పీ పీ పీ ..డుమ్ డుమ్ డుమ్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరిణయ ఘడియలు వచ్చేశాయి...తెల్ల కాగితాల్లాంటి రెండు కొత్త మనసులపై అనేక మధురస్మృతులను లిఖించే ఆనంద ఘడియలు తలుపు తట్టాయి..ఎన్నో ఊహల్లో..మరెన్నో ఆశల్లో.. ఇంకెన్నో తలపుల్లో నిలిచిన భాగస్వామితో ఏడడుగులు వేసే శుభ ఘడియలు పలకరించాయి.ఐదు నెలలుగా మూగబోయిన పెళ్లి బాజాలు మళ్లీ మోగనున్నాయి.. మాంగల్యం తంతునానేనా అనే వేద మంత్రంతో కొత్త జీవితాలకు పెళ్లి పుస్తకం తెరిచాయి.
నేటి నుంచి పెళ్లిళ్ల సీజన్ షురూ..
హైదరాబాద్: ప్రస్తుతం ఆశ్వయుజమాసం రావడంతో శుభఘడియలు సమీపించాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో దివ్యమైన ముహూర్తాల్లో ఊరూరా కల్యాణవీణ మోగనుంది. ఐదు నెలల తరువాత ముహూర్తాలు రావడంతో జంట నగరాల్లో వేల సంఖ్యలో పెళ్లి బాజాలు మోగనున్నాయి.
ఇవీ శుభ ముహూర్తాలు
నవంబరు 7, 13, 14, 15, 17, 18, 19, 20, 22, 26 తేదీలు..డిసెంబరులో 2, 4, 5, 6, 14, 16,17, 20, 21, 24, 25, 27, 30, 31 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. జనవరి 11 నుంచి పుష్యమాసం కావడంతో మళ్లీ తిరిగి ఫిబ్రవరి 9 వరకు ముహూర్తాలు లేవని వెల్లడిస్తున్నారు.
అన్నింటికీ డిమాండే..
ఐదు నెలల తరువాత ఒక్కసారిగా పెళ్లి గంటలు మోగనుండటంతో వివాహానికి సంబంధించిన అన్నింటికీ ఒక్కసారిగా డిమాండ్ పెరగనుంది. కల్యాణ మండపాలు, కేటరింగ్, పురోహితులు, బాజా భజంత్రీలు, మండపం డెకరేషన్‌లు, కార్లు, బస్సులు, షామియానా, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ.. ఇలా అన్నింటికీ ఒక్కసారిగా డిమాండ్ రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఆయా విభాగాల వారికి ముందుగా అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వధూవరులతో పాటు బంధుమిత్రులు సిద్ధమయ్యారు.