్ చేసినవారే మళ్లీ ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నా డెడికేషన్ చూసి మెచ్చుకున్నారు. అలా మొదటిసారి మా టీవీ ‘మీ స్టార్’ ప్రోగ్రామ్‌తో బుల్లితెరకు పరిచయం అయ్యాను. స్టార్టింగ్‌లోనే బన్నీ, ప్రభాస్, అల్లరి నరేష్.. పెద్ద పెద్ద హీరోలు, డెరైక్టర్లను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. మొదటి ఎపిసోడ్‌కి కాస్త తడబడినా.. ఎర్లీగా సెట్ అయిపోయాను. లైవ్‌షోస్, రియాలిటీ షోస్, గేమ్షోస్.. సెలబ్రిటీ టాక్, కామిక్టానిక్, జెమినీ కామెడీ షో ఇలా ప్రోగ్రామ్స్ చేస్తూ హ్యాపీగా ఉన్నాను. సీరియల్స్, సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు యాంకరింగ్ అంటేనే ఇష్టం. యాంకరింగ్‌ను ఫుల్‌టైమ్ ప్రొఫెషన్‌గా మలచుకోలేం అని నాకు తెలుసు. అందుకే మంచి ‘బ్యూటీ స్పా’ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ దానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇన్నోసెంట్... నేను చెన్నైలో పుట్టి పెరిగాను. మాతృభాష తమిళం. పదో తరగతి వరకు చెన్నైలోనే చదివాను. అప్పుడు నాకు తమిళ్, ఇంగ్లిష్ తప్ప వేరే లాంగ్వేజ్ వచ్చేది కాదు. చిన్నప్పటినుంచి నేను ‘రొంబ నల్ల పొన్ను’ని. చాలా కామ్ కూడా. సెలైంట్ అండ్ ఇన్నోసెంట్ కిడ్ని. బాగా చదివేదాన్ని. కానీ ఎవరితో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. కాకపోతే స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్లో క్లాసికల్ డ్యాన్సులు, ఫ్యూజిన్ డ్యాన్సులు నావే. అందుకే ఇప్పటికీ నా దగ్గర ఒక రూమ్ నిండా షీల్డ్స్, అవార్డ్స్, సర్టిఫికెట్స్ ఉన్నాయి. షూట్స్ లేని టైమ్‌లో ఫ్రెండ్స్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాను. మాదాపూర్ చాక్లెట్ రూమ్‌లో కూర్చుని ఫ్రెండ్స్‌తో చిట్ చాటింగ్ చాలా ఇష్టం. ఇక నా హాబీస్ విషయానికొస్తే.. నెయిల్ ఆర్ట్ బాగా వేస్తాను. మెహిందీ డిజైన్స్ వేయడం కూడా ఇష్టం. గూగుల్ తల్లి దయ వల్ల కుకింగ్ కూడా వంటబట్టింది. ఇక్కడే సెటిల్.. నాకు లైఫ్ ఇచ్చిన హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇక్కడే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. షాపింగ్ కోసం ఇనార్బిట్ మాల్కి వెళ్తుంటాను. నెయిల్ పాలిష్ నుంచి.. ఎలక్ట్రానిక్ డివెజైస్ వరకు కొన్ని వందల షాప్స్ ఒకే రూఫ్ కింద ఉంటాయి. కొంపల్లిలోని ‘డోలా-రే-దని’లో టైమ్ స్పెండ్ చేస్తాను. ఒంటెలమీద స్వారీలు, పప్పెట్ షో, బెలూన్ షూట్, బుల్‌ఫైట్.. ఇలా అక్కడికి వెల్తే నిజంగానే రాజస్థాన్‌లో ఉన్నామా అన్నట్టు ఉంటుంది. ఐ లవ్ దట్ ప్లేస్! -
లవ్ ఇన్ హైదరాబాద్
శ్రీయాశర్మ. సినిమా లవర్స్‌కే కాదు... బుల్లి తెర ప్రేక్షకులకూ చిర పరిచితమైన పేరు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎప్పుడో తెలుగు తెరకు పరిచయమైనా... గుర్తింపు వచ్చింది దూకుడులో సుశాంతిగానే. ఇప్పుడు ‘గాయకుడు’తో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన శ్రీయాశర్మను సిటీప్లస్ పలకరించింది. ఆ బ్యూటిఫుల్ టీన్ పరిచయం ఆమె మాటల్లోనే... - శిరీష చల్లపల్లి మాది హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్. నాన్న వికాస్ శర్మ ఇంజనీర్. అమ్మ రీతూ శర్మ డైటీషియన్. తమ్ముడు యజత్ శర్మ. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చేస్తున్నా. ఎప్పడూ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా... స్టడీస్‌ను నెగ్లెక్ట్ చేయలేదు. మార్కులెప్పుడూ నైన్టీ పర్సెంట్‌కు తగ్గలేదు. నేను ఇండస్ట్రీలోకి రావడం వెనుక నా పేరెంట్స్ ప్రోత్సాహం ఉంది. మా అంకుల్ మేజర్ విశాల్ శర్మ నా మోటివేటర్. ఇక నాకు నచ్చే ప్రాంతం అంటే మా అమ్మమ్మ వాళ్ల ఊరు సులాహ్. అక్కడి తేయాకు తోటలు.. మంచుతో కప్పి ఉండే ఎత్తై కొండలు.. ఐ లవ్ ఇట్. నాన్నమ్మ పెట్టే పచ్చళ్లని ఇష్టంగా తింటాను. అలా మొదలైంది... మూడేళ్ల వయసులో మొదటిసారిగా జీటీవీలో ‘కన్నయ్య’ సీరియల్లో నటించా. అందరి ఆదరాభిమానాలు తెచ్చిపెట్టింది మాత్రం ‘కసౌటీ జిందగీ కీ’ సీరియల్. ‘బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్’, ‘ఇండియన్ టెలీ అవార్డు’తోపాటు ‘స్టార్ పరివార్ అవార్డు’ కూడా వచ్చింది. ఇక తెలుగులో నా మొదటి సినిమా జై చిరంజీవ. చిరంజీవిగారితో నటించడం మరిచిపోలేని అనుభూతి. మళ్లీ ఆరేళ్ల తరువాత 2011లో దూకుడు, ఆ తరువాత ‘రచ్చ’, ‘తూనీగ తూనీగ’, ఇప్పుడు ‘గాయకుడు’... అలా బాలనటిగా మొదలైన జర్నీ ఇలా కంటిన్యూ అవుతోంది. ‘గాయకుడు’నీ ఆదరించండి.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైదరాబాద్ స్పెషల్. ఈ ఇండస్ట్రీకి నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గానే పరిచయం. ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నా. ఇక్కడ అందరూ ఆప్యాయంగా ట్రీట్ చేస్తారు. ఆ పలకరింపు నాకు ఇష్టం. హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీ నుంచే నా ప్రయాణం మొదలవుతోంది. కొత్త డెరైక్టర్, కొత్త హీరోలతో ‘గాయకుడు’ సినిమాతో మళ్లీ మీ ముందుకొస్తున్నా. ఇది హైదరాబాద్ బేస్డ్ లవ్‌స్టోరీ. గతంలోలాగే తెలుగు ప్రేక్షకులు నా ఈ సినిమానూ ఆదరిస్తారని, మీకు మరింత చేరువవుతానని ఆశిస్తున్నా!. -
నయా ట్రెండ్స్
కొత్త ఆశలతో వస్తున్న కొత్త సంవత్సరం కొంగొత్త ట్రెండ్స్‌నూ మోసుకొస్తోంది. ఫ్యాషన్ ప్రపంచంలో, డే టు డే లైఫ్‌లో నయా మార్పులకు శ్రీకారం చుడుతోంది. న్యూ ఇయర్ రాకతో క్యాలెండర్ మార్చినట్టే.. ఓల్డ్ ఫ్యాషన్స్‌ను మార్చేస్తున్నారు. ఒక్క ఫ్యాషన్‌లోనే కాదు... అన్ని రంగాల్లో డిఫరెంట్ యాంగిల్‌ను చూపిస్తున్నారు. - శిరీష చల్లపల్లి ఫ్యాషన్ అనగానే అమ్మాయిల కే అనుకుంటాం. సిటీలో అతివలకు సమానంగా ఫ్యాషన్ పోకడలకు స్వాగతం పలుకుతున్నారు మగాళ్లు. 