City fashion
-
బ్యూటీ బ్లూమ్
నగరంలో ఎందెందు వెతికినా అందందే అన్నట్టుగా అందాల పోటీలు హోరెత్తుతున్నాయి. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో ఈవెంట్ల నిర్వాహకులు కొత్త కొత్త టైటిల్స్‌తో కాలేజీ యూత్‌ని ఊరిస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను అందుకుంటూ సిటీ ఫ్యాషన్ వేదికపై సరికొత్త అందాలు వికసిస్తున్నాయి. - ఎస్.సత్యబాబు మోడలింగ్, టివి, షార్ట్ఫిలిమ్స్, సినిమా రంగాలకు ‘బ్యూటీ’ బ్యాంక్‌ను సమృద్ధిగా ఏర్పాటు చేసే క్రమంలో సిటీలో రకరకాల ఫ్యాషన్ పోటీలు ఊపందుకున్నాయి. ఒకప్పుడు బ్యూటీ కాంటెస్ట్ అంటే మిస్ ఇండియా ఒక్కటే. తర్వాత మిసెస్ ఇండియా, గ్లాడ్రాగ్స్, మిస్ సౌతిండియా, ఐయామ్షి, ఇండియన్ ప్రిన్సెస్.. ఇలా పలు రకాల బ్యూటీ హంట్స్ ఫ్యాషన్ పరేడ్ నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ పోటీల పుణ్యమా అని పిల్లలున్న శ్రీమతులు సైతం మతులు పోగొట్టే స్థాయిలో బ్యూటీ క్వీన్లుగా మారిపోతున్నారు. వేదిక ఏదైనా వేడుక అదే.. జాతీయస్థాయి పోటీలే స్ఫూర్తిగా కాలేజ్ క్యాంపస్, పబ్స్, క్లబ్స్, షాపింగ్‌మాల్స్‌లో సైతం బ్యూటీ కాంటెస్ట్‌లు సర్వసాధారణమయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే నగరంలో ఏ భారీస్థాయి ఈవెంట్ నిర్వహిస్తున్నా, ఏ తరహా కార్యక్రమం నిర్వహిస్తున్నా, అది గ్లామర్ రంగంతో ఎలాంటి సంబంధమూ లేనిదైనా సరే.. అందాల పోటీ అనివార్యం అవుతోంది. ఇటీవల విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రీయులు సైతం మిస్ గుజరాతీ, మిస్ పంజాబీ.. అంటూ కమ్యూనిటీ వైజ్ పోటీలకు తెరతీశారు. తాజాగా బంజారాహిల్స్ మెరిడియన్ స్కూల్లో నిర్వహించిన ఈవెంట్‌తో అందాల పోటీలు స్కూల్స్కూ విస్తరించినట్టయింది. అలాగే సికింద్రాబాద్ క్లబ్ నిర్వహించే ‘మే క్వీన్’ కాంటెస్ట్ ఇప్పటికే బాగా పాపులర్ కాగా మరిన్ని క్లబ్స్ ఈ పోటీలకు సై అంటున్నాయి. చూడచక్కగా ఉంటే చాలు... కనీసం 5.6 అడుగుల ఎత్తు, తీరైన ఫిజిక్, కలర్.. వగైరాలన్నీ ఉంటేనే ఒకప్పుడు ఈ పోటీలకు అర్హత లభించేది. దాంతో సిటీలో పార్టిసిపెంట్స్ దొరకక నిర్వాహకుల తలప్రాణం తోకకు వచ్చేది. అయితే పోటీల వెల్లువ కారణంగా చూడడానికి కాస్త బావున్నా సరే.. ‘మేము సైతం పోటీకి తయారే’ అంటూ రంగంలోకి దూకేస్తున్నారు అతివలు. దీంతో బ్యూటీ ఈవెంట్స్ నిర్వాహకులకు ఆ కొరత తీరిపోయింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం అందించే మార్గాలుగా వాణిజ్యపరంగానూ ఇవి లాభదాయకంగా మారాయి. పడతులూ...పారాహుషార్... అద్దం అబద్ధం చెప్పదేమో కానీ...అందాల కిరీటం అబద్ధం చెప్పొచ్చు. నగరంలో అందాల పోటీలు పెరుగుతున్నట్టే ఆ క్రేజ్‌ను ఏదో రకంగా ఉపయోగించుకోవాలి అనుకునేవారూ పెరుగుతున్నారు. క్యాంపస్‌లోనో కమ్యూనిటీ పరిధిలో జరిగే పోటీలైతే పర్లేదు కానీ.. పెద్దగా పరిచయం లేని వాటిలో పాల్గొనాలనుకునే అమ్మాయిలకు కొన్ని సూచనలు... ⇒ ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ఇదొక మార్గం అన్నట్టుగా మాత్రమే పోటీలకు సిద్ధమవ్వాలి. ⇒ వీలైనంత వరకూ కుటుంబ సభ్యులను ఒప్పించి, వారితో చర్చించి మాత్రమే పాల్గొనాలి. ⇒ వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఆకర్షణీయమైన టైటిల్స్‌తో చేసే ప్రచారాన్నో, వెబ్సైట్లో చెప్పుకుంటున్నవి చూసో నమ్మేయకండి. అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ⇒ నిర్వాహకులు ఎవరు? సదరు పోటీ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా? లేదా చెక్ చేసుకోవాలి. ⇒ నిర్వాహక సంస్థ గతచరిత్ర, వారికి ఉన్న అనుభవం తెలుసుకోవాలి ⇒ కాంటెస్ట్ నిర్వహణ సందర్భంగా గ్రూమింగ్ సెషన్ల కోసమంటూ నిర్వాహకులు దూరప్రాంతాలకు తీసుకెళ్లేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. నిర్వహణ తీరుతెన్నులపై ఎటువంటి సందేహాలు తలెత్తినా ప్రశ్నించాలి. మౌనం వహించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ⇒ గెలిస్తే ఓకే. ఓడిపోయినంత మాత్రాన నష్టమూ లేదు. అయితే చదువు, తెలివితేటలూ ఉండీ మోసానికి గురైతే అది జీవితకాలం వెంటాడే చేదు జ్ఞాపకం అవుతుందనే విషయం మరచిపోకూడదు. టైటిల్ కోసం ఎటువంటి ప్రలోభాలకు గురికాకూడదు. -
మిసమిషెల్
మనం ధరించిన దుస్తులను చూసి విదేశీయులు నచ్చి, మెచ్చి వాటిని గౌరవించడం మనకు తెలుసు. అయితే ఒక విదేశీ వనిత ధరించిన మన దేశీ దుస్తులు టాక్ ఆఫ్ ది వరల్డ్ కావడం.. అవి మనకు అద్భుతంగా అనిపించడం.. ఇప్పుడు ఆ స్టైల్స్‌ని అనుసరించడానికి ఫ్యాషన్ లవర్స్ ఆరాటపడటం.. జరుగుతోంది. అంటే నిజంగా ఆ విదేశీ వనితను అభినందించాల్సిందే. ఆ ఘనత దక్కించుకుంది మరెవరో కాదు మిషెల్ ఒబామా. ఇప్పుడు సిటీ ఫ్యాషన్ సర్కిల్లో టాక్ ఆఫ్ ది ట్రెండ్స్. . .:: ఎస్.సత్యబాబు అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా తన భర్తతో సహా మన దేశానికి వచ్చారు. తిరిగి వెళ్లనూ వెళ్లారు. మనదేశంతో అనుబంధాల గురించి మాట్లాడి ఒబామా భారతీయుల అభిమానాన్ని చూరగొన్నట్టే.. అద్భుతమైన డిజైనర్ దుస్తులతో మిషెల్ కూడా అందర్నీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు సిటీజనులకు ట్రెండ్ సెట్టర్ అయ్యారు. క్రేజీ కాంబినేషన్... మిషెల్ ధరించిన దుస్తులు క్రేజీ కాంబినేషన్‌గా అందరి మెప్పునూ పొందుతున్నాయి. పాపీ ప్రింట్ కోట్ కు కేప్ కోట్, సింపుల్ బ్లాక్ పంప్స్ కాంబినేషన్‌తో లుక్‌ని మెరిపించిన మిషెల్.. డ్రెస్సింగ్ ఇప్పుడు సిటీ డిజైనర్స్‌కు హాట్ ట్రెండ్ అయింది. సిటీలో పలువురు ఫ్యాషన్ ప్రియులైన అమ్మాయిలు మిషెల్ డ్రెస్సింగ్ స్టైల్‌ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుండటంతో.. సిటీ డిజైనర్లు అర్జెంట్‌గా తమ అస్త్రాలకు పదును పెట్టి ఆ తరహాలో వెరైటీ డిజైన్లకు శ్రీకారం చుడుతున్నారు. బ్లూ ఫ్లోరల్ మోటిఫ్స్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ నీ లెంగ్త్ డ్రెస్‌ను ఆమె ప్రత్యేకంగా మన భారత్ సందర్శన కోసం రూపొందించుకున్నారు. దీనిలో ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి రానున్న స్ప్రింగ్ సమ్మర్‌కి సంబంధించిన లేటెస్ట్ కలె క్షన్. దీన్ని ‘షీట్’ డ్రెస్ అని పిలుస్తారు. మిషెల్ ధరించిన దుస్తుల్లో కోట్, డ్రెస్ రెండింటికీ ఒకే ఫ్యాబ్రిక్ వాడారు. ఇది కొత్త ట్రెండ్. ఆమె ధరించిన దుస్తులకు వాడింది పాలియస్టర్ బ్లెండ్‌లో సూతింగ్ ఫ్యాబ్రిక్ అయి ఉంటుందని సిటీ డిజైనర్ నీరజ కోన అంటున్నారు. భారతీయ డిజైన్ల అభిమాని... తాజా మిషెల్ పర్యటన కోసం దుస్తుల్ని డిజైన్ చేసింది జన్మతః ఒడిసాలోని రూర్కెలా వాసి, ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటున్న భారతీయ డిజైనర్ బిభూ మహాపాత్ర. భారతీయ డిజైన్లకు ప్రపంచవ్యాప్త కీర్తి తీసుకొచ్చారు మిషెల్. ఇప్పుడే కాదు అమెరికాలో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌కు ఆమె జన్మతః ముంబై వాసి అయిన డిజైనర్ నయీమ్ ఖాన్ దుస్తులను ధరించారు. గత 2010లో భారత సందర్శనకు వచ్చినప్పుడు కూడా ఆయనే రూపొందించిన మెటాలిక్ కాలమ్‌ను ధరించారు. అదే ఏడాది 33వ యాన్యువల్ కెన్నెడీ సెంటర్ హానర్స్ కార్యక్రమానికి సైతం ఆమె నయీమ్ డిజైన్ చేసిన స్లీవ్‌లెస్ గౌన్నే ధరించారు. తర్వాతి ఏడాది జర్మన్ చాన్స్‌లర్ అంజెలా మెర్కెల్ కోసం నిర్వహించిన స్టేట్ డిన్నర్లో ఆమె బ్రీడెడ్ కాలమ్ ధరించారు. బ్రెజిలియన్ ప్రెసిడెంట్ డిల్మా రూసెఫ్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా ఆమె నీ లెంగ్త్ ఎంబ్రాయిడరీ డ్రెస్‌ను ఎంచుకున్నారు. 2012లో భారత్ సందర్శనకు వచ్చినప్పుడు కూడా న యీమ్ ఖాన్, రాచెల్రాయ్ల డిజైన్లను ధరించిన మిషెల్ ఇప్పుడు కూడా తన భారతీయ ఫ్యాషన్ ప్రియత్వాన్ని చాటుకున్నారు. పెద్దన్నలో అర్ధభాగమైన మిషెల్ ఒబామా డ్రెస్సింగ్ స్టైల్స్‌లో మన డిజైన్లు ఒక విడదీయలేని భాగం అయిపోవడం విశేషం. ట్రెండీ డ్రెస్ అది... మిషెల్ ఒబామా మన దేశానికి వచ్చినప్పుడు ధరించిన డ్రెస్ రియల్లీ ట్రెండీ. దీని వల్ల ఇండియన్ డిజైనర్ బాగా టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యారు. నీ లెంగ్త్ షీట్ డ్రెస్. ఇప్పుడు సిటీలో చాలా మంది అమ్మాయిలు ఈ వెరైటీ కాంబినేషన్‌పై ఆసక్తి చూపుతున్నారు. భారతదేశ పర్యటనకు వచ్చారనే కాదు గతంలో కూడా అమెరికాలో తను పాల్గొన్న పలు కార్యక్రమాల్లో మిషెల్ ఇండియన్ డిజైనర్లు రూపొందించిన దుస్తులను ధరించారు. అయితే ఈసారి డ్రెస్సింగ్ బాగా ఎలివేట్ కావడంతో గతంలో మిషెల్ ధరించిన ఇండియన్ డిజైనర్స్ డ్రెస్‌ల గురించి కూడా సిటీ అమ్మాయిలు నెట్లో సెర్చ్ చేస్తున్నారు. - నీరజ కోన, టాలీవుడ్ స్టైలిస్ట్