బ్యూటీ బ్లూమ్
నగరంలో ఎందెందు వెతికినా అందందే అన్నట్టుగా అందాల పోటీలు హోరెత్తుతున్నాయి. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో ఈవెంట్ల నిర్వాహకులు కొత్త కొత్త టైటిల్స్‌తో కాలేజీ యూత్‌ని ఊరిస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను అందుకుంటూ సిటీ ఫ్యాషన్ వేదికపై సరికొత్త అందాలు వికసిస్తున్నాయి. - ఎస్.సత్యబాబు
మోడలింగ్, టివి, షార్ట్‌ఫిలిమ్స్, సినిమా రంగాలకు ‘బ్యూటీ’ బ్యాంక్‌ను సమృద్ధిగా ఏర్పాటు చేసే క్రమంలో సిటీలో రకరకాల ఫ్యాషన్ పోటీలు ఊపందుకున్నాయి.
ఒకప్పుడు బ్యూటీ కాంటెస్ట్ అంటే మిస్ ఇండియా ఒక్కటే. తర్వాత మిసెస్ ఇండియా, గ్లాడ్‌రాగ్స్, మిస్ సౌతిండియా, ఐయామ్‌షి, ఇండియన్ ప్రిన్సెస్.. ఇలా పలు రకాల బ్యూటీ హంట్స్ ఫ్యాషన్ పరేడ్ నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ పోటీల పుణ్యమా అని పిల్లలున్న శ్రీమతులు సైతం మతులు పోగొట్టే స్థాయిలో బ్యూటీ క్వీన్‌లుగా మారిపోతున్నారు.
వేదిక ఏదైనా వేడుక అదే..
జాతీయస్థాయి పోటీలే స్ఫూర్తిగా కాలేజ్ క్యాంపస్, పబ్స్, క్లబ్స్, షాపింగ్‌మాల్స్‌లో సైతం బ్యూటీ కాంటెస్ట్‌లు సర్వసాధారణమయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే నగరంలో ఏ భారీస్థాయి ఈవెంట్ నిర్వహిస్తున్నా, ఏ తరహా కార్యక్రమం నిర్వహిస్తున్నా, అది గ్లామర్ రంగంతో ఎలాంటి సంబంధమూ లేనిదైనా సరే.. అందాల పోటీ అనివార్యం అవుతోంది.
ఇటీవల విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రీయులు సైతం మిస్ గుజరాతీ, మిస్ పంజాబీ.. అంటూ కమ్యూనిటీ వైజ్ పోటీలకు తెరతీశారు. తాజాగా బంజారాహిల్స్ మెరిడియన్ స్కూల్‌లో నిర్వహించిన ఈవెంట్‌తో అందాల పోటీలు స్కూల్స్‌కూ విస్తరించినట్టయింది. అలాగే సికింద్రాబాద్ క్లబ్ నిర్వహించే ‘మే క్వీన్’ కాంటెస్ట్ ఇప్పటికే బాగా పాపులర్ కాగా మరిన్ని క్లబ్స్ ఈ పోటీలకు సై అంటున్నాయి.
చూడచక్కగా ఉంటే చాలు...
కనీసం 5.6 అడుగుల ఎత్తు, తీరైన ఫిజిక్, కలర్.. వగైరాలన్నీ ఉంటేనే ఒకప్పుడు ఈ పోటీలకు అర్హత లభించేది. దాంతో సిటీలో పార్టిసిపెంట్స్ దొరకక నిర్వాహకుల తలప్రాణం తోకకు వచ్చేది. అయితే పోటీల వెల్లువ కారణంగా చూడడానికి కాస్త బావున్నా సరే.. ‘మేము సైతం పోటీకి తయారే’ అంటూ రంగంలోకి దూకేస్తున్నారు అతివలు. దీంతో బ్యూటీ ఈవెంట్స్ నిర్వాహకులకు ఆ కొరత తీరిపోయింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం అందించే మార్గాలుగా వాణిజ్యపరంగానూ ఇవి లాభదాయకంగా మారాయి.
పడతులూ...పారాహుషార్...
అద్దం అబద్ధం చెప్పదేమో కానీ...అందాల కిరీటం అబద్ధం చెప్పొచ్చు. నగరంలో అందాల పోటీలు పెరుగుతున్నట్టే ఆ క్రేజ్‌ను ఏదో రకంగా ఉపయోగించుకోవాలి అనుకునేవారూ పెరుగుతున్నారు. క్యాంపస్‌లోనో కమ్యూనిటీ పరిధిలో జరిగే పోటీలైతే పర్లేదు కానీ.. పెద్దగా పరిచయం లేని వాటిలో పాల్గొనాలనుకునే అమ్మాయిలకు కొన్ని సూచనలు...
⇒ ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ఇదొక మార్గం అన్నట్టుగా మాత్రమే పోటీలకు సిద్ధమవ్వాలి.
⇒ వీలైనంత వరకూ కుటుంబ సభ్యులను ఒప్పించి, వారితో చర్చించి మాత్రమే పాల్గొనాలి.
⇒ వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఆకర్షణీయమైన టైటిల్స్‌తో చేసే ప్రచారాన్నో, వెబ్‌సైట్‌లో చెప్పుకుంటున్నవి చూసో నమ్మేయకండి. అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి.
⇒ నిర్వాహకులు ఎవరు? సదరు పోటీ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా? లేదా చెక్ చేసుకోవాలి.
⇒ నిర్వాహక సంస్థ గతచరిత్ర, వారికి ఉన్న అనుభవం తెలుసుకోవాలి
⇒ కాంటెస్ట్ నిర్వహణ సందర్భంగా గ్రూమింగ్ సెషన్ల కోసమంటూ నిర్వాహకులు దూరప్రాంతాలకు తీసుకెళ్లేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి.
నిర్వహణ తీరుతెన్నులపై ఎటువంటి సందేహాలు తలెత్తినా ప్రశ్నించాలి. మౌనం వహించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ.
⇒ గెలిస్తే ఓకే. ఓడిపోయినంత మాత్రాన నష్టమూ లేదు. అయితే చదువు, తెలివితేటలూ ఉండీ మోసానికి గురైతే అది జీవితకాలం వెంటాడే చేదు జ్ఞాపకం అవుతుందనే విషయం మరచిపోకూడదు. టైటిల్ కోసం ఎటువంటి ప్రలోభాలకు గురికాకూడదు.