2015లో అప్పీరియన్స్‌లో ఆడవాళ్లకు దీటుగా కనిపిస్తాం అంటున్నారు. బ్లూ జీన్స్, బొమ్మల టీ షర్ట్, కూలింగ్ గ్లాసెస్, మెడలో యాక్సెసరీస్ ఈ ట్రెండ్ ఓల్డ్ అయిపోయిందంటున్నారు యువకులు. సింపుల్ స్పన్ టీ షర్ట్, పైన సెమీ హెవీ జాకెట్, కలర్ చినోస్, బ్లాక్ ఫ్రేమ్ కూల్ గ్లాసెస్, వెట్టెడ్ ఫంక్ హ్యాండ్ కోంబింగ్ హెయిర్ స్టయిల్.. ఇలా సింపుల్ లుక్స్‌లో జెంటిల్‌గా కనిపించే ప్యాటర్న్ మీద మనసు పారేసుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు.. ఫ్యాషన్ షోల్లో, కాలేజీల్లో సైతం ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. - హర్ష, ఫ్యాషన్ డిజైనర్ గుండమ్మ రుచి సిటీవాసులకు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు కామన్. కానీ వీటిని తోసిరాజని సరికొత్త రుచి ఒకటి భోజనప్రియులను చవులూరిస్తోంది. ఆ పాత రుచిని కాస్త మోడిఫై చేసిన వెరైటీ డిష్ 3జీ రైస్. జనరేషన్‌కు తగ్గట్టుగా మొబైల్లోనే కాదు ఫుడ్‌లో కూడా 3జీ వెరైటీని ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. ఇంతకీ 3జీ అంటే గుండమ్మ గారి గోంగూర రైస్. గుండమ్మకథ సినిమా నచ్చని వారు ఉండరు. అందుకే ఆ సినిమా పేరుతో గోంగూర రైస్‌ను సిటీవాసులకు పరిచయం చేస్తున్నారు. ఈ డిష్ 2015లో హాట్ డిష్‌గా మారబోతోందని చెబుతున్నారు భోజనప్రియులు. - వెంకట్ (కిచెన్ ఆఫ్ కూచిపూడి) నేచురల్ మేకప్ సహజంగానే అతివలకు మేకప్‌పై మక్కువ ఎక్కువ. అయితే మార్కెట్లోకి వస్తున్న లోషన్స్‌ను ఎడాపెడా రుద్దేస్తే చర్మం వికసించడం కాదు సరి కదా.. పాలిపోతుంది. అందుకే కెమికల్స్ రహిత ఆర్గానిక్ మేకప్ కిట్ మార్కెట్లోకి వచ్చింది. పసుపు, కుంకుమ పువ్వు, గంధం, విభూది చూర్ణం వంటి సహజమైన వస్తువులతో తయారు చేసిన ఈ మేకప్ కిట్ ద్వారా ఎలాంటి దుష్ర్పభావాలూ ఉండవనేది బ్యుటీషియన్ల మాట. సో... చిన్నపిల్లలకే కాదు సెన్సిటివ్ స్కిన్ ఉన్న మగువలకూ ఈ మేకప్ ఎంతో ఉపకరిస్తుంది. - లక్ష్మీదీప, సాయి సంపద ట్రెడిషనల్ ఇండియన్ ప్రొడక్ట్స్ -
అందరి బంధువయా
పట్నం తీరు గురించి నాంపల్లి స్టేషన్‌కాడ రాజలింగాన్ని అడిగితే.. ఉందామంటే నెలవే లేదు.. చేద్దామంటే కొలువే లేదని గోడు వెళ్లబోసుకుంటాడు. కళను నమ్ముకుని కలలు తీర్చుకునే దారిలో హైదరాబాద్‌కు వచ్చిన కళాకారులను ఇదే ప్రశ్న అడిగి చూడండి.. భాగ్యనగరాన్ని కళల కాణాచిగా అభివర్ణిస్తారు. పొట్టచేత పట్టుకుని ఒట్టి చేతులతో ఇక్కడకు వచ్చే వారిని సైతం ఆదరించే ఈ నగరం.. హస్తకళను పట్టుకుని వచ్చిన వారిని మాత్రం పట్టించుకోకుండా ఉంటుందా..! వారి కళకు సలామ్ చేస్తోంది. కలకాలం నిలిచేలా చేస్తుంది. ఇదే మాటను నొక్కి మరీ చెబుతున్నారు.. పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కళాకారులు. సిటీ అందరి బంధువని కొనియాడుతున్నారు. హస్తకళను నమ్ముకుని శిల్పారామం వేదికగా ఏళ్లకేళ్లుగా జీవనం సాగిస్తున్న కళాకారుల మనసులో మాట... - శిరీష చల్లపల్లి ఆదరణకు పెట్టనికోట... మాకు బతుకుదెరువు ఇచ్చింది హైదరాబాదే. 14 ఏళ్లుగా ఈ సిటీనే నమ్ముకుని నా కుటుంబాన్ని పోషిస్తున్నా. మా ఫ్యామిలీ కోల్‌కతాలోనే ఉంటుంది. నేను, మా తమ్ముడు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం. టైట బొమ్మలంటే దేశవ్యాప్తంగా మంచిపేరు ఉంది. హైదరాబాద్‌వాసులు మా బొమ్మలను ఆదరిస్తున్నారు. ఆత్మీయంగా వాళ్ల ఇళ్లలో చోటిస్తున్నారు. వాటిని చూసి బాగున్నాయని పొగుడుతుంటే హ్యాపీగా ఉంటుంది. మా కళను ఆదరిస్తున్న ఈ మహానగరం అంటే మాకెంతో అభిమానం. ఇక్కడ మా స్టాల్ అద్దె ఆరు వేల రూపాయలు. మా ఇంటి అద్దె రెండున్నర వేలు. అన్ని ఖర్చులు పోగా నెలకు రూ.15 వేలు మిగులుతోంది. ఈ మొత్తాన్ని మా ఇంటికి పంపిస్తాం. - పింటూ పురమని, కోల్‌కతా బొమ్మల కొలువు స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. చదివింది పదో తరగతే. పదేళ్ల కిందట మా ఆయనతో కలసి హైదరాబాద్ వచ్చా. మొదట్లో ప్రింటింగ్, డిజైనింగ్ చేసుకునేవాళ్లం. ఎనిమిదేళ్ల కిందట శిల్పారామంలో వండర్ డాల్స్ పేరుతో సాఫ్ట్ టాయ్స్ స్టాల్ నిర్వహిస్తున్నాం. మా దగ్గర 15 మంది పని చేస్తున్నారు. అందరూ ఆడపిల్లలే. సైడ్ పౌచెస్, టెడ్డీబేర్స్, జంతువులు, పక్షుల బొమ్మలు, ఇంటీరియర్ డెకార్స్, దేవుని ప్రతిమలు ఇలా అనేక రకాల కళాకృతులు తయారు చేస్తున్నాం. మా వ్యాపారం బాగుంది. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో మా ఉత్పత్తులు అమ్ముకునేలా ప్రాంచైజీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. - ఇందిర, కావలి బేరాలాడకుంటే... మాది ఒడిశా. బట్ట ముక్కలతో వాల్ హ్యాంగిగ్స్, కొబ్బరి పీచుతో పిచ్చుక గూడు, జంతువుల బొమ్మలు, అద్దాలతో మోడ్రన్ ఆప్లిక్, బెడ్ కవర్లు... ఇలా రకరకాల గృహాలంకరణ వస్తువులు రూపొందిస్తుంటాం. నాలుగు రోజులు 9 గంటల చొప్పున కుడితే గానీ ఒక బెడ్‌షీట్ పూర్తికాదు. మేం తిన్నా తినకపోయినా.. ఒంట్లో బాగున్నా లేకున్నా.. పని చేయాల్సిందే. 15 ఏళ్లుగా మా కుటుంబాన్ని ఆదరించిన శిల్పారామం, హైదరాబాదీలన్నా మాకు ఎనలేని గౌరవం. - శైలబాల సాహూ, ఒడిశా కశ్మీర్ కీ కథ... కశ్మీర్ నుంచి బతుకుదెరువు కోసం 11 ఏళ్ల కిందట నగరానికి వచ్చా. మా కశ్మీరీ ప్రొడక్ట్స్‌కు ఇక్కడ ఆదరణ ఎక్కువ. కలప, పేపర్ మేడ్ వస్తువులు, వాల్ హ్యాంగింగ్స్, జ్యువెలరీ బాక్సులు, బ్యాంగిల్స్, బెడ్ ల్యాంప్స్, క్యాండెల్ స్టాండ్స్ ఇలా ఎన్నో చేసి అమ్ముతుంటా. ఒక్క గాజును కశ్మీరీ డిజైన్‌లో తీర్చిదిద్దడానికి 4 గంటలు పడుతుంది. శిల్పారామంలో మా స్టాల్ ఉంది. కొండాపూర్‌లో అద్దెకుంటున్నా. నా భార్య, పిల్లలు కశ్మీర్‌లోనే ఉంటున్నారు. మూడు నెలలకోసారి మా ఇంటికి వెళ్లొస్తా. నేను అక్కడికి వెళ్లగానే నా భార్య ఇక్కడికి వస్తుంది. ఇలా కష్టపడితేగానీ పూట గడవదు. మా కష్టాన్ని గుర్తించి మాకు జీవనోపాధి కల్పిస్తున్న హైదరాబాదీలను ఎన్నటికీ మరచిపోలేను. - జావీద్, కశ్మీర్