
అధ్యయనం పేరుతో మంత్రుల బృందం ఏర్పాటు
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్
నివేదికకు నిర్దిష్ట గడువు లేకుండా వీలైనంత త్వరగా.. అంటూ ముక్తాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. అధ్యయనం పేరుతో ఓ కమిటీని నియమించిన ప్రభుత్వం... దానికి కాలపరిమితిని విధించకపోవడమే ఇందుకు కారణం. కాలయాపన కోసమే ఈ కమిటీని నియమించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి హామీ ఇచ్చింది.
సూపర్ సిక్స్ పేరిట ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. అయితే అధికారం చేపట్టి ఆరు నెలలు దాటినా మహిళలకు ఉచిత బస్సు హామీని అమలు చేయలేదు. ఇప్పుడు ఉచిత బస్సు అమలు కోసం అధ్యయనం పేరుతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
వాస్తవానికి తెలంగాణతోపాటు కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమల్లో ఉంది. దీనిపై పెద్ద అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని, అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రారంభించవచ్చని ఉన్నతాధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
రవాణా శాఖ మంత్రి అధ్యక్షతన కమిటీ...
మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడంపై అధ్యయనం కోసం రవాణా శాఖ మంత్రి అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని నియమించింది. మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, హోంమంత్రి సభ్యులుగా, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలను ఈ బృందం సందర్శించి అక్కడ విధానాలపై అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అమలుకు తగిన నమూనాను మంత్రుల బృందం రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే, మంత్రుల బృందం నమూనా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించేందుకు నిర్దిష్ట సమయం ఏదీ ఉత్తర్వుల్లో పేర్కొనకుండా వీలైనంత త్వరగా... అంటూ ముక్తాయింపు ఇచ్చారు. దీంతో కాలయాపన కోసమే ఈ కమిటీని నియమించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment