పెళ్లికి బాజా మోగింది | marriages season | Sakshi
Sakshi News home page

పెళ్లికి బాజా మోగింది

Published Fri, Dec 5 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

పెళ్లికి బాజా మోగింది

పెళ్లికి బాజా మోగింది

మళ్లీ పెళ్లిళ్ల సీజన్ వచ్చింది. మూడు నెలల విరామం తర్వాత మార్గశిర మాసం మంచి ముహూర్తాలు తీసుకువచ్చింది. ఆకాశాన్ని పందిరిగా మార్చి.. .భూలోకాన్ని పీటగా చేసి వధూవరులు కొత్త జీవితం ప్రారంభించేందుకు శుభ ఘడియలు రానే వచ్చాయి. శుభ కార్యాల కోసం మండపాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. వధూవరుల కోసం వస్త్ర దుకాణాలు, జువెలరీ షాపులు సందడిగా మారాయి. జిల్లాలోని ముఖ్యపట్టణాలు, మండలకేంద్రాలు, గ్రామాలు పెళ్లి వేడుకలకు సర్వం సిద్ధమయ్యాయి.
 
 మార్గశిర మాసం...మంచి ముహుర్తాలు తెచ్చింది. జిల్లాకు పెళ్లి కళ వచ్చింది. బంధుమిత్రుల రాకతో కోలాహలం పెరిగింది. కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లు సందడిగా మారాయి. ఆకాశాన్ని పందిరిగా మార్చి...భూలోకాన్ని పీఠగా పేర్చి వధూవరులు కొత్త జీవితం ప్రారంభించేందుకు శుభ ఘడియలు మొదలయ్యాయి. మౌఢ్యాల మూలంగా ఈ ఏడాది భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక మాసాల్లో పెళ్లిళ్లు జరగలేదు. ఈసారి వివాహ మహోత్సవ వేడుకలకు ముహూర్తాలు తక్కువగా ఉండటంతో ముందస్తుగానే జాగ్రత్త పడి ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో వివాహ వేడుకలకు సర్వం సిద్ధమైంది.    
 - మహబూబ్‌నగర్ కల్చరల్
 
 ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మరుపురాని ఘట్టం. మూడు ముళ్లు, ఏడడుగులతో ఏకమయ్యే అపూర్వమైన సుదినం. ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. వివాహానికి సుముహూర్తమే కొండంత బలం. దివ్యమైన ముహూర్తం లేకపోతే వివాహం జరిగే అవకాశాలు తక్కువే. ఈ ఏడాది భాద్రపద, అశ్వీయుజ, కార్తీక మాసాల్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు లేవు. మార్గశిర మాసం మాత్రమే పెళ్లిముహూర్తాలను మోసుకొచ్చింది. ఈ నెల 6, 7, 10, 12, 13, 17, 18 తేదీల్లో వివాహ శుభ ముహూర్తాలున్నాయి. ఇందులో 13, 18 తేదీల్లో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నట్లు అర్చకులు చెబుతున్నారు.
 
 ఈ నెల 18వ తేదీ దాటితే 2015 జనవరి 22వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు మరో దఫా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. తక్కువ రోజులు శుభఘడియలు ఉండటంతో ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకున్న కుటుంబాలు బిడ్డలు, కొడుకుల పెళ్లి చేయడానికి తహతహలాడుతున్నారు. ఆ ముహూర్తం కోసం ఎంతో ఆతృతగా నిరీక్షిస్తున్నారు. శుభఘడియలు ఆరంభమై పెళ్లి ముహూర్తాలు దగ్గరపడటంతో వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
 
 వందలాది వివాహాలు
 జిల్లాకు పెళ్లి కళ వచ్చేసింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకు ర్తి, అయిజ, కొత్తకోట, దేవరకద్ర, మక్తల్, ఆత్మకూర్, అలంపూర్  తదితర ప్రధాన పట్టణాల్లో ఎక్కడ చూసిన పెళ్లి సందడి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా మార్గశిర మాసంలో వందలాది పెళ్లిళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లిలు జరిగే కుటుంబాలు వివాహ వేడుకల్లో తల మునకలయ్యారు. పెళ్లిళ్లు నిర్వహించడానికి కల్యాణ మండపాలు, గార్డెన్లు, ఫంక్షన్‌హా ళ్లు, ప్రింటింగ్ ప్రెస్, బ్యాండ్, టెంట్‌హౌజ్, ఫొటో, వీడియోగ్రాఫర్లు, క్యాటరింగ్ నిర్వాహకులు, పురోహితులకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. చాలావరకు పెళ్లి ముహూర్తంతోనే ముందస్తుగా ఎక్కడికక్కడ బుక్ చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో హోటళ్లను, లాడ్జీలను కూడా రిజర్వు చేసుకున్నారు. బస్సులను మాట్లాడుకున్నారు.
 
 రెండు నెలల ముందే బుకింగ్
  కార్తీక మాసంలో పెళ్లిల్లు లేకపోవడంతో మార్గశిరంలో ఎక్కువగా జరుగుతాయని గ్రహించిన వారంతా రెండు నెలల ముందే ఫంక్షన్‌హాళ్లను బుక్ చేసుకున్నారు. ఒకే ముహుర్తంలో ఎ క్కువ సంఖ్యలో వివాహాలు జరుగుతుండటంతో ఉన్న ఫంక్షన్‌హాళ్లలోనే పార్టిషన్‌లు చేసి సుందరంగా తీర్చిదిద్ది కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నాం. రిసెప్షన్‌లు రాత్రిపూట జరుగుతుండడంతో పెళ్లి ముహుర్తాలకు కొంత వెసులుబాట్లు లభిస్తున్నది.             
- మద్ది అనంతరెడ్డి, బృందావన్ గార్డెన్స్ యజమాని
 
 వేదికలు ముస్తాబు...
 వివాహ మహోత్సవ వేడుకలు నిర్వహించే కల్యాణ మండపాలు, ఫంక్షన్‌హా ళ్లు సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్నాయి. ఖరీదైన పెళ్లి జరిపించే వారి కోసం నిర్వాహకులు తగిన రీతిలో ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కల్యాణ మండపాల్లో ప్రత్యేకంగా డెకరేషన్ చేస్తున్నారు. కొన్నిచోట్ల సెట్టింగ్‌లు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఆర్ట్ డెరైక్టర్లను రప్పిస్తున్నారు. వివాహ వేడుకను అతిథులంతా వీక్షించేందుకు వీలుగా పలుచోట్ల ఎల్‌ఈడీలు, స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లి నిర్వాహకుల ఆర్థికస్థోమతను బట్టి ఫంక్షన్‌హాళ్లు రెడీ అవుతున్నాయి. జీవితంలో మరుపురాని రోజు కావడంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా పెళ్లి చేయడానికి కుటుంబాలు సిద్ధమవుతున్నాయి.
 
 ఖరీదైన పెళ్లిళ్లు...
 మారిన కాలంలో పెళ్లిళ్లు ఖరీదైపోయాయి. సాదాసీదాగా పెళ్లి నిర్వహించే పరిస్థితులు కరువయ్యాయి. ఇక కట్నకానుకలు సరేసరి. పెళ్లి నిర్వహించడానికి రూ.లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి దాపురించాయి. పెళ్లి ముహూర్తాలు ఖరారు కావడంతో అందుకు సంబంధించిన రంగాలు ధరలను ఏకంగా పెంచేశాయి. కల్యాణ మండలం అద్దెను పెంచేశారు. ఇతర రోజుల కన్నా సుమారు 20 నుంచి 25 శాతం అద్దె పెంచారు. బ్యాండ్ నిర్వాహకులు పెళ్లికి రూ.10-15 వేలకు తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. ముఖ్యపట్టణాల్లో రూ.20 వేల వరకు కూడా వసూలు చేస్తున్నారు. క్యాటరింగ్, ఫొటో, వీడియోగ్రాఫర్లు కూడా తమదైన శైలిలో అధిక మొత్తాన్ని ఆశిస్తున్నారు. గతం కన్నా రూ.3వేల వరకు పెంచేశారు. పురోహితులు కూడా డిమాండ్‌ను బట్టి అడుగుతున్నారు.
 
 ఒక్కో పురోహితుడు రెండు, మూడు పెళ్లిళ్లు ఏకకాలంలో నిర్వహించడానికి నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రింటింగ్ ప్రెస్‌ల యజమానులు కూడా పెరిగిన ముడి సరుకుధరలను బేరీజు వేసుకుని తీసుకుంటున్నారు. ఈ రకంగా పెళ్లికి రూ. లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బంగారం ధరలు పెరుగుతుండటంతో ముందుగానే బంగారం కొనేందు కు ఎగబడుతున్నారు. నవంబర్‌లో 10 గ్రాముల బంగారం రూ.26 వేలకు తగ్గినా, పెళ్లిళ్ల సీజన్‌తో మళ్లీ పుంజుకుని రూ.27వేలకు పైగా పలుకుతోంది.
 
 ఆ రెండు రోజుల్లో సుముహూర్తాలు  
 కార్తీక మాసంలో శుక్లమౌఢ్యమి ఉన్నందున పెళ్లిల్లు తదితర శుభాకార్యాలు జరగలేదు. అందుకే ఈనెల 6, 7, 10, 12, 13, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉం డడంతో జిల్లాలో వేలాది పెళ్లిల్లు జరగనున్నాయి. ఒకేసారి పెళ్లిల్లు ఉండడం వల్ల పురోహితుల కొరత ఏర్పడినప్పటికీ వధూవరుల జన్మనక్షత్రాల ప్రకారం వేర్వే రు సమయాల్లో శుభ లగ్నాలు జరుగుతుండడం వల్ల కొంత వెసులుబా టు కుదురుతున్నది. 17, 18 తేదీల్లో సుముహూర్తాలు ఉండడం వల్ల ఆ రెండు రోజుల్లో అత్యధికంగా వివాహాలు జరగనున్నాయి.       
  - రామాచారి, టీటీడీ జిల్లా సహాయకులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement