తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలో డోలాస్‌నగర్‌లో నివాసముండే ఓ ఆటోడ్రైవర్ తన భార్య చనిపోవడంతో మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహమై భర్త వదిలేసిన ఓ మహిళను చర్చిలో వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న అనంతరం కట్నం కావాలని మొదటిభార్య సంతానంతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై 5 రోజుల క్రితం సదరు మహిళ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు ఎటువంటి న్యాయం జరగకపోవడంతో మంగళవారం పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యయత్నం చేసింది. బాధిత మహిళ వివరాల ప్రకారం.. మ్యారేజ్‌బ్యూరో ద్వారా డోలాస్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ బుచ్చిబాబును అనురాధ 2023 ఫిబ్రవరి 11వ తేదీన ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు.
వివాహం చేసుకునేముందు తన భార్య చనిపోయిందని, తన ఇద్దరు పిల్లలు తన దగ్గర ఉండరని, సొంత ఇంట్లో నివాసముంటామని, మొదటి భర్తతో పుట్టిన నీ కొడుకును సైతం హాస్టల్‌లో ఉంచాలని బుచ్చిబాబు అనురాధతో చెప్పాడు. బుచ్చిబాబు కుమార్తెకు వివాహమైనా భర్తకు దూరంగా ఉండడంతో ఆమె కూడా అదే ఇంట్లో నివాసముంటోంది. వివాహమైనప్పటి నుంచి ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని, ఇంటి ఖర్చుల నిమిత్తం డబ్బులు అడిగితే నువ్వు నాకు కట్నం ఇవ్వలేదు, ముందు కట్నం తేవాలని వేధింపులకు గురిచేశారని బాధితురాలు అనురాధ వాపోయింది.
ఈవిషయమై నిలదీయడంతో తనపై పలుసార్లు దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఐదు రోజుల క్రితం బుచ్చిబాబు, అతని కుమార్తె, కుమారుడు, తల్లి తన నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని హింసించగా, వారినుంచి తప్పించుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చానని, ఇక్కడ పోలీసులు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. చివరకు సీఐ మల్లిఖార్జునరావును కలవగా, మ్యారేజ్ సర్టిఫికేట్ తేవాలని సూచించారన్నారు. తన మొదటి భర్త వదిలేసి ఎటో వెళ్లిపోతే అతనితో విడాకులు అయినట్లు పత్రాలు, మరల బుచ్చిబాబును ద్వితీయ వివాహం చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని అంటున్నారని, వివాహం జరిగిన చర్చిలో పాస్టర్‌ను మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగితే మేము అలాంటివి ఇవ్వమని చెబుతున్నారని బాధిత మహిళ వాపోయింది.
ఈక్రమంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యయత్నం చేయగా స్థానిక మీడియా ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులను వివరణ అడుగగా అనూరాధ రెండవ భర్త బుచ్చిబాబు అందుబాటులో లేడని, అతడ్ని పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారి కుటుంబ సభ్యులకు హెచ్చరించామని, అనూరాధ, బుచ్చిబాబుల మధ్య సఖ్యత కుదరపోతే కేసు నమోదు చేసి ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు పంపనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment