♦ ఇరు రాష్ట్రాల్లో 150కి పైగా బాధితులు
♦ నిందితురాలి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: వివిధ కులాల వారికి పెళ్లి సంబంధాలంటూ పత్రికల్లో ప్రకటనలిచ్చి మో సాలకు పాల్పడుతున్న మహిళను సీసీఎస్ ఆధీనంలోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 150 మందికి పైగా మోసపోయిన వారు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ప్రాంతానికి చెందిన సరిత స్థానికంగా ‘శ్రీరస్తు మ్యారేజ్ బ్యూరో’ నిర్వహిస్తోంది. వివిధ తెలుగు పత్రికల్లోని ప్రత్యేక ఎడిషన్లలో కులాల వారీగా పెళ్లి సంబంధాలున్నాయంటూ ప్రకటనలు ఇచ్చేది. వీటిలో ఉన్న ఫోన్ నెంబర్‌లో ఎవరైనా సంప్రదిస్తే... వారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.2,000 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసేది.
ఆపై వారి ఆసక్తిని బట్టి ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఫొటోలు, నకిలీ ప్రొఫైల్స్ పంపేది. రకరకాల కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ చివరకు సదరు వ్యక్తికి వివాహమైందని, మరో ప్రొఫైల్ పంపిస్తున్నానని నమ్మబలికేది. కొన్ని రోజులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లు విసిగి వదిలేసేవారు. ఈ పంథాలో మోసాలకు పాల్పడుతున్న సరిత వ్యవహారాలపై సమాచారం అందుకున్న మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ శంకర్ రాజు నేతృత్వంలోని బృందం లోతుగా ఆరా తీసింది. నలుగురు బాధితుల్ని గుర్తించిన మీదట నిందితురాలిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. బాధితుల సంఖ్య 150కి పైగా ఉంటుందని, వారిలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సీసీఎస్ అధికారులు చెప్పారు.
మ్యారేజ్ బ్యూరో పేరిట టోకరా
Published Thu, Oct 29 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM
Advertisement
Advertisement