ఫ్రాక్..కిరాక్
పెళ్లి అనేది సంప్రదాయ వేడుక. పక్కా ట్రెడిషనల్‌గా జరిగే పెళ్లిసందడిలో ఆచార వ్యవహారాలే కాదు.. కట్టూ, బొట్టూ కూడా పద్ధతి అంటారు పెద్దలు. కానీ రిసెప్షన్‌కు వచ్చేసరికి కాస్త పట్టువిడుపులు ప్రదర్శిస్తారు. అందుకే పెళ్లిపందిరిలో పట్టు చీరలో మెరిసిపోయే వధూమణి.. రిసెప్షన్ వేడుకలో నయాట్రెండ్ వస్త్రాల్లో తళుకులీనుతుంది. అప్పుడున్న ట్రెండ్‌లో ది బెస్ట్ కలెక్షన్‌ను సెలెక్ట్ చేసుకుని మరింత అందంగా కనిపిస్తుంది.
కాలంతో పాటు ఫ్యాషన్ ట్రెండ్స్ మారిపోతుంటాయి. ఓసారి ఫ్యాషన్ ప్రపంచం అంతా చుడీదార్ల చుట్టూ తిరిగింది. మరోసారి పల్లూ శారీస్‌ను పట్టుకుని మురిసిపోతుంది. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్‌లపై మనసుపడింది. ఫ్లోర్ లెన్త్ గౌన్లలో కాస్త హుందాగా.. ఇంకాస్త అందంగా కనిపిస్తామని యంగ్ మగువలు దీన్ని ఎన్నుకుంటున్నారు. పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్ వేడుకల్లో సైతం లాంగ్ స్కర్ట్‌లో దర్శనమిస్తున్నారు.
లాంగ్‌స్కర్ట్ జమానా మళ్లీ ఊపందుకోవడంతో సరికొత్త కలెక్షన్స్ మార్కెట్‌లోకి తెస్తున్నారు డిజైనర్లు. లైట్ వెయిట్ షిఫాన్, క్రీప్స్, జార్జెట్స్ వంటి రకాలు ఫ్యాషన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఫారిన్ సొగసులు దిద్దుకున్న ఈ లాంగ్ గౌన్‌లకు ఇండియన్ ఫ్లేవర్ అద్దుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. అదిరిపోయే ఎంబ్రాయిడరీ వర్క్స్‌తో లాంగ్ స్కర్ట్స్‌కు వెడ్డింగ్ శోభను తీసుకొస్తున్నారు. అందుకే ఈ కొత్త ఫ్యాషన్.. మిగతా కలెక్షన్స్‌ను దాటుకుని ముందుకొచ్చింది.
- శిరీష చల్లపల్లి