పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు
► ఏర్పాట్లు పూర్తి నేడు విజయవాడలో 86 కేంద్రాల్లో పరీక్షలు
► నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
► జిల్లా నుంచి వచ్చే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
► బస్టాండ్, రైల్వేస్టేషన్‌లో హెల్ప్ డెస్క్‌లు
► వివాహాల సీజన్‌కు చివరి ముహూర్తం
► ఇదేరోజు కావటంతో పెరగనున్న ట్రాఫిక్ రద్దీ
సాక్షి, విజయవాడ : ఎంసెట్ విద్యార్థులకు ప్రత్యేక సేవలు అందించటానికి విజయవాడ కమిషనరేట్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పరీక్ష రాయటానికి వచ్చే విద్యార్థులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించింది. పోలీసులు యథావిధిగా సెంటర్ల వద్ద బందోబస్తు మొదలుకొని పరీక్షా కేంద్రాల మార్గంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వరకు అన్నింటినీ పర్యవేక్షించనున్నారు. దూర ప్రాంత విద్యార్థుల సౌకర్యం కోసం బస్టాండ్, రైల్వేస్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచే ఇవి పనిచేయనున్నాయి. ఎంసెట్ కన్వీనర్‌తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఎంసెట్ నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
విద్యార్థులకు ఉచిత రవాణా
ఆర్టీసీ అధికారులు ఎంసెట్ విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నారు. నగరంలోని పరీక్షా కేంద్రాల రూట్లకు ఆర్టీసీ సిటీ బస్సుల్ని ఏర్పాటు చేశారు. 400 సిటీ బస్సులు నగరంలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. ఎంసెట్ విద్యార్థులు హాల్‌టిక్కెట్ చూపించి వాటిలో ప్రయాణం చేయవవచ్చు. జిల్లా నుంచి వచ్చే విద్యార్థులు కూడా హాల్‌టిక్కెట్ చూపించి బస్సులో ఉచితంగా విజయవాడకు చేరుకోవచ్చు. ఆర్టీసీ ఆర్‌ఎం రామారావు ఇప్పటికే డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం నుంచి ఆర్‌ఎంతో పాటు అధికారులు పరిస్థితిని సమీక్షించనున్నారు.
శుభకార్యాలకూ చివరి ముహూర్తం...
వివాహాలు తదితర శుభకార్యాలకు ఈ సీజన్‌లో శుక్రవారం చివరి ముహూర్తం. నగరంలో సుమారు 120కి పైగా వివాహాలు జరగనున్నాయి. ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది. పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. నగరంలో వివాహాల ఊరేగింపులపై నిషేధం విధించారు. విద్యార్థులు రెండు గంటలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు. రద్దీ ప్రాంతాల్లో రెగ్యులర్ ట్రాఫిక్ పోలీసులతో పాటు అదనంగా మరికొంత మందిని నియంత్రణకు కేటాయించారు.
ఉదయం ఇంజినీరింగ్.. మధ్యాహ్నం మెడిసిన్..
విజయవాడలో శుక్రవారం 86 పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్ (ఇంజినీరింగ్, మెడిసిన్) ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. దీనికి జిల్లాలో 42,224 మంది విద్యార్థులకు ఉన్నత విద్యామండలి హాల్ టికెట్లు జారీ చేసింది. ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ , మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. 86 పరీక్ష కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.