ఇండియాలో పెళ్లిళ్లను ట్రంప్‌ ప్రభావితం చేస్తున్నాడా? | Marriages in India: Change in Choosing Life Partner, NRI Matches | Sakshi
Sakshi News home page

పెళ్లిళ్ల సీజన్‌ వస్తోంది.. కొంగుముడి ఎప్పుడు?

Published Mon, Jan 16 2023 8:04 PM | Last Updated on Mon, Jan 16 2023 8:04 PM

Marriages in India: Change in Choosing Life Partner, NRI Matches - Sakshi

‘నేను పెళ్లి చేసుకునే అబ్బాయి ఫలానా హీరోలా ఉండాలి’ 
‘నాకు భార్య కావాలంటే ఆ అమ్మాయికి అదృష్టం ఉండాలి’ 
ఇలాంటి... డైలాగ్‌లు టీన్స్‌ నుంచి ట్వంటీస్‌ వరకు చెప్పేవే. 
అమ్మానాన్నలు తెచ్చిన సంబంధాలు వాస్తవంలోకి తెచ్చేవి. 
అనేకానేక రాజీలతో బాసికానికి తలవంచి ఏడడుగులు పడేవి.  
అది ఒకప్పుడు... ఇప్పుడు కాలం మారింది. ట్రెండ్‌ మారింది. 

కొత్తకాలంలో కట్నం కాలగర్భంలోకి కలిసిపోనుందా? 
అయితే... ఇది మంచి పరిణామమే. 
అమ్మాయి విద్య ఉద్యోగాలతో సాధికారత సాధించిందా? 
అయితే... ఇది ఇంకా గొప్ప శుభపరిణామమే. 
భాగస్వామి ఎంపికలో యువత ప్రాధాన్యాలెలా ఉన్నాయి? 
ఇండియాలో పెళ్లిళ్లను ట్రంప్‌ ప్రభావితం చేస్తున్నాడా? 
అధ్యక్షుడిగా ట్రంప్‌ పోయినా ట్రంప్‌ భయం ఇంకా ఉందా? 

‘పెళ్లిలో పెళ్లి కుదరడం’ ఒకప్పటి మాట. అంటే బంధువుల పెళ్లిలో పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు బంధువులందరి దృష్టిలో పడతారు. ఏం చదువుకున్నారు? ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? వంటి వివరాలన్నీ కబుర్లలో భాగంగా బంధువులందరికీ చేరిపోయేవి. అబ్బాయికీ, అమ్మాయికీ బంధుత్వం కలిసే ఎవరో పెద్దవాళ్లు ఎవరో ఓ మాటగా అంటారు. మాటలు కలుపుకుంటారు. పెళ్లి కుదిరేది. శ్రావణమాసం పెళ్లిలో కలిసిన అమ్మాయి, అబ్బాయి విజయదశమి ముహూర్తాల్లో వధూవరులయ్యేవాళ్లు.

మరి ఇప్పుడు...
కాలం మారింది. ఎంతగా మారిందీ అంటే... బంధువులను కూడా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌గా పలకరించుకునే తరం ఇది. దగ్గరి బంధువుల అమ్మాయి, అబ్బాయిల వివరాలు కూడా మ్యారేజ్‌ బ్యూరోల ద్వారా తెలుస్తున్న పరిస్థితి. సమాజంలో వచ్చిన ఈ మార్పుతోపాటు... జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో వచ్చిన మార్పు కూడా పెద్దదే. నుదుట బాసికాలు, మెడలో పూలదండలు ధరించకపోతే పెళ్లిపీటల మీద ఉన్న వాళ్లు వధూవరులా లేక కన్యాదాతలా అనే సందేహం కూడా ఎదురవుతుంటుంది.

‘తొలి ప్రసవం కనీసం ముప్పై ఏళ్ల లోపు జరగడం శ్రేయస్కరం’ అని వైద్యరంగం చెబుతూనే ఉంది. కానీ ఉన్నత విద్యావంతులైన అమ్మాయిలు పెళ్లికి సిద్ధమయ్యేటప్పటికే ముప్పయ్‌ దాటుతున్నాయి. ఆలస్యానికి కారణాలు ఒకటి–రెండు కాదు, అనేకం. భాగస్వామిని ఎంచుకోవడం పట్ల సమాజం ఎలా ఉందో తెలియాలంటే మ్యారేజ్‌ బ్యూరోతో మాట్లాడడం ఓ సులువైన మార్గం. హైదరాబాద్‌లోని అవినాష్‌రెడ్డి మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకులు కోటిరెడ్డి, జ్యోతి మ్యాట్రిమొనీ నిర్వాహకురాలు జొన్నలగడ్డ జ్యోతి, శ్రీకాకుళంలోని శ్రీసాయి నరసింహ సేవాసంఘం నిర్వహకులు కరణం నరసింగరావు,  తిరుపతికి చెందిన సాయి మ్యాట్రిమొనీ నిర్వాహకురాలు పసుపులేటి శ్వేత అనేక ఆసక్తికరమైన విషయాలను సాక్షితో పంచుకున్నారు. 

ఇదీ నా స్టైల్‌ షీట్‌!
‘‘పెళ్లి కుదర్చడం అనేది ఓ యాభై ఏళ్ల కిందట ఉన్నంత సులభం కాదిప్పుడు. తెరిచిన పుస్తకంలా ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ల మధ్య వివాహం జరిగే రోజులు కావివి. ఖండాల అవతలి వ్యక్తులతోనూ పెళ్లిబంధం కలపాలి. ప్రేమ పెళ్లిళ్లను పక్కన పెడితే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునే వాళ్లే మా దగ్గరకు వస్తారు. వాళ్లు తమ గురించి ఏ వివరాలిస్తారో ఆ వివరాలనే అవతలి వాళ్లకు అందివ్వగలుగుతాం. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. వంద పెళ్లిళ్లలో ఒక్క పెళ్లి విఫలమైనా మేము ఎక్కడో లోపం చేశామేమో అనిపిస్తుంది. నేను ఇరవై ఏళ్లుగా ఈ ఫీల్డులో ఉన్నాను. వేలాది మంది క్లయింట్‌లతో మాట్లాడాను. రెండువేలకు పైగా పెళ్లిళ్లు చేశాను. ఈ అనుభవంతో ఈ ప్రొఫెషన్‌ని సమగ్రంగా తీర్చిదిద్దుకోవడానికి నాకు నేనుగా కొన్ని నియమాలను రూపొందించుకున్నాను.  

► అబ్బాయి, అమ్మాయి ఉద్యోగం, చదువు, ఆస్తిపాస్తుల గురించి ప్రశ్నావళిలో ఇచ్చిన వివరాలు వాస్తవమేనా అనే సందేహం కూడా కలుగుతుంటుంది. సమగ్రంగా విచారణ చేసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి. ఇలాంటి ఎంక్వయిరీ కూడా మ్యారేజ్‌ బ్యూరో చేసి పెట్టగలగాలి. అలాగే ఆధార్‌ నంబర్, శాలరీ సర్టిఫికేట్‌లు తీసుకునే నియమం బ్యూరోలకు ఉంటే అబద్ధాలతో పెళ్లి చేసుకోవచ్చనే దురాలోచనను మొగ్గలోనే అరికట్టవచ్చు. 

► యువతీయువకులు భాగస్వామి ఎంపిక విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారు. తమకు నచ్చిన అంశాలన్నీ ఒక వ్యక్తిలో రాశిపోసి ఉండడం సాధ్యం కాదని, మనం కోరుకున్న లక్షణాలతో ఓ వ్యక్తిని తయారు చేయలేమని, ఉన్న ఆప్షన్స్‌లో సెలెక్ట్‌ చేసుకోవడం మాత్రమే మనం చేయగలిగింది అని పెద్దవాళ్లు చెప్పట్లేదు. ఈ విషయంలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు కొంత త్వరగా నిర్ణయం తీసుకుంటున్నారు’’ అన్నారు కోటిరెడ్డి. 

ఇన్ని వడపోతలు పూర్తయి పెళ్లి జరిగిన తర్వాత కూడా ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన ఈ తరం తల్లిదండ్రులకు తప్పడం లేదు. అందుకే వైవాహిక బంధం బలపడే వరకు కొంత కనిపెట్టి ఉండాలి. గాడి తప్పుతున్నట్లు అనిపిస్తే సరి చేయడం వరకే ఉండాలి పెద్దవాళ్ల జోక్యం. పిల్లల జీవితంలోకి దూరిపోయి వాళ్ల జీవితాలను తామే జీవించాలనుకోకూడదు. ఇప్పటి పేరెంట్స్‌ దాదాపు చదువుకున్న వాళ్లే. అబ్బాయి తల్లిదండ్రులకు కూడా కోడలు వచ్చి తమను చూసుకోవాలనే ఆంక్షల్లేవు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ల కుటుంబం వాళ్లను దిద్దుకోమని నూతన దంపతులను వేరే ఇంట్లో ఉంచడానికే ప్రయత్నిస్తున్నారు. మరో ముఖ్యమైన సంగతి... తల్లిదండ్రులు వృత్తి వ్యాపారాల్లో రిటైరై ఉంటే, పిల్లల పెళ్లి బాధ్యత పూర్తయిన తరవాత తమకిష్టమైన లేదా సమాజహితమైన వ్యాపకాన్ని పెట్టుకోవాలి.  
– వాకా మంజులారెడ్డి

ట్రంప్‌ ప్రభావం
నేను పాతికేళ్లుగా వివాహవేదిక నడుపుతున్నాను. అప్పట్లో అమ్మాయి తల్లిదండ్రులైనా, అబ్బాయి తల్లిదండ్రులైనా అవతలి వారి కుటుంబ నేపథ్యాన్ని ప్రధానంగా గమనించేవారు. ఇప్పుడు డబ్బు, ఆస్తులు ప్రధానం అయ్యాయి. పాతికేళ్ల కిందట విదేశాల మోజు బాగా ఉండేది. పదవ తరగతి అమ్మాయికి కూడా యూఎస్‌ సంబంధాల కోసం ప్రయత్నించేవారు. ఈ ట్రెండ్‌ 1990– 2000 మధ్య బాగా ఉండేది. ఇప్పుడు అమ్మాయిలే చదువుకుని విదేశాలకు వెళ్తున్నారు. ఇప్పుడు చదువు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన అమ్మాయిలు, అలాగే అక్క, అన్న విదేశాల్లో ఉన్న అమ్మాయిలు మాత్రమే విదేశీ సంబంధాలు కోరుకుంటున్నారు.


ట్రంప్‌ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇండియాలో ఉన్న అమ్మాయికి యూఎస్‌ అబ్బాయితో పెళ్లి చేసినవాళ్లు, అమ్మాయిని అమెరికా పంపించడానికి వీసా రాక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇక్కడ కూడా మంచి ఉద్యోగాలున్నాయి కాబట్టి అమ్మాయి మా కళ్ల ముందే ఉంటుంది, ఇండియా సంబంధాలే చెప్పండి అంటున్నారు. అయితే అబ్బాయికి లక్ష రూపాయల జీతం ఉన్నా సరే ‘ఏం సరిపోతుంది, ఇంకా పెద్ద జీతం ఉన్నవాళ్లను చెప్పండి’ అంటున్నారు. పైగా ‘మా అమ్మాయి సర్దుకుపోలేదు, కాబట్టి ఉమ్మడి కుటుంబం వద్దు’ అనే నిబంధనలు ఎక్కువయ్యాయి. కట్నం అనేది పెద్ద విషయంగా చర్చకు రావడం లేదు. ఆడంబరాలు మాత్రం ఆకాశమే హద్దు అన్నంతగా పెరిగిపోయాయి. ఇక పెళ్లి వయసుదాటిపోతోందనే ఆందోళన అటు పేరెంట్స్‌లోనూ కనిపంచడం లేదు, పెళ్లి చేసుకోవాల్సిన యువతీయువకుల్లోనూ కనిపించడం లేదు. ముప్పై సంవత్సరాలు దాటుతున్నా కూడా వయసును పట్టించుకోవడం లేదు.  
– జొన్నలగడ్డ జ్యోతి 

మళ్లీ యూఎస్‌ క్రేజ్‌ 
పదేళ్లుగా ఈ వ్యాపకంలో ఉన్నాను. మొదట్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నాలుగైదు సంబంధాలు చూసి నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు నలభై– యాభై సంబంధాలు చూసినా కూడా నిర్ణయం తీసుకోవడం లేదు. వయసు మీరిపోతున్నా ఎవరికీ పట్టింపు ఉండడం లేదు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా భాగస్వామి కోసం బంగారాన్ని గీటుపెట్టినట్లు చూస్తున్నారు. అబ్బాయి క్యాప్‌ పెట్టుకున్న ఫొటో పంపిస్తే ‘బట్టతల కావచ్చు, క్యాప్‌ లేని ఫొటోలు పంపించండి’ అంటున్నారు అమ్మాయిలు. ఇక అబ్బాయిలు కూడా తాము యావరేజ్‌గా ఉన్నా సరే... అందమైన అమ్మాయి కావాలంటారు. అబ్బాయిలైనా కొంతవరకు రాజీపడుతున్నారు కానీ అమ్మాయిలు కచ్చితంగా ఉంటున్నారు. ఓ మంచి మార్పు ఏమిటంటే... కట్నం ప్రాధాన్యం లేని విషయమైపోయింది. అలాగే ట్రంప్‌ హయాంలో అమ్మాయి తల్లిదండ్రులు యూఎస్‌ సంబంధాలు వద్దనేవాళ్లు. ఇప్పుడు మళ్లీ యూఎస్‌ సంబంధాలకు క్రేజ్‌ పెరిగింది. 
– శ్వేత పసుపులేటి 

నిర్ణయం వధూవరులదే! 
అమ్మాయికి పెళ్లి చేయాలంటే... ఓ ఇరవై ఏళ్ల కిందట అబ్బాయి కుటుంబ నేపథ్యాన్ని ప్రధానంగా చూసేవారు. ఇప్పుడు చదువు, ఉద్యోగం మొదటి ప్రాధాన్యంలో ఉంటున్నాయి. ఉద్యోగంలో కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు తొలి ప్రాధాన్యం, ఆ తర్వాత గవర్నమెంట్‌ ఉద్యోగం ఉంటోంది. వ్యాపారం అనగానే ‘రిస్క్‌ అవసరమా’ అంటున్నారు. వ్యవసాయం అయితే ఇక నాలుగో ప్రాధాన్యంలోకి వెళ్లిపోయింది. కరోనా తర్వాత విదేశాలంటే భయపడుతున్నారు. అంతవరకు విదేశాలతో సంబంధం లేని వాళ్లు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. వధువు అక్క లేదా అన్న యూఎస్, యూకేల్లో ఉన్న ఆ దేశంలో ఉన్న అబ్బాయికే మొగ్గు చూపుతున్నారు. ఇక డిమాండ్‌ల విషయానికి వస్తే... వరుని ఎంపిక విషయంలో అమ్మాయిలు చాలా కచ్చితంగా ఉంటున్నారు. ఎంతో కొంత రాజీ పడుతున్నది అబ్బాయిలే.  


చాదస్తం తగ్గింది 

ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లిని ఒకప్పుడు వధూవరుల తల్లిదండ్రులు కుదిర్చేవాళ్లు, ఇప్పుడు వధూవరులు స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నారు (అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ల విషయంలో కూడా). ఇప్పుడు దాదాపుగా అందరూ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులే. వాళ్లు కొడుకు, కూతురు ఇద్దరినీ చదివిస్తున్నారు. ఇద్దరినీ ఉద్యోగాలకు పంపిస్తున్నారు. ఆస్తిని దాదాపుగా సమంగా ఇస్తున్నారు. దీంతో కట్నం ప్రస్తావన ప్రధానంగా కనిపించడం లేదు. తల్లిదండ్రులు కూడా పరిణతి చెందారు. ఒకప్పటిలాగ కోడలు తెల్లవారు జామున లేచి ఇంటి పనులు చక్కబెట్టాలని, తాము నిద్రలేచే సరికి కాఫీ కప్పుతో సిద్ధంగా ఉండాలనే చాదస్తాల్లేవు. ఉద్యోగానికి వెళ్లాల్సిన అమ్మాయి ఇంటి పనుల్లోనే అలసిపోవాలని కోరుకోవడం లేదు. ఇక పిల్లలిద్దరికీ పెళ్లి చేసిన వెంటనే వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయి పిల్లలతో కలిసి జీవించాలనుకోవడం లేదు. బాధ్యతలు పూర్తయిన తమ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. 
– కరణం నరసింగరావు 


లేటెస్ట్‌ ఫొటోలుండాలి!

మ్యారేజ్‌ బ్యూరోలో మేము ఒక ప్రశ్నావళిని సమగ్రంగా రూపొందించుకున్నాం. అబ్బాయి లేదా అమ్మాయితో స్వయంగా మాట్లాడతాం. సాధ్యమైతే బ్యూరోలోనే లైవ్‌ ఫొటో షూట్‌ చేయడం మంచిది. పేరెంట్స్‌ ఇచ్చే ఫైల్‌ ఫొటోలు కొన్ని సందర్భాల్లో బాగా పాతవి ఉంటాయి. ఫొటోలు ఉన్నట్లుగా లైవ్‌లో లేనట్లయితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా డిజప్పాయింట్‌ అవుతారు. ఇక ఆ తర్వాత మిగిలిన ప్రత్యేకతలేవీ పరిగణనలోకి రావు.
– కోటిరెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement