Marriage Bureau
-
Khairatabad: మ్యారేజ్ బ్యూరో ముసుగులో వ్యభిచారం
ఖైరతాబాద్: మ్యారేజ్ బ్యూరో ముసుగులో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న వారిపై సెంట్రల్ జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులు దాడిచేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌కు చెందిన అయేషా సిద్ధిఖీ షాదాన్ కాలేజ్ లేన్‌లో మ్యారేజ్‌బ్యూరో పేరుతో కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యాపారం నిర్వహిస్తోందని తెలుసుకున్న టాస్‌్కఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేసి ప్రధాన నిర్వాహకురాలితో పాటు విటులు బానోత్ వీరుడు, షేక్ సిహబ్, మహ్మద్ సులేమాన్, మహ్మద్ నిజాముద్దీన్లను అదుపులోకి తీసుకొని వీరివద్ద నుంచి ఫోన్లు, నగదు, కండోమ్ ప్యాకెట్లు స్వా«దీనం చేసుకొని ఖైరతాబాద్ పోలీసుకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కట్నం తేవాలంటూ భార్యకు వేధింపులు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలో డోలాస్‌నగర్‌లో నివాసముండే ఓ ఆటోడ్రైవర్ తన భార్య చనిపోవడంతో మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహమై భర్త వదిలేసిన ఓ మహిళను చర్చిలో వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న అనంతరం కట్నం కావాలని మొదటిభార్య సంతానంతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై 5 రోజుల క్రితం సదరు మహిళ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు ఎటువంటి న్యాయం జరగకపోవడంతో మంగళవారం పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యయత్నం చేసింది. బాధిత మహిళ వివరాల ప్రకారం.. మ్యారేజ్‌బ్యూరో ద్వారా డోలాస్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ బుచ్చిబాబును అనురాధ 2023 ఫిబ్రవరి 11వ తేదీన ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకునేముందు తన భార్య చనిపోయిందని, తన ఇద్దరు పిల్లలు తన దగ్గర ఉండరని, సొంత ఇంట్లో నివాసముంటామని, మొదటి భర్తతో పుట్టిన నీ కొడుకును సైతం హాస్టల్లో ఉంచాలని బుచ్చిబాబు అనురాధతో చెప్పాడు. బుచ్చిబాబు కుమార్తెకు వివాహమైనా భర్తకు దూరంగా ఉండడంతో ఆమె కూడా అదే ఇంట్లో నివాసముంటోంది. వివాహమైనప్పటి నుంచి ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని, ఇంటి ఖర్చుల నిమిత్తం డబ్బులు అడిగితే నువ్వు నాకు కట్నం ఇవ్వలేదు, ముందు కట్నం తేవాలని వేధింపులకు గురిచేశారని బాధితురాలు అనురాధ వాపోయింది. ఈవిషయమై నిలదీయడంతో తనపై పలుసార్లు దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఐదు రోజుల క్రితం బుచ్చిబాబు, అతని కుమార్తె, కుమారుడు, తల్లి తన నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని హింసించగా, వారినుంచి తప్పించుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చానని, ఇక్కడ పోలీసులు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. చివరకు సీఐ మల్లిఖార్జునరావును కలవగా, మ్యారేజ్ సర్టిఫికేట్ తేవాలని సూచించారన్నారు. తన మొదటి భర్త వదిలేసి ఎటో వెళ్లిపోతే అతనితో విడాకులు అయినట్లు పత్రాలు, మరల బుచ్చిబాబును ద్వితీయ వివాహం చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని అంటున్నారని, వివాహం జరిగిన చర్చిలో పాస్టర్‌ను మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగితే మేము అలాంటివి ఇవ్వమని చెబుతున్నారని బాధిత మహిళ వాపోయింది. ఈక్రమంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యయత్నం చేయగా స్థానిక మీడియా ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులను వివరణ అడుగగా అనూరాధ రెండవ భర్త బుచ్చిబాబు అందుబాటులో లేడని, అతడ్ని పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారి కుటుంబ సభ్యులకు హెచ్చరించామని, అనూరాధ, బుచ్చిబాబుల మధ్య సఖ్యత కుదరపోతే కేసు నమోదు చేసి ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు పంపనున్నట్లు తెలిపారు. -
ఇండియాలో పెళ్లిళ్లను ట్రంప్ ప్రభావితం చేస్తున్నాడా?
‘నేను పెళ్లి చేసుకునే అబ్బాయి ఫలానా హీరోలా ఉండాలి’ ‘నాకు భార్య కావాలంటే ఆ అమ్మాయికి అదృష్టం ఉండాలి’ ఇలాంటి... డైలాగ్‌లు టీన్స్ నుంచి ట్వంటీస్ వరకు చెప్పేవే. అమ్మానాన్నలు తెచ్చిన సంబంధాలు వాస్తవంలోకి తెచ్చేవి. అనేకానేక రాజీలతో బాసికానికి తలవంచి ఏడడుగులు పడేవి. అది ఒకప్పుడు... ఇప్పుడు కాలం మారింది. ట్రెండ్ మారింది. కొత్తకాలంలో కట్నం కాలగర్భంలోకి కలిసిపోనుందా? అయితే... ఇది మంచి పరిణామమే. అమ్మాయి విద్య ఉద్యోగాలతో సాధికారత సాధించిందా? అయితే... ఇది ఇంకా గొప్ప శుభపరిణామమే. భాగస్వామి ఎంపికలో యువత ప్రాధాన్యాలెలా ఉన్నాయి? ఇండియాలో పెళ్లిళ్లను ట్రంప్ ప్రభావితం చేస్తున్నాడా? అధ్యక్షుడిగా ట్రంప్ పోయినా ట్రంప్ భయం ఇంకా ఉందా? ‘పెళ్లిలో పెళ్లి కుదరడం’ ఒకప్పటి మాట. అంటే బంధువుల పెళ్లిలో పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు బంధువులందరి దృష్టిలో పడతారు. ఏం చదువుకున్నారు? ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? వంటి వివరాలన్నీ కబుర్లలో భాగంగా బంధువులందరికీ చేరిపోయేవి. అబ్బాయికీ, అమ్మాయికీ బంధుత్వం కలిసే ఎవరో పెద్దవాళ్లు ఎవరో ఓ మాటగా అంటారు. మాటలు కలుపుకుంటారు. పెళ్లి కుదిరేది. శ్రావణమాసం పెళ్లిలో కలిసిన అమ్మాయి, అబ్బాయి విజయదశమి ముహూర్తాల్లో వధూవరులయ్యేవాళ్లు. మరి ఇప్పుడు... కాలం మారింది. ఎంతగా మారిందీ అంటే... బంధువులను కూడా ఫేస్బుక్లో ఫ్రెండ్స్‌గా పలకరించుకునే తరం ఇది. దగ్గరి బంధువుల అమ్మాయి, అబ్బాయిల వివరాలు కూడా మ్యారేజ్ బ్యూరోల ద్వారా తెలుస్తున్న పరిస్థితి. సమాజంలో వచ్చిన ఈ మార్పుతోపాటు... జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో వచ్చిన మార్పు కూడా పెద్దదే. నుదుట బాసికాలు, మెడలో పూలదండలు ధరించకపోతే పెళ్లిపీటల మీద ఉన్న వాళ్లు వధూవరులా లేక కన్యాదాతలా అనే సందేహం కూడా ఎదురవుతుంటుంది. ‘తొలి ప్రసవం కనీసం ముప్పై ఏళ్ల లోపు జరగడం శ్రేయస్కరం’ అని వైద్యరంగం చెబుతూనే ఉంది. కానీ ఉన్నత విద్యావంతులైన అమ్మాయిలు పెళ్లికి సిద్ధమయ్యేటప్పటికే ముప్పయ్ దాటుతున్నాయి. ఆలస్యానికి కారణాలు ఒకటి–రెండు కాదు, అనేకం. భాగస్వామిని ఎంచుకోవడం పట్ల సమాజం ఎలా ఉందో తెలియాలంటే మ్యారేజ్ బ్యూరోతో మాట్లాడడం ఓ సులువైన మార్గం. హైదరాబాద్‌లోని అవినాష్‌రెడ్డి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు కోటిరెడ్డి, జ్యోతి మ్యాట్రిమొనీ నిర్వాహకురాలు జొన్నలగడ్డ జ్యోతి, శ్రీకాకుళంలోని శ్రీసాయి నరసింహ సేవాసంఘం నిర్వహకులు కరణం నరసింగరావు, తిరుపతికి చెందిన సాయి మ్యాట్రిమొనీ నిర్వాహకురాలు పసుపులేటి శ్వేత అనేక ఆసక్తికరమైన విషయాలను సాక్షితో పంచుకున్నారు. ఇదీ నా స్టైల్ షీట్! ‘‘పెళ్లి కుదర్చడం అనేది ఓ యాభై ఏళ్ల కిందట ఉన్నంత సులభం కాదిప్పుడు. తెరిచిన పుస్తకంలా ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ల మధ్య వివాహం జరిగే రోజులు కావివి. ఖండాల అవతలి వ్యక్తులతోనూ పెళ్లిబంధం కలపాలి. ప్రేమ పెళ్లిళ్లను పక్కన పెడితే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునే వాళ్లే మా దగ్గరకు వస్తారు. వాళ్లు తమ గురించి ఏ వివరాలిస్తారో ఆ వివరాలనే అవతలి వాళ్లకు అందివ్వగలుగుతాం. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. వంద పెళ్లిళ్లలో ఒక్క పెళ్లి విఫలమైనా మేము ఎక్కడో లోపం చేశామేమో అనిపిస్తుంది. నేను ఇరవై ఏళ్లుగా ఈ ఫీల్డులో ఉన్నాను. వేలాది మంది క్లయింట్లతో మాట్లాడాను. రెండువేలకు పైగా పెళ్లిళ్లు చేశాను. ఈ అనుభవంతో ఈ ప్రొఫెషన్ని సమగ్రంగా తీర్చిదిద్దుకోవడానికి నాకు నేనుగా కొన్ని నియమాలను రూపొందించుకున్నాను. ► అబ్బాయి, అమ్మాయి ఉద్యోగం, చదువు, ఆస్తిపాస్తుల గురించి ప్రశ్నావళిలో ఇచ్చిన వివరాలు వాస్తవమేనా అనే సందేహం కూడా కలుగుతుంటుంది. సమగ్రంగా విచారణ చేసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి. ఇలాంటి ఎంక్వయిరీ కూడా మ్యారేజ్ బ్యూరో చేసి పెట్టగలగాలి. అలాగే ఆధార్ నంబర్, శాలరీ సర్టిఫికేట్లు తీసుకునే నియమం బ్యూరోలకు ఉంటే అబద్ధాలతో పెళ్లి చేసుకోవచ్చనే దురాలోచనను మొగ్గలోనే అరికట్టవచ్చు. ► యువతీయువకులు భాగస్వామి ఎంపిక విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారు. తమకు నచ్చిన అంశాలన్నీ ఒక వ్యక్తిలో రాశిపోసి ఉండడం సాధ్యం కాదని, మనం కోరుకున్న లక్షణాలతో ఓ వ్యక్తిని తయారు చేయలేమని, ఉన్న ఆప్షన్స్‌లో సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మనం చేయగలిగింది అని పెద్దవాళ్లు చెప్పట్లేదు. ఈ విషయంలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు కొంత త్వరగా నిర్ణయం తీసుకుంటున్నారు’’ అన్నారు కోటిరెడ్డి. ఇన్ని వడపోతలు పూర్తయి పెళ్లి జరిగిన తర్వాత కూడా ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన ఈ తరం తల్లిదండ్రులకు తప్పడం లేదు. అందుకే వైవాహిక బంధం బలపడే వరకు కొంత కనిపెట్టి ఉండాలి. గాడి తప్పుతున్నట్లు అనిపిస్తే సరి చేయడం వరకే ఉండాలి పెద్దవాళ్ల జోక్యం. పిల్లల జీవితంలోకి దూరిపోయి వాళ్ల జీవితాలను తామే జీవించాలనుకోకూడదు. ఇప్పటి పేరెంట్స్ దాదాపు చదువుకున్న వాళ్లే. అబ్బాయి తల్లిదండ్రులకు కూడా కోడలు వచ్చి తమను చూసుకోవాలనే ఆంక్షల్లేవు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ల కుటుంబం వాళ్లను దిద్దుకోమని నూతన దంపతులను వేరే ఇంట్లో ఉంచడానికే ప్రయత్నిస్తున్నారు. మరో ముఖ్యమైన సంగతి... తల్లిదండ్రులు వృత్తి వ్యాపారాల్లో రిటైరై ఉంటే, పిల్లల పెళ్లి బాధ్యత పూర్తయిన తరవాత తమకిష్టమైన లేదా సమాజహితమైన వ్యాపకాన్ని పెట్టుకోవాలి. – వాకా మంజులారెడ్డి ట్రంప్ ప్రభావం నేను పాతికేళ్లుగా వివాహవేదిక నడుపుతున్నాను. అప్పట్లో అమ్మాయి తల్లిదండ్రులైనా, అబ్బాయి తల్లిదండ్రులైనా అవతలి వారి కుటుంబ నేపథ్యాన్ని ప్రధానంగా గమనించేవారు. ఇప్పుడు డబ్బు, ఆస్తులు ప్రధానం అయ్యాయి. పాతికేళ్ల కిందట విదేశాల మోజు బాగా ఉండేది. పదవ తరగతి అమ్మాయికి కూడా యూఎస్ సంబంధాల కోసం ప్రయత్నించేవారు. ఈ ట్రెండ్ 1990– 2000 మధ్య బాగా ఉండేది. ఇప్పుడు అమ్మాయిలే చదువుకుని విదేశాలకు వెళ్తున్నారు. ఇప్పుడు చదువు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన అమ్మాయిలు, అలాగే అక్క, అన్న విదేశాల్లో ఉన్న అమ్మాయిలు మాత్రమే విదేశీ సంబంధాలు కోరుకుంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇండియాలో ఉన్న అమ్మాయికి యూఎస్ అబ్బాయితో పెళ్లి చేసినవాళ్లు, అమ్మాయిని అమెరికా పంపించడానికి వీసా రాక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇక్కడ కూడా మంచి ఉద్యోగాలున్నాయి కాబట్టి అమ్మాయి మా కళ్ల ముందే ఉంటుంది, ఇండియా సంబంధాలే చెప్పండి అంటున్నారు. అయితే అబ్బాయికి లక్ష రూపాయల జీతం ఉన్నా సరే ‘ఏం సరిపోతుంది, ఇంకా పెద్ద జీతం ఉన్నవాళ్లను చెప్పండి’ అంటున్నారు. పైగా ‘మా అమ్మాయి సర్దుకుపోలేదు, కాబట్టి ఉమ్మడి కుటుంబం వద్దు’ అనే నిబంధనలు ఎక్కువయ్యాయి. కట్నం అనేది పెద్ద విషయంగా చర్చకు రావడం లేదు. ఆడంబరాలు మాత్రం ఆకాశమే హద్దు అన్నంతగా పెరిగిపోయాయి. ఇక పెళ్లి వయసుదాటిపోతోందనే ఆందోళన అటు పేరెంట్స్‌లోనూ కనిపంచడం లేదు, పెళ్లి చేసుకోవాల్సిన యువతీయువకుల్లోనూ కనిపించడం లేదు. ముప్పై సంవత్సరాలు దాటుతున్నా కూడా వయసును పట్టించుకోవడం లేదు. – జొన్నలగడ్డ జ్యోతి మళ్లీ యూఎస్ క్రేజ్ పదేళ్లుగా ఈ వ్యాపకంలో ఉన్నాను. మొదట్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నాలుగైదు సంబంధాలు చూసి నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు నలభై– యాభై సంబంధాలు చూసినా కూడా నిర్ణయం తీసుకోవడం లేదు. వయసు మీరిపోతున్నా ఎవరికీ పట్టింపు ఉండడం లేదు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా భాగస్వామి కోసం బంగారాన్ని గీటుపెట్టినట్లు చూస్తున్నారు. అబ్బాయి క్యాప్ పెట్టుకున్న ఫొటో పంపిస్తే ‘బట్టతల కావచ్చు, క్యాప్ లేని ఫొటోలు పంపించండి’ అంటున్నారు అమ్మాయిలు. ఇక అబ్బాయిలు కూడా తాము యావరేజ్‌గా ఉన్నా సరే... అందమైన అమ్మాయి కావాలంటారు. అబ్బాయిలైనా కొంతవరకు రాజీపడుతున్నారు కానీ అమ్మాయిలు కచ్చితంగా ఉంటున్నారు. ఓ మంచి మార్పు ఏమిటంటే... కట్నం ప్రాధాన్యం లేని విషయమైపోయింది. అలాగే ట్రంప్ హయాంలో అమ్మాయి తల్లిదండ్రులు యూఎస్ సంబంధాలు వద్దనేవాళ్లు. ఇప్పుడు మళ్లీ యూఎస్ సంబంధాలకు క్రేజ్ పెరిగింది. – శ్వేత పసుపులేటి నిర్ణయం వధూవరులదే! అమ్మాయికి పెళ్లి చేయాలంటే... ఓ ఇరవై ఏళ్ల కిందట అబ్బాయి కుటుంబ నేపథ్యాన్ని ప్రధానంగా చూసేవారు. ఇప్పుడు చదువు, ఉద్యోగం మొదటి ప్రాధాన్యంలో ఉంటున్నాయి. ఉద్యోగంలో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు తొలి ప్రాధాన్యం, ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఉంటోంది. వ్యాపారం అనగానే ‘రిస్క్ అవసరమా’ అంటున్నారు. వ్యవసాయం అయితే ఇక నాలుగో ప్రాధాన్యంలోకి వెళ్లిపోయింది. కరోనా తర్వాత విదేశాలంటే భయపడుతున్నారు. అంతవరకు విదేశాలతో సంబంధం లేని వాళ్లు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. వధువు అక్క లేదా అన్న యూఎస్, యూకేల్లో ఉన్న ఆ దేశంలో ఉన్న అబ్బాయికే మొగ్గు చూపుతున్నారు. ఇక డిమాండ్ల విషయానికి వస్తే... వరుని ఎంపిక విషయంలో అమ్మాయిలు చాలా కచ్చితంగా ఉంటున్నారు. ఎంతో కొంత రాజీ పడుతున్నది అబ్బాయిలే. చాదస్తం తగ్గింది ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లిని ఒకప్పుడు వధూవరుల తల్లిదండ్రులు కుదిర్చేవాళ్లు, ఇప్పుడు వధూవరులు స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నారు (అరేంజ్డ్ మ్యారేజ్‌ల విషయంలో కూడా). ఇప్పుడు దాదాపుగా అందరూ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులే. వాళ్లు కొడుకు, కూతురు ఇద్దరినీ చదివిస్తున్నారు. ఇద్దరినీ ఉద్యోగాలకు పంపిస్తున్నారు. ఆస్తిని దాదాపుగా సమంగా ఇస్తున్నారు. దీంతో కట్నం ప్రస్తావన ప్రధానంగా కనిపించడం లేదు. తల్లిదండ్రులు కూడా పరిణతి చెందారు. ఒకప్పటిలాగ కోడలు తెల్లవారు జామున లేచి ఇంటి పనులు చక్కబెట్టాలని, తాము నిద్రలేచే సరికి కాఫీ కప్పుతో సిద్ధంగా ఉండాలనే చాదస్తాల్లేవు. ఉద్యోగానికి వెళ్లాల్సిన అమ్మాయి ఇంటి పనుల్లోనే అలసిపోవాలని కోరుకోవడం లేదు. ఇక పిల్లలిద్దరికీ పెళ్లి చేసిన వెంటనే వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయి పిల్లలతో కలిసి జీవించాలనుకోవడం లేదు. బాధ్యతలు పూర్తయిన తమ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. – కరణం నరసింగరావు లేటెస్ట్ ఫొటోలుండాలి! మ్యారేజ్ బ్యూరోలో మేము ఒక ప్రశ్నావళిని సమగ్రంగా రూపొందించుకున్నాం. అబ్బాయి లేదా అమ్మాయితో స్వయంగా మాట్లాడతాం. సాధ్యమైతే బ్యూరోలోనే లైవ్ ఫొటో షూట్ చేయడం మంచిది. పేరెంట్స్ ఇచ్చే ఫైల్ ఫొటోలు కొన్ని సందర్భాల్లో బాగా పాతవి ఉంటాయి. ఫొటోలు ఉన్నట్లుగా లైవ్‌లో లేనట్లయితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా డిజప్పాయింట్ అవుతారు. ఇక ఆ తర్వాత మిగిలిన ప్రత్యేకతలేవీ పరిగణనలోకి రావు. – కోటిరెడ్డి -
ఆమెకు 19 మంది భర్తలు..!
బీజింగ్ : ఓ వ్యక్తి సోషల్ మీడియాను బ్రౌజ్ చేస్తుండగా తన భార్య వీడియోల్ని చూసి కంగుతిన్నాడు. ఆ వీడియోలో జరిగిన తంతు చూసి ఇది నిజమేనా అని అనుకున్నాడు. తన భార్య గురించి బుర్రను తొలుస్తున్న అనుమానాల్ని నివృత్తి చేసుకోవాలని పోలీసుల్ని ఆశ్రయించాడు. చివరికి నెత్తి నోరు బాదుకున్నాడు. చైనా మంగోలియాలోని బయాన్నూర్ కు చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది జనవరిలో పెళ్లికోసం మ్యారేజ్ బ్యూరోని ఆశ్రయించాడు. వ్యక్తి కోరుకున్నట్లు మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులు గన్సు అనే ప్రాంతంలోఓ సంబంధం చూశారు. అమ్మాయి బాగుంది. కాకపోతే వధువే .. వరుడిని ఎదురు కట్నం కింద 148,000 యువాన్లు (రూ.16.9లక్షల ) అడిగింది. అందుకు పెళ్లికొడుకు నాకు నచ్చిన అమ్మాయిని చూశారు. ఎదురు కట్నం ఎంతైనా ఇస్తానని ప్రగల్భాలు పలికాడు. అనుకున్నట్లుగానే రూ.16.9లక్షలు ఎదురు కట్నం కూడా ఇచ్చాడు. వివాహం సాంప్రదాయ బద్దంగా జరిగింది. చదవండి : ఒక పెళ్లి.. రెండు బరాత్‌లు.. ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లి తరువాత నూతన వధువరులు అన్యోన్యంగా మెలుగుతున్నారు. అయితే పెళ్లైన రెండు నెలల తరువాత ఏవండి ! మన పెళ్లై రెండు నెలల అవుతుంది. మా అమ్మా నాన్న గుర్తుకొస్తున్నారు. మీరు అనుమతి ఇస్తే ఓ సారి పుట్టింటికి వెళ్లాలని అనుకుంటున్నాను. మీరేమంటారు? అని అడిగింది. అసలే పెళ్లై రెండు నెలలవుతుంది. భార్య మనస్సు నొప్పించడం ఇష్టం లేక. సరే అని అత్తారింటికి పంపాడు.రోజులు గడుస్తున్నాయి. భార్య పుట్టింటి నుంచి రావడం లేదు. అదే సమయంలో ఓ రోజు ఇంట్లో ఖాళీ గా ఉన్న భర్త సోషల్ మీడియాను బ్రౌజ్ చేస్తుండగా తన భార్య మరొకరిని వివాహం చేసుకున్న వీడియోల్ని చూసి షాక్ అయ్యాడు. ఆ ఆధారాలతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ దర్యాప్తులో పోలీసులు, భర్త విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బుల కోసం మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులు భారీ ఎత్తున మోసాలకు పాల్పడినట్లు తేలింది.పెళ్లికి ముందే ఎదురు కట్నం తీసుకోవడం. పెళ్లి తరువాత పత్తాలేకుండా పోవడం.. పారిపోయి మరొకరిని పెళ్లి చేసుకోవడం. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పెళ్లి కాని 19మంది యువకుల్ని పెళ్లి చేసుకుందని, వారి వద్ద నుంచి రూ. 2.28కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులైన మ్యారేజ్ బ్యూరో ప్రతినిధి లీ' తో పాటూ మరో ఇద్దరు సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి చేసుకుంటానంటూ పరిచయం.. చివరికి
రాజేంద్రనగర్: వివాహ పరిచయ వేదికలో పేరు నమోదు చేసుకున్న ఓ యువతికి.. రష్యా నుంచి ఓ యువకుడు ఫోన్ చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ పరిచయం చేసుకున్నాడు. అనంతరం గిఫ్ట్ పంపిస్తున్నానంటూ రెండు లక్షల రూపాయలను బ్యాంక్ ఖాతాలో వేయించుకోని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో ఆ యువతి రాజేంద్రనగర్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. కిస్మత్పూర్ ప్రాంతానికి చెందిన 24 సంవత్సరాల యువతి ప్రైవేట్ ఉద్యోగి. వివాహం చేసుకునేందుకు వివాహ పరిచయ వేదికలో తన పేరు, ఫోన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసుకుంది. అయితే తాను రష్యాలో ఉంటానని చెబుతూ గత వారం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన వివరాలు తెలుపుతూ మాటలు కలిపాడు. ఫోన్లో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడి వివాహం చేసుకునేందుకు అంగీకరించారు. ఆ యువకుడు గిఫ్ట్ పంపిస్తున్నానంటూ తెలిపి ఇంటి చిరునామా, తదితర వివరాలు తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మాట్లాడుతున్నామంటూ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందని, పన్ను రూపేనా రెండు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పాడు. దీంతో ఆ యువతి రష్యా యువకుడికి ఫోన్ చేసి తెలపడంతో ఖరీదైన గిఫ్ట్ అని పన్ను కట్టి తీసుకోవాలంటూ సూచించాడు. అంత డబ్బు తన వద్ద లేవని తెలపడంతో మూడు దఫాలుగా కట్టమని సూచించాడు. సదరు యువతి ఆరు రోజుల క్రితం మూడు దఫాలుగా రెండు లక్షల రూపాయలను శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోన్ చేస్తున్నామని తెలిపిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. మూడు రోజుల అనంతరం గిఫ్ట్ వస్తుందని తెలిపారు. మూడు రోజులుగా డబ్బు తీసుకున్న వ్యక్తి, వివాహం చేసుకుంటానని తెలిపిన ఇద్దరు వ్యక్తులు సెల్ఫోన్లు స్విచాఫ్ రావడంతో లబోదిబోమంటూ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో కేసులో ఇలా.. వివాహ పరిచయ ద్వారా యువకుడి ఫోన్ నంబర్ తీసుకుని ఓ యువతి 48 వేల రూపాయలను బ్యాంక్ అకౌంట్లో వేయించుకోని స్విచ్ఆఫ్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సులేమాన్‌నగర్ ప్రాంతానికి చెందిన యువకుడు తన పెళ్లి కోసం వివాహ పరిచయ వేదికలో పేరు నమోదు చేసుకున్నాడు. అతడి ఫోన్ నంబర్‌కు ఖతార్ దేశానికి చెందిన యువతి ఫోన్ చేసి తాను వివాహం చేసుకుంటానంటూ తన వివరాలతో పాటు అతడి వివరాలు సేకరించింది. గత వారం ఫోన్లో అన్ని వివరాలు మాట్లాడుకున్న అనంతరం ఆ యువతి హైదరాబాద్ వస్తున్నానని తెలిపింది. సోమవారం ఉదయం తాను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగానని తన వద్ద ఉన్న లగేజీ, ఇతర విలువైన సామాన్లకు రూ.48 వేల ఇండియన్ కరెన్సీ కట్టమంటున్నారని తెలిపింది. తన వద్ద ఖతార్ కరెన్సీ ఉందని ఈ నగదు చెల్లదంటున్నారని తెలపడంతో.. సదరు యువకుడు గూగుల్ పే ద్వారా రూ.48 వేలు పంపించాడు. ఆ తర్వాత యువతి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన యువకుడు గురువారం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: ప్రేమ పెళ్లికి నిరాకరించారని ఇంటి నుంచి పరార్ ) -
మ్యారేజ్ బ్యూరో: ఇక్కడ పెళ్లి సంబంధాలు రైతులకు మాత్రమే
►సూర్యాపేటకు చెందిన 35 ఏళ్ల రైతుకు పది ఎకరాల సాగు భూమి ఉంది. కాలాలకు అనుగుణంగా పంట దిగుబడి వస్తుంటుంది. ఆయనకు వివాహం కాలేదు.. పెళ్లి కాలేదనే కంటే.. పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే.. అతను వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి.. ►మంథనిలో ఐదు ఎకరాలున్న మరో యువకుడు ఉన్నత చదువులున్నా వ్యవసాయం మీద మక్కువతో రైతుగా మారాడు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. సేద్యం చేస్తున్నాడనే సాకుతో అతడికి పిల్లనివ్వడానికి ఎవరూ రావట్లేదు. సాక్షి, కరీంనగర్: రైతును పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు అంతగా ఆసక్తి చూపడం లేదు.. ఎకరాల కొద్దీ భూములున్నా, లక్షల కొద్దీ ఆదాయమున్నా వివాహం అనే విషయం వచ్చేసరికి వ్యవసాయదారులు వెనకబడిపోతున్నారు. ఏదిఏమైనా రైతులకు పెళ్లి సంబం ధాలు దొరకడం చాలా కష్టంగా మారుతోంది.. ఈ పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన రైతు కేతిరెడ్డి అంజిరెడ్డి (40) ‘రైతు మ్యారేజ్ బ్యూరో’ ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకున్నారు.. దేశంలో రైతులకు మాత్రమే పెళ్లి సంబంధాలు కుది ర్చే తొలి బ్యూరో తనదేనని అంజిరెడ్డి అంటున్నారు.. ‘15 ఎకరాలున్న నా మిత్రుడికి పెళ్లి విషయంలో ఎదురైన అనుభవం తో రైతు కోసమే ప్రత్యేకంగా మ్యారేజీ బ్యూరో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా.. అందుకోసం రైతును పెళ్లి చేసుకో వాలనుకునే వారు సంప్రదించాలని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో హైదరాబాద్ రోడ్డులో తిమ్మాపూర్ వద్ద రైతు మ్యారేజ్ బ్యూరో తెరిచా’ అని అంజిరెడ్డి చెప్పుకొచ్చారు. ఫీజు ఐదొందల రూపాయలు.. గత అక్టోబర్‌లో ఈ బ్యూరో ఏర్పాటు చేసిన అంజిరెడ్డి.. సోషల్ మీడియాను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ఫేస్బుక్లో వ్యవసాయంతో లింక్ అయిన అన్ని గ్రూపుల్లో తన ఆలోచనను పంచుకున్నారు. యూట్యూబ్ చానల్ ద్వారా విస్తృత ప్రచారం చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి చాలా దరఖాస్తులు వచ్చాయి. అందులో వ్యవసాయం మాత్రమే చేసే వ్యక్తుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే వ్యవసాయదారుడు భర్తగా కావాలనుకుంటున్న యువతులు, వారి తల్లిదండ్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు అంజిరెడ్డి చెప్పారు. సంబంధాలు కుదిర్చేందుకు రూ.500 ఫీజుగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగినులు వస్తున్నారు.. కులం, మతంతో సంబంధం లేకుండా పెళ్లి విషయంలో రైతు పట్ల వివక్ష అత్యంత దయనీయంగా ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో రైతు కుటుంబానికి పెద్ద కష్టమేమీ లేదు. సాధారణ ఉద్యోగి సంపాదిస్తున్న దాని కన్నా ఐదెకరాల రైతు ఆదాయం ఎక్కువే.. ఈ విషయాలను ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ఎంటెక్, ఎంసీఏ చదివిన వారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వారు కూడా పల్లెల్లో వ్యవసాయం చేసే చదువుకున్న భర్త కావాలని కోరుకుంటున్నారు. మా దగ్గరికి వచ్చిన బయోడేటాలను బట్టి ఈ విషయం తెలుస్తోంది. కొన్ని సంబంధాలు కూడా కుదిరాయి. మంచి రోజులు రాగానే పెళ్లిళ్లు జరుగుతాయి. – కేతిరెడ్డి అంజిరెడ్డి, రైతు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు -
10న నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక
సాక్షి, హైదరాబాద్: నాయి బ్రాహ్మణ యువతీ యువకుల వివాహ సంబంధాల కోసం పరిచయ కార్యాక్రమం ఈనెల 10న జరగనుంది. ఆదివారం దిల్షుక్నగర్ కొత్తపేటలోని బాబు జగ్జీవన్‌రామ్ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మహేష్ చంద్ర నాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిచయ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న నాయి బ్రాహ్మణలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పునర్వివివాహ సంబంధాల కోసం చూస్తున్న వితంతువులు, డైవోర్సిలు కూడా తమకు నచ్చిన భాగస్వామిని ఈ వివాహ పరిచయ కార్యక్రమం ద్వారా వెతుక్కునే అవకాశముందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 9849566988, 9391357109 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
మ్యారేజ్ బ్యూరో పేరిట టోకరా
♦ ఇరు రాష్ట్రాల్లో 150కి పైగా బాధితులు ♦ నిందితురాలి అరెస్టు సాక్షి, హైదరాబాద్: వివిధ కులాల వారికి పెళ్లి సంబంధాలంటూ పత్రికల్లో ప్రకటనలిచ్చి మో సాలకు పాల్పడుతున్న మహిళను సీసీఎస్ ఆధీనంలోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 150 మందికి పైగా మోసపోయిన వారు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లోని అంబర్పేట్ ప్రాంతానికి చెందిన సరిత స్థానికంగా ‘శ్రీరస్తు మ్యారేజ్ బ్యూరో’ నిర్వహిస్తోంది. వివిధ తెలుగు పత్రికల్లోని ప్రత్యేక ఎడిషన్లలో కులాల వారీగా పెళ్లి సంబంధాలున్నాయంటూ ప్రకటనలు ఇచ్చేది. వీటిలో ఉన్న ఫోన్ నెంబర్లో ఎవరైనా సంప్రదిస్తే... వారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.2,000 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసేది. ఆపై వారి ఆసక్తిని బట్టి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫొటోలు, నకిలీ ప్రొఫైల్స్ పంపేది. రకరకాల కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ చివరకు సదరు వ్యక్తికి వివాహమైందని, మరో ప్రొఫైల్ పంపిస్తున్నానని నమ్మబలికేది. కొన్ని రోజులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లు విసిగి వదిలేసేవారు. ఈ పంథాలో మోసాలకు పాల్పడుతున్న సరిత వ్యవహారాలపై సమాచారం అందుకున్న మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇన్స్పెక్టర్ శంకర్ రాజు నేతృత్వంలోని బృందం లోతుగా ఆరా తీసింది. నలుగురు బాధితుల్ని గుర్తించిన మీదట నిందితురాలిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. బాధితుల సంఖ్య 150కి పైగా ఉంటుందని, వారిలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సీసీఎస్ అధికారులు చెప్పారు. -
తుళ్లూరు వధూవరులకు భలే డిమాండ్
*ఫొటోలతో తిరుగుతున్న మ్యారేజ్ బ్యూరోలు *చదువు లేకపోయినా.. ఆస్తి ఉంటే చాలు.. విజయవాడ : రాజధాని తుళ్లూరు అంటే మాటలా.. ఎన్నో వింతలు, విశేషాలు ఒకవైపు.. రియల్టర్లు, భూ యజమానులు, రైతుల హడావుడి మరోవైపైతే.. తాజాగా మ్యారేజ్ బ్రోకర్ల హవా కూడా ఇక్కడ నడుస్తోంది. ఒకప్పుడు తుళ్లూరులో పెళ్లి సంబంధమంటేనే.. ‘ఆ.. పెద్దగా చదువుకోరు ఏం అవసరం లేదులే..’ అనుకున్న పెళ్లి పెద్దలు ఇప్పుడు ఎగిరి గంతేసి మరీ ఒప్పుకొంటున్నారు. బ్రోకర్లకు ఫొటోలిచ్చి సంబంధం చూడమంటున్నారు. చదువు లేకపోయినా.. ఆస్తి తప్పనిసరి.. ఒకప్పుడు తుళ్లూరు సంబంధం అంటేనే వెనక్కి తగ్గేవారని, రాజధాని ప్రభావంతో ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని గుంటూరులోని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా సంబంధాల కోసం వస్తున్నారంటున్నారు. నాలుగైదు ఎకరాల భూమి ఉన్న కుర్రాడికి చదువు లేకపోయినా చాలు తమ కుమార్తెను ఇవ్వడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. విజయవాడ, గుంటూరులో ఐదారు ఇళ్లు ఉన్న యజమానుల కంటే.. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో రెండు మూడు ఎకరాల భూమి ఉన్న వారికి సంబంధం చూడటం సులభంగా ఉందని గుంటూరు పండరీపురం ఏరియాలోని ఒక మ్యారేజ్ లింక్స్ నిర్వాహకురాలు చెబుతున్నారు. బీటెక్ సంబంధాలున్నాయా..? రాజధాని ప్రభావం తుళ్లూరు రైతులపై బాగానే పడింది. గతంలో తమ కుమారుడికి మధ్య తరగతి ఆడపిల్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడేవారు. ఇప్పుడు వరుడికి చదువు లేకపోయినా.. వధువు మాత్రం తప్పనిసరిగా బీటెక్ చదివి ఉండాలని ఆంక్షలు పెట్టడం విశేషం. ఇక ఇటీవల ముగిసిన మ్యారేజ్ సీజన్లో తుళ్లూరులో జరిగిన వివాహాలు చూస్తే ఔరా..! అనక మానరు. ఒకప్పుడు సాదాసీదాగా ఉన్న రైతులు లక్షలు ఖర్చుపెట్టి వివాహాలు జరిపించారు. ఆడపిల్లల తండ్రులు పెద్ద మొత్తంలో కట్నాలు సమర్పించడమే కాకుండా భారీగా, హుందాగా వివాహాలు చేస్తున్నారు